| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| క. |
ఒకనాఁడు మనువు దుమ్మిన, వికలుఁడు గా కతని ఘ్రాణవివరము వెంటం బ్రకటయశుండిక్ష్వాకుం, డకలంకుఁడు పుట్టె రవికులాధీశుండై. |
155 |
| సీ. |
ఇక్ష్వాకునకుఁబుత్త్రు లెలమిఁబుట్టిరి నూర్వు రమర వికుక్షియు నిమియు దండ కుండు నాతని పెద్దకొడుకులు మువ్వు రా ర్యావర్తమందు హిమాచలంబు వింధ్యాద్రిమధ్య ముర్వీమండలము కొంత యేలిరి యిరువదియేవు రొక్క పొందున నా తూర్పు భూమి పాలించిరి యందఱు పడమటి కధిపులైరి |
|
| తే. |
యున్న నలువది యేడ్గురు నుత్తరోర్వి దక్షిణోర్వియుఁగాచిరి తండ్రి యంత నష్టకాశ్రాద్ధ మొనరింతు ననుచు నగ్ర సుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన మాంసఖండంబుఁ దెమ్మనె మహితయశుఁడు. |
156 |
| మ. |
అగుఁగా కంచు వికుక్షి వేఁట సని ఘోరారణ్యభూమిం దగన్ మృగసంఘంబులఁ జంపి బిట్టలసి తా, మే నొల్లఁబో నాఁకటన్ సగమై యొక్క శశంబుఁ బట్టి తిని శేషంబైన మాంసంబు శీ ఘ్రగతిం దండ్రికిఁదెచ్చి యిచ్చె నకలంకస్ఫూర్తి వర్తిల్లఁగాన్. |
157 |
| తరల. |
కులగురుండు వసిష్ఠుఁ డంత వికుక్షి కుందెలు దింట లో పల నెఱింగి ‘యనర్హ మెంగిలి పైతృకం బొనరింపఁగా వలదు వీఁడు దురాత్మకుం’ డన వానితండ్రియు వానిఁ జెం తలను జేరఁగనీక దేశము దాఁటి పో నడిచెన్ వడిన్. |
158 |
| ఆ. |
కొడుకు వెడలఁగొట్టి గుణవంతుఁ డిక్ష్వాకుఁ, డా వసిష్ఠుఁ డేమి యాన తిచ్చె నదియుఁజేసి యోగియై వనంబునఁ గళే, బరము విడిచి ముక్తిపదము నొందె. |
159 |
| చ. |
జనకుఁడు ముక్తిఁ బొంద నయశాలి వికుక్షి శశాదు డంచు భూ జనులు నుతింప నీ ధరణిచక్ర మశేషము నేలి యాగముల్ గొనకొని చేసెఁ బ్రీతి హరిఁ గూర్చి పురంజయుఁ బుత్త్రుఁ గాంచెఁ బే ర్కొనె “నమరేంద్రవాహుఁడు గకుత్స్థుఁడు” నంచును వాని లోకముల్. |
160 |
| సీ. |
కృతయుగాంతంబున దితిసుతామరులకు రణ మయ్యె; నందు నా రాక్షసులకు నమరవల్లభుఁ డోడి హరితోడఁ జెప్పిన జలజనేత్రుఁడు పురంజయునియందు వచ్చి నే నుండెద వాసవ! వృషభంబవై మోవు మని పల్క నమరవిభుఁడు గోరాజమూర్తిఁ గకుత్ప్రదేశంబున నా పురంజయు మోచె నంత నతఁడు |
|
| తే. |
విష్ణుతేజంబు దనయందు విస్తరిల్ల , దివ్యచాపంబు చేఁబట్టి దీర్ఘనిశిత బాణములఁ బూని వేల్పులు ప్రస్తుతింప, నంత కాలాగ్నిచాడ్పున ననికి నడచె. |
161 |
| చ. |
నడచి శరావళిన్ దనుజనాథులమేనులు చించి కంఠముల్ దొడిఁదొడిఁ ద్రుంచి కాలుపురిత్రోవకుఁ గొందఱఁ బుచ్చి కొందఱన్ వడి నురగాలయంబున నివాసము సేయఁగఁ దోలి యంత నూ రడక నిశాచరేంద్రులపురంబులు గూల్చె పురంజయాఖ్యతన్. |
162 |
| వ. | ఇ వ్విధంబున శశాదపుత్త్రుండు రాక్షసులపురంబులు జయించిన కతనం బురంజయుండును, వృషభరూపుండైన యింద్రుండు వాహనం బగుటంజేసి యింద్రవాహనుండును, నతనిమూపురం బెక్కి రణంబు సేసిన కారణంబునఁ గకుత్స్థుండును నన నీ మూఁడు నామంబులం బ్రసిద్ధి కెక్కి దైత్యుల ధనంబులు నింద్రుని కిచ్చె, నప్పురంజయునిపుత్త్రుం డనేనసుండు, అతనిపుత్త్రుండు పృథుండు, పృథునికొడుకు విశ్వగంధుండు, విశ్వగంధునకు నందనుండు చంద్రుండు. చంద్రసుతుండు యువనాశ్వుండు, యువనాశ్వ తనూభవుండు శవస్తుండు. అతండు శావస్తి నామనగరంబు నిర్మించె. శవస్తతనయుండు బృహదశ్వుండు; బృహదశ్వతనూజుండు గువలయాశ్వుం; డానరేంద్రచంద్రుండు. | 163 |
| క. |
లావు మెఱసి యిరువదియొక, వేవురు నందనులుఁ దాను వీరుఁ డతఁడు భూ దేవుఁ డుదంకుఁడు పనుప దు, రావహుఁడై చంపె దుంధు నమరాబంధున్. |
164 |
| వ. | అది కారణంబుగా దుంధుమారుం డన నెగడె. నయ్యసురుముఖానలంబునఁ గువలయాశ్వు కుమారు లందఱు భస్మంబై; రందు దృఢాశ్వుండును, గపిలాశ్వుండును, భద్రాశ్వుండును ననువారలు ముగ్గురు సిక్కి; రందు దృఢాశ్వునకు హర్యశ్వుండును, హర్యశ్వునకు నికుంభుండును, నికుంభునకు బర్హిణాశ్వుండును, బర్హిణాశ్వునకుఁ గృతాశ్వుండును, గృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యువనాశ్వుండును జనియించి; ర య్యువనాశ్వుండు గొడుకులు లేక నూర్వురుభార్యలుం దానును నివ్వెఱపడియుండ, నా రాజునకు మునులు కృపసేసి, ఇంద్రునిఁ గూర్చి సంతతికొఱకై యైంద్రయాగంబు సేయించి రందు. | 165 |
| సీ. |
భూమీశుభార్యకుఁ బుత్త్రలాభమునకై పోయు తలంపున భూమిసురులు జలమును మంత్రించి జలకలశము దాఁచి నియమంబుతోఁగూడి నిద్రవోవ ధరణీశ్వరుఁడు పేరుదప్పితో నా రాత్రి ధృతిలేక యజ్ఞమందిరముఁ జొచ్చి యా నీరుఁ ద్రావిన నంత మేల్కని వార ‘లెవ్వఁడు ద్రావె నీరెందుఁ బోయె?’ |
|
| ఆ. |
ననుచు రాజు ద్రావు టంతయు భావించి, యెఱిఁగి చోద్యమంది యీశ్వరాజ్ఞ యెవ్వఁ డోపుఁ గడవ; నీశ్వరునకు నమ, స్కార మనుచు నేది కార్య మనుచు. |
166 |
| వ. | వారలు దుఃఖింపుచుండు నంతఁ గొంత తడవునకు యువనాశ్వునికడుపు వ్రక్కలించుకొని, చక్రవర్తి చిహ్నంబులు గల కుమారుండు జన్మించి, తల్లి లేనికతంబునం గడుపునకు లేక యేడ్చుచుండ, ఇంద్రుండు వచ్చి, శిశువునకు నాఁకటి దీఱుకొఱకు వానినోటం దనవ్రేలిడినం, ద్రావినకతంబున వానిపేరు మాంధాత యని నిర్దేశించి చనియె. ని వ్విధంబున. | 167 |
| ఆ. |
కడుపు పగుల ముద్దుకొడుకు జన్మించినఁ, దీఱఁ డయ్యెఁ దండ్రి దేవవిప్ర కరుణ యట్ల కాదె? కడిఁది దైవము లావు, కలుగువాఁడు బ్రతుకుఁ గాక చెడునె? |
168 |
| వ. | ఇట్లు బ్రతికియున్న యువనాశ్వుండు, కొంతకాలంబునకుఁ దపంబుసేసి, సిద్ధిం బొందె; నంత. | 169 |
| సీ. |
పడమటఁ బొడమెడు బాలచంద్రునిమాడ్కిఁ బూఁటపూఁటకు వృద్ధిఁ బొందె బాలుఁ; డల్లన పరిపూర్ణయౌవనారూఢుఁడై రావణాదిరిపుల రాజవరుల దండించి తనుఁ ద్రసదస్యుఁ డంచు సురేంద్రుఁ డంకింప శూరుఁడై యఖిలదేవ మయు నతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్ము నజుని యజ్ఞాధీను నాత్ముఁ గూర్చి |
|
| తే. |
చేసెఁ గ్రతువులు భూరిదక్షిణల నిచ్చి, ద్రవ్యయజమానవిధిమంత్రధర్మయజ్ఞ కాలఋత్విక్ప్రదేశముఖ్యంబు లెల్ల, విష్ణురూపంబు లనుచు భావించి యతఁడు |
170 |
| క. |
బలిమి నడంచుచు నరులం, జలివెలుఁగున్ వేఁడివెలుఁగుఁ జనుచోటెల్లన్ జలరుహనయనునికరుణను, జెలువుగ మాంధాత యేలె సిరి నిండారన్. |
171 |
| వ. | అంత నా రాజునకు శతబిందునికూఁతురగు బిందుమతియందుఁ బురుకుత్సుండు; నంబరీషుండును, ముచుకుందుండును ననువారు ముగ్గురుగొడుకులు, నేఁబండ్రుకూఁతులును జనియించి, పెరుఁగుచున్న యెడ. | 172 |
| సీ. |
యమునాజలములోన నధికుఁడు సౌభరి తపము సేయుచు జలస్థలమునందుఁ బిల్లలుఁ దనప్రాణవల్లభయునుఁ గూడి మెలఁగ నానందించు మీనరాజుఁ గనుఁగొని సంసారకాంక్షియై మాంధాత నొక కన్య నడుగ నృపోత్తముండు తరుణి నిత్తును స్వయంవరమునఁ జేకొను మనవుడు ననుఁ జూచి యౌవనాంగి |
|
| ఆ. |
యేల ముసలిఁ గోరు నిట్టట్టు వడఁకెడి, వాఁడఁ జాల నరసినాఁడ నొడల జిగియు బిగియు లేని శిథిలుండఁ గరఁగింప, బాలఁ దిగిచికొను నుపాయ మెట్లు? |
173 |
| వ. | అదియునుం గాక. | 174 |
| ఆ. |
బాల పువ్వుఁబోడి ప్రాయంపువానినిఁ, జెన్నువాని ధనముఁజేర్చువాని మరగెనేనిఁ గొంత మరగుఁగా కెదిరిఁ ద, న్నెఱిఁగి ముసలితపసి నేల మరగు? |
175 |
| వ. | అని విచారించి సౌభరి దన తపోబలంబునం జేసి ముసలితనంబు విడిచి యెలప్రాయంపుఁ గొమరుండయి యలంకరించుకొని ముందట నిలువంబడిన మాంధాతయుఁ గన్నియల నగరు గాచికొని యున్నవారికి సెలవు సేసినవా ర మ్మునీంద్రుని నా రాజపుత్రికలున్న యెడకుం గొనిపోయి చూపిన. | 176 |
| ఉ. |
‘కోమలులార! వీఁడు నలకూబరుఁడో! మరుఁడో! జయంతుడో! యేమఱి వచ్చె; వీనిఁ దడ వేల వరింతుము నేమ నేమ’ యం చా మునినాథుఁ జూచి చలితాత్మికలై సొరిదిన్ వరించి రా భామిను లందఱుం గుసుమబాణుఁడు గీయని ఘంట వ్రేయఁగన్. |
177 |
| వ. | ఇట్లు రాజకన్యకల నందఱం జేకొని సౌభరి నిజతపఃప్రభావంబున ననేకలీలావినోదంబులఁ గల్పించి. | 178 |
| సీ. |
గృహరాజములయందుఁ గృతకాచలములందుఁ గలువలు విలసిల్లు కొలఁకులందుఁ గలకంఠశుకమధుకరనినాదములచే వర్ణనీయములైన వనములందు మణివేదికలయందు మహనీయపర్యంకపీఠలీలాశైలబిలములందు శృంగారవతులగు చెలువలు పలువురు తనపంపు సేయ సుస్థలములందు |
|
| తే. |
వస్త్రమాల్యానులేపసువర్ణహార, భూరిసంపద నిష్టాన్నభోజి యగుచుఁ బూఁట పూటఁకు నొక వింత పొలుపుఁ దాల్చి, రాజకన్యల నందఱ రతులఁ దేల్చె. |
179 |
| క. |
పెక్కండ్రు రాజముఖులకు, నొక్కఁడు మగఁ డయ్యుఁ దనియకుండె మునీంద్రుం డెక్కుడు ఘృతధారలచే, నక్కజమై తృప్తి లేని యనలునిభంగిన్. |
180 |
| వ. | ఇవ్విధంబున. | 181 |
| క. |
ఆరామంబున మునివరుఁ, డా రామలతోడ బహువిహారమయుండై గారాములఁ దన కిట్టటు, పోరాముల సేసి కొన్నిప్రొద్దులు పుచ్చెన్. |
182 |
| వ. | అంత నొక్కనాఁడు మాంధాతృమేదినీవల్లభుండు, మునీశ్వరుం డెందుఁ బోయెఁ? గూఁతు లెక్కడ నలజడి పడుచున్నవారలో’ అని తలంచి, వెదుక వచ్చి, యొక్క మహానగరంబున, మణిమయసౌధంబులం, జక్రవర్తియుంబోలెఁ గ్రీడించుచున్న తాపసరాజుం గని, సంతసించి, వెఱఁగుపడి, మన్ననలంబొంది, మెల్లన కూఁతులం బొడగని సత్కరించి యిట్లనియె. | 183 |
| క. |
నా తోడులార! మీ పతి, మీ తోడే?, పనులయెడల మేలే’ యనుడున్ ‘నా తోడిదె నా తోడిదె, తాతా మే!’, లనుచు ననిరి తరుణులు వరుసన్. |
184 |
| వ. | అంతఁ గొంతకాలంబునకు గృహగతచర్యుండగు సౌభరి యేకాంతంబునఁ దన్నుఁ దాన చింతించుకొని, మీనమిథునసంగదోషంబునం గాఁపురంబు దనకు నగపడుట యెఱింగి, పశ్చాత్తాపంబున నిట్లనియె. | 185 |
| మ. |
ఉపవాసంబుల డయ్యుటో? విషయసంయోగంబు వర్జించుటో? తపముం బూని చరించుటో? హరిపదధ్యానంబునన్ నిల్చుటో? యపలాపంబున నేల పొందితి? హతం బయ్యెం దపంబెల్ల నీ కపటస్త్రీపరిరంభముల్ మునులకుం గైవల్యసంసిద్ధులే? |
186 |
| చ. |
ముని నఁట! తత్త్వవేది నఁట! మోక్షమ కాని సుఖంబు లెవ్వియుం జన వఁట! కాంత లేఁబ దఁట! సౌధచయం బఁట వాసదేశముం, దనయులు నైదువే లఁట! నిదానము మీనకుటుంబిసౌఖ్యముం గను టఁట చెల్లరే నగవుగాక మహాత్ములు సూచి మెత్తురే? |
187 |
| ఆ. |
తపము సేయువాఁడు దత్త్వజ్ఞుఁ డగువాఁడు, నెలమి మోక్ష మిచ్ఛ నెంచువాఁడు నేకతంబు విడిచి యేర్పడ నేరఁడు, కాఁపురంబు సేయుఁ గఱటితపసి. |
188 |
| వ. | అని దుఃఖించి, తన్నుం దాన నిందించుకొని, తన వేడబంబు వివేకించుచు, నిహపరసాధకుండై, కాఁపురంబు విడిచి, సతులుం దానును వానప్రస్థధర్మంబున నడవికిం జని, ఘోరతపంబు సేసి, శరీరంబు గుదియించి, యగ్నిసహితుండై, పరబ్రహ్మంబు సొచ్చె; నంత. | 189 |
| క. |
మునిపతి వనమున కరిగిన, వనితలు తో నరిగి ప్రాణవల్లభుగతికిం జనిరి వెనుతవిలి విడువక, యనలునితో శిఖలు నిలువ కరిగినభంగిన్. |
190 |
| వ. | అంత మాంధాత పెద్దకొడుకగు నంబరీషునిం దత్పితామహుం డగుటం జేసి యువనాశ్వుండు దనకుఁ బుత్త్రుండు గావలయునని కోరి తెచ్చుకొనియె; న య్యంబరీషునకు యౌవనాశ్వుం, డతనికి హారితుండు జనియించి, రది కారణంబుగా నంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాతృగోత్రంబునకుఁ బ్రవరులైరి; మాంధాత రెండవకొడుకు పురుకుత్సుం; డతని నురగలోకంబునకుఁ గొనిపోయి భుజంగకుమారులు దమ చెల్లెలి నర్మదయను కన్యకను వివాహంబు చేసిరి; పురుకుత్సుండు నక్కడ ననేకగంధర్వనాథుల వధించి తన నాగలోక సంచరణంబు దలంచువారికి నురగభయంబు లేకుండ వరంబు వడసి తిరిగి వచ్చె; నా పురుకుత్సునకుఁ ద్రసదస్యుండుఁ, ద్రసదస్యునకు ననరణ్యుండు, నా యనరణ్యునకు హర్యశ్వుండు, హర్యశ్వునకు నరుణుండు, నరుణునకుఁ ద్రిబంధనుండుఁ; ద్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించి; రా సత్యవ్రతుండు త్రిశంకుఁడనం బరఁగె; నతండు. | 191 |
| సీ. |
గురుశాపవశమునఁ గూలి చండాలుఁడై యనఘాత్ముఁ గౌశికు నాశ్రయించి యతనిలావున దివిజాలయంబున కేఁగ మన్నింప కమరులు మరలఁ ద్రోయఁ దలక్రిందుగాఁ బడి దైన్యంబుతో రాఁగఁ గౌశికుం డెప్పటి ఘనత మెఱసి నిలిపె నాకసమున; నేఁడు నున్నాఁడు త్రిశంకుఁ; డాతఁడు హరిశ్చంద్రుఁ గనియె |
|
| తే. |
నా హరిశ్చంద్రుఁ గౌశికుఁ డర్థిఁ జేరి, యాగదక్షిణామిషమున నఖిలధనముఁ గొల్లఁగొని మీఁదఁ గులహీనుఁ గొలువఁబెట్ట, బొంక కలజడిఁ బొందె నా భూవరుండు. |
192 |
| వ. | అట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రు నెగులుపఱచుట విని వసిష్ఠుండు విశ్వామిత్రుని గృధ్రమ్మవు గమ్మని శపించె. విశ్వామిత్రుండును వసిష్ఠుని బకంబవు గమ్మని శపించెఁ; బక్షిరూపు లయ్యును వైరంబు మానక య య్యిరువురును యుద్ధంబు సేసి; రంత హరిశ్చంద్రుండు పుత్త్రులు లేక నారదు నుపదేశంబున వరుణోపాసనంబు నతిభక్తితోఁ జేయ నా వరుణుండు ప్రత్యక్షంబైన నతనికిఁ మ్రొక్కి యిట్లనియె. | 193 |
| ఆ. |
‘వరుణదేవ! నాకు వరవీరగుణములఁ, గొడుకు పుట్టెనేనిఁ గొడుకుఁబట్టి పశువుఁజేసి నీవు పరిణమింపఁగ వేల్తుఁ, గొడుకు నీఁ గదయ్య కొసరు లేక! |
194 |
| వ. | అని పలికినం గుమారుండు గలిగెడు మని వరం బిచ్చి వరుణుండు సనియె; నంత హరిశ్చంద్రునకు వరుణప్రసాదంబున రోహితుండను కుమారుండు జన్మించె; వరుణుండును హరిశ్చంద్రకుమారు నుద్దేశించి. | 195 |
| సీ. |
పురిటిలోపల వచ్చి పుత్త్రువేలుపు మన్నఁ బురుడు వోయినఁగాని పొసఁగ దనియెఁ; బలురాక మును వచ్చి బాలు వేలుపు మన్నఁ బండ్లు లేకుంట నభావ్యుఁడనియెఁ; బండ్లు రాఁజూచి డింభకుని వేలుపు మన్నఁ బడి పండ్లు రామి నభావ్యుఁడనియెఁ; బడిపండ్లు వొడమినఁ గొడుకు వేలుపు మన్నఁ బోరుల కొదవక పోల దనియెఁ; |
|
| ఆ. |
దొడరి యిట్లు గొడుకుతోడిమోహంబునఁ, బ్రొద్దు గడపుచుండె భూవరుండు దండ్రి తలఁపుకొలఁదిఁ దనలోనఁ జింతించి, యింట నుండ కడవి కేగెఁ గొడుకు. |
196 |
| వ. | ఇట్లు వనంబునకుం జని శరశరాసనధరుండయి రోహితుండు దిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదరవ్యాధిచేఁ బీడితుండుగా నుండుట విని, పురంబునకుం దిరిగి రా గమకింప నింద్రుండు ముసలితపసియై వచ్చి యిట్లనియె. | 197 |
| ఆ. |
పుణ్యభూము లరుగు; పుణ్యతీర్థంబులఁ, గ్రుంకు; పుణ్యజనులఁ గోరి చూడు; పుణ్యకథలు వినుము భూపాలపుత్రక!, మేలు గలుగునట్టి మేర గలదు. |
198 |
| వ. | అని యిట్లు మగుడించినం దిరిగి చని రోహితుం డొక్క యే డవ్వనంబునం దిరిగి క్రమ్మఱఁ జనుదేర నింద్రుండు వచ్చి తొంటియట్ల నివారించె; ని వ్విధంబున. | 199 |
| సీ. |
ఐదేండ్లు మరలించె నమరేంద్రుఁ డా బాలు నాఱవయేటఁ దా నడవినుండి యింటికి వచ్చుచు నెలమి నజీగర్తు మధ్యమపుత్త్రు సన్మాన్యచరితు ఘను శునశ్శేఫునిఁ గొని యాగపశువుగ నా హరిశ్చంద్రున కాతఁ డిచ్చెఁ; బురుషమేధము సేసి భూపాలవర్యుఁడు వరుణాదినిఖిలదేవతలఁ దనిపె |
|
| తే. |
హోత కౌశికుఁ; డధ్వర్యుఁ డొనర భృగువు;, బ్రహ్మ జమదగ్ని, సామంబు పాడువాఁడు ముని వసిష్ఠుఁ డా మఖమున ముదముఁ బొంది, కనకరథ మిచ్చె నింద్రుఁ డా మనుజపతికి. |
200 |
| వ. | శునశ్శేఫునిప్రభావంబు వెనుక వివరించెద; నంత భార్యాసహితుండైన హరిశ్చంద్రువలన నత్యంతప్రీతుండై విశ్వామిత్రుం డతనికి ముఖ్యజ్ఞానంబుఁ గృపసేసిన మనం బన్నమయంబు గావున, నన్నరూపియైన పృథివి నెఱింగి, పృథివిని జలంబువలన నణంచి, జలంబుఁ దేజంబువలన నింకించి, తేజంబు వాయువువలనం జేర్చి, వాయువు నాకాశంబునం గలిపి, యాకసంబు దామసాహంకారంబునందు లయంబు చేసి, యహంకారత్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్త్వంబునకు లోకంబులు సృజించెద నను తలంపైన మహత్తత్త్వంబునందు విషయాకారంబు నివర్తించి విషయవివర్జితుండై పరతత్త్వంబుల నెఱుంగుచు, న య్యెఱుకవలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబుఁ జేసి, యయ్యెఱుకను నిర్వాణసుఖపారవశ్యంబునం బరిహరించి, సకలబంధ విముక్తుండై హరిశ్చంద్రుం డవాఙ్మానసగోచరంబయిన నిజరూపంబుతో వెలుంగుచుండె; నతని కుమారునకు హరితుండు పుట్టె; హరితునకుఁ జంపనామధేయుండు జనియించె; నతండు దనపేరఁ జంపానగరంబు నిర్మించె; నా చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు వృకుండు, వృకునకు బాహుకుండు జనియించి; రందు బాహుకుండు. | 201 |