పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
అంబరీషోపాఖ్యానము
శా. సప్తద్వీపవిశాలభూభరము దోఃస్తంభంబునం బూని సం
ప్రాప్తశ్రీయుతుఁడై మహీవిభవసంపచ్చాతురిం గల్గి దు
ర్వ్యాప్తిం జెందక వైష్ణవార్చనల మేరం గాలముం బుచ్చుచున్‌
సుప్తిం బొందక యొప్పె సద్గుణగరిష్ఠుం డంబరీషుండిలన్‌.
81
సీ. చిత్తంబు మధురిపుశ్రీపాదములయంద; పలుకులు హరిగుణపఠనమంద;
కరములు విష్ణుమందిరమార్జనములంద; శ్రవములు హరికథాశ్రవణమంద;
చూపులు గోవిందరూపవీక్షణమంద; శిరము గేశవనమస్కృతులయంద;
పదము లీశ్వరగేహపరిసర్పణములంద; కామంబు చక్రికైంకర్యమంద;
 
తే. సంగ మచ్యుతజనతనుసంగమంద, ఘ్రాణ మసురారిభక్తాంఘ్రికమలమంద;
రసన దులసిదళములంద; రతులు పుణ్య, సంగతులయంద యా రాజచంద్రమునకు.
82
వ. మఱియు నమ్మహీవిభుండు. 83
సీ. ఘనవైభవంబునఁ గల్మషదూరుఁడై యజ్ఞేశు నీశు నబ్జాక్షుఁ గూర్చి
మొనసి వసిష్ఠాదిమునివల్లభులతోడఁ దగిలి సరస్వతీతటమునందు
మేధతో బహువాజిమేధంబు లొనరించె గణుతింపరాని దక్షిణలు వెట్టి
సమలోష్టహేముఁడై సర్వకర్మంబులు హరిపరంబులు గాఁగ నవని యేలె;
 
ఆ. విష్ణుభక్తులందు విష్ణువునందుఁ గ, లంక మెడల మనసు లంకె పెట్టి
విహితరాజ్యవృత్తి విడువనివాఁడునై, యతఁడు రాచతపసి యనఁగ నొప్పె.
84
వ. వెండియు న మ్మహాభాగవతుండు. 85
క. హరి యని సంభావించును, హరి యని దర్శించు; నంటు; నాఘ్రాణించున్‌;
హరి యని రుచిగొనఁ దలఁచును, హరిహరి! ఘను నంబరీషు నలవియె పొగడన్‌?
86
వ. ఇట్లు పుణ్యచిత్తుండు, నీశ్వరాయత్తుండునై యల్లనల్లన రాజ్యంబు సేయుచున్న సమయంబున. 87
ఆ. అతని కీహ మానె హరులందుఁ గరులందు, ధనములందుఁ గేళివనములందుఁ,
బుత్త్రులందు బంధుమిత్రులయందును, బురమునందు నంతిపురమునందు.
88
వ. అంతఁ గొంతకాలంబున క మ్మేదినీకాంతుండు సంసారంబువలని తగులంబు విడిచి నిర్మలుండై యేకాంతంబున భక్తిపరవశుండయి యుండ నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖిలజగదవక్రంబునగు చక్రంబు నిచ్చి చనియె నంత. 89
క. తనతోడి నీడకైవడి, ననురూపగుణాఢ్యయైన యాత్మమహిషితో
జనవిభుఁడు ద్వాదశీవ్రత, మొనరఁగ హరిఁ గూర్చి చేసె నొకయేఁ డధిపా!
90
వ. ఇట్లు వ్రతంబు సేసి, యా వ్రతాంతంబునం గార్తికమాసంబున మూఁడురాత్రు లుపవసించి, కాళిందీజలంబుల స్నాతుండయి, మధువనంబున మహాభిషేకవిధానంబున విహితపరికరసంపన్నుండయి, హరి నభిషేకంబు సేసి, మనోహరంబు లయిన గంధంబులు సమర్పించి యభినవామోదంబులైన పుష్పంబులం బూజించి తదనంతరంబ. 91
శా. పాలేఱై ప్రవహింప డగ్గఱుచు లేఁబ్రాయంబులున్‌ రూపము
ల్మేలై ధూర్తలు గాక వెండిగొరిజల్‌ హేమోరుశృంగంబులుం
గ్రాలం గ్రేపుల యఱ్ఱు నాఁకుచును రంగచ్ఛాయలై యున్న మం
దాలన్‌ న్యర్బుదషట్క మిచ్చె విభుఁ డుద్యద్వైదికశ్రేణికిన్‌.
92
క. పెక్కండ్రు విప్రవరులకు, గ్రక్కున నతిభక్తితోడఁ గడుపులు నిండం
జొక్కపు టన్నంబిడి విభుఁ, డొక్కెడఁ బారణము సేయ నుద్యోగించెన్‌.
93
వ. అ య్యవసరంబున. 94
క. భాసురనిగమపదోప, న్యాసుఁడు సుతపోవిలాసుఁ డనుపమయోగా
భ్యాసుఁడు రవిభాసుఁడు దు, ర్వాసుఁ డతిథి యయ్యెఁ దన్నివాసంబునకున్‌.
95
వ. అట్లతిథియై వచ్చిన న మ్మునివల్లభునకుఁ బ్రత్యుత్థానంబు చేసి, కూర్చుండ గద్దియ యిడి పాదంబులు గడిగి పూజించి సేమం బరసి తనయింట నన్నంబు గుడువుమని నమస్కరించిన నమ్మహాత్ముండును సంతసించి భోజనంబునకు నంగీకరించి నిర్మలంబులగు కాళిందీజలంబులం బరమధ్యానంబు సేయుచు, మునింగి లేచి రాక తడవుసేసిన, ముహూర్తార్ధావశిష్ట యగు ద్వాదశియందుఁ బారణ సేయవలయుటఁ జింతించి బ్రాహ్మణాతిక్రమదోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారల నుద్దేశించి. 96
క. ‘ముని నీరు సొచ్చి వెడలఁడు, చనియెడు ద్వాదశియు నింత సనియె న్నీలో
నన పారణచేయవలయు, వినిపింపుం డర్హమైన విధ మెట్టిదియో?’
97
వ. అని పలికిన నా రాజునకు బ్రాహ్మణజను లిట్లనిరి. 98
ఆ. ‘అతిథి వోయి రామి నధిప! యీ ద్వాదశి, పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంటఁ గాదు కుడుచుటయును గాదు, సలిలభక్షణంబు సమ్మతంబు.’
99
వ. అని ధర్మసందేహంబు వాపిన, నా రాజర్షి శ్రేష్ఠుండును మనంబున హరిం దలంచి నీరు పారణంబు సేసి, జలంబుల మునింగిన తపసిరాక కెదురుచూచుచున్న సమయంబున. 100
సీ. యమునలోఁ గృతకృత్యుఁడై వచ్చి రాజుచే సేవితుండై రాజుచేష్టితంబు
బుద్ధిలో నూహించి బొమముడి మొగముతో నదరెడి మేనితో నాగ్రహించి
రెట్టించి యాఁకలి కొట్టుమిట్టాడంగ నీ సంపదున్మత్తు నీ నృశంసు
నీ దురహంకారు నిందఱుఁ గంటిరే? విష్ణుభక్తుఁడు గాఁడు వీఁడు నన్నుఁ
 
తే. గుడువ రమ్మని మునుముట్టఁ గుడిచినాఁడు, ధర్మభంగంబు సేసి దుష్కర్ముఁ డయ్యె!
నయిన నిప్పుడు సూపెద నన్నిదిశల, నేనుఁ గోపింప మాన్పువాఁ డెవ్వఁ? డనుచు.
101
చ. పెటపెటఁబండ్లు గీఁటుచును, భీకరుఁడై కనుఁగ్రేవ నిప్పుకల్‌
పొటపొట రాల, గండములు పొంగ, మునీంద్రుఁడు హుంకరించుచున్‌,
జట మొదలంటఁగాఁ బెఱికి చక్కన దానన కృత్య నాయుధో
త్కటవలమానహస్తయుతఁగా నొనరించె నయించె రాజుపైన్‌’
102
వ. అంత. 103
క. కాలానలసన్నిభయై, శూలాయుధహస్త యగుచు సుఱసుఱ స్రుక్కన్‌,
నేలఁ బదంబులఁ ద్రొక్కుచు, వాలి మహాకృత్య మనుజవల్లభుఁ జేరెన్‌.
104
ఆ. ఆ ప్రకార మెఱిఁగి హరి విశ్వరూపుండు, ‘వెఱ్ఱితపసి సేయు వేడబంబుఁ
జక్కఁ బెట్టు’ మనుచుఁ జక్రంబుఁ బంచిన, వచ్చె నదియుఁ బ్రళయవహ్నిపగిది.
105
వ. వచ్చి ముని పంచిన కృత్యను దహించి, తనివి సనక ముని వెంటంబడిన, మునియును మేరుగుహ సొచ్చిన నదియు వ్యాళంబు వెనుకొను దవానలంబు చందంబునఁ దోన చొచ్చి మఱియును. 106
మ. భువి దూఱన్‌ భువి దూఱు; నబ్ధిఁ జొర నబ్ధుల్‌ సొచ్చు; నుద్వేగియై
దివిఁ బ్రాఁకన్‌ దివిఁ బ్రాఁకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి
క్కి వెసంగ్రుంకినఁ గ్రుంగు; నిల్వ నిలుచుం గ్రేడింపఁ గ్రేడించు నొ
క్క వడిన్‌ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్రమై.
107
శా. ఏలోకంబున కైన వెంటఁబడి తో నేతెంచు చక్రానల
జ్వాలల్‌ మానుపువారు లేమిఁ జని దేవజ్యేష్ఠు లోకేశు వాఁ
డాలోకించి “విధాత! విశ్వజననవ్యాపారపారీణ రే
ఖా లీలేక్షణ! కావవే కరుణఁ జక్రంబు న్నివారింపవే.”
108
వ. అనిన బ్రహ్మ యిట్లనియె. 109
మ. కర మర్థిన్‌ ద్విపరార్థసంజ్ఞ గల యీ కాలంబుఁ గాలాత్ముఁడై
సొరిదిన్‌ నిండగఁజేసి లోకముల నా చోటున్‌ విభుం డెవ్వఁడో
పరిపూర్తిన్‌ గనుఁగ్రేవఁగెంపు గదురన్‌ భస్మంబుగాఁ జేయు నా
హరిచక్రానలకీల కన్యుఁ డొకరుం డడ్డంబు గా నేర్చునే?
110
ఆ. ఏను, భవుఁడు, దక్షుఁ, డింద్రాదులునుఁ బ్రజా, పతులు, భృగుఁడు, భూతపతులు శిరము
లందుఁ దాల్తు మతని యాజ్ఞ జగద్ధితం, బంచు భూరికార్యమతుల మనుచు.
111
వ. కావున సుదర్శనానల నివారణంబునకు నోపనని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకుం జనుదెంచి, శర్వు నాలోకించి, చక్రానలంబు తెఱంగెఱింగించిన న మ్మహాదేవుండిట్లనియె. 112
సీ. వినవయ్య! తండ్రి! యీ విశ్వేశ్వరుని యందుఁ జతురాస్య జీవకోశములు పెక్కు
వేల సంఖ్యలు గూడి వేళతో నిబ్భంగి, నగుచుండుఁ జనుచుండు; నదియుఁగాక
యెవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార మేను దేవలుఁడసురేంద్ర సుతుఁడు
నారదుఁ డజుఁడు సనత్కుమారుఁడు ధర్ముఁ డా కపిలుఁడు మరీచ్యాదు లన్య
 
ఆ. పారవిదులు సిద్ధపతులు నెవ్వని మాయ, నెఱుఁగలేము దాన నింత పడుదు
మట్టి నిఖిలనాథు నాయుధశ్రేష్ఠంబుఁ, దొలఁగఁజేయ మాకు దుర్లభంబు.
113
వ. మునీంద్రా! నీవు న మ్మహాత్ముని శరణంబు వేఁడు మతండు మేలు సేయంగలవాఁడని పలికిన నీశ్వరునివలన నిరాశుండై, దుర్వాసుండు వైకుంఠనగరంబునకుంజని. 114
శా. ఆ వైకుంఠములోని భర్మమణిసౌధాగ్రంబుపై లచ్చి దాఁ
గ్రేవన్‌ మెల్లన నర్మభాషణములం గ్రీడించు పుణ్యున్‌ హరిన్‌
దేవాధీశ్వరుఁ గాంచి “యో వరద! యో దేవేశ! యో భక్త ర
క్షా విద్యాపరతంత్ర! మానుపఁ గదే, చక్రానలజ్వాలలన్‌.
115
ఉ. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా నెఱుఁగంగ లేక నీ
ప్రేమకు వచ్చు దాసునకుఁ గ్రించుఁదనంబున నెగ్గు చేసితిన్‌
నా మఱపున్‌ సహింపు మట నారకుఁడైన మనంబులో భవ
న్నామము చింతసేసిన ననంతసుఖస్థితిఁ జెందకుండునే?
116
వ. అని పలికి, పాదకమలంబులకు మ్రొక్కి, లేవకయున్న దుర్వాసునిం గని హరి యిట్లనియె. 117
చ. చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్‌
నిలువఁగఁబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్‌
వలలకుఁ జిక్కి భక్తజనవత్సలతన్‌ జనుచుందుఁ దాపసా!
118
ఆ. నాకు మేలుఁ గోరు నా భక్తుఁ డగువాఁడు, భక్తజనుల కేన పరమగతియు;
భక్తుఁ డెందుఁ జనినఁ బఱతెంతు వెనువెంట, గోవువెంటఁ దగులు కోడెభంగి.
119
వ. అదియునుంగాక. 120
ఆ. తనువు మనువు విడిచి, తనయులఁ జుట్టాల, నాలి విడిచి, సంపదాళి విడిచి
నన్నె కాని యన్య మెన్నఁడు నెఱుఁగని, వారి విడువ నెట్టివారినైన.
121
క. పంచేంద్రియముల తెరువుల, వంచించి మనంబునందు వరమతులు ప్రతి
ష్ఠించి వహింతురు నన్నును, మంచివరుం బుణ్యసతులు మరగిన భంగిన్‌.
122
క. సాధులహృదయము నాయది; సాధులహృదయంబు నేను; జగముల నెల్లన్‌
సాధుల నేన యెఱుంగుదు, సాధు లెఱుంగుదురు నాదుచరితము విప్రా!
123
ఆ. ధారుణీసురులకుఁ దపము విద్యయు రెండు, ముక్తి చేయుచుండు ముదముతోడ;
దుర్వినీతులైన దుర్జను లగువారి, కివియుఁ గీడు సేయ కేలయుండు?
124
క. నా తేజము సాధులలో, నాతతమై యుండు వారి నలఁచుజనులకున్‌
హేతిక్రియ భీతి నిచ్చుం, జేతోమోదంబుఁ జెఱుచు సిద్ధము సుమ్మీ.
125
క. అదె పో బ్రాహ్మణ! నీకును, సదయుఁడు నాభాగసుతుఁడు జనవినుతగుణా
స్పదుఁ డిచ్చు నభయ మాతని, మది సంతసపఱచి వేఁడుమా శరణంబున్‌,.
126
మ. అని శ్రీవల్లభుఁ డానతిచ్చిన మహోద్యచ్చక్రకీలావళీ
జనితాయాసుఁడు నిర్వికాసుఁ డుదితశ్వాసుండు దుర్వాసుఁ డ
ల్లన యేతెంచి సభక్తిఁ గాంచెఁ గరుణాలావణ్యవేషున్‌ విదో
షు నయోదారమనీషు మంజుమితభాషు న్నంబరీషున్‌ వెసన్‌.
127
వ. కని, దుఃఖితుండై, యమ్మహీవల్లభుపాదంబులు వట్టి విడువకున్న నా నరేంద్రచంద్రుండు చరణస్పర్శ నంబునకు నోడుచుఁ గరుణారసభరితహృదయుండై, హరిచక్రంబు నిట్లని స్తుతియించె. 128
సీ. నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు; నీవ చంద్రుండవు; నీవ జలము;
నీవ నేలయు; నింగి వీవ; సమీరంబు నీవ; భూతేంద్రియనికర మీవ;
నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును; నీవ యజ్ఞంబును; నీవ ఫలము;
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు; నీవ కాలంబును నీవ జగము;
 
తే. నీవ బహుయజ్ఞభోజివి;నీవ నిత్య, మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి, శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని
129
మ. హరిచే నీవు విసృష్టమై చనఁగ ము న్నాలించి నీ ధారలన్‌
ధరణిన్‌ వ్రాలుట నిక్క మంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్‌
శిరముల్‌ పాదములున్‌ భుజోరుయుగమున్‌ చేతుల్‌ నిజాంగంబు ల
ప్డొరగంబ్రాణసమీరముల్‌ వెడలు నీ యుద్ధంబులం జక్రమా!
130
ఆ. కలఁగి నిద్రవోవఁ గలలోన వచ్చిన, నిన్నుఁ జూచి దీర్ఘనిద్ర వోదు
రసురవరులు శయ్యలందున్నసతులు ప్ర, భాతమందు లేచి పలవరింప.
131
ఉ. చీఁకటి వాపుచున్‌ వెలుఁగు సేయుచు సజ్జనకోటి నెల్ల స
శ్రీకులఁజేయు నీ రుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్‌
వాకున నిట్టి దట్టిదని వర్ణన సేయ విధాత నేరఁ డ
స్తోకము నీదు రూపు గలదుందుది లేదు పరాత్పరాద్యమై.
132
ఆ. కమలలోచనుండు ఖలుల శిక్షింపంగఁ, బాలు సేయ నీవు పాలు వడితి
వైన నింకఁ జాలు నాపన్నుఁడై యున్న, తపసిఁ గావు నీవు ధర్మవృత్తి.
133
వ. అని వినుతించి కేలుఁదమ్మిదోయి నొసలంబొసంగించి యిట్లనియె. 134
ఆ. ఏ నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ, కేతువునకు ధర్మసేతువునకు
విమలరూపమునకు విశ్వదీపమునకుఁ, జక్రమునకు గుప్తశక్రమునకు.
135
వ. అని మఱియు నిట్లనియె. 136
ఆ. విహితధర్మమందు విహరింతు నేనియు, నిష్టమైన ద్రవ్య మిత్తునేని
ధరణిసురుఁడు మాకు దైవతంబగునేని, విప్రునకు శుభంబు వెలయుఁగాక!
137
క. అఖిలగుణాశ్రయుఁడగు హరి, సుఖియై నా కొలువువలనఁ జొక్కెడినేనిన్‌
నిఖిలాత్మమయుండగుటకు, సుఖమందుంగాక భూమిసురుఁ డివ్వేళన్‌.
138
వ. అని యివ్విధంబునం బొగడు పుడమిఱేని వలన మన్నించి, తపసిని దాహంబు నొందింపక, రక్కసుల గొంగ చక్రంబు తిరిగి చనియె; నంత దుర్వాసుండు శాంతిం బొంది మెల్లని మేలిమి మాటల నా రాజుం దీవించి, యిట్లనియె. 139
మ. ‘నరనాథోత్తమ! మేలు సేసితి కదా! నా తప్పు మన్నించి శ్రీ
హరి పాదాబ్జము లింతముట్టఁగొలుతే? యాశ్చర్య మౌ నెన్నుచో
నరుదండ్రే నినుఁబోఁటి సాధులకుఁదానై యిచ్చుటల్‌ గాచుటల్‌
సొరిదిన్‌ నైజగుణంబులై సరస వచ్చుంగాదె మిత్రాకృతిన్‌.
140
వ. అదియునుం గాక. 141
మ. ఒక మా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోఁకినన్‌
సకలాఘంబులు పల్లటిల్లి తొలఁగున్‌ సంభ్రాంతితో నట్టి స
త్సుకరున్‌ మంగళతీర్థపాదు హరి విష్ణున్‌ దేవదేవేశుఁ దా
నకలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!
142
మత్తకోకిల. తప్పు లోఁగొని చక్రపావకదాహముం బెడఁబాపి తౌ
నొప్పునొప్పు భవద్దయారస మో నరేశ్వర! ప్రాణముల్‌
సెప్ప మున్మును వోయి క్రమ్మఱఁజేరె ధన్యుఁడ నైతి నీ
కెప్పుడున్‌ శుభ మేను గోరెద నింకఁబోయెద భూవరా!
143
క. అనిన విని రాజముఖ్యుఁడు, మునివల్లభు పాదములకు మ్రొక్కి కడున్‌ మ
న్నన సేసి యిష్టభోజన, మనువుగఁబెట్టించెఁదృప్తుఁడయ్యె నతండున్‌.
144
వ. మఱియు నమ్మునీంద్రుం డిట్లనియె. 145
శా. “కంటిన్‌ నేఁటికి నిన్ను నీ వచనముల్‌ కర్ణద్వయప్రీతిగా
వింటి న్నన్నముఁ గొంటి నీ గృహమునన్‌ వేడ్కన్‌ ఫలంబబ్బె నే
మంటిన్‌ బోయెద! నీ చరిత్ర మమరుల్‌ మర్త్యుల్‌ సుఖాసీనులై
మింటన్‌ మేదిని సన్నుతింపఁగల రీమీఁదన్నరేంద్రాగ్రణీ!
146
వ. అని చెప్పి దుర్వాసుం డంబరీషుని దీవించి, కీర్తించి, మింటి తెరువున బ్రహ్మలోకమునకుం జనియె. మునీశ్వరుండు తిరిగి చనువేళకు నొక సంవత్సరంబు నిండి, వ్రతంబు పరిపూర్ణంబయిన. 147
ఆ. అవనిసురుఁడు గుడువ నతిపవిత్రంబైన, వంటకంబు భూమివరుఁడు గుడిచెఁ
దపసి నెగులు మాన్పఁ దానెంతవాఁడను, హరి కృపామహత్త్వ మనుచుఁ దలఁచి.
148
వ. మఱియును. 149
క. హరిఁగొల్చుచుండువారికిఁ, బరమేష్ఠిపదంబు మొదలు పదభోగంబుల్‌
నరకసమములను తలఁపున, ధరణీరాజ్యంబుతోడి తగులము మానెన్‌.
150
వ. ఇట్లు విరక్తుం డై 151
ఆ. తనకు సదృశులైన తనయుల రావించి, ధరణిభరము వారిఁ దాల్పఁ బంచి
కాననంబు సొచ్చెఁ గామాది విజయుఁడై, నరవిభుండు హరిసనాథుఁ డగుచు.
152
క. ఈ యంబరీషచరితము, తీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం, డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!
153
వ. విను మయ్యంబరీషునకు విరూపుండును, గేతుమంతుండును, శంభుండు నను వారు మువ్వురు కొడుకు; లందుఁ గేతుమంతుండును, శంభుండును హరింగూర్చి తపంబు సేయువారై, వనంబునకుం జనిరి. విరూపునికిఁ బృషదశ్వుండును, బృషదశ్వునకు రథీతరుండును గలిగి; రమ్మహాత్మునికి సంతతి లేకున్న నంగిరసుఁడను మునీంద్రుం డతని భార్యయందు బ్రహ్మతేజోనిధులైన కొడుకులం గలిగించె; వారలు రథీతరగోత్రులు, నాంగిరసులను బ్రాహ్మణులునై, యితరులందు ముఖ్యులయి ప్రవర్తిల్లి రని చెప్పి శుకుం డిట్లనియె. 154
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )