పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
వైసస్వత మనువంశ కథనము
ఆ. వినుము, మనువుకులము వేయినూఱేండ్లును, బరఁగ విస్తరించి పలుకరాదు
నాకుఁ దోఁచినంత నరనాథ! వేగంబ, యెఱుకపడఁగఁ బ్రీతి నేర్పరింతు.
6
క. ఎక్కువ తక్కువ పొడవుల, కెక్కటి మొదలైన పురుషుఁ డింతయుఁ జెడఁ దా
నొక్కఁడుఁ గల్పాంతంబున, నక్కజమై నిల్చె విశ్వ మతఁడై యుంటన్‌.
7
సీ. భూమీశ! య మ్మహాపురుషునినాభిమధ్యమున బంగారుఁగెందమ్మి మొలిచె;
నా తమ్మిపూవులో నటమీఁదఁ దనయంత నాలుగుమోముల నలువ వుట్టె
నా బ్రహ్మమనమున నట మరీచి జనించె; గశ్యపుం డతనికిఁ గలిగె; నంత
నా కశ్యపునికి దక్షాత్మజ యదితికిఁ గొమరుఁడై చీఁకటిగొంగ వొడమె;
 
తే. జలజబంధునిపెండ్లాము సంజ్ఞయందు, శ్రాద్ధదేవుండు మనువు సంజాతుఁ డయ్యె
మనువునకు శ్రద్ధ యనియెడి మగువయందుఁ, బదురుగొడుకులు గలిగిరి భద్రయశులు.
8
వ. వార లిక్ష్వాకుండును, నృగుండును, శర్యాతియు, దిష్టుండును, ధృష్టుండును, గరూశకుండును, నరిష్యంతుండును, వృషధ్రుండును, నభగుండును, గవియు నన నెగడి; రటమున్ను మనువుకొడుకులు లేనివాఁడై, మిత్రావరుణుల నుద్దేశించి. 9
సీ. మనువు బిడ్డలు పుట్ట మఖ మాచరించుచో నతనిభార్యయు హోత నాశ్రయించి
కూఁతురు పుట్ట నాకును జేయు మని పల్కి వరభక్తితోఁ బయోవ్రతము సల్పె;
నా సతి సెప్పిన ట్లధ్వర్యుఁడును హోత నగుఁ గాక! వేలువు, మనుచుఁ బలికె;
హవి నందుకొని ‘కూఁతు రయ్యెడు’ మని వషట్కారంబు సెప్పుచుఁ గదిసి వేల్వ
 
తే. హోత పెడచేఁత నిల యను నువిద పుట్టె, దానిఁ బొడగని మనువు సంతాప మంది
“కొడుకు మేల్‌ గాక! యేటికిఁ గూఁతు? రకట!, చెప్పవే” యని పోయె వసిష్ఠుకడకు.
10
వ. చని యిట్లనియె. 11
క. “అయ్యా! కొడుకులకొఱకై, యియ్యాగము నీ యనుజ్ఞ నేఁ జేయంగా
నియ్యాఁడు దేల పుట్టెను?, మీయంతటివారి కొండు మేరయుఁ గలదే!
12
వ. అదియునుంగాక, మీరు బ్రహ్మవాదులరు; మంత్రవాదులరు; పాపంబు లందకుండం జేయించువా; రిదియేమి?” యనవుడు, మా ముత్తాత వసిష్ఠుండు హోతృవ్యభిచారం బెఱింగి, మనువున కిట్లనియె! 13
తే. ‘అధిప! సంకల్పవైషమ్య మగుటఁజేసి, హోత కల్లతనంబున నువిద గలిగె;
నైనఁ గలిగింతు నీకుఁ బ్రియాత్మజునిని, నీవు మెచ్చంగఁ జూడు నా నేర్పుబలిమి’
14
వ. అని పలికి భగవంతుండగు వసిష్ఠుండు గీర్తితత్పరుండు గావున మనువుకూఁతు మగతనంబుకొఱకు నేకచిత్తంబున నాదిపురుషుండగు హరిం బొగడిన నప్పరమేశ్వరుండు మెచ్చి తపసి కోరిన వరం బిచ్చె; నది నిమిత్తంబుగా నిలాకన్యక సుద్యుమ్నుండను కుమారుండయి రాజ్యంబు సేయుచు. 15
సీ. ప్రొద్దు వో కొకనాఁడు వోయి పేరడవుల, వెంట వేఁటాడుచు వేడ్కతోడఁ
గొందఱు మంత్రులు గూడ రా సైంధవం బయిన గుఱ్ఱము నెక్కి యందమైన
బలువిల్లుఁ గ్రొవ్వాఁడి బాణంబులును దాల్చి పెనుమెకంబులవెంట బిఱుసుతోడ
నుత్తరదిశను మహోగ్రుఁడై చని చని మేరువుపొంతఁ గుమారవనముఁ
 
తే. జేరె నందు మహేశుండు శివయు నెపుడు, రతి సలుపుచుందు రందుఁ జొరంగఁ బోవ
నాఁడు దయ్యెను రాజు; రాజానుచరులుఁ, బడఁతులైరి తదశ్వంబు బడబ యయ్యె.
16
వ. ఇట్లు మగతనంబు సెడి మగువలై యొండొరుల మొగంబులు సూచి మఱుఁగుచుండి; రనిన విని శుకునకు రాజిట్లనియె. 17
ఆ. ‘రాజుఁ దోడివారు రమణులై రంటివి, కాంత లగుట యేమికారణమున?
నిట్టి దేశ మెఱుఁగ మెన్నఁడు నా కథల్‌, వేడ్కదీర నాకు విస్తరింపు.
18
వ. అదియునుంగాక. 19
ఆ. మగువతనము మాని మగవాఁడు గావచ్చుఁ, గాక పేరుఁ బెంపు గాసి గాఁగ
మగతనంబు మాని మగువ గావచ్చునె, మానవంతుఁడైన మానవునకు?
20
వ. అని యడిగిన నర్జునపౌత్త్రునకు వ్యాసపుత్త్రుం డిట్లనియె. 21
సీ. ‘పురవైరి కొకనాఁడు పొడసూపువేడుకఁ దద్దయు దిక్కుల తమము లెల్ల
దమతమ వెలుఁగులు దగిలి గొందులు సొరఁ గొందఱు మౌనులు గోరి రాఁగఁ
బ్రాణేశుతొడలపై భాసిల్లు నంబిక వారలఁ జూచి మై వలువ లేమి
సిగ్గు పుట్టిన లేచి చీరఁ గట్టినఁ జూచి దేవియు దేవుండు దీర్ఘలీల
 
తే. నొంటి దమలోనఁ గ్రీడించుచున్నవారు, మనకు సమయంబు గా దని మరలి మునులు
నరుఁడు నారాయణుండు ననారతంబు, మెలఁగుచోటికి నడచిరి మేదినీశ!
22
వ. అది కారణంబుగా, భగవంతుండగు శివుండు తన ప్రియురాలివేడుకలకొఱకు నిట్లని వక్కాణించె. 23
క. ఈ నెల వెవ్వఁడు సొచ్చిన, మానిని యగు ననిన తొంటి మాటకతమునన్‌
మానవుఁడు మగువపోఁడిమి, మానక పేరడవులందు మఱియుం దిరిగెన్‌.
24
వ. ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం దానును నా రాచపూఁబోఁడిచూపుల నాఁడుపోఁడిమి నెఱపుచు దైవయోగంబున సోమసుతుండును, భగవంతుండును నగు బుధునియాశ్రమంబు సేరి మెలఁగుచున్న యెడ. 25
ఆ. రాజుకొడుకుఁ జూచె రాజీవదళనేత్ర, రాజవదనఁ జూచె రాజుపట్టి
దొంగకాముఁ డంత దొందడిఁ జిగురాకు, వాలు వెఱికి యుఱికి వారి మొత్తె.
26
వ. ఇట్లలరువిల్తుని నెఱబిరుదుచిగురుటడిదంబు మొనకు నోహటించి వార లిరువురుం బై పడి వేడుకలకుం జొచ్చిన వారలకుం బురూరవుం డను కుమారుండు పుట్టె. నివ్విధంబున. 27
ఆ. మనుసుతుండు ఘనుఁడు మగనాలితనమునఁ, గొడుకుఁ గాంచి విసివి కుంది కుంది
చింతఁ బొంది గురు వసిష్ఠుని భావించె, నతనితలఁపుతోన నతఁడు వచ్చె.
28
వ. వచ్చి సుద్యుమ్నుండు మగవాడగుకొఱకు న మ్మునిపుంగవుండు శంకరు నారాధింప నీశ్వరుండును దపసిప్రయాసంబునకు సంతసిల్లి యిట్లనియె. 29
మ. ‘తన మున్నాడినమాటయున్‌ నిజముగాఁ దన్మౌనికిం బ్రీతిగా
మనుచుండున్‌ నెల వో నెలం బురుషుఁడై మాసాంతరంబైనఁ గా
మినియై యీ గతి వీడుపాటమర భూమిం దాన రక్షించుఁ బొ
మ్మనినన్‌ వచ్చె వసిష్ఠుఁ; డా మనుసుతుం డా రీతి రాజ్యస్థుఁడై.
30
ఆ. మగువ యగుచు మరల మగవాఁడు నగుచును, భూతధాత్రి యంత నాతఁ డేలెఁ
బ్రజలు సంతసింప బాహాబలముతోడ, గురునికరుణఁజేసి కువలయేశ!
31
వ. అతనికి నుత్కలుండును, గయుండును, విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి ధర్మపరులై యుత్తరాపథంబునకు రాజు లయిరి సుద్యుమ్నుండు ముదుసలియై ప్రతిష్ఠానపురంబు విడిచి పురూరవునకు భూమి యిచ్చి వనంబునకుం జనియె న వ్విధంబున. 32
సీ. కొడుకు సుద్యుమ్నుండు ఘోరాటవుల కేఁగ వందుచు మనువు వైవస్వతుండు
దనకు బిడ్డలు గల్గఁ దప మాచరించెను హరిఁగూర్చి నూఱేండ్లు యమునలోన;
హరి యంత నిక్ష్వాకుఁ డాదిగాఁ బదుగురు పుత్త్రుల నిచ్చెను బొసఁగ; వారి
యందుఁ బృషధ్రాఖ్యుఁ డనువాడు గురునాజ్ఞ విమలధర్మంబులు వెలయఁ బూని
 
తే. పసులకదుపులఁ గాచుచు బలు మొగిళ్లు, వచ్చి నడురేయి జోరున వాన గురియ
మంద విడియించి చుట్టు నేమఱకయుండె, నడవిమెకములు సొరకుండ నరసికొనుచు.
33
వ. అంత. 34
క. ప్రబ్బికొనిన పెంజీఁకటి, నిబ్బరముగ నడిఁకి నడిఁకి నింగికి వడితో
గొబ్బున నెగసి తటాలున, బెబ్బులి మందావుఁ బట్టెఁ బెలుకుఱి యఱవన్‌.
35
క. ఉల్లములు గలఁగి మొదవుల, వెల్లువ లన్నియును లేచి విచ్చలవిడితోఁ
జెల్లాచెదరై పాఱెను, బెల్లుగ నంబా యటంచు బెబ్బులి గాలిన్‌.
36
వ. అయ్యవసరంబున 37
శా. ఆ పెంజీఁకటి మ్రోలఁ గాన కడిదం బంకించి శార్దూల మం
చా పుల్లావు శిరంబుఁ ద్రుంచి తెగదో యంచుం, బులిన్‌ వెండియున్‌
వాపోవం దెగ వ్రేసి భూవరుఁడు ద్రోవన్‌ ఖడ్గరక్తంబుచేఁ
బై పై గీయుచుఁ జేరి చూచెఁ దల ద్రెవ్వంబడ్డ యద్ధేనువున్‌.
38
వ. చూచి దుఃఖితుండై యున్న పృషధ్రునిం గని, కులగురుండగు వసిష్ఠుండు కోపించి ‘నీవు రాజత్వంబునకుఁ బాసి యీ యపరాధంబున శూద్రుండవు గ’ మ్మని శపియించె; నతండును గృతాంజలియై తన కులాచార్యుని వలన మరలం గైకోలు వడసి యతని యనుమతంబున. 39
సీ. అఖిలాత్ముఁ డగుచున్న హరియందుఁ బరునందు భక్తితోఁ జాలఁ దత్పరత మెఱసి
యూర్ధ్వరేతస్కుఁడై యున్న ప్రాణులకెల్ల నాప్తుఁడై సర్వేంద్రియములు గెల్చి
సంగంబునకుఁ బాసి శాంతుండు నపరిగ్రహుండునై కోరక యుండి తనకు
వచ్చినయదియ జీవనము గావించుచుఁ దనుఁ దాన నిలుపుచు ధన్యబుద్ధి
 
తే. జడునితెఱఁగున నంధునిచందమునను, జెవిటిభంగిని మహినెల్లఁ జెల్లఁ దిరిగి
యడవులకు నేఁగి కార్చిచ్చునందుఁ జొచ్చి, చిక్కి నియతుడై బ్రహ్మంబుఁ జెందె నతఁడు.
40
క. కవి యను కడపటికొమరుఁడు, భవనము రాజ్యంబు విడిచి బంధులతో నేఁ
గి వనమునఁ బరమపురుషునిఁ, బ్రవిమలమతిఁ దలఁచి తలఁచి పరముం బొందెన్‌.
41
వ. మఱియుఁ గరూశుం డను మానవునివలనం గొందఱు కారూశులు క్షత్త్రియులు గలిగి, ధర్మంబుతోడి ప్రియంబున బ్రహ్మణ్యులై యుత్తరాపథంబునకు రక్షకులైరి; ధృష్టునివలన ధార్‌ష్టం బను వంశంబు గలిగి భూతలంబున బ్రహ్మభూయంబు నొంది నెగడె; నృగునివంశంబున సుమతి పుట్టె; నతనికి భూతజ్యోతి పుట్టె; నతనికి వసువు జనించె; వసువునకుం బ్రతీతుండు గలిగెఁ; బ్రతీతునికి నోఘవంతుఁడు జనించె; నతని కూఁతు నోఘవతి యను కన్యకను సుదర్శనుండు వివాహంబయ్యె; నరిష్యంతుండను మనుపుత్త్రునికిఁ జిత్రసేనుం, డా విభునకు దక్షుం, డా పుణ్యునకు మీఢ్వాంసుం, డా సుజనునికి శర్వుం, డమ్మహాత్మునికి నింద్రసేనుం, డా రాజునకు వీతిహోత్రుం, డా సుమతికి సత్యశ్రవుం, డాఘనునికి నురుశ్రవుం, డా వీరునకు దేవదత్తుం, డా పండితునకు నగ్నివేశుండు సుతులయి జనియించి; రయ్యగ్నివేశుండు కానీనుండన నెగడి జాతకర్ణుండను మహర్షియై వెలసె; నతనివలన నాగ్నివేశ్యాయనంబను బ్రహ్మకులంబు గలిగె; నవ్విధంబున. 42
క. తెలుపఁబడె నరిష్యంతుని, కుల మెల్లను నీకు దిష్టకులమున్‌ దెలియం
దెలిపెద రాజేంద్రోత్తమ!, తెలియుము సర్వంబు నీకుఁ దేటపడంగన్‌.
43
వ. దిష్టునికొడుకు నాభాగుండనువాఁడు కర్మవశంబున వైశ్యత్వంబు నొందె; నా నాభాగునికి హలంధనుండు కలిగె; నతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిఁ బ్రాంశువు, నతనికిఁ బ్రమితియుఁ, బ్రమితికి ఖమిత్రుండును, ఖమిత్రునికిఁ జాక్షుషుండు, నతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండు, నతనికిఁ గరంధనుండు, గరంధనున కవీక్షిత్తు, నా యవీక్షిత్తునకు మరుత్తుండు జనియించి రా మరుత్తుండు చక్రవర్తి యయ్యె; నతనిచరిత్రంబు వినుము. 44
సీ. అంగిరస్సుతుఁడు మహాయోగి సంవర్తుఁ డతనియాగమునకు యాజకుండు,
దిరిగి యుండెడివారు మరుదాఖ్యగణము లొప్పారు విశ్వేదేవు లచటి సభ్యు
లధికదక్షిణల బ్రాహ్మణకోటిఁ దనిపెను; సోమపానంబున సురవరుండు
మది నుబ్బి బంగారుమయము గావించెను యాగవస్తువులెల్ల; నధికనియతి
 
తే. నా మరుత్తుఁడు సేసిన యట్టిభంగి, ధీరభావంబుఁ జాగంబుఁ దెంపుఁ గలిగి
మఖము సేసినవారిని మఱియు నెఱుఁగ, మెల్ల లోకములందు నరేంద్రముఖ్య!
45
వ. ఆ మరుత్తునకు దముండును, దమునకు రాజవర్ధనుండును, రాజవర్ధనునకు సుధృతియు, సుధృతికి సౌధృతేయుండును, సౌధృతేయునకుఁ గేవలుండును, కేవలునకు బంధుమంతుండును, నతనికి వేదవంతుండును, వేదవంతునికి బంధుండును, బంధునకుఁ దృణబిందుండును సంభవించి; రంత. 46
క. అచ్చరకన్య యలంబుస, గ్రచ్చఱఁ దృణబిందుఁ జూచి కామించి తుదిం
బచ్చవిలుకానియమ్ముల, ముచ్చిచ్చున వచ్చి పొందె మోహాతురయై.
47
వ. ఆ దంపతులకు నిలబిల యను కూఁతురు జన్మించె; నా కొమ్మను విశ్రవసుండు వొందిననైలబిలుండనం గుబేరుండు పుట్టె; మఱియు నా తృణబిందునకు విశాలుండును, శూన్యబంధుండును, ధూమ్రకేతుండును ననువారు మువ్వురుగొడుకులు గలిగి, రందు విశాలుండును వంశవర్ధనుండై వైశాలియను నగరంబు నిర్మించె; నా రాజునకు హేమచంద్రుం, డా నరేంద్రునకు ధూమ్రాక్షుం, డా పుడమిఱేనికి సహదేవుం, డా బలిష్ఠునకుఁ గృశాశ్వుం డాతనికి సోమదత్తుండు జన్మించె; నతండు. 48
ఆ. అమరవిభుఁడు మెచ్చ నశ్వమేధము సేసి, భూరిపుణ్యగతికిఁ బోయె నెలమి;
సోమదత్తుకొడుకు సుమతికి జనమేజ, యుం డనంగఁ గొమరుఁ డుప్పతిల్లె.
49
వ. వీరలు వైశాలు రనం బరఁగి తృణబిందునికీర్తి వహించి, రాజ్యంబు సేసిరి. మఱియును. 50
సీ. శర్యాతి యను రాజు జనియించె బ్రహ్మవరుండైన మనువుకు రూఢితోడ;
నతఁ డంగిరుని సత్త్రమందు రెండవనాఁటి విహితకర్మము నెల్ల వెలయఁ జెప్పె;
నతనికూఁతురు సుకన్యక యను వనజాక్షి దన తండ్రితోఁ దపోవనికి నరిగి
చ్యవనాశ్రమముఁ జేరి సఖులును దానును ఫలపుష్పములు గోయఁ బాఱ తిరిగి
 
ఆ. యొక్కపుట్టలోన నొప్పారు జ్యోతుల, రెంటిఁ గాంచి వాఁడిముంటఁ బొడిచెఁ;
గన్య ముగుద మఱచి ఖద్యోతయుగ మంచు, దైవవశముకతనఁ దమకి యగుచు.
51
క. జ్యోతుల ముంటం బొడిచిన, వాతల నెత్తురులు గురిసె వసుధేశభట
వ్రాతముల కెల్ల నచ్చట, నా తఱి మలమూత్రబంధ మయ్యె నరేంద్రా!
52
వ. వారలం జూచి రాజర్షియగు శర్యాతి విస్మితుండై ‘మీరలియ్యాశ్రమదూషణంబు సేయ నోపుదు రది కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించె నని పలుకు నవసరంబునఁ దండ్రికి సుకన్య యిట్లనియె. 53
తే. అయ్య! యీ పుట్టచేరువ నాడి యాడి, యిందులో రెండుజ్యోతుల నేనుఁ గాంచి
కంటకంబునఁ బొడువ రక్తంబు గురిసె, నే విధంబునఁ గురిసెనో యెఱుఁగు మీవు.
54
వ. అనిన శర్యాతి భీతుండై కూఁతుం దోడ్కని వల్మీకంబుకడకుం జని యందుఁ దపంబు సేయుచున్న చ్యవనుని గని తన నేర్పున నతనివలనఁ బ్రసన్నత వడసి తపసిచిత్తంబు నెఱింగి తన పుత్రిక నిచ్చి యెట్ట కేలకుం బ్రదికినవాఁడై మునీశ్వరుని వీడ్కొని పురంబునకుం జనియె; నంత. 55
ఆ. పరమకోపుఁడయిన భార్గవుఁ బతిఁ జేరి, మిగులఁ బనులయెడల మెచ్చఁ దిరిగి
యతనిపర్ణశాల నా సుకన్యక యను, మగువ గొన్నియేండ్లు మనువు మనియె.
56
వ. అంత నొక్కనాఁ డ య్యాశ్రమంబునకు వేల్పువెజ్జులైన యాశ్విను లిద్దఱు వచ్చిన వారలం బూజించి తన ముదిమి సూపి చ్యవనుం డిట్లనియె, ‘మీకు మున్న యాగభాగంబుల లేని సోమపానంబు నేఁడు గల్పించి యిచ్చెద, సోమపానసమయంబునఁ బానపాత్రంబు మీకు నందిచ్చెద; నా ముదిమి మానుపుం’ డని యిట్లనియె. 57
క. నవకంబగు ప్రాయంబున, జవరాండ్రఁ గరంచు మేని చక్కఁదనంబున్‌
శివతరముగఁ గృప సేయుఁడు, దివిజాధిపవైద్యులార! దీవింతు మిమున్‌.
58
వ. అనిన నశ్వినీదేవతలు సంతోషించి సిద్ధనిర్మితంబయిన యీ మడుఁగున మునుఁగు మని పలికి. 59
సీ. ముసలితాపసుఁ బట్టి మొగి నెత్తుకొనిపోయి ముగురు నా మడుఁగున మునిఁగి లేచి
వనితాజనము నెల్ల వలపించువారలై సుందరమూర్తులై సుభగు లగుచుఁ
గమలమాలికలతోఁ గనకకుండలములతో మంచి చీరలతోడఁ దుల్యు
లై సూర్యతేజస్కులై యున్నవారల మువ్వురఁ బొడఁగాంచి ముగుద బాల
 
తే. యిందు బెనిమిటి వీఁడని యెఱుఁగ లేక, గరిత గావున నిజనాథుఁ గానఁగోరి
సుభగమతులార! నా నాథుఁ జూపుఁ డనుచు, నశ్వినీదేవతలకు నయ్యబల మ్రొక్కె.
60
వ. వార లా పతివ్రతనిజమరితనంబునకు మెచ్చి వయోరూపసంపన్నుండయిన చ్యవనుం జూపి, దంపతుల వీడ్కొని విమానారూఢులై వేలుపులప్రోలికిం జని, రంత. 61
సీ. యాగంబు సేయంగ నర్థించి శర్యాతి, చ్యవనమునీంద్రు నాశ్రమముకడకుఁ
గూఁతు నల్లునిఁ దోడుకొని పోవువేడుక వచ్చి పుత్త్రికకుఁ బార్శ్వంబునందు
సూర్యతేజంబున సొంపారు నరుఁ గని, వీఁ డెవ్వఁడో దీనివిభుఁడు గాఁడు;
చెల్లరే! యని పుత్త్రి సేసిన ప్రియములు మ్రొక్కులు నొల్లక మోము వాంచి
 
తే. మాఱుమాటాడ దీవింప మనసు రోసి, “చ్యవనుఁ డధికుండు మునిజనసత్తముండు
భువనసన్నుతుఁ డతఁడెందుఁబోయె? నాతఁ, డెట్లు వంచింపఁబడియె? వీఁడెవ్వఁ డబల!
62
మ. తగవే? ధర్మమె? శీలమే? కులజవై దర్పించి మోదింప నా
జగదారాధ్యునిఁ బుణ్యశీలుఁ దపసిన్‌ సాధ్వీమనస్సమ్మతున్‌
మగనిన్‌ మాని భుజంగుఁ బొందఁదగునే మానంబు వాటింపఁగాఁ
దగదే! దుర్గతిఁ ద్రోచితే కఠినవై తండ్రిం బతిం గూఁతురా!
63
ఆ. పద్మనయన! మగఁడు ప్రాయంపువాఁడైనఁ, గాపు వెట్టి కొంతఁ గావ నేర్చుఁ
గడఁగి ముసలితపసి గావంగ నేర్చునే, యువతి ముదుకఁ గూర్ప నొప్ప దెందు.”
64
వ. అని పలికిన న ప్పరమపతివ్రతాలలామంబు చిఱునగవు చెక్కుటద్దంబులఁ జిడిముడిపడఁ దండ్రి కిట్లనియె. 65
క. ‘ఇయ్యల్లుఁ డితఁడు భార్గవుఁ, డయ్యా! జారుండు గాఁడు హర్షముతోడన్‌
నెయ్యంబు నిల్పు’ మంచును, దొయ్యలి సర్వంబు దండ్రితో వినిపించెన్‌.
66
వ. అంత శర్యాతియు నప్రమత్తుండై కూఁతుం గౌఁగిలించుకొని గారవంబున’ నయిదువవు గ’మ్మని దీవించె; నంత భార్యాసహితుండై చ్యవనుండు సని తన మామకు యాగంబు సేయించి యొక్క పాత్రంబున సోమభాగంబుఁ బట్టి నిజ తపోబలమున నశ్వినీదేవతల కిచ్చినం జూచి. 67
క. కోపముతోడుత వాసవుఁ, డేపున మునిపైని వజ్రమెత్తిన మరలం
దాపసుఁడు వజ్రిభుజమున, నా పవి నిలిపెన్‌ జగంబు లాశ్చర్యపడన్‌.
68
వ. ఇవ్విధంబున నశ్వినీదేవతలిద్దఱు దేవతావైద్యులై సోమభాగంబు లేని వారయ్యుఁ జ్యవనుసామర్థ్యంబునఁ బ్రాప్తభాగు లయి చనిరి; శర్యాతికి నుత్తానబర్హియు, నానర్తుండును, భూరిషేణుండు నను మువ్వురుకొడుకులు గలిగి; రందు. 69
సీ. ఆనర్తునకు రైవతాహ్వయుం డుదయించె నతఁడు కుశస్థలి యను పురంబు
నీరధిలోపల నిర్మించి పెంపుతో, నానర్తముఖవిషయంబు లేలెఁ;
గనియెఁ గకుద్మిముఖ్యంబైన నందనశతము; రైవతుఁడు విశాలయశుఁడు
దన కూఁతు రేవతి ధాతముందటఁ బెట్టి, తగు వరు నడిగెడి తలఁపుతోడఁ
 
తే. గన్యఁ దోడ్కొని బ్రహ్మలోకమున కేఁగి, యచట గంధర్వకిన్నరు లజునిమ్రోల
నాటపాటలు సలుపఁగ నవసరంబు, గాక నిలుచుండె నతఁ డొక్కక్షణముతడవు.
70
వ. అంత నవసరంబైన నజునికి నమస్కరించి రైవతుండు రేవతిఁ జూపి యిట్లనియె. 71
ఆ. చాల ముద్దరాలు జవరాలు గొమరాలు, నీ శుభాత్మురాలి కెవ్వఁ డొక్కొ
మగఁడు? సెప్పు’ మనిన మదిఁ జూచి పకపక, నవ్వి భూమిపతికి నలువ పలికె.
72
సీ. ‘మనుజేశ! దీనికై మదిలోనఁ దలఁచిన, వార లెల్లరు గాల వశతఁ జనిరి;
వారల బిడ్డల వారల మనుమల, వారల గోత్రంబువారినైన
వినము మేదినిమీఁద; వినుము నీ వచ్చిన యీలోన నిరువదియేడు మాఱు
లొండొండ నాలుగుయుగములుఁ జనియె; నీ వటు గాన ధరణికి నరుగు మిపుడు
 
తే. దేవదేవుండు హరి బలదేవుఁ డనఁగ, భూమిభారంబు మాన్పంగఁ బుట్టినాఁడు;
సకలభూతాత్మకుఁడు నిజాంశంబుతోడ, యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ!
73
వ. అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోకంబునకుఁ జనుదెంచి సోదరస్వజన హీనంబగు తన నగరంబున కారాజు వచ్చి బలభద్రుం గాంచి రేవతీకన్య నతని కిచ్చి నారాయణాశ్రమంబగు బదరికావనంబునకు నియమంబునఁ దపంబు సేయం జనియె. 74
క. నభగుఁ డను మనుజపతికిని శుభమతి, నాభాగుఁ డనఁగ సుతుఁ డుదయించెం
బ్రభులై మనియెడు తలఁపున, విభజించిరి భ్రాత లతనివిత్తము నధిపా!
75
వ. అంత నాభాగుండును బ్రహ్మచారియై తన తోడంబుట్టువులను ధనంబుల పాలడగిన వారలు‘ దండ్రి చెప్పిన క్రమంబున నిచ్చెద’ మనిన నాభాగుండు తండ్రియగు నభగు కడకుం జని’ విభాగంబు సేయు’మని పలికిన నతం ‘డిందు నంగిరసులు మేధ గలవార లయ్యును సత్త్రయాగంబు సేయుచు నాఱవదినంబున నర్హకర్మంబులు దోఁపక మూఢు లయ్యెదరు; వారలకు నీవు వైశ్వదేవసూక్తంబులు రెండెఱింగించినఁ గవి యనం బ్రసిద్ధి కెక్కెదవు; దానంజేసి వారు కృతకృత్యులై స్వర్గంబునకుఁ బోవుచు, సత్త్ర పరిశేషితంబైన ధనంబు నీ కిచ్చెద’ రని పలికినం దండ్రి వీడ్కొని నాభాగుండు సని యట్టు సేసిన నంగిరసులు సత్త్రపరిశేషితధనంబు లతని కిచ్చి నాకంబునకుం జని రంత. 76
క. అంగిరసు లిచ్చు పసిఁడికి, మంగళమతిఁ జేరు నృపుని మానిచి యొకఁ డు
త్తుంగుఁడు గృష్ణాంగుఁడు దగ, ముంగల నిలుచుండి విత్తముం జేకొనియెన్‌.
77
వ. వానిం జూచి నాభాగుండు దనకు మును లిచ్చుటంజేసి తన ధనం బని పలికిన, నమ్మహాపురుషుండు ‘మీ తండ్రి సెప్పిన క్రమంబ కర్తవ్యం’ బనిన నాభాగుండు నభగు నడిగిన, నతండు యజ్ఞమందిరగతంబై ‘యుచ్ఛిష్టంబగు ధనంబుఁ దొల్లి మహామునులు రుద్రున కిచ్చి; రది కారణంబుగా నా దేవుండు సర్వధనంబులకు నర్హుం’ డనిన విని, వచ్చి నాభాగుండు మహాదేవునకు నమస్కరించి ‘దేవా! యీ ధనంబు నీ యధీనం’ బని మా తండ్రి సెప్పె, నే నపరాధంబు సేసితి; సహింపు’ మనవుడు భక్త వత్సలుండగు న మ్మహాపురుషుండు నభగు సత్యవచనంబునకు, నాభాగుని నిజంబునకు మెచ్చి‘నీవు దప్పక పలికితివి కావున, సత్త్రపరిశేషితంబగు ధనంబు నీకు నిచ్చితి’ నని పలికి యంతర్దర్శిత్వంబును, సనాతనంబగు బ్రహ్మజ్ఞానంబు నుపదేశించి తిరోహితుండయ్యె; నివ్విధంబున. 78
క. భువిలో నాభాగునికథ, దవిలి మతిన్‌ రేపు మాపుఁదలఁచిన మాత్రం
గవి యగు; మంత్రజ్ఞుం డగుఁ, బ్రవిమలగతిఁ బొందు నరుఁడు భద్రాత్మకుఁడై.
79
వ. అంత నాభాగునకు నంబరీషుండు జనియించె; నతనియందు జగదప్రతిహతంబైన బ్రాహ్మణశాపంబు నిరర్థకం బయ్యె ననిన విని యేమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబువలన నతండు విడువం బడియె ననిన నప్పుడమిఱేనికి శుకుం డిట్లనియె. 80
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )