| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| తే. |
పరఁగ నిక్ష్వాకుఁడును బృహద్బలుఁడు మొదలుఁ, దుదయుఁ గాఁగల రాజులఁ దోడుతోడ నెఱుఁగ జెప్పితి నీ వారి; నింకమీఁదఁ, బుట్టఁ గలవారిఁ జెప్పెద భూవరేంద్ర! |
365 |
| వ. | ఆ బృహద్బలునకు బృహద్రణుండును, బృహద్రణునకు నురుక్షతుండు, నాతనికి వత్సప్రీతుండును, వత్సప్రీతునకుఁ బ్రతివ్యోముండును, బ్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహదశ్వుండును, బృహదశ్వునకు భానుమంతుండును, భానుమంతునకుఁ బ్రతీకాశ్వుండును, బ్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్త్రుండును, సుతక్షత్త్రునకు ఋక్షకుండును, ఋక్షకునకు నంతరిక్షుండును, నతనికి సుతపుండును, సుతపునకు నమిత్రజిత్తు, నతనికి బృహద్వాజియు, నతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును, ధనంజయునకు రణంజయుండును, రణంజయునకు సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకుఁ బ్రసేనజిత్తు, నతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు ఋణకుండును, ఋణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును బుట్టుదురు. సుమిత్రుని యనంతరకాలంబున సూర్యవంశంబు నశింపం గలదు. వీరలు బృహద్బలుని నుండి క్రమంబునం బుట్టంగలవారలు అని చెప్పి శుకుం డిట్లనియె. | 366 |
| సీ. |
‘ధన్యుఁ డా యిక్ష్వాకు తనయుఁడౌ నిమి యాగ మాచరింపఁగఁ గోరి యా వసిష్ఠు నార్త్విజ్యమునకుఁ దా నర్థింపఁ గని యాతఁ డింద్రుని మఖము సేయింప నియ్య కొనినాఁడ మఱి వత్తుఁ గొదవ లే దన వచ్చి సంసార మెంతయుఁ జంచలంబు కాలయాపన మేల? గ్రతువు సేసెద’ మని యన్యఋత్విక్కుల నతఁడు గూర్చి |
|
| తే. |
సేయ నింద్రుని యాగంబు చెల్లఁజేసి, గురుఁడు చనుదెంచి శిష్యుపైఁ గోప మెత్తి యోరి నా వచ్చు నిందాఁక నుండ వనుచు, నతని దేహంబు వడుఁగాక యని శపించె. |
367 |
| వ. | ఇట్లు వసిష్ఠుండు శపించిన, నిమియును వసిష్ఠుని దేహంబు వడుఁగాక యని మరల శపించిన న వ్వసిష్ఠుండు మిత్రావరుణుల వలనఁ గడపట నూర్వశికి జన్మించె. గురుశాపంబున బ్రహ్మజ్ఞాని యైన నిమి, విగతదేహుండైన, నతని దేహంబు మునీశ్వరులు గంధవస్తువులం బొదివి, దాఁచి, దొరకొన్న సత్త్రయాగంబు సెల్లించిరి. యాగంబు కడపటను దేవగణంబులు మెచ్చి వచ్చిన, వారలకు నిమిదేహంబు సూపి, బ్రతుకం జేయుం’ డనవుడు వారలు ‘నిమి ప్రాణంబులు వచ్చుంగాక’ యని పలికిన, నిమి తనదేహంబు సొరనొల్లక యిట్లనియె. | 368 |
| మ. |
అతి మోహాకులితంబు సాంద్రమమతాహంకారమూలంబు సం తత నానాసుఖదుఃఖపీడిత మనిత్యం? బిట్టి దేహంబు సం కృతి నా కేటికి? మీనజీవనము భంగిం భీతిబాహుళ్య మం చితరుల్ పెద్దలు దీనిఁ జేకొనరు సర్వేశున్ మదిన్ గొల్చెదన్. |
369 |
| వ. | అని పలికిన నిమిమాటలు గ్రమ్మఱింప నేరక, శరీరులు గన్నులు దెఱచినప్పుడును, మూసినప్పుడును, నిమి గాన వచ్చుంగాక యని పల్కి దేవతలు సనిరి. అంత. | 370 |
| ఆ. |
పెద్దలైన మునులు పృథ్వీస్థలికి రాజు, లేమిఁ జూచి నిమి కళేబరంబు తరువ నొకఁడు పుట్టెఁ దనయుండు వానిని, జనకుఁ డనుచుఁ బలికె జగము లెల్ల. |
371 |
| వ. | మఱియు నతఁడు విగతదేహుండు గావున వైదేహుడనియును, మథఁనజాతుండు గావున మిథిలుం డనియుం బరఁగె. అ మ్మిథులునిచేత నిర్మితం బైనది గావున మిథిలా నగరంబు నాఁ బరఁగె; ఆ జనకునకు నుదావసుండును, నుదావసునకు నందివర్ధనుండును, నందివర్ధనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును పుట్టె. అతనికి మహావీర్యుండును, నతనికి సుధృతియు, నతనికి ధృష్టకేతుండును, నతనికి హర్యశ్వుండు, నతనికి మరువు, నతనికిఁ బ్రతింధకుండును, నతనికిఁ గృతరయుండు, నతనికి దేవమీఢుండును, నతనికి విధృతుండును, నతనికి మహాధృతియు, నతనికిఁ గీర్తిరాతుండు, నతనికి మహారోముండు, నతనికి స్వర్ణరోముండును, నతనికి హ్రస్వరోముండును, నతనికి సీరధ్వజుండును బుట్టిరి. | 372 |
| ఆ. |
అతఁడు మఖము సేయ నవని దున్నింపంగ, లాంగలంబుకొనను లక్షణాంగి సీత జాత యయ్యె సీరధ్వజుండన, దానఁ జెప్పఁబడియె ధన్యుఁ డతఁడు. |
373 |
| వ. | ఆ సీరధ్వజునకుఁ గుశధ్వజుండును, గుశధ్వజునకు ధర్మధ్వజుండును, ధర్మధ్వజునకుఁ గృతధ్వజ, మితధ్వజులను వారిద్దఱుఁ బుట్టిరి. అందుఁ గృతధ్వజునకుఁ గేశిధ్వజుఁ డుదయించె. అతండుఁ దన్నుఁ దా నెఱింగెడి విద్యయందు నేర్పరి యయ్యె. మితధ్వజునకు ఖాండిక్యుం డనువాఁడు జన్మించి, తండ్రివలన నెఱుక గలవాఁడై, కర్మతత్త్వంబు నేర్చి, కేశిధ్వజునివలన భీతుండై యేగె, ఖాండిక్యునకు భానుమంతుండును, భానుమంతునకు శతద్యుమ్నుండును, శతద్యుమ్నునికి శుచియు, శుచికి సనద్వాజుండును, సనద్వాజునకు నూర్ధ్వకేతుండు, నూర్ధ్వకేతునకు నజుండును, నజునకుఁ గురుజిత్తును, గురుజిత్తునకు నరిష్టనేమియు, నరిష్టనేమికి శ్రుతాయువు, శ్రుతాయువునకుఁ బార్శ్వుండును, బార్శ్వునకుఁ జిత్రరథుండును, జిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు నుపగురుండును, ఉపగురునకు నగ్నిదేవుప్రసాదంబున నుపగుర్వుండును, ఉపగుర్వునకు సావనుండును, సావనునకు సువర్చసుండును గలిగె, అతఁడె సుభూషణుండని వినంబడు. ఆ సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకు ననఘుండును, అనఘునకు వీతిహవ్యుండును, వీతిహవ్యునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకుఁ గృతియుఁ, గృతికి మహావశియును జన్మించిరి. వీరలు మైథిలులగు రాజులని చెప్పంబడుదురు. యోగీశ్వరు ప్రసాదంబున గృహస్థులై యుండియు బంధవిముక్తులై యాత్మజ్ఞానంబు గలిగి, నిరంతర బ్రహ్మానుసంధానంబు సేయుచు నుండుదురు అని పలికి శుకయోగీంద్రుం డిట్లనియె. | 374 |