పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము
ఆ. చంద్రగౌరమైన చంద్రవంశమునందుఁ, జంద్రకీర్తితోడ జనితమైన
యట్టి పుణ్యమతులు నైళాదిరాజుల, నింక వినుము మానవేంద్రచంద్ర!
375
సీ. ఒకవేయుతలలతో నుండు జగన్నాథు బొడ్డుఁ దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల;
నతనికి గుణముల నతనిఁ బోలిన దక్షుఁ, డగు నత్రి సంజాతుఁ డయ్యె; నత్రి
కడగంటి చూడ్కులఁ గలువలసంగడీఁ, డుదయించె విప్రుల కోషధులకు
నమరఁ దారాతతి కజుని పంపున నాథుఁడై యుండి రాజసూయంబు సేసి
 
తే. మూఁడులోకములను గెల్చి మోఱకమునఁ, జని బృహస్పతి పెండ్లాముఁ జారుమూర్తిఁ
దార నిలుసొచ్చి కొనిపోయి తన్ను గురుఁడు, వేఁడునందాఁక న య్యింతి విడువఁ డయ్యె.
376
వ. అంత వేల్పులతో రక్కసులకుం గయ్యం బయ్యె, బృహస్పతితోడి వైరంబునం జేసి, కావ్యుఁడు రాక్షసులతోఁ జేరికొని చంద్రునిఁ జేపట్టి, సురాచార్యునిం బోఁదోలిన హరుండు భూతగణసమేతుండై, తన గురుపుత్త్రుండైన బృహస్పతినిఁ జేపట్టె. దేవేంద్రుండును, సురగణంబులుం, దానును బృహస్పతికి నడ్డంబు వచ్చె, అ య్యవసరంబున బృహస్పతి భార్యానిమిత్తంబున రణంబు సురాసుర వినాశకరం బయ్యె. ఆలోన బృహస్పతి తండ్రియగు నంగిరసుండు సెప్పిన విని బ్రహ్మదేవుండు చంద్రునిం గోపించి, గర్భిణి అయిన తారను మరల నిప్పించినం జూచి, బృహస్పతి దాని కిట్లనియె. 377
ఉ. సిగ్గొకయింతలేక వెలచేడియ భంగిని ధర్మకీర్తులన్‌
బొగ్గులు సేసి జారు శశిఁ బొంది కటా! కడు పేల దెచ్చి కొం
టెగ్గు దలంపఁగా వలదె యిప్పుడు గర్భము దించుకొమ్ము నిన్‌
మ్రగ్గఁగ జేసెదన్‌ జెనఁటి! మానవతుల్‌ నినుఁ జూచి మెత్తురే?
378
వ. అని కోపించుచుండ, నా చెలువకుఁ బసిండిచాయ మేనుగల కుఱ్ఱ పుట్టె. వానిం జూచి మోహంబు చేసి, బృహస్పతి తన కొడుకనియునుం, జంద్రుండు దన కన్నవాఁ డనియును, జగడించిరి. అప్పుడు 379
ఆ. వారి వాదు చూచి వారింపఁగా వచ్చి, యేర్పరింపలేక యెల్లమునులు
నమరవరుల నడుగ నా వేడుకలకత్తె, యెఱుఁగుఁ గాని యితరు లెఱుఁగ రనిరి.
380
వ. ఆ పలుకులు విని, సిగ్గుపడి యున్న తారకుఁ జిన్ని కొమరుం డిట్లనియె. 381
క. ఇలువరుస చెడఁగ బంధులు, దలవంపఁగ మగఁడు రోయఁ దల్లీ! కట్టా!
వెలినేల నన్నుఁ గంటివి, కలిగించినవాఁడు శీతకరుఁడో గురుఁడో.
382
వ. అని పలుకుచున్న కొడుకునకు మాఱుమాటలాడనేరకున్న తార నేకాంతంబునకుం జీరి మంతనంబున బ్రహ్మ యిట్లనియె. 383
మ. చెలువా! నీయెల సిగ్గు వాసి, గురుఁడో శీతాంశుఁడో యెవ్వడౌ
లలితాకారుఁ గుమారుఁ గన్న యతఁ? డేలా దాఁప? నీ పాటు నీ
తలనే పుట్టెనె? వెచ్చ నూర్పకుము; కాంతల్‌ కామినుల్‌ గారె? మా
టల నిందేమియుఁ బోదుపో యొరులతోడం జెప్ప; విన్పింపవే.
384
వ. అని పలికిన బ్రహ్మకు నెదురుమాటాడ వెఱచి, మంతనంబున నయ్యింతి చంద్రునికిం గన్న దాన ననవుఁడు నా బాలకునకు బుధుండని పేరు పెట్టి, చంద్రున కిచ్చి బ్రహ్మ సనియె. నంత. 385
ఆ. బుద్ధిమంతుడైన బుధుఁడు పుత్త్రుండైన, మేను పెంచి రాజు మిన్ను ముట్టె;
బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి, మిన్ను ముట్టకేల మిన్నకుండు?
386
వ. ఆ బుధునకుఁ దొల్లి చెప్పిన యిళాకన్యక వలనఁ బురూరవుండు పుట్టె; ఆ పురూరవునకుఁ గల శౌర్యసౌందర్య గాంభీర్యాది గుణంబులు నారదుని వలన నింద్రసభలోన నూర్వశి విని, మిత్రావరుణుల శాపంబున మనుష్యస్త్రీరూపంబు దాల్చి, భూలోకంబునకు వచ్చి, పురూరవు ముందట నిలువంబడి. 387
తరల. సరసిజాక్షు మృగేంద్రమధ్యు విశాలవక్షు మహాభుజున్‌
సురుచిరానన చంద్రమండల శోభితున్‌ సుకుమారు నా
పురుషవర్యుఁ బురూరవుం గని పువ్వుటంపరజోదుచేఁ
దొరఁగు క్రొవ్విరి తూపులన్‌ మదిఁ దూలపోవఁగ భ్రాంతయై.
388
వ. ఊర్వశి నిలిచి యున్నంత 389
ఉ. భావజు కోలయో? మొగులువాసి వెలుంగు మెఱుంగొ? మోహినీ
దేవతయో? నభోరమయొ? దీని కరగ్రహణంబు లేనిచో
జీవన మేటి కంచు మరుచేఁ జిగురా కడిదమ్ము జిమ్ములం
దా వడఁకెన్‌ బురూరవుఁడు తామరపాకు జలంబు కైవడిన్‌.
390
వ. ఇట్లు రాచపట్టి చెఱకువింటి వాని దాడికి నోడి, యెట్టకేలకు సైరణచేసి నిలుకడం దెచ్చికొని; య చ్చెలువ కిట్లనియె. 391
ఉ. ఎక్కడనుండి రాక? మన కిద్దఱికిం దగు; నీకుఁ దక్కితిన్‌
మ్రుక్కడి వచ్చెనే యలరుముల్కులవాఁ డడిదంబుఁ ద్రిప్పు చే
దిక్కు నెఱుంగ నౌ యబల! దేహము దేహము గేలుఁ గేల నీ
చెక్కునఁ జెక్కు మోపి తగు చెయ్వుల నన్ను విపన్నుఁ గావవే.
392
వ. అనినం బ్రోడచేడియ యిట్లనియె 393
మ. ఇవి నా కూర్చుతగళ్ళు రెండు దగ నీ వెల్లప్పుడున్‌ గాచె దే
ని వివస్త్రుండవు గాక నాకడ సదా నీవుండు దేనిన్‌ విశే
ష విలాసాధిక! నీకు నా ఘృతము భక్ష్యంబయ్యె నేనిన్‌ మనో
జ వినోదంబుల నిన్నుఁ దేల్తు నగునే చంద్రాన్వయగ్రామణీ!
394
వ. అని పల్కిన వేల్పుల వెలయాలి ప్రతిమాటల కియ్యకొని తన మనంబున. 395
క. మంచిదఁట, రూపు ననురతి, నంచిత యఁట దేవగణిక యఁట, మరుచేతన్‌
సంచలితచిత్తయై కా, మించిన దఁట, యింతకంటె మేలుం గలదే.
396
వ. అని నిశ్చయించుకొని 397
ఆ. రాజు రాజముఖిని రతిఁ దేల్చె బంగారు, మేడలందుఁ దరుల నీడలందుఁ
దోఁటలందు రత్నకూటంబులందును, గొలఁకులందు గిరుల కెలఁకులందు.
398
వ. అంత న య్యిద్దఱకుం తగులంబు నెలకొనిన 399
క. ఒక దిక్క యేగుదురు వా, రొకచోటన కాని నిలిచి యుండరు దమలో
నొకటియె మనమున నెంచుచు, నొకనిమిషము పాయకుందు రువిదయుఁ దానున్‌.
400
క. దయ్య మెఱుంగును వారల, నెయ్యంబును మక్కువలును నిజమరితనముల్‌
వియ్యములును నెడసందినిఁ, బయ్యదకొం గడ్డమైనఁ బ్రాణము వెడలున్‌.
401
వ. ఇ ట్లూర్వశియుం బురూరవుండు నొం డొరువుల వలన మక్కువలు చెక్కులొత్తం బగళ్లు రేలు నెల్లెడల విహరింప నొక్కనాఁడు దేవలోకంబున దేవేంద్రుండు గొలువుండు తఱిఁ గొలువున నూర్వశి లేకుండుటం జూచి. 402
క. ఇన్ని దినంబులవలె నా, యున్న సభామధ్యవేది యూర్వశి లేమిన్‌
విన్నఁదనంబున నున్నది, వన్నె దఱిఁగి యున్న పసిఁడివడువున ననుచున్‌.
403
వ. ఇంద్రుండు గంధర్వులం బనిచిన వారు నడురేయిం జని చీఁకటి నూర్వశి పెంచుకొన్న యేడకంబులం బట్టిన నవి రెండును మొఱవెట్టిన వాని మొఱ విని రతిఖిన్నుండై మేనుమఱచి కూరుకుచున్న పురూరవు కౌఁగిటనుండి యూర్వశి యిట్లనియె. 404
మ. ‘అదె నా బిడ్డలఁ బట్టి దొంగలు మహాహంకారులై కొంచు ను
న్మదులై పోయెద; రడ్డపాటునకు సామర్థ్యంబునన్‌ హీనుఁడై
కదలం డీ మగపంద; కూరుకుగతిం గన్మూసి గుర్వెట్టుచున్‌
వదలం జాలఁడు నాదు కౌఁగిలియు దా వంధ్యాత్ముఁడై చెల్లరే’
405
క. పగతురు దొంగల రేఁపఁగ, మగఁటిమి వాటింపలేక మగతన మెల్లన్‌
మగువల కౌఁగిటఁ జూపెడు, మగవాఁడగుకంటె మగఁడు మగువగు టొప్పున్‌.
406
ఆ. అధముఁడైన వాని కా లగుకంటె న, త్యధికునింట దాసి యగుట మేలు;
హీనుఁ బొంది యోని హింసింపఁగా నేల?, యువతిజనుల కూరకుంట లెస్స.
407
క. ఏటిది నీరాచఱికం, బాఁటది మొఱవెట్టఁ బశువులాతురపడ నో
యాఁటదని లేచి దొంగల, గీఁటవు వెడలంగ శవముక్రియ నుండె దిదే.
408
క. వినియు వినవు రణభీరువు, మనుజాధము నిదురబోతు మందుని నకటా!
నినుఁ జక్రవర్తిఁ జేసిన, వనజాసనుకంటె వెఱ్ఱివాఁడును గలఁడే?
409
వ. అని పెక్కుభంగుల న య్యింతి, పరుషోక్తులను కరవాలమ్ములు చెవులఁజొనుప, నా రాజశేఖరుం డంకుశంబు పోట్ల నడరు మదగజంబు చందంబున చీరమఱచి, దిగంబరుండై వాలు కేల నంకించి, నడురేయి దొంగల నఱకి వైచి మేషంబుల విడిపించుకొని, తిరిగివచ్చునెడ. 410
ఆ. చీఱలేని మగనిఁ జెలువ దా నీక్షించి, కన్ను మొఱఁగి పోవఁ గడఁక నతఁడు
వెఱ్ఱివానిభంగి వివశుఁడై పడి లేచి, పొటిలి తెఱలి స్రుక్కి పొక్కిపడియె.
411
వ. మఱియుఁ బురూరవుండు మదనాతురుండై, వెతకుచు, సరస్వతీ తీరంబునఁ జెలికత్తెలతోఁ గూడియున్న నూర్వశిం గని, వికసితముఖుండై యిట్లనియె. 412
మ. తనుమధ్యా! యిది యేల వచ్చి తకటా! ధర్మంబె శర్మంబె! మున్‌
మనలో నుంకువలాడి కొన్న వలపుల్‌ మర్యాదలున్‌ దప్పెనే
నిను నేఁ బాసిన యంతనుండి తనువు న్నేలం బడంబాఱె మే
దినిపై వ్రాలకమున్న నన్నుఁ గరుణాదృష్టిన్‌ విలోకింపవే!
413
వ. అనిన నూర్వశి యిట్లనియె. 414
క. మగువలకు నింత లొంగెదు; మగవాఁడవె నీకు పశువుమాడ్కిన్‌ వగవం
దగవే మానుషపశువును, మృగములు గని రోయుఁగాక మేలని తినునే!
415
వ. అదియునుం గాక. 416
మ. తలఁపుల్‌ చిచ్చులు, మాట లుజ్జ్వల సుధాధారల్‌, విభుండైన పు
వ్విలుతున్‌ మెచ్చర! యన్యులన్‌ వలతురే! విశ్వాసమున్‌ లేదు క్రూ
రలు తోడుం బతినైనఁ జంపుదు రధర్మల్‌ నిర్దయల్‌ చంచలల్‌
వెలయాండ్రెక్కడ? వారి వేడబము లా వేదాంతసూక్తంబులే?
417
ఉ. ఇంకొక యేఁడు వోయిన నరేశ్వర! యాతలిరేయి నీవు నా
లంకెకు వచ్చి యాత్మజుల లక్షణవంతులఁ గాంచె దేమియున్‌
గొంకక పొమ్ము నావుడును గొమ్మను గర్భిణిఁ గాఁ దలంచుచున్‌
శంక యొకింత లేక నృపసత్తముఁ డల్లనపోయె వీటికిన్‌.
418
వ. ఇట్లు మరలి చని, తన పురంబున నొక్కయేఁడుండి, పిదప నూర్వశికడ కేగి యొక్కరేయి పురూరవుం డ య్యింతికడ నున్న, నా వెలఁదియు గంధర్వుల వేఁడికొనుము, నన్నిచ్చెదరు అనవుడు నతండు గంధర్వులను బ్రార్థించిన, వారలతండు పొగడుటకు మెచ్చి, యగ్నిస్థాలి నిచ్చిన, న య్యగ్ని స్థాలి నూర్వశింగాఁ దలంచుచు, దానితో నడవిం దిరుగుచుండి, యొక్కనాఁ డగ్నిస్థాలి యని యెఱింగి, వనంబున దిగవిడిచి, యింటికిఁ జనుదెంచి, నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండఁ, ద్రేతాయుగంబు సొచ్చిన నా రాజుచిత్తంబునం గర్మబోధంబులై, వేదంబులు మూఁడు మార్గంబులం దోఁచిన, నా భూవరుండు స్థాలికడకుం జని, యందు శమీగర్భజాతంబైన యశ్వత్థంబుఁ జూచి, యశ్వత్థంబుచేత నరణులు రెండు గావించి, ముందటి యరణి దానును, వెనుకటి యరణి నూర్వశియును, రెంటినడుమ నున్న కాష్ఠంబు పుత్రుండు నని, మంత్రంబు చెప్పుచుం ద్రచ్చుచుండ, జాతవేదుండను నగ్ని సంభవించె. నతఁడు విహితారాధన సంస్కారంబునం జేసి, యాహవనీయాది రూపంబుల మూఁట నెగడి పురూరవుని పుత్రుండని కల్పింపం బడియె. ఆ యగ్ని పురూరవునిఁ బుణ్యలోకంబునకుం బనుపం గారణం బగుటం జేసి. 419
క. ఆ యగ్నిచేఁ బురూరవుఁ, డా యజ్ఞేశ్వరు ననంతు హరి వేదమయున్‌
శ్రీయుతుఁ గూర్చి యజించె గు, ణాయుతుఁ డూర్వశిఁ గనంగ నరిగెడు కొఱకై.
420
ఉ. ఒక్కడ వహ్ని వేల్పు పురుషోత్తముఁ డొక్కఁడ సర్వవాఙ్మయం
బొక్కఁడ వేద మా ప్రణవ మొక్కఁడ వర్ణము తొల్లి త్రేతయం
దెక్కటి మాన్చి మూఁడుగను నేర్పఱిచెన్‌ దనబుద్ధి పెంపుచేఁ
జక్కఁగ నా పురూరవుఁ డశక్తులకున్‌ సులభంబులౌ గతిన్‌.
421
వ. ఇట్లు వేదవిభాగంబు గల్పించి, యాగంబు సేసి, పురూరవుం డూర్వశియున్న గంధర్వలోకంబునకుం జనియె. అతనికి నూర్వశిగర్భంబున నాయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు విజయుం డన నార్గురు పుత్త్రులు గలిగిరి. అందు శ్రుతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు ద్రుతంజయుండును, రయునకు శ్రుతుండు, నేకుండు నన నిరువురును గలిగిరి, జయునకు నమితుండును, విజయునకు భీముండును జనించిరి. ఆ భీమునకుఁ గాంచనుండును, గాంచనునకు హోత్రకుండును, హోత్రకునకు గంగా ప్రవాహంబు పుక్కిటం బట్టిన జహ్నుండును, జహ్నునకుఁ బూరుండును, బూరునకు బాలకుండును, బాలకునకు నజకుండును, నజకునకుఁ గుశుండును, గుశునకుఁ గుశాంబుండు, ధూర్తయుండు, వసువు, కుశనాభుం డన నలువురును సంభవించిరి. అందుఁ గుశాంబునికి గాధి యనువాఁడు గలిగె. ఆ గాధి రాజ్యంబు సేయుచుండ. 422
సీ. సత్యవతిని గాధిజాతను కన్యను విప్రుఁడు ఋచికుండు వేఁడుకొనిన
గాధియు సుత కీడు గాఁడని తెల్లని, నవకంపు మేనులు నల్లచెవులు
గల గుఱ్ఱముల వేయు కన్యకు నీ వుంకు విచ్చిన గూఁతురు నిత్తు ననిన
వసుధామరుండును వరుణుని కడ కేగి హరులఁ దెచ్చినఁ గూఁతు నాతఁ డిచ్చె
 
ఆ. నా మహాత్ము సతియు నత్తయుఁ గొడుకులఁ, గోరి యడుగ నీయకొని యతండు
విప్రరాజ మంత్ర వితతుల వేల్పించి, చరువుసేసి గ్రుంకఁ జనియె నదికి.
423
వ. అయ్యెడం దల్లి యడిగిన సత్యవతి బ్రహ్మమంత్రంబుల వేల్పించిన చరువు దల్లి కిచ్చి, క్షాత్ర మంత్రంబులం దల్లికి వేల్పించిన చరువు దా నందుకొని యుండ, నా ముని సనుదెంచి, వీడ్వడుట యెఱింగి, భార్య కిట్లనియె. 424
ఆ. తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల, తల్లిపాల నిడితి తరళనేత్ర!
కొమ్మ! యింక నీకుఁ గ్రూరుఁడు పుట్టు మీ, యమ్మ బ్రహ్మవిదుని ననఘుఁ గాంచు.
425
వ. అనిన, నయ్యింతి వెఱచి మ్రొక్కి, వినయంబు లాడినం బ్రసన్నుండై, నీ కొడుకు సాధువై, నీ మనుమండు క్రూరుం డగుంగాక యని, రుచికుం డనుగ్రహించిన నా సత్యవతికి జమదగ్ని సంభవించె, ఆ సత్యవతియునుం గౌశికీనదియై, లోకపావనియై ప్రవహించె. ఆ జమదగ్నియు రేణువుకూఁతురు రేణుకను వివాహంబై, వసుమనాది కుమారులం గనియె నందు. 426
క. పురుషోత్తము నంశంబున, ధర జమదగ్నికి జనించె ధన్యుఁడు రాముం
డిరువది యొకమఱి నృపతుల, శిరములఁ జక్కడిచెఁ దనదు చేగొడ్డంటన్‌.
427
వ. అనిన విని, భూవరుండు శుకున కిట్లనియె. 428
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )