పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
పరశురాముని చరిత్రము
ఉ. ఏటికిఁ జంపె రాముఁ డవనీశులఁ బల్వుర, వారియందుఁ ద
ప్పేటిది? విప్రుఁడయ్యు నతఁడేటికి రాజస తామసంబులన్‌
వాటముఁ బొందె? భూభరము వారిత మౌటది యే విధంబు? నా
మాటకు మౌనిచంద్ర! మఱుమాట ప్రకాశము గాఁగఁ జెప్పవే!
429
వ. అనిన విని శుకుం డిట్లనియె. 430
సీ. హైహయాధీశ్వరుం డర్జునుం డనువాఁడు ధరణీశ్వరులలోనఁ దగినవాఁడు
పురుషోత్తమాంశాంశుఁ బుణ్యదత్తాత్రేయు నారాధనము చేసి యతని వలనఁ
బరిపంథి జయమును బాహుసహస్రంబు నణిమాది గుణములు యశము బలము
యోగీశ్వరత్వంబు నోజయుఁ దేజంబు చెడని యింద్రియములు సిరియుఁ బడసి
 
తే. గాలికైవడి సకల లోకంబు లందుఁ, దనకు పోరాని రారాని తలము లేక
యెట్టిచో నైనఁ దనయాజ్ఞ యేపు మిగుల, ధరణి వెలుఁగొందె వినువీథిఁ దరణి మాడ్కి.
431
మ. ఒకనాఁ డా మనుజేంద్రుఁ డంగనలతో నుద్దాముఁడై వీట నుం
డక, రేవానది కేగి యందుఁ దెలినీటం జల్లుపోరాడి, దీ
ర్ఘ కరాబ్జంబుల నా నదీజలములం గట్టెన్‌; వడిన్‌ నీరు మ్రో
లకుఁ బెల్లుబ్బి రణాగతుండయిన యా లంకేశుపైఁ దొట్టఁగన్‌.
432
వ. ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుం డా రాజుచే కట్టం దొట్టిన యేటినీటికి సహింపక రోషంబునం బోటరియుంబోలె నమ్మేటి మగనితోడి పోరాటకుం దొడరినఁ బాటింపక తన బాహుపాటవంబున. 433
క. వీఁకమెయి నతఁడు రావణుఁ, గూఁకటు లగలించి పట్టికొని మోఁకాళ్లం
దాఁకించి కోఁతికైవడి, నాఁకం బెట్టించెఁ గింకరావళిచేతన్‌.
434
వ. అంత నర్జునుండు మాహిష్మతీపురంబున కేతెంచి. 435
క. ఆ రాజేంద్రుఁడు రావణు, నోరీ! యిటమీఁద నూరకుండుము; జగతిన్‌
వీరుఁడ ననకుము; కాచితిఁ, బోరా; యని సిగ్గుపఱిచి పుచ్చెను మరలన్‌.
436
వ. అంత. 437
సీ. ధరణీశుఁ డొకనాఁడు దైవయోగంబున వేఁటకై కాంతారవీథి కేగి
తిరిగి వేఁటల శ్రాంతదేహుఁడై జమదగ్ని ముని యాశ్రమముఁ జేరి మ్రొక్కి నిలువ
నా మునీంద్రుఁడు రాజు నర్థితోఁ బూజించి యా రాజునకు రాజుననుచరులకుఁ
దన హోమధేనువుఁ దడయక రప్పించి యిష్టాన్నములు గురియింపఁ దడవఁ
 
తే. గుడిచి కూర్చుండి మొదవుపైఁ గోర్కిఁ జేసి, సంపద యదేల యీ యావు చాలుఁ గాక
యిట్టి గోవుల నెన్నఁడు నెఱుఁగ మనుచుఁ, బట్టి తెండని తనయొద్ది భటులఁ బనిచె.
438
వ. పంచిన వారలు దర్పంబునం జని. 439
క. క్రేపుం బాపకుఁ డంచును, నాపదలం బడితి ననుచు నంబా యంచున్‌
జూపోపరు నృపు లంచును, వాపోవన్‌ మొదవుఁ గొంచు వచ్చిరి పురికిన్‌.
440
వ. అంత నర్జునుండు మాహిష్మతీ పురంబునకు వచ్చునెడ, రాముం డాశ్రమంబున కేతెంచి. 441
ఆ. అద్దిరయ్య యింట నశనంబుఁ గుడిచి మా, యయ్య వల దనంగ నాక్రమించి
కోరి మొదవు రాజు గొనిపోయినాఁ డఁట, యేను రాముఁడౌట యెఱుఁగఁ డొక్కొ!.
442
వ. అని పలికి. 443
మ. ప్రళయాగ్నిచ్ఛట భంగిఁ గుంభి విదళింపన్‌ బాఱు సింహాకృతిన్‌
బెలుచన్‌ రాముఁ డిలేశుఁ వెంట నడచెన్‌ బృథ్వీతలంబెల్ల నా
కులమైఁ గ్రుంగఁ గుఠారియై కవచియై కోదండియై కాండియై
ఛలియై సాహసియై మృగాజిన మనోజ్ఞశ్రోణియై తూణియై.
444
వ. చని మాహిష్మతీపురంబుఁ జేరి నిలుచున్న సమయంబున. 445
మ. కనియెన్‌ ముందటఁ గార్తవీర్యుఁడు సమిత్కాముం బ్రకాముం శరా
సనతూణీరకుఠారభీము నతిరోషప్రోచ్చల ద్భ్రూయుగా
నన నేత్రాంచలసీము నైణపట నానా మాలికోద్దాము నూ
తన సంరంభ నరేంద్రదానశుభసూత్రక్షామునిన్‌ రామునిన్‌,
446
వ. కని కోపించి. 447
ఉ. బాలుఁడు వెఱ్ఱి బ్రాహ్మణుఁడు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ
పాలురతోడ భూరిబలభవ్యులతోడ భయంబుఁ దక్కి క
య్యాలకు వచ్చినాఁడు మనయం దిఁకఁ బాపము లేదు లెండు లెం
డేల సహింప భూసురుని నేయుఁడు వ్రేయుఁడు గూల్పుఁ డిమ్మహిన్‌.
448
వ. అని కదలించి, దండనాయకుం బురికొల్పిన, వారును రథ గజ తురగ పదాతి సమూహంబులతో లెక్కకుం బదియే డక్షౌహిణులతో నెదురు నడచి, శర చక్ర గదా ఖడ్గ భిండివాల శూల ప్రముఖ సాధనంబుల నొప్పించిన, నవ్విప్రుండు గన్నుల కొలఁకుల నిప్పులు కుప్పలుగొన రెట్టించిన కట్టల్క మిట్టిపడి, యజ్ఞోపవీతంబు చక్క నిడికొని, కరాళించి, బిట్టు దట్టించి, కఠోరంబగు కుఠారంబు సారించి, మూఁకలపై కుఱికి, తొలకరి మొగంబునం గ్రొచ్చెలికపట్టునం జెట్టులు గొట్టు కృషీవలుని తెఱంగునఁ బదంబులు ద్రెంచుచు నరఁటికంబంబులఁ దెగనడచు నారామకారుని పగిది మధ్యంబులఁ ద్రుంచుచుఁ, దాళఫలంబులు రాల్చు వృక్షారోహకుని కైవడి శిరంబులు ద్రుంచుచు, మృగంబుల వండం దుండించు సూపకారుని భంగి నవయవంబులఁ జెక్కుచు, నంతటం దనివి సనక, విలయకాలకీలి కేళిని మంట లుమియుచు, విల్లంది యెల్లెడం బిడుగుల సోనలు గురియు బలు మొగుళ్ళ వడువున నప్రమాణంబులగు బాణంబులు పఱపి, సుభటసైన్యంబుల దైన్యంబు నొందించుచు, నడ్డంబు లేని యార్భాటంబులు గల బాణవర్ష ఘృతంబులచే రాహుతులం గోపానలంబున కాహుతులు సేయుచుఁ, దురంగంబుల నిరంగంబులఁ గావించుచు, రథంబుల విశ్లథంబులుగా నొనర్చుచు, ద్విరదంబుల నరదంబులపైఁ బఱవం దోలుచు, ని వ్విధంబున సేనల నంపవానల ముంచి, రూపుమాపిన. 449
క. మత్తిల్లి భూతజాలము, చిత్తంబులఁ జొక్కి వేడ్క చిందులు వాఱన్‌
జొత్తిల్లి సమిత్తలమున, నెత్తురు మేదంబు పలలనికరం బయ్యెన్‌.
450
వ. అ య్యవసరంబున. 451
క. మే లీ బ్రాహ్మణుఁ డొక్కఁడు, నేలం బడఁ గూల్చె సైన్యనిచయము నెల్లన్‌
బాలార్ప నేల యీతనిఁ, దూలించెదఁ గాక నాదు దోర్బలము వడిన్‌.
452
వ. అని పలికి. 453
మ. ఒకయేనూఱు కరంబులన్‌ ధనువు లత్యుల్లాసియై తాల్చి వే
ఱొక యేనూట గుణధ్వనుల్‌ నిగుడ శాతోగ్రాస్త్రముల్‌ గూర్చి వి
ప్ర! కుఠారంబును నిన్నుఁ గూల్తు ననుచున్‌ భర్జించి పుంఖాను పుం
ఖ కఠోరంబుగ నేసె రాజు రయరేఖాధామునిన్‌ రామునిన్‌.
454
క. వడిఁదూపు లెగయ గుడుసులు, పడి కార్ముక పంచశతము పరఁగ విభుఁడు సొం
పడరెఁ బరివేషమండలి, నడుమ ఖరద్యుతుల వెలయు నళినాప్తు క్రియన్‌.
455
వ. ఇ ట్లర్జునుండు బాణవిలాసంబు సూపిన. 456
మ. ధరణీదేవుఁడు రాముఁ డాఢ్యుఁడు జగద్ధానుష్కరత్నంబు దు
ష్కరచాపం బొక టెక్కు పెట్టి శరమున్‌ సంధించి పెల్లేసి భూ
వరుకోదండము లొక్కచూడ్కిఁ దునిమెన్‌ వాఁడంతటం బోక వే
తరువుల్‌ ఱువ్వఁ గుఠారధార నఱకెన్‌ దద్బాహుసందోహమున్‌.
457
క. కరములు దునిసిన నతనికి, శిరమొక్కటి చిక్క శైలశిఖరముభంగిం
బరశువున నదియుఁ ద్రుంచెను, బరసూదనుఁడైన ఘనుఁడు భార్గవుఁడు వడిన్‌.
458
ఆ. తండ్రివడిన నతని తనయులు పదివేలు, దలఁగి పోయి రతనిఁ దాఁకలేక
పరభయంకరుండు భార్గవుం డంత నా, గోవుఁ గ్రేపుతోడఁ గొనుచుఁ జనియె.
459
వ. ఇట్లు హోమధేనువు మరలం దెచ్చి యిచ్చి తన పరాక్రమంబుఁ దండ్రికిం దోఁబుట్టువులకుఁ దెలియఁ జెప్పిన, జమదగ్ని రామున కిట్లనియె. 460
క. కలవేల్పు లెల్లఁ దమతమ, చెలువంబులు దెచ్చి రాజుఁ జేయుదు రకటా!
బలువేల్పు రాజు వానిం, జలమున నిట్లేల పోయి చంపితి పుత్త్రా!
461
క. తాలిమి మనకును ధర్మము, తాలిమి మూలంబు ధర్మతత్త్వంబునకున్‌;
దాలిమి గల దని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్‌ మనలన్‌.
462
క. క్షమ గలిగిన సిరి గలుగును, క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్‌
క్షమ గలుగఁ దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
463
క. పట్టపురాజును జంపుట, గట్టలుకన్‌ విప్రుఁ జంపు కంటెను పాపం
బట్టిట్టనకుము నీ వీ, చెట్ట సెడన్‌ దీర్థ సేవ సేయుము తనయా!
464
క. అని తన్నుఁ దండ్రి పనిచినఁ, బనిపూని ప్రసాద మనుచు భార్గవుఁడు రయం
బున నొకయేఁడు ప్రయాణము, చని తీర్థము లెల్ల నాడి చనుదెంచె నృపా!
465
ఉ. ఆ యెడ నొక్కనాఁడు సలిలార్థము రేణుక గంగలోనికిం
బోయి ప్రవాహమధ్యమునఁ బొల్పుగ నచ్చరలేమపిండుతోఁ
దోయవిహారముల్‌ సలుపు దుర్లభుఁ జిత్రరథున్‌ సరోజ మా
లాయుతుఁ జూచుచుండెఁ బతియాజ్ఞఁ దలంపక కొంత ప్రేమతో.
466
వ. ఇట్లు గంధర్వవల్లభునిం జూచు కారణంబునఁ దడసి. 467
ఉ. అక్కట! వచ్చి పెద్దతడ వయ్యెడి; హోమమువేళ దప్పె; నే
నిక్కడ నేల యుండితి? మునీశ్వరుఁ డేమనునో యటంచుఁ దా
గ్రక్కునఁ దోయకుంభము శిరఃస్థలమం దిడి తెచ్చి యిచ్చి వే
మ్రొక్కి కరంబు మోడ్చి పతిముందట నల్లన నిల్వఁ జూచుచున్‌.
468
వ. అప్పుడు. 469
క. చిత్తమున భార్య దడసిన, వృత్తాంతం బెఱిఁగి తపసి వేగము సుతులన్‌
మత్తం దీనిం జావఁగ, మొత్తుం డన మొత్తరైరి మునుకుచు వారల్‌.
470
క. కడుకొని పెండ్లముఁ జంపని, కొడుకులఁ బెండ్లాముఁ జంప గురుఁ డానతి యీ
నడుగులకు నెఱఁగి రాముం, డడుగిడకుండంగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్‌.
471
శా. తల్లిన్‌ భ్రాతల నెల్లఁ జంపు మనుచోఁ దాఁ జంపి రాకున్న బెం
పెల్లన్‌ బోవ శపించుఁ దండ్రి; తన పంపేఁ జేయుడున్‌ మెచ్చి నా
తల్లిన్‌ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుం డంచు వే
తల్లిన్‌ భ్రాతలఁ జంపె భార్గవుఁడు లేదా చంపఁజేయాడునే.
472
వ. ఇ వ్విధంబున. 473
క. అడ్డఁడు చెప్పక కడపటి, బిడ్డఁడు రాముండు సుతులఁ బెండ్లము నచటన్‌
గొడ్డంటం దెగ నడచిన, జడ్డనఁ దలయూఁచి మెచ్చె జమదగ్ని మదిన్‌.
474
క. మెచ్చిన తండ్రినిఁ గనుఁగొని, చెచ్చెర నీ పడినవారి జీవంబులు నీ
విచ్చితి నను మని మ్రొక్కిన, నిచ్చెన్‌ వారలును లేచి రెప్పటిభంగిన్‌.
475
ఆ. పడిన వారి మరల బ్రతికింప నోపును, జనకుఁ డనుచుఁ జంపె జామదగ్న్యుఁ;
డతఁడు సంపె ననుచు నన్నలఁ దల్లిని, జనకునాజ్ఞ నైనఁ జంపఁదగదు.
476
వ. అంత. 477
సీ. పరశురామున కోడి పరుగులు పెట్టిన యర్జునపుత్త్రకు లాత్మయందుఁ
దండ్రి మ్రగ్గుటకు సంతప్తులై పొగులుచు నింతట నంతట నెడరు వేచి
తిరిగి యాడుచు నొక్కదివసమం దా రాముఁ డడవి కన్నలతోడ నరుగఁ బిదపఁ
బగదీర్పఁ దఱి యని పఱతెంచి హోమాలయంబున సర్వేశు నాత్మ నిలిపి
 
తే. నిరుపమ ధ్యాన సుఖవృత్తి నిలిచియున్న, పుణ్యు జమదగ్ని నందఱుఁ బొదివి పట్టి
కుదులకుండఁగఁ దలఁ ద్రెంచి కొనుచుఁ జనిరి, యడ్డ మే తెంచి రేణుక యడిచికొనఁగ.
478
వ. మఱియును. 479
మ. జనకుం జంపిన వైర మేమఱక రాజన్యాత్మజుల్‌ నేఁడు మీ
జనకుం జంపిరి రామ! రామ! రిపులన్‌ శాసింతు రమ్మంచు న
మ్మునిపై వ్రాలి లతాంగి మోఁదికొనియెన్‌ ముయ్యేడుమాఱుల్‌ రయం
బున రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై.
480
వ. ఇట్లప్పుడు దల్లి మొఱ విని, జమదగ్నికుమారులు వచ్చి యిట్లని విలపించిరి. 481
క. వాకిలి వెడలవు కొడుకులు, రాకుండఁగ నట్టి నీవు రాజసుతులచేఁ
జీకాకు పొంది పోవఁగ, నీకా ళ్లెట్లాడెఁ దండ్రి! నిర్జరపురికిన్‌.
482
వ. అని విలపించుచున్న అన్నలను జూచి రాముం డిట్లనియె. 483
ఉ. ఏడువనేల? తండ్రి తను వేమఱకుండుఁడు తోడులార! నే
సూడొగిఁ దీర్తునంచుఁ బరశుద్యుతి భీముఁడు రాముఁ డుగ్రుఁడై
యోడక యర్జునాత్మభవులున్న పురంబున కేగి వారు గో
డాడఁగఁ బట్టి చంపె వడి నర్జునజాతుల బ్రహ్మఘాతులన్‌.
484
క. ఖండించి రిపుల శిరములు, గొండలుగాఁ బ్రోగు లిడియె గురురక్తనదుల్‌
నిండికొని పాఱి యుబ్బెను, భండనమున నృపులు రిపులు భయమంద నృపా!
485
వ. మఱియు నంతటఁ బోక. 486
ఆ. అయ్యపగకు రాముఁ డలయక రాజుల, నిరువదొక్కమాఱు లరసి చంపె;
జగతిమీఁద రాజశబ్దంబు లేకుండ, సూడు దీర్పలేని సుతుఁడు సుతుఁడె.
487
వ. మఱియు నా రాముఁడు శమంతక పంచకంబున రాజరక్తంబులం దొమ్మిది మడుఁగులు కావించి, తండ్రి శిరంబుఁ దెచ్చి, శరీరంబుతో సంధించి, సర్వదేవమయుండగు దేవుండు తాన కావునఁ దన్ను నుద్దేశించి యాగంబు చేసి, హోతకుం దూర్పును, బ్రహ్మకు దక్షిణభాగంబును, నధ్వర్యునకుఁ బడమటి దిక్కును, నుద్గాత కుత్తరదిశయును, నున్నవారల కవాంతరదిశలును, గశ్యపునకు మధ్యదేశంబును, నుపద్రష్టకు ఆర్యావర్తంబును, సదస్యులకుం దక్కిన యెడలును గలయ నిచ్చి, బ్రహ్మనదియైన సరస్వతియం దవభృథస్నానంబు సేసి, కల్మషంబులం బాసి, మేఘవిముక్తుండైన సూర్యుండునుం బోలె నొప్పుచుండె నంత. 488
క. ఆప్తుఁడగు పుత్రువలనను, బ్రాప్తతనుం డగుచుఁ దపము బలిమిని మింటన్‌
సప్తర్షిమండలంబున, సప్తముఁడై వెలుఁగుచుండె జమదగ్ని నృపా!
489
క. ఆ జమదగ్ని తనూజుఁడు, రాజీవాక్షుండు ఘనుఁడు రాముఁ డధికుఁడై
యోజను వేదర్షులలో, రాజిల్లెడు మీఁదిమనువు రా నవ్వేళన్‌.
490
ఆ. శాంతచిత్తుఁ డగుచు సంగవిముక్తుఁడై, భవ్యుఁడై మహేంద్రపర్వతమున
నున్నవాఁడు రాముఁ డోజతో గంధర్వ, సిద్ధవరులు నుతులు సేయుచుండ.
491
క. భగవంతుఁడు హరి యీక్రియ, భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీపతులన్‌
జగతీభారము వాయఁగఁ, బగఁగొని పలుమాఱు చంపె బవరమున నృపా!
492
వ. అంత గాధికి నగ్నితేజుండగు విశ్వామిత్రుండు జన్మించి తపోబలంబున రాజధర్మంబును మాని, బ్రహ్మర్షియై, యేకశత సంఖ్యాగణితు లగు కొడుకులం గనియె; అయ్యెడ భృగుకుల జాతుండైన యజీగర్తుని కొడుకు శునశ్శేఫుండు దల్లిదండ్రుల చేత హరిశ్చంద్రుని యాగపశుత్వంబునకు నమ్ముడుపడి, బ్రహ్మాదిదేవతల వినుతి సేయుచు మెప్పించి, పితృదేవతలచే బంధవిముక్తుండైన వాని యందుఁ గృప గలిగి, విశ్వామిత్రుండు పుత్త్రుల కిట్లనియె. 493
క. కన్నులఁ గంటిని వీనిని, మన్నన కొమరుండు నాకు మక్కువ మీలో
నన్నన్న యనుచు నతనిన్‌, మన్నింపుం డనినఁ జూచి మదసంయుతులై.
494
క. ఇతఁ డన్నఁటవో మాకును, గృతకృత్యుల మైతి మనుచు గేలి యొనర్పన్‌
సుతులన్‌ మ్లేచ్ఛులు గండని, ధృతిలేక శపించి తపసి తిరుగుడువడఁగన్‌.
495
వ. అయ్యెడ నతని శాపంబునకు వెఱచి, యా నూర్వురయందు మధ్యముండైన మధుచ్ఛందుం డేఁబండ్రు దమ్ములుం దానును నమస్కరించి, తండ్రీ! నీ చెప్పిన క్రమంబున శునశ్శేఫుండు మా కన్నయని నమస్కరింపం గలవార’ మనవుడు సంతసించి, మంత్రదర్శియైన శునశ్శేఫుని వారల యందుఁ బెద్దఁజేసి, మధుచ్ఛందున కిట్లనియె. 496
ఆ. పాడి సెడక వీఁడె నేఁడు నీకతమునఁ, గొడుకు కలిగె నేఁడు కొడుకులార!
కడుపులార మీరు గొడుకులఁ గనుఁ డింకఁ, బ్రీతితోడ దేవరాతుఁ గూడి.
497
వ. అని పలికె, అట్లు శునశ్శేఫుండు దేవతలచేత విడివడుటం జేసి, దేవరాతుండయ్యె. మధుచ్ఛందుండు మొదలైన యేఁబండ్రును దేవరాతునకుఁ దమ్ములైరి. పెద్దలైన యష్టక, హారీత, జయంత, సుమదాదు లేఁబండ్రును వేఱై చనిరి. ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు రెండు విధంబులైనం, బ్రవరాంతరంబు గలిగె నని చెప్పి శుకుం డిట్లనియె. ఆ పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్రవృద్ధుఁడును, రజియును, రంభుండును, ననేనస్సు ననువారు పుట్టిరి. అందు క్షత్రవృద్దునకుఁ గుమారుండగు సుహోత్రునకుఁ గాశ్యుండుఁ గుశుండు గృత్స్నమదుండను ముగ్గురు గలిగిరి. ఆ కృత్స్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుండును, న మ్మహాత్మునకు బహ్వృచప్రవరుండును జన్మించిరి. ఆ బహ్వృచప్రవరుండు తపోనియతుండై చనియె. కాశ్యునకుఁ గాశియుఁ, గాశికి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండు నుదయించిరి. 498
క. ఆ దీర్ఘతపుని కధికుఁడు, శ్రీదయితాంశమునఁ బుట్టె సేవ్యుం డాయు
ర్వేదజ్ఞుఁడు ధన్వంతరి, ఖేదంబులు వాయు నతనిఁ గీర్తన సేయన్‌.
499
వ. వాసుదేవాంశ సంభూతుండగు నా ధన్వంతరి, యజ్ఞభోగంబున కర్హుండు. అతనికిఁ గేతుమంతుండు, కేతుమంతునకు భూమరథుం, డతనికి దివోదాసుం డనం బరఁగు ద్యుమంతుం డుదయించిరి. ఆ ద్యుమంతునకుఁ బ్రతర్దనుండు జన్మించెఁ. బ్రతర్దనుండు శత్రుజిత్తనియు, ఋతధ్వజం డనియుం జెప్పఁబడె, అతనికిఁ గువలయాశ్వుండు సంభవించె. 500
ఆ. వసుమతీశ! విను కువలయాశ్వభూభర్త, లలితపుణ్యు ఘను నలర్కుఁ గనియె
నాతఁ డేలె నేల నఱువదియాఱు వే, లేండ్లు వానిభంగి నేలె నెవఁడు?
501
వ. అ య్యలర్కునకు సన్నతియు, నతనికి సునీతుండు, నతనికి సుకేతనుండును, నతనికి ధర్మకేతువును, నతనికి సత్యకేతువును, నాతనికి ధృష్టకేతువును, నా ధృష్టకేతువునకు సుకుమారుండును, నా సుకుమారునకు వీతిహోత్రుండును, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనియించిరి. 502
ఆ. వాఁడు తుదయుఁ గాశ్యవసుమతీశుం డాది, యైనవారు గాశు లనఁగ నెగడి
రవనిమీఁద వార లా క్షత్రవృద్ధుని, వంశజాతు లగుచు వంశవర్య!
503
వ. మఱియు, క్షత్రవృద్ధునికి రెండవకొడుకగు కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునకు హర్యధ్వనుండును, హర్యధ్వనునకు సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును. జయత్సేనునకు సంకృతియును, సంకృతికి జయుండును, జయునికి క్షత్రధర్ముండును బుట్టిరి. వీరలు క్షత్రవృద్ధుని వంశంబునం గల రాజులు. రంభునికి రభసుండును, రభసునకు గంభీరుండును, గంభీరునికిఁ గృతుండును గలిగిరి. ఆ కృతునికి బ్రహ్మకులంబు పుట్టె. అ య్యనేనసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు, శుచికి బ్రహ్మసారథియైన త్రికకుత్తును జనించిరి. అతనికి శాంతరజుండు పుట్టె. నతండు విజ్ఞానవంతుండు, కృతకృత్యుండు, విరక్తుండు నయ్యె. 504
సీ. రజియనువానికి రాజేంద్ర! యేనూఱు కొడుకులు గలిగిరి ఘోరబలులు
వేల్పులెల్లను వచ్చి వేఁడిన నా రజి, దైతులం బెక్కండ్ర ధరణిఁ గూల్చి
నాకంబు దేవేంద్రునకు నిచ్చె నిచ్చిన రజికాళ్ళ కెఱఁగి సురప్రభుండు
వెండియు నతనికి విబుధదేహము నిచ్చి సంతోషబుద్ధి నర్చన మొనర్చె
 
ఆ. అంత నా రజి మృతుఁడైన నతని పుత్త్రు, లమరవిభుఁడు దమ్ము నడిగికొనిన
నీక యింద్రలోక మేలిరి యాగభో, గములు పుచ్చుకొనిరి గర్వమంది.
505
క. వేలుపులఱేఁడు గురుచే, వేలిమిఁ బెట్టించి బలిమి వెలయఁగ నిజ దం
భోలిని రజిసుతులను ని, ర్మూలము గావించి స్వర్గముం గైకొనియెన్‌.
506
వ. అది యట్లుండె నహుషునకు యతియు, యయాతియు, సంయాతియు, నాయాతియు, వియతియుఁ గృతియు నన నార్గురు కొడుకులు దేహికి నింద్రియంబుల చందంబున సంభవించిరి. అందుఁ బెద్దకొడు కగు యతికి రాజ్యం బిచ్చిన, నతండు విరక్తుండై. 507
క. రాజ్యంబు పాపమూలము, రాజ్యముతో నొడ లెఱుంగ రాదు సుమతియున్‌
రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగఁడు, రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా?
508
వ. అని పలికి, వాఁడు రాజ్యంబునకుం బాసి చనియె. 509
క. ఆ నహుషుడు మఖశతమును, మానుగఁ గావించి యింద్రమానినిఁ గవియం
బూని మునీంద్రులు మోచిన, యానముపై నుండి కూలె నహియై నేలన్‌.
510
ఉ. అన్నయుఁ దండ్రియుం జన యయాతి మహీపతియై చతుర్దిశల్‌
పన్నుఁగఁ గావఁ దమ్ములకుఁ బాలిడి శుక్రుని కూఁతురున్‌ సుసం
పన్న గుణాభిరామ వృషపర్వుని కూఁతురు నోలి నాండ్రుగా
సన్నయశాలి యీ ధరణి చక్రధురంధరుఁ డయ్యెఁ బేర్మితో.
511
వ. అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 512
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )