| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| ఆ. |
పార్థివుఁడు యయాతి బ్రహ్మర్షిభార్గవుఁ, డల్లుఁడగుట మామ యగుట యెట్లు రాజు రాచకూఁతు రతిసేయఁ దగుఁగాక, విప్రకన్య నొంద విహిత మగునె? |
513 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 514 |
| సీ. |
దనుజేంద్రుకూఁతురు తరళాక్షి శర్మిష్ఠ పురములో నొకనాఁడు ప్రొద్దువోక వేలసంఖ్యను చెలుల్ వెంటరా గురుసుత యగు దేవయానితో నాట మరగి పూచిన యెలదోఁట పొంత జొంపము గొన్న క్రొమ్మావిచేరువ కొలఁకుఁ జేరి యందుఁ దమ్ములతేనె లాని చొక్కుచు మ్రోయు నళుల ఝంకృతులకు నదరిపడుచు |
|
| ఆ. |
వలువ లూడ్చి కొలఁకు వడిఁ జొచ్చి తమలోనఁ, బెల్లురేఁగి నీటఁ జల్లులాడ నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ, శూలి వచ్చెఁ గొండచూలితోడ. |
515 |
| చ. |
మలహరుఁ జూచి సిగ్గుపడి మానిను లందఱు సంభ్రమంబునన్ వలువలు గట్టుచో దనుజవల్లభు కూఁతురు దేవయాని దు వ్వలువ ధరించి, ముందఱికి వచ్చినఁ జూచి యెఱిం గెఱింగి నా వలు విది యెట్లు గట్టుకొనవచ్చును దాసికి నంచు దెప్పుచున్. |
516 |
| వ. | దేవయాని యిట్లనియె: | 517 |
| శా. |
ఆ లోకేశుముఖంబునం గలిగె బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబు నా; మేలై వైదికమార్గముల్ దెలుపుచున్ మిన్నంది రందున్ మహా శీలుర్ భార్గవు; లందు శుక్రుఁడు సుధీసేవ్యుండు; నే వానికిన్ జూలన్; నా వలువెట్లు గట్టితివి రక్షోజాతవై చేటికా! |
518 |
| క. |
మహిమవతులైన భూసుర, మహిళలవిత్తంబులు పెఱమగువల కగునే? మహిఁ బసిఁడి గొలుసు లిడినన్, విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్. |
519 |
| క. |
మీ తండ్రి మాకు శిష్యుఁడు, మా తండ్రి గురుండు గొంతమాత్రం బైనం బ్రీతిం గావింపక పరి, భూతం జేయుదువె తులువపోఁడిమిఁ జెనఁటీ! |
520 |
| వ. | అని భర్జించుచున్న దేవయాని పలుకులు విని, కరాళించి, మ్రోఁగుచున్న భుజంగి పగిది నిట్టూర్పులు నిగుడించి, పెదవులు గొఱుకుచు, శర్మిష్ఠ యిట్లనియె. | 521 |
| శా. |
భిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ భిక్షించి యుండంగ సం రక్షింపం దుది నింతయై మఱపుతో రాజప్రసూతాకృతిన్ రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమం బాడెడిన్ గుక్షిస్ఫోటము గాఁగ దీనిఁ జెలు లీ కూపంబునం ద్రోవరే. |
522 |
| వ. | అని పలికి. | 523 |
| ఆ. |
బోఁటిపిండుచేతఁ బొదువంగఁ బట్టించి, రాజసమున దైత్యరాజతనయ తొడరి దేవయానిఁ ద్రోపించె వలు వీక, క్రుంకి నూతిలోనఁ గుదిలకొనఁగ. |
524 |
| వ. | ఇట్లు సేసి, శర్మిష్ఠ వోయిన వెనుక, యయాతిభూపాలుండు వేఁటమార్గంబున నడవిం దిరుగుచు, దైవయోగంబున నా దేవయాని యున్న నుయ్యి చేరం జనుదెంచి యందు. | 525 |
| క. |
బంధువుల నెల్లఁ జీరుచు, నందు జలామగ్న నగ్నయై వగచుచు ని ర్బంధమునఁ జిక్కి వ్రీడా, సింధువున మునింగియున్న చేడియఁ గనియెన్. |
526 |