| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| వ. | కనుంగొని. | 527 |
| శా. |
సప్తాంభోనిధి మేఖలావృత మహా సర్వంసహా కన్యకా ప్రాప్తోద్యద్వరదక్ష దక్షిణకరప్రాలంబముం జేసి ప్రో క్షిప్తం జేసె యయాతి కట్టుకొనఁ బై చేలంబు మున్నిచ్చి ప ర్యాప్త స్వేదజలాంగి నాళిసముదాయస్వర్గవిన్ భార్గవిన్. |
528 |
| వ. | ఇట్లు నుయ్యి వెడలించిన రాజునకు రాజవదన యిట్లనియె. | 529 |
| మ. |
ననుఁ బాణిగ్రహణంబు చేసితి గదా నా భర్తవు న్నీవ దై వ నియోగం బిది పౌరుషంబునకు నా వాక్యంబు సిద్ధంబు సౌ ఖ్య నివాసు న్నిను మాని యొండు వరునిం గాంక్షింప నే నేర్తునే? వనజం బానెడి తేఁటి యన్యకుసుమావాసం బపేక్షించునే? |
530 |
| వ. | అదియునుంగాక. | 531 |
| సీ. |
సుగుణాఢ్య! విను నేను శుక్రుని కూఁతుర దేవయానిని దొల్లి దేవమంత్రి తనయుండు కచుఁడు మా తండ్రిచేత మృతసంజీవనిఁ దా నభ్యసించు వేళ నతనిఁ గామించిన నతఁడొల్ల ననవుడు నతఁడు నేర్చిన విద్య యణఁగి పోవ నతని శపించిన నతఁడు నా భర్త బ్రాహ్మణుఁడు గాకుండెడు నని శపించె |
|
| తే. |
నది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుఁడు గాఁడు, ప్రాణనాథుఁడ వీ వని పడఁతి వలుకఁ దనదు హృదయంబు నెలఁతపైఁ దగులువడినఁ, దమక మొక యింతయును లేక తలఁచి చూచి. |
532 |
| మత్త. |
దైవయోగము గాక విప్రసుతన్ వరించునె నా మనం బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టి దంచు వరించె ధా త్రీవరుండును దేవయానిని ధీరబుద్ధులకున్ మనో భావ మొక్కటియే ప్రమాణ మభావ్య భావ్య పరీక్షకున్. |
533 |
| వ. | ఇట్లు వరించి, యయాతి చనిన వెనుక దేవయాని శుక్రుని కడకుం జని, శర్మిష్ఠ చేసిన వృత్తాంతం బంతయుం జెప్పి కన్నీరు మున్నీరుగా వగచిన. | 534 |
| క. |
క్రూరాత్ముల మందిరములఁ, బౌరోహిత్యముల కుంట పాపం బీ సం సారముకంటె శిలల్ దిని, యూరక కాపోతవృత్తి నుండుట యొప్పున్. |
535 |
| వ. | అని వృషపర్వుని కడ నుండుట నిందించుచు, శుక్రుం డాకూఁతుం దోడ్కొని పురంబు వెడలి చన, నయ్యసురవల్లభుం డెఱింగి, శుక్రునివలన దేవతల గెలువఁ దలఁచి తెరువున కడ్డంబు వచ్చి, పాదంబులపైఁ బడి ప్రసన్నుఁ జేసిన, నా కోపంబు మాని శుక్రుండు శిష్యున కిట్లనియె. | 536 |
| తరల. |
చెలులు వేవురుఁ దాను నీ సుత చేటికైవడి నాసుతం గొలుచు చుండినఁ దీఱుఁ గోపము గొల్వఁ బెట్టెద వేని నీ వెలఁదిఁ దోడ్కొని వత్తు నావుడు వేగ రమ్మని భార్గవిం గొలువఁ బెట్టె సురారివర్యుఁడు గూఁతు నెచ్చెలిపిండుతోన్. |
537 |
| మ. |
చల మింకేలని తన్నుఁ దండ్రి వనుపన్ శర్మిష్ఠ సన్నిష్ఠతో జలజాతాస్యలు సద్వయస్యలు సహస్రంబు న్నజస్రంబుఁ ద న్నలమన్ దాసి సుదాసి యయ్యెఁ బగ వాయన్ భూరికోపానలా కలితగ్లానికి దేవయానికి మహాగర్వోద్యమ స్థానికిన్. |
538 |
| వ. | అంత. | 539 |
| ఉ. |
ఆతతమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో పేతఁ దనూభవం బిలిచి పెండ్లి యొనర్చె మహావిభూతికిన్ బ్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధు వినీతికిన్ సిత ఖ్యాతికి భిన్నదుష్కలహకార్యభియాతికి న య్యయాతికిన్. |
540 |
| వ. | ఇట్లు యయాతికి దేవయాని నిచ్చి శుక్రుండు శర్మిష్ఠాసంగమంబు సేయకు మని నియమించి చనియె. పిదప న ద్దేవయానియు, న య్యయాతివలన యదుతుర్వసు లను కుమారులం గనియె, ఒక్కరేయి సెఱంగు మాసి, దేవయాని వెలుపలనున్న యెడ శర్మిష్ఠ యెడరు వేచి, యేకాంతంబున యయాతి కడకుం జని, చెఱకువింటిజోదు పువ్వుటంపర కోహటించి, తన తలంపు సెప్పిన. | 541 |