పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట
ఉ. ఆ జవరాలిఁ జూచి మన మాఁపఁగలేక మనోభవార్తుఁడై
యా జనభర్త మున్ను కవియాడిన మాట దలంచి యైనఁ జే
తోజసుఖంబులం దనిపెఁ, ద్రోవఁగ వచ్చునె దైవ యోగముల్‌
రా జఁట సద్రహస్య మఁట రాజకుమారిని మాన నేర్చునే?
542
వ. ఇట్లు యయాతి వలన శర్మిష్ఠ గర్భంబై క్రమంబున ద్రుహ్యుండును, ననువును, పూరువును ననువారి మువ్వురు తనయులం గాంచె. అంత దేవయాని తద్వృత్తాంతం బంతయు నెఱింగి, కోపించి, శుక్రుని కడకుం జని క్రోధమూర్ఛితయై యున్న సమయమున యయాతి వెంటం జని, యిట్లనియె. 543
ఆ. మామకేల చెప్ప మాను సరోజాక్షి, దనుజతనయఁ బొంది తప్పువడితిఁ
గామినైన నన్నుఁ గరుణింపు పతిమాట, తండ్రిమాటకంటెఁ దగును నీకు.
544
వ. అని పలికి పాదంబుల కెఱఁగిన న య్యింతి యొడంబడక యుండె; నంత నది యెఱింగి శుక్రుం డిట్లనియె. 545
క. నా మాటఁ ద్రోచి దానవ, భామను బొందితివి ధరణి పాలక! తగవే?
యేమాట యేది రూపము, కాముకులకు లోలుపులకుఁ గలవే నిజముల్‌?
546
వ. అని పలికి, నీవు వనితాజన హేయంబైన ముదిమిం బొందెదవు అని శపియించిన, యయాతి యిట్లనియె. 547
క. మామా! నాపైఁ గోపము, మా మా; నీ పుత్రి యందు మానవు నాకుం
గామోపభోగవాంఛలు, ప్రేమన్‌ రమియించి ముదిమిఁ బిదపన్‌ దాల్తున్‌.
548
వ. అని పలికి యనుజ్ఞ గొని, దేవయానిం దోడ్కొని పురంబునకుఁ జని పెద్దకొడుకగు యదువుం బిలిచి యయాతి యిట్లనియె. 549
శా. నీతల్లిం గనినట్టి శుక్రువలనన్‌ నేఁడీ జరం బొందితిన్‌;
నాతండ్రీ! యదునామధేయ! తనయా! నా వృద్ధతం దాల్పవే
నీ తారుణ్యము నాకు నిమ్ము తనివో నిండారఁ గొన్నేండ్లు నేఁ
జేతోజాతసుఖంబులం దిరిగెదన్‌ శృంగారినై పుత్త్రకా!
550
వ. అనిన తండ్రికి యదు విట్లనియె. 551
శా. కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృ
చ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేదవ్రణాకంపన
శ్రాంతిస్ఫోటక యుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానాసుఖో
పాంతం బైన వయోనిధాన మిది యయ్యా! తేర యీవచ్చునే?
552
వ. అని యదుం డొడంబడకున్న యయాతి తుర్వసు ద్రుహ్యాదుల నడిగిన వారును యదువు పలికినట్లు పలికినఁ గడగొట్టు కుమారుండైన పూరువున కిట్లనియె. 553
ఉ. ‘పిన్నవుగాని నీవు కడుఁ బెద్దవు బుద్ధుల యందు రమ్ము నా
యన్న! మదాజ్ఞ దాఁటవు గదన్న! వినీతుఁడ వన్న! నీవు నీ
యన్నలు సెప్పినట్లు పరిహారము సెప్పకు మన్న! నా జరన్‌
మన్ననఁ దాల్చి నీ తరుణిమం బొనఁగూర్పుము నాకుఁ బుత్త్రకా!’
554
వ. అనిన విని, గురుభక్తి గుణాధారుండైన పూరుం డిట్లనియె. 555
శా. అయ్యా! నన్నిటు వేఁడనేల? భవదీయాజ్ఞా సముల్లంఘనం
బయ్యుండన్‌ బరిహారమున్‌ నొడువ నే నన్యాయినే నీ జర
న్నెయ్యం బొప్పఁగఁ దాల్చి నా తరుణిమ న్నీ కిచ్చెదన్‌ బంపినన్‌
గయ్యం బాడెడి పుత్త్రకుండు గ్రిమిసంకాశుండుఁ గాకుండునే?
556
వ. అదియునుం గాక. 557
క. మునివృత్తి డయ్య నేటికి, జనపాలక! సుగతిఁ గోరు సత్పురుషులకున్‌
దనుఁ గన్న తండ్రి సెప్పిన, పనిచేసిన సుగతి గొంగుపసిఁడియె కాదే!
558
క. పనుపక చేయుదు రధికులు, పనిచిన మధ్యములు పొందుపఱుతురు; తండ్రుల్‌
పనిచెప్పి కోరి పనిచిన, ననిశము మాఱాడు పుత్త్రు లధములు తండ్రీ!
559
వ. అని పలికి, పూరుండు ముదిమి చేకొని, తన లేఁతప్రాయంబు యయాతి కిచ్చె, అ య్యయాతియుం దరుణుండై, 560
శా. ఏడున్‌ దీవులు నేడు వాడలుగ సర్వేలాతలం బెల్లఁ బెన్‌
వీడై లోనుగ నేలుచుం బ్రజల నన్వేషించి రక్షింపుచున్‌
దోడం భార్గవి రా మనోజసుఖసంతోషంబులం దేలుచున్‌
గ్రీడించె న్నియతేంద్రియుం డగుచు నాక్రీడా విశేషంబులన్‌.
561
క. మర్మంబుల నతిసాధ్వీ, ధర్మంబుల దేవయాని తన ప్రాణేశున్‌
నర్మముల మనోవాక్తను, కర్మంబుల నొండు లేక కడు మెప్పించెన్‌.
562
శా. ఆకాశంబున మేఘబృందము ఘనంబై సన్న మై దీర్ఘమై
యేకంబై బహురూపమై యణఁగు నట్లేదేవు గర్భంబులో
లోకశ్రేణి జనించుచున్‌ మెలఁగుచున్‌ లోపించు నా దేవు సు
శ్రీకాంతున్‌ హరిఁ గూర్చి యాగములు సేసె న్నాహుషుం డిమ్ములన్‌.
563
వ. మఱియు. 564
మ. చెలికాండ్రం గరులన్‌ రథమ్ముల భటశ్రేణిం దురంగంబులం
గలలోఁ గన్న ధనాళితో సమములంగాఁ జూచుచున్‌, భార్యతోఁ
బలు వేలేండ్లు మనోజభోగ లహరీపర్యాప్తుఁడై తేలియున్‌
బలుతృష్ణం గడఁగాన కెంతయు మహాబంధంబులన్‌ స్రుక్కుచున్‌.
565
వ. ఒక్కదినంబున నాత్మజ్ఞానంబునం జేసి కాంతానిమిత్తంబున మోసపోవుట యెఱింగి యయాతి యతివిషాదంబు నొంది దేవయాని కిట్లనియె. 566
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )