పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన మనెడి వ్యాజంబున స్వవృత్తాంతంబు దెలుపుట
క. ‘మనచారిత్రము వంటిది, విను మితిహాసంబు గలదు; వృద్ధజనములున్‌
మునులును మెత్తురు; నీవును, మనమున నంగీకరింపు మంజులవాణీ!
567
వ. అది యెట్టి దనిన. 568
సీ. అజ మొకం డడవిలో నరుగుచుఁ దాఁ గర్మ ఫలమున నూతిలోపలికి జాఱి
లోఁగెడి ఛాగి నాలోకించి కామియై కొమ్మున దరిఁ గొంత గూలఁ ద్రోచి
వెడలింప న చ్ఛాగి విభునిగాఁ గోరిన నగుఁగాక యని తాను నదియుఁ దిరుగ
నెన్నియేనియుఁ దన్ను నెంత కామించిన నన్నింటికిని భర్తయై తనర్చి
 
తే. వాని నే ప్రొద్దు రతులకు వశలఁ జేసి, సొరిదిఁ గ్రీడించి క్రీడించి చొక్కి చొక్కి
కాముఁ డనియెడు దుస్సహగ్రహముకతనఁ, జిత్త మేమఱి మత్తిల్లి చెల్లఁ జిక్కె.
569
క. వెడవింటివాని చిగురా, కడిదపు వ్రేటునకు లొంగి యతిమోహితుఁడై
విడువక సతులం దగిలెడు, జడునకు నెక్కడివి బుద్ధిచాతుర్యంబుల్‌?
570
వ. అంత న చ్ఛాగంబు తన పిదపం దగిలిన ఛాగీనివహంబు లోపలం జూడ నొప్పెడి ఛాగియందుఁదగిలి, క్రీడింపం గని, నూతిలోపలం బడి వెలువడిన ఛాగి, తన పతివలని నెయ్యంబు లేకుండుటకు విన్ననై తన మనంబున. 571
క. పలికిన పలుకులు పలుకఁడు, కలఁచు న్నవకాంతఁ జూచి కడు సంచలుఁడై
నిలిచిన చోట న్నిలువఁడు, నిలు వెల్లను గల్ల కామి నిజమరి గలఁడే.
572
వ. అని పలికి, విడిచి చనిన, న య్యజవల్లభుండు సురతపరతంత్రుఁడై, మిసిమిసియను శబ్దంబు సేయుచు, న చ్ఛాగి వెంటం జని, యొడంబఱుపం జాలకుండె, అంత దానికిఁ గర్తయైన బ్రాహ్మణుండు రోషంబున రతిసమర్థంబు గాకుండ నల్లాడుచున్న ఛాగవృషణంబులు త్రెంచివేసిన, న చ్ఛాగంబు గ్రిందఁ బడి, వేఁడుకొనినఁ బ్రయోజనంబు వొడగని, యోగవిదుండు గావున, బ్రాహ్మణోత్తముండు గ్రమ్మఱ న య్యజవృషణంబులు సంధించిన. 573
క. వృషణములు మరలఁ గలిగిన, సుషముండై ఛాగివిభుఁడు సుందరితోడన్‌
విషయసుఖంబులఁ బొందుచుఁ, దృష తుదిఁ గనఁ డయ్యెఁ బెక్కు దివసము లయ్యున్‌.
574
వ. అని యీ విధంబున యయాతి దేవయానికి నిజవృత్తాంతంబు గథారూపంబున నెఱింగించి యిట్లనియె. 575
మ. అబలా! నీ నిబిడాతి దుర్జయ సలజ్జాపాంగభల్లంబులం
బ్రబలంబైన మనంబు భగ్నముగ నా ప్రావీణ్యముం గోలుపో
యి బలిష్ఠుండగు కాముఁబారిఁ బడి నే నెట్లోర్చెదన్‌ బంది క
త్తె బడిం బాపపుఁ దృష్ణ యిప్పు డకటా! దీర్ఘాకృతిన్‌ రొప్పెడిన్‌.
576
క. అదలదు ప్రాణము లదలినఁ, గదలదు సర్వాంగకములు గదలుచు నున్నన్‌
వదలదు బిగువులు వదలినఁ, దుదిలే దీ తృష్ణ దీనిఁ ద్రుంపఁగ వలయున్‌.
577
క. వెయ్యేం డ్లయ్యెను నీతోఁ, గ్రయ్యంబడి యున్నవాఁడఁ గామసుఖములం
గ్రుయ్య దొక యించుకైనన్‌, డయ్యదు కొన లిడియెఁ దృష్ణ నవపద్మముఖీ!
578
క. ముదిసెను దంతావళియును, ముదిసెను కేశములుఁ దనువు ముదిసెం దనకున్‌
ముదియనివి రెండు చిక్కెను, బ్రదికెడి తీపియును విషయపక్షస్పృహయున్‌.
579
క. కడ లే దాశాలతకును, గడఁజూడఁగఁ గానరాదు కడఁ గనిరేనిన్‌
గడుముదమున సంసారము, గడఁ గందురు తత్త్వవిదులు కమలదళాక్షీ!
580
క. మండన హాటక పశు వే, దండాశ్వ వధూ దుకూల ధాన్యాదులు పె
క్కుండియు నాశాపాశము, ఖండింపఁగ లేవు మఱియుఁ గడమయ చుమ్మీ.
581
క. కామోపభోగసుఖములు, వేమాఱును బురుషుఁ డనుభవింపుచు నున్నం
గామంబు శాంతిఁ బొందదు, ధూమధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు వడునే?
582
ఆ. అక్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన, పాను పెక్కఁ జనదు పద్మనయన!
పరమయోగికైన బలిమిని నింద్రియ, గ్రామ మధికపీడఁ గలుగఁ జేయు.
583
క. వెంగలివిత్తై తిరుగక, కంగారై చెడక ముక్తిఁ గాంక్షించు నతం
డంగనలతోడ విడువని, సంగడముల వదలవలయు జలజాతముఖీ!
584
వ. అది గావున నేఁడు మొదలు తృష్ణాఖండనంబు సేసి, నిర్విషయుండనై, యహంకారంబు విడిచి, మృగంబులం గలసి, వనంబున సంచరించెద. పరబ్రహ్మంబునందుఁ జిత్తంబుఁ జేర్చెద, బ్రహ్మనిష్ఠ మనుష్యులకు నాశా నివారిణి యగుటం జేసి యే నందుఁ దత్పరుండనై, యాహారనిద్రాది యోగంబులం బరిహరించెద. ఆత్మ విదుండై, సంసార నాశంబుఁ దలంచిన వాఁడె విద్వాంసుండని తలంచి పలికి, పూరుని యౌవనం బతని కిచ్చి, ముదిమి తాను గైకొని, విగతలోభుండై, నిజభుజశక్తి పాలితం బగు భూమండలంబు విభాగించి, ద్రుహ్యునకున్‌ బూర్వభాగంబును, యదువునకు దక్షిణభాగంబును, దుర్వసునకుఁ బశ్చిమదిగ్భాగంబును, ననువునకు నుత్తరదిగ్భాగంబును సంరక్షింపుం డని యిచ్చి వారల సమక్షంబున. 585
క. నాలుగుచెఱఁగుల నేలయుఁ, బాలింపుం డనుచు నగ్రభవులకుఁ బంచెన్‌
భూలోక మేలు మనుచును, బాలార్కోదారుఁ బూరుఁ బట్టము గట్టెన్‌.
586
వ. ఇట్లు పూరునికి రాజ్యం బిచ్చి, పెక్కువర్షంబుల యందు ననుభూతంబులైన యింద్రియ సుఖంబులు విసర్జించి. 587
క. మిక్కిలి విజ్ఞానంబునఁ, జక్కఁగ దిగ విడిచి వైరిషడ్వర్గంబున్‌
ఱెక్కలు వచ్చిన విహగము, గ్రక్కున నీడంబు విడుచుకరణి నుదితుఁడై.
588
క. కారుణికోత్తముఁడగు హరి, కారుణ్యము కతన నతఁడు ఘనుఁడై గెలిచెన్‌
గ్రూరములగు విషయంబుల, నూరక గెలువంగ శక్తుఁ డొక్కఁడు గలఁడే?
589
వ. మఱియు నిర్మూలిత సకలసంగుండై సత్త్వరజస్తమో గుణంబులం దిగనాడి నిర్మలంబై, పరమంబైన వాసుదేవాభిధాన బ్రహ్మంబునందు యయాతిభూపాలుండు స్వతస్సిద్ధయైన భాగవతగతిం జెందె నంత. 590
సీ. ప్రాణేశుఁ డాడిన పలుకులు నగవులు గాఁ జూడ కంతరంగమున నిలిపి
పథికులై పోవుచుఁ బానీయశాలలఁ జల్లఁగా నుండెడి జనుల యట్ల
సంసారమునఁ గర్మసంబంధులై వచ్చి, యాలుబిడ్డలు మగం డనుచుఁ గూడి
యుండుట గాని సంయోగంబు నిత్యంబు గా దీశమాయా ప్రకల్పితంబు
 
తే. దీని విడుచుట తగ వని తెగువ మెఱసి, నిద్ర సాలించి మేల్కొన్న నేర్పు చాలఁ
గలిగి భార్గవి సర్వసంగముల విడిచి, హరిపదధ్యానయై ముక్తి కరిగె నధిప!
591
వ. అని యిట్లు యయాతి చరితంబు చెప్పి, భగవంతుండును, సర్వభూత నివాసుండును, శాంతుండును, వేదమయుండు నైన వాసుదేవునకు నమస్కరించెద అని శుకుం డిట్లనియె. 592
క. భారత! నీవు జనించిన, పూరునివంశంబునందుఁ బుట్టిన వారిన్‌
జారుయశో0000లంకారుల, ధీరుల వినిపింతు నధిక తేజోధనులన్‌.
593
వ. పూరునకుఁ జనమేజయుండు, జనమేజయునకుఁ బ్రాచిన్వాంసుఁ డతనికిఁ బ్రవిరోధనమన్యు, వతనికిఁ జారువు పుట్టె. ఆ చారునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుండును, బహుగతునకు శర్యాతి, శర్యాతికి సంయాతియు, సంయాతికి రౌద్రాశ్వుండు, రౌద్రాశ్వునకు ఘృతాచి యను నచ్చరలేమయందు ఋతేపువు కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, సత్యేపువు, వ్రతేపువు, వనేపువు అనువారు జగదాత్మ భూతుండైన ప్రాణునకు నింద్రియంబుల చందంబునఁ బదుగురు కొడుకులు జన్మించిరి. అందు ఋతేపువునకు నంతిసారుండు, నంతిసారునకు సుమతియు, ధ్రువుండు, నప్రతిరథుండు నను మువ్వురును బుట్టిరి. అందు నప్రతిరథునకుఁ గణ్వుం, డా కణ్వునికి మేధాతిథి, యతనికి ప్రస్కందుండు మొదలగు బ్రాహ్మణులు జన్మించిరి. ఆ సుమతికి రైభ్యుండు, రైభ్యునకు దుష్యంతుండు పుట్టి. 594
క. పారావారపరీతో, దారధరాభారదక్ష దక్షిణహస్త
శ్రీ రాజిల్లఁగ నొకనాఁ, డా రాజేంద్రుండు వేఁటయం దభిరతుఁడై.
595
క. గండక కంఠీరవ భే, రుండ శశ వ్యాళ కోల రోహిష రురు వే
దండ వ్యాఘ్ర మృగాదన, చండ శరభ శల్య భల్ల చమరాటవులన్‌.
596
క. చప్పుడు సేయుచు మృగముల, రొప్పుచు నీరములయందు రోయుచు వలలం
ద్రిప్పుకొని పడఁగఁ జోపుచుఁ, దప్పక యేయుచును వేఁటతమకం బొప్పన్‌.
597
క. మృగయూథంబుల వెంటను, మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై
మృగయులు గొందఱుఁ గొలువఁగ, మృగరాజ పరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్‌.
598
వ. ఇట్లు వచ్చి వచ్చి దైవయోగంబునఁ గణ్వమహాముని తపోవనంబు చేరంజని. 599
సీ. ఉరుతర శ్రాంతాహి యుగళంబులకుఁ బింఛముల విసరెడి కేకిముఖ్యములను
గరుణతో మదయుక్త కలభంబులకు మేఁత లిడుచు ముద్దాడు మృగేంద్రములను
ఘనమృగాదనములు, గాపుగా లేళ్ళతో రతులు సాగించు సారంగములను
నునుపుగా హోమధేనువుల కంఠంబులు దువ్వుచు నాడు శార్దూలములను
 
తే. దార కలహించు మూషిక దంపతులకు, మైత్రి నంకించు మార్జాలమల్లములను
మతిని జాతివైరంబులు మాని కూడి, కలసి క్రీడించు మృగములఁ గాంచె నతఁడు.
600
క. ఇత్తెఱఁగున మృగజాతుల, పొత్తులు మే మెఱుఁగ మనుచు భూవల్లభుఁడుం
జిత్తములోపల నా ముని, సత్తము సద్వృత్తమునకు సంతసపడుచున్‌.
601
క. హల్లక బిసరుహ సరసీ, కల్లోలోత్ఫుల్ల యూథికా గిరిమల్లీ
మల్లీ మరువక కురవక, సల్లలితానిలము వలన సంతుష్టుండై.
602
వ. దుష్యంతుండు వచ్చు నవసరంబున. 603
క. ఇం దిందిరాతి సుందరి, యిందిందిరచికుర యున్న; దిందింద శుభం;
బిం దిందువంశ యను క్రియ, నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్‌.
604
క. మా కందర్పుని శరములు, మాకందము లగుటఁజేసి మాకందంబుల్‌
మా కందము లను కైవడి, మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్‌.
605
వ. అంత. 606
క. ఇందున్న కణ్వమునికిని, వందన మొనరించి తిరిగి వచ్చెద ననుచుం
బొందుగ ననుచరులను దా, నందఱ నందంద నిలిపి యటఁ జని మ్రోలన్‌.
607
శా. ఆ కణ్వాశ్రమమందు నీరజనివాసాంత ప్రదేశంబులన్‌
మాకందంబులనీడఁ బుష్పలతికా మధ్యంబునన్‌ మంజు రం
భాకాండాంచితశాలలోఁ గుసుమసంపన్నస్థలిన్‌ జూచె నా
భూకాంతుండు శకుంతల న్నవనటత్‌ భ్రూపర్యటత్కుంతలన్‌.
608
క. దట్టపుఁదుఱుమును మీఁదికి, మిట్టించిన చన్నుఁగవయు మిఱుమిఱుచూడ్కుల్‌
నట్టాడునడుముఁ దేనియ, లుట్టెడు మోవియును మనము నూరింపంగన్‌.
609
వ. అంత నా రాజకుమారుం డలరు టమ్ముల విలుకాని, వెడవింట ఘణఘణాయమానలై మ్రోయు ఘంటలకుం బబ్బరించి, తన మనంబున. 610
శా. వన్యాహారములన్‌ జితేంద్రియత నావాసించు నా కణ్వుఁ డీ
కన్యారత్నము నే గతిం గనియెడిం గా; దీ కురంగాక్షి రా
జన్యాపత్యము గాఁగ నోపు; నభిలాషం బయ్యెఁ; గాదేని నే
యన్యాయక్రియలందుఁ బౌరవుల కెం దాశించునే చిత్తముల్‌?
611
క. అడిగిన నృపసుతఁ గానని, నొడివెడినొ కదే మనంబు నొవ్వ నని విభుం
డుడురాజవదన నడుగఁగఁ, దడుమన యొకకొంతప్రొద్దు తడఁబడఁ జొచ్చెన్‌.
612
వ. మఱియు నెట్టకేలకుఁ దన చిత్త సంచలనంబు సత్యంబుగాఁ దలంచి యిట్లనియె. 613
క. భూపాలక కన్యక వని, నీపై చిత్తంబు నాఁటె, నీవా రేరీ?
నీపే రెవ్వరు? నిర్జన, భూపర్యటనంబు తగవె? పూర్ణేందుముఖీ!
614
వ. అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్ర చంద్రికా రసంబు నేత్రచకోరంబువలనఁ ద్రావుచు, న య్యువిద విభ్రాంతయై యున్న సమయంబున. 615
క. కంఠేకాలునిచేతన్‌, గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్‌
లుంఠించి గుణనినాదము, ఠం, ఠమ్మన బాల నేసె ఠవఠవ గదురన్‌.
616
వ. ఇట్లు వలరాజువాఁడి క్రొవ్విరికోలల వేఁడిమిఁ దాలిమి పోఁడిమి సెడి, యా వాలుఁగంటి యిట్లనియె. 617
మ. అనివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయున్‌
గని; రామేనక డించిపోయె నడవిన్‌; గణ్వుండు న న్నింతగా
మనిచెన్‌; సర్వము నా మునీంద్రుఁ డెఱుఁగున్‌ మద్భాగధేయంబునన్‌
నినుఁ గంటిం బిదపం గృతార్థ నగుదున్‌ నేఁడీ వనాంతంబునన్‌.
618
క. నీవారము ప్రజ లేమును, నీవారము పూజగొనుము నిలువుము నీవున్‌
నీవారును మాయింటను, నీవారాన్నంబుఁ గొనుఁడు నేఁడు నరేంద్రా!
619
వ. అని పలికిన, దుష్యంతుఁడు మెచ్చి, మచ్చెకంటి యిచ్చ యెఱింగి యిట్లనియె. 620
ఆ. రాజతనయ వగుదు రాజీవదళనేత్ర!, మాట నిజము లోనిమాట లేదు
తనకు సదృశుఁడైన తరుణునిఁ గైకొంట, రాజసుతకుఁ దగవు రాజవదన!
621
వ. అని మఱియుఁ దియ్యని నెయ్యంపుఁ బలుకుల వలన న య్యువిద నియ్యకొలిపి. 622
క. బంధురయశుఁడు జగన్నుత, సంధుఁడు దుష్యంతుఁ డుచితసమయజ్ఞుండై
గంధగజగమన నప్పుడు, గాంధర్వవిధిన్‌ వరించె గహనాంతమునన్‌.
623
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )