| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| వ. | ఇ వ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టి, తపసిరాచూలికిఁ జూలునిలిపి, మఱునాఁడు తన వీటికిం జనియె. న య్యింతియుం గొంతకాలంబునకుఁ గొడుకుం గనినం, గణ్వమునీంద్రుఁ డా రాచపట్టికి జాత కర్మాది మంగళాచారంబు లొనర్చె. నా డింభకుండును దినదినంబునకు బాలచంద్రుండునుం బోలె నెదుగుచు. | 624 |
| క. |
కుంఠితుఁడుగాక వాఁ డు, త్కంఠం దన పిన్ననాఁడె కణ్వవనచరత్ కంఠీరవముఖ్యంబుల, కంఠములన్ బట్టి యడచుఁ; గట్టున్; విడుచున్. |
625 |
| వ. | అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె. | 626 |
| ఉ. |
పట్టపురాజు నీ మగఁడు; పాపఁడు నన్నిట నెక్కు డంతకున్, బట్టపుదేవివై గరిమ బాగుగ నుండక పాఱువారితో గట్టువనంబులో నవయఁగాఁ బనిలే దిటఁ దర్లి పోఁగదే పుట్టినయిండ్లు మాని పతిఁబొందక యిట్లనిశంబు నుందురే? |
627 |
| వ. | అనిన నియ్యకొని | 628 |
| క. |
ఆ పిన్నవాని నతుల, వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం జూపెద నంచు శకుంతల, భూపాలునికడకు వచ్చెఁ బుత్త్రునిఁ గొనుచున్. |
629 |
| వ. | వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి యున్నయెడ. | 630 |
| మ. |
వలకేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే ఖలు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న గ్గలమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ బలుకండయ్యె విభుం డెఱింగి సతి విభ్రాంతాత్మయై వందురన్. |
631 |
| వ. | ఆ సమయంబున. | 632 |
| మ. |
అదె నీ వల్లభ, వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్త్రులన్ బాత్రులన్ వదలం గా; దలనాటి కణ్వవనికా వైవాహికారంభముల్ మది నూహింపు; శకుంతలా వచనముల్ మాన్యంబులౌ భూవరేం ద్ర! దయం జేకొను మంచు మ్రోసెను వియద్వాణీ వధూవాక్యముల్. |
633 |
| వ. | ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుం దేటపడ భరింపు మని పలికిన, నా కుమారుండు భరతుండయ్యె, అంత నా రాజు రాజవదన నంగీకరించి, తనూభవుం జేకొని, కొంతకాలంబు రాజ్యంబుఁ జేసి పరలోకంబునకుం జనియె. తదనంతరంబ. | 634 |
| క. |
రెండవ హరిక్రియ ధరణీ, మండలభారంబు నిజసమంచితబాహా దండమున నిలిపి తనకును, భండనమున నెదురులేక భరతుం డొప్పెన్. |
635 |
| వ. | మఱియు నా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురోహితుండుగా డెబ్బదియెనిమిది యును, గంగాతీరంబున నేఁబదియయిదును, నిట్లు నూటముప్పదిమూఁ డశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగా నొనర్చి, దేవేంద్రవిభవంబున నతిశయించి, పదుమూఁడువేలున్నెనుబదినాలుగు కదుపుధేనువులు గలయది ద్వంద్వంబనం బరఁగు. అట్టి వెయ్యి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁ గ్రేపులతోడ నలంకారసహితలం జేసి, వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార పుణ్యతీర్థ కూలంబున విప్రముఖ్యులకు రత్నభూషణశోభితంబులై; ధవళదంతంబులు గల నల్లని యేనుంగులఁ బదునాలుగు లక్ష లొసంగె. దిగ్విజయ కాలంబున శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజుల పీచం బడంచి, రసాతలంబున రాక్షసకారాగృహంబులందున్న వేల్పులగరితలం బెక్కండ్ర విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె. త్రిపురదానవుల జయించి, నిర్జరుల నిజమందిరంబుల నునిచె. అతని రాజ్యంబున గగనధరణీతలంబులు ప్రజలు గోరిన కోరిక లిచ్చుచుండె, ఇ వ్విధంబున. | 636 |
| ఆ. |
సత్యచరితమందుఁ జలమందు బలమందు, భాగ్యమందు లోకపతులకంటె నెక్కుడైన పేర్మి నిరువదియేడు వే, లేండ్లు ధరణి భరతుఁ డేలె నధిప! |
637 |
| క. |
అర్థపతికంటెఁ గలిమి గృ, తార్థుండై యతుల శౌర్య మలవడియు నతం డర్థములును బ్రాణములును, వ్యర్థము లని తలఁచి శాంతుఁడయ్యె నరేంద్రా! |
638 |
| క. |
భరతుని భార్యలు మువ్వురు, వరుసం బుత్త్రకులఁ గాంచి వల్లభుతోడన్ సరిగారని తోడ్తోడను, శిరములు దునుమాడి రాత్మశిశువుల నధిపా! |
639 |
| వ. | ఇట్లు విదర్భరాజపుత్త్రికలు శిశువులఁ జంపిన భరతుం డపుత్త్రకుండై మరుత్‌స్తోమం బను యాగంబు పుత్రార్థియై చేసి, దేవతల మెప్పించె న య్యవసరంబున. | 640 |
| సీ. |
అన్న యిల్లాలిఁ జూలాలిని మమతాఖ్యఁ జూచి బృహస్పతి సురతమునకుఁ దొరఁకొని పైఁబడ్డఁ దొల్లి గర్భంబున నున్న బాలుఁడు భయం బొదవి వలదు తగదని మొఱసేయఁ దమకంబుతో వాని నంధుండ వగుమన్న నలిగి వాఁడు యోనిలోపలి వీర్య మూడఁదన్నిన నేలఁ బడి బిడ్డఁడై యున్నఁ బాయలేక |
|
| ఆ. |
నితనిఁ బెంపు; కొడుకు లిరువురు జన్మించి, రనుచు వెలయఁజేయుమనిన మమతఁ బెంపఁజాల; నీవు పెంపు; భరింపు మీ; ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి. |
641 |
| వ. | ఇ ట్లుచథ్యునిభార్య యగు మమతయు, బృహస్పతియు శిశువుం గని, ద్వాజుండైన వీని నీవే భరింపుమని, వదినె మఱందులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాఁడు భరద్వాజుండయ్యె, గర్భస్థుండైన వాఁడు బృహస్పతి శాపంబున దీర్ఘతముం డయ్యె, అంత నా బృహస్పతియు, మమతయు నుదయించిన వాని విడిచి, నిజేచ్ఛం జనిన, మరుత్తులు వానిం బోషించి, పుత్రార్థియైన భరతున కిచ్చిరి. భరతుండును వానిం జేకొనియె. వితథంబైన భరతవంశమునకు నా భరద్వాజుండు వంశకర్త యగుటం జేసి, వితథుండనం బరఁగె. ఆ వితథునికి మన్యువు, మన్యువునకు బృహత్‌క్షత్ర జయ మహావీర్య నర గర్గులను వారేవురు సంభవించిరి. అందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం డన నిరువురు జన్మించిరి. అందు. | 642 |