| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| సీ. |
రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి యేల? చెప్పఁగ విను మిందు నందు నా రాజు దన సంచితార్థంబు లన్నియు నెడపక దీనుల కిచ్చి యిచ్చి సకుటుంబుఁడై ధైర్యసంయుతుండై పేద యై కూడు నీరులే కధమవృత్తి నెందేని నలువది యెనిమిది దివసముల్ చరియింప నొకదివసంబు రేపు |
|
| ఆ. |
నెయ్యి పాయసంబు నీళ్ళును గలిగిన, బహుకుటుంబ భారభయముతోడ నలసి నీరువట్టు నాఁకలియును మిక్కి, లొదవఁ జూచి కుడువ నుత్సహించె. |
643 |
| వ. | అయ్యవసరంబున. | 644 |
| సీ. |
అతిథిభూసురుఁ డొక్కఁడాహార మడిగినఁ గడపక ప్రియముతో గారవించి హరిసమర్పణ మంచు నన్నంబులో సగ మిచ్చిన భుజియించి యేగె నాతఁ; డంతలో నొకశూద్రుఁ డశనార్థియై వచ్చి పొడసూపలే దనఁబోక తనకు నున్న యన్నములోన నొకభాగ మిచ్చిన సంతుష్టుఁడై వాఁడు సనిన వెనుక |
|
| ఆ. |
కుక్క గమియుఁ దాను నొక్కఁ డేతేర నా, యన్న శేషమిచ్చి సన్నయమున వాని మ్రొక్కి పంప వరుసతోఁ జండాలుఁ, డొక్కఁ డరుగుదెంచి చక్క నిలిచి. |
645 |
| క. |
హీనుఁడఁ; జండాలుండను, మానవకులనాథ! దప్పి మానదు; నవలం బోనేర; నీకుఁ జిక్కిన, పానీయము నాకుఁ బోసి బ్రతికింపఁగదే! |
646 |
| వ. | అనిన వాని దీనాలాపంబులకుఁ గరుణించి, రాజిట్లనియె. | 647 |
| ఉ. |
అన్నము లేదు, కొన్ని మధురాంబువు లున్నవి; ద్రావుమన్న; రా వన్న, శరీరధారులకు నాపద వచ్చిన వారియాపదల్ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ సుమ్ము పుల్కసా! |
648 |
| వ. | అని పలికి. | 649 |
| మ. |
బలవంతంబగు నీరువట్టున నిజప్రాణాంతమై యున్నచో నలయం డేమియు; వీని హృజ్జ్వరము నాయాసంబు ఖేదంబు నా జలదానంబున నేఁడు మాను ననుచున్ సర్వేశ్వరాధీనుఁడై జలముల్ వోసెను రంతిదేవుఁడు దయం జండాలపాత్రంబునన్. |
650 |
| వ. | తదనంతరంబ, బ్రహ్మాదిదేవతలు సంతోషించి, రంతిదేవునికి మేలు సేయం దలంచి, నిజాకారంబులతో ముందట నిలువంబడి యా రాజు ధైర్య పరీక్షార్థంబు దమ చేసిన వృషలాదిరూపంబు లగు విష్ణుమాయ నెఱింగించిన, నా నరేంద్రుం డందఱికి నమస్కరించి. | 651 |
| క. |
వారల నేమియు నడుగక, నారాయణభక్తి తన మనంబున వెలుఁగన్ ధీరుం డాతఁడు మాయా, పారజ్ఞుం డగుచుఁ బరమపదముం బొందెన్. |
652 |
| క. |
ఆ రాజర్షిని గొలిచిన, వారెల్లఁ దదీయయోగవైభవమున శ్రీ నారాయణ చింతనులై, చేరిరి యోగీశు లగుచు సిద్ధపదంబున్. |
653 |
| వ. | ఇట్లు రంతిదేవుండు విజ్ఞానగర్భిణియగు భక్తివలనఁ బరమ పదంబునకుం జనియె. అంత గర్గునకు శిని జన్మించె, శినికి గార్గ్యుండు గలిగె, అతని నుండి బ్రాహ్మణకులంబయ్యె. మహావీర్యునికి నురుక్షయుండు, నురుక్షయునకుఁ ద్రయ్యారుణియుఁ, గవియుఁ, బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి. వారును బ్రాహ్మణులై చనిరి. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండును, సుహోత్రునికి హస్తియు జనించిరి. అతండు దనపేర హస్తినాపురంబు నిర్మించె, ఆ హస్తికి నజమీఢుండును, ద్విమీఢుండును, పురుమీఢుండును నన ముగ్గురు జనియించిరి. అందు నజమీఢుని వంశంబునఁ బ్రియమేధాదులు గొందఱు పుట్టి బ్రాహ్మణులై చనిరి. అ య్యజమీఢునికి బృహదిషువు, నతనికి బృహద్ధనువు, నతనికి బృహత్కాయుండు, నతనికి జయద్రథుండు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువు, కాశ్యుండు, వత్సుండు నన నలుగురు జనియించిరి. అందు రుచిరాశ్వునకుఁ బ్రాజ్ఞుండు, నతనికిఁ బృథుసేనుండును, బృథుసేనునికిఁ బారుండును, వానికి నీపుండును, నీపునికి నూర్వురు కొడకులును బుట్టిరి; మఱియును. | 654 |
| ఆ. |
శుకునికూఁతు రైన సుందరి సత్కృతిఁ, బొంది వేడ్క నీపభూవిభుండు విమలయోగవిత్తు విజ్ఞానదీపితో, దారచిత్తు బ్రహ్మదత్తుఁ గనియె. |
655 |
| వ. | బ్రహ్మదత్తుండు, జైగీషవ్యోపదేశంబున, యోగతంత్రంబునఁ జేసి గోదేవి యను భార్యవలన విష్వక్సేనుండను కుమారునిం గనియె. విష్వక్సేనునకు నుదక్సేనుండు, నుదక్సేనునకు భల్లాదుండు. వీరలు బార్హదిషవులను రాజులైరి. ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిఁ గృతిమంతుడు, కృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు జనించిరి. సన్నతిమంతుకొడుకు కృతి యనువాఁడు, హిరణ్య నాభునివలన యోగమార్గం బెఱింగి, శోకమోహంబులు విడిచి, తూర్పు దేశంబున సామసంహిత పఠియించె. నతనికి నుగ్రాయుధుండు, నుగ్రాయుధునకు క్షేమ్యుండు, క్షేమ్యునకు సువీరుండు, సువీరునకుఁ బురంజయుండుఁ, బురంజయునకు బహురథుండు జన్మించిరి. హస్తికొడుకు పురుమీఢునకు సంతతి లేదయ్యె. అ య్యజమీఢునికి నళిని యను భార్యయందు నీలుండు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికిఁ బురుజుండు, పురుజునికి నర్కుండు, నర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల యవీనర బృహదిషు కాంపిల్య సృంజయు లను వా రేవురు పుట్టిరి. | 656 |
| క. |
మించిన భర్మ్యాశ్వుఁడు సుత, పంచకమును జూచి విషయపంచకమును వ ర్జించితి మే మని పల్కినఁ, బాంచాలురు నాఁగ సుతులు పరఁగిరి ధరణిన్. |
657 |
| వ. | అంత ముద్గలుని నుండి, బ్రాహ్మణకులంబై ముద్గలగోత్రంబు నా నెగడె, భర్మ్యాశ్వపుత్త్రుండైన యా ముద్గలునికి దివోదాసుండు, నహల్య యను కన్యకయునుం బుట్టిరి. అహల్య యందు గౌతమునికి శతానందుండు పుట్టె; శతానందునికి ధనుర్వేదవిశారదుండైన సత్యధృతి పుట్టె, అతనికి శరద్వంతుండు పుట్టె. అతం డొక్కనాఁడు వనంబున నూర్వశిం గనిన, నతనికి, రేతఃపాతంబై తద్వీర్యంబు శరస్తంబంబునంబడి, మిథునంబైన సమయంబున. | 658 |
| క. |
చపలరతి శంతనుండను, నృపవరుఁ డడవికిని వేఁటనెపమునఁ జనుచుం గృపతో శిశుయుగముం గని, కృపియుం గృపుఁ డనుచుఁ దెచ్చి గృహమునఁ బెంచెన్. |
659 |
| వ. | ఆ కృపి ద్రోణునకు భార్య యయ్యె. దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకుఁ జ్యవనుండు, చ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుఁడు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు, సుజన్మకృత్తునకు నూర్వురు కొడుకులు గలిగిరి. వారిలో జంతు వనువాఁడు జ్యేష్ఠుండు కడచూలు పృషతుండు. పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు ధృష్టద్యుమ్నాదు లయిన కొడుకులును, ద్రౌపది యను కూఁతురుం గల్గిరి. ధృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు పుట్టె. వీరలు పాంచాలరాజు లని యెఱుంగుము. మఱియు న య్యజమీఢుని కొడుకు ఋక్షుండు, ఋక్షునకు సంవరణుం డుదయించె. ఆ సంవరుణుఁడు తపతి యనెడి సూర్యకన్యక యందుఁ గురువుం గనియె. ఆ కురువుపేరం గురుక్షేత్రం బయ్యె. ఆ కురువునకుఁ బరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధుండు ననువారలు నలువురు పుట్టిరి. అందుఁ బరీక్షిత్తు కొడుకులు లేక చనియె. సుధనువునకు సుహోత్రుండు, నతనికి చ్యవనుండు, చ్యవనునకుఁ గృతి, కృతికి నుపరిచరవసువు, వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర చేదిషాదులు పుట్టిరి. అందు, బృహద్రథునకుఁ గుశాగ్రుండు, గుశాగ్రునికి ఋషభుండు, ఋషభునికి సత్యహితుండు, సత్యహితునికిఁ బుష్పవంతుండు, బుష్పవంతునకు జహ్ను వనువాఁడు జనియించిరి. మఱియును. | 660 |
| సీ. |
ఆ బృహద్రథునకు నన్యభార్యాగర్భమున రెండు తనుఖండములు జనించెఁ; దునుకలు గని తల్లి దొలఁగంగ వైచిన సంధించె నొకటిగా జర యనంగ నొక దైత్యకాంత; వాఁడొప్పె జరాసంధుఁ డన; గిరివ్రజపుర మాతఁ డేలె; నతనికి సహదేవుఁ; డతనికి సోమాపి తనయుఁ; డాతనికి శ్రుతశ్రవుండు |
|
| తే. |
జహ్నుపుత్త్రుండు సురథుండు జనవరేణ్య!, యతనికొడుకు విదూరథుఁ; డతనిపట్టి సార్వభౌముండు;వానికి సంభవుండు, విను జయత్సేనుఁ డనువాఁడు విమలకీర్తి. |
661 |
| వ. | ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు నయుతాయువు, నయుతాయువునకుఁ గ్రోధనుండుఁ; గ్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి ఋక్షుండు, ఋక్షునికి భీమసేనుండు, వానికిఁ బ్రతీపుండుఁ; బ్రతీపునకు దేవాపి శంతను బాహ్లికు లను మువ్వురు కొడుకులు పుట్టిరి. అందు. | 662 |
| సీ. |
దేవాపి రాజ్యంబు దీర్పనొల్లక వనంబున కేగెఁ దమ్ముండు పూర్వజన్మ మందు మహాభిషుఁ డనియెడు వాఁడు శంతనుఁ డయ్యె వాఁడె యీ ధాత్రినెల్ల నేలుచుఁ గరముల నే వృద్ధు ముట్టిన వాఁడెల్ల నిండుజవ్వనము నొందు; నతఁడు శాంతిప్రాప్తుఁడై యున్నఁ దానఁ బండ్రెండేండ్లు వజ్రి వర్షింపకున్న |
|
| ఆ. |
వృష్టిలేని చొప్పు విప్రుల నడిగిన, “నన్న యుండఁ దమ్ముఁ డగ్నిహోత్ర దారసంగ్రహంబుఁ దాల్చినఁ” బరివేత్త, యండ్రు వాని నీవ యతఁడ వైతి. |
663 |
| వ. | అట కారణంబుగా నన్న యుండఁ దమ్ముండు రాజ్యార్హుండు గాఁడు, నీవు పరివేత్తవు. మీయన్నకు రాజ్యం బిచ్చిన, ననావృష్టి దోషంబు చెడు నని బ్రాహ్మణులు వల్కిన, శంతనుండు వనంబునకుం జని, దేవాపికిఁ బ్రియంబు చెప్పి, రాజ్యంబు చేకొమ్మని పల్కె, అంతకు మున్న వాని మంత్రి దేవాపిని రాజ్యంబున కనర్హుం జేయఁ దలంచి విప్రులం బంచిన, నా విప్రులు పాషండమత వాక్యంబులు దేవాపికి నుపదేశించిరి. దేవాపి వేదంబుల నిందించినఁ బాషండుండును, దేవదూషకుండును గావున వానికి రాజ్యంబు లేదని బ్రాహ్మణులు సెప్పిన, శంతనుండును మగుడి వచ్చి, రాజ్యంబుఁ జేకొనియె. వర్షంబులు గురిసె. నివ్విధంబున. | 664 |
| క. |
దేవాపి కలాపపురం, బావాసము గాఁగ యోగియై యున్నాఁ డు ర్వీవర! కలినష్టంబగు, జైవాతృకకులము మీఁద సంస్థాపించున్. |
665 |
| వ. | బాహ్లికుం డనువానికి సోమదత్తుండు పుట్టె, సోమదత్తునికి భూరియు, భూరిశ్రవస్సు, శలుండను వారు మువ్వురు పుట్టిరి. | 666 |
| క. |
భాతిగ శంతనునకు గం, గా తటినికి వైష్ణవాగ్రగణ్యుఁడు ఘోరా రాతి నయననీలోత్పల, భీతికర గ్రీష్ముఁడైన భీష్ముఁడు పుట్టెన్. |
667 |
| ఆ. |
పరశురాముతోడఁ బ్రతిఘటించి జయింప, నన్యునొకని నెఱుఁగ మతనిఁ దక్క వీరయూధపతి వివేకధర్మజ్ఞుండు, వేల్పుటేటిపట్టి విమలయశుఁడు. |
668 |
| వ. | ఆ శంతనునకు దాశకన్యకయైన సత్యవతి యందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టిరి. అందుఁ జిత్రాంగదుండు (చిత్రాంగదుండను) గంధర్వునిచేత నిహతుండయ్యె. మఱియును. | 669 |
| ఉ. |
సత్యవతీవధూటి మును శంతను పెండ్లముగానినాఁడు సాం గత్యమునం బరాశరుఁడు గర్భము చేసిన బాదరాయణుం డత్యధికుండు శ్రీహరికళాంశజుఁడై ప్రభవించె నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములన్ విభజింప దక్షుఁడై. |
670 |
| ఆ. |
బాదరాయణుండు భగవంతుఁ డనఘుండు, పరమగుహ్యమైన భాగవతము నందనుండ నైన నాకుఁ జెప్పెను శిష్య, జనుల మొఱఁగి యేనుఁ జదువుకొంటి. |
671 |
| వ. | ఆ విచిత్రవీర్యునికిఁ గాశిరాజుకూఁతుల, నంబికాంబాలికల భీష్ముండు బలాత్కారంబునం దెచ్చి వివాహంబు చేసిన, విచిత్ర వీర్యుండు వారలం దగిలి మనోజరాగ మత్తుండై, చిరకాలంబు నానావిధక్రీడలన్ విహరించుచు, రాజయక్ష్మ పీడితుండై, మృతుండయ్యె నంత. | 672 |
| క. |
అతనిసతుల వలన సుతుల, సుత! కను మని తల్లి వనుప సొరిదిం గనియెన్ ధృతరాష్ట్ర పాండు విదురుల, నుతచరితుఁడు బాదరాయణుండు నరేంద్రా! |
673 |
| వ. | అందు, ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులగు కొడుకులు నూర్వురును, దుశ్శలయను కన్యకయును జన్మించిరి. మృగశాపభయంబునం జేసి, భార్యం బొంద వెఱచిన పాండునకుఁ గుంతీదేవియందు ధర్మానిలేంద్ర ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జునులను మువ్వురును, మాద్రిదేవి వలన నాసత్య ప్రసాదంబున నకుల సహదేవులనువా రిద్దఱునుగా నేవురు పుట్టిరి. అయ్యేవురకును, ద్రుపదరాజపుత్రియైన ద్రౌపదియందుఁ గ్రమంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసేనుండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతకర్ముండు నన నేవురు పుట్టిరి. మఱియు యుధిష్ఠిరునకుఁ బౌరవతియందు దేవకుండును, భీమసేనునికి హిడింబయందు ఘటోత్కచుండును, గాళియందు సర్వగతుండును, సహదేవునికి విజయయందు సుహోత్రుండును, నకులునకు రేణుమతియందు నిరమిత్రుండును, నర్జునునకు నులూపియను నాగకన్యకయందు నిరావంతుండును, మణలూరుపతి పుత్త్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుండును, సుభద్రయందు శౌర్యధైర్యతేజో విభవంబుల నఖిల రాజనికరంబునఁ బ్రఖ్యాతుండైన యభిమన్యుండును జన్మించిరి. అందుఁ బభ్రువాహనుం డర్జునుని నియోగంబున మాతామహుని గోత్రంబునకు వంశకర్త యయ్యె. | 674 |
| ఉ. |
అన్యసుపూజ్య! నీ జనకుఁడై యభిమన్యుఁడు భూవరేంద్ర మూ ర్ధన్యుఁడు ధన్యమార్గణ కదంబ విదారిత వైరివీర రా జన్యుఁడు జన్యభీత కురుసైన్యుఁడు సైన్య సమూహనాథ దృ ఙ్మాన్యుఁడు మాన్యకీర్తి మహిమం దనరెం గురువంశకర్తయై. |
675 |
| వ. | ఆ యభిమన్యునకు నుత్తర యందు నీవు జన్మించితివి. | 676 |
| క. |
ద్రోణసుతు తూపువేఁడిమిఁ, బ్రాణంబులఁ బాసి హరికృపాదర్శన సం త్రాణంబున బ్రతికితె కా, క్షోణీశ్వర! మున్ను నీ శిశుత్వమువేళన్. |
677 |
| వ. | నీ కుమారులు జనమేజయ శ్రుతసేన భీమసేనోగ్రసేనులను నల్వురు. వీరలయందు. | 678 |
| ఆ. |
నీవు తక్షకాహి నిహతుఁడ వని విని, సకలసర్పలోక సంహృతముగ సర్పయాగ మింక జనమేజయుఁడు సేయఁ, గలఁడు పూర్వరోషకలితుఁ డగుచు. |
679 |
| వ. | మఱియు నతఁడు సర్వధరణీమండలంబును జయించి, కావషేయుండు పురోహితుండుగా నశ్వమేధంబు సేయఁగలవాఁడు. వానికి శతానీకుండు జనియించి, యాజ్ఞవల్క్యునితోడ వేదంబులు పఠియించి, కృపాచార్యుని వలన విలువిద్య నేర్చి, శౌనకుని వలన నాత్మజ్ఞానంబునుం బడయం గలవాఁడు. ఆ శతానీకునికి సహస్రానీకుండు, వానికి నశ్వమేధజుండు, నశ్వమేధజునికి నాసీమకృష్ణుండు, నాసీమకృష్ణునకు నిచకుండు జనియింతురు. ఆ నిచకుఁడు గజాహ్వయంబు నదిచే హృతంబుగాఁ గౌశాంబియందు వసియించు, ఆతనికి నుప్తుం డుప్తునికిఁ జిత్రరథుండు, చిత్రరథునకు శుచిరథుండు, శుచిరథునికి వృష్టిమంతుండు, వృష్టిమంతునికి సుషేణుండు, సుషేణునికి సుపీతుండు, సుపీతునికి నృచక్షుస్సు, నృచక్షుస్పుకు సుఖానిలుండు, సుఖానిలునికిఁ బరిప్లవుండు, పరిప్లవునకు మేధావి, మేధావికి సునయుండు, సునయునికి నృపంజయుండు, నృపంజయునికి దూర్వుండు, దూర్వునికి నిమి, నిమికి బృహద్రథుండు, బృహద్రథునకు సుధాంశుండు, సుధాంశునికి శతానీకుండు, శతానీకునకు దుర్దమనుండు, దుర్దమనునికి విహీనరుండు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుండు, మితునకు క్షేమకుండు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు పుట్టుదురు. వాఁడు నిర్వంశుండై, దేవర్షి సత్కృతుండై, కలియుగంబునందుఁ జనం గలవాఁడు. | 680 |
| క. |
జగతి నిటమీఁదఁ బుట్టెడు, మగధాధీశ్వరుల నిఖిలమనుజేశ్వరులన్ నిగమాంతవిదులఁ జెప్పెద, సుగుణాలంకార! ధీర! సుభగవిచారా! |
681 |
| వ. | జరాసంధపుత్త్రుండైన సహదేవునికి మార్జాలి, మార్జాలికి శ్రుతశ్రవస్సు, శ్రుతశ్రవస్సునకు నయుతాయువు, నయుతాయువునకు నిరమిత్రుండు, నిరమిత్రునకు సునక్షత్రుండును, సునక్షత్రునికి బృహత్సేనుండు, బృహత్సేనునికిఁ గర్మజిత్తు, కర్మజిత్తునకు శ్రుతంజయుండు, శ్రుతంజయునకు విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకు శ్రుతుండు, శ్రుతునకు దృఢసేనుండు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకుఁ బురంజయుండును జన్మించెద రని చెప్పి మఱియు నిట్లనియె. | 682 |
| ఆ. |
వినుము మగధదేశవిభులు జరాసంధ, ప్రముఖధరణిపతులు ప్రబలయశులు వీరు కలియుగమున వెయ్యేండ్ల లోపలఁ, బుట్టి గిట్టఁగలరు భూవరేంద్ర! |
683 |
| వ. | యయాతికొడు కనువునకు సభానరుండు, చక్షువు, పరోక్షుండు ననువారు ముగ్గురు పుట్టి రందు సభానరునకుఁ గాలనాథుండు, కాలనాథునకు సృంజయుండు, సృంజయునకుఁ బురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మహామనసుఁడు, మహామనసునకు నుశీనరుండు, తితిక్షు వన నిరువురు జన్మించిరి. అందుశీనరునకు శిబియు, వనుండును, గ్రిమియు, దర్పుండు నన నలువురు జన్మించిరి. అందు శిబికి వృషదర్ప సువీర మద్ర కేకయులు నలువురు పుట్టిరి. తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలి పుట్టిరి. ఆ బలిక్షేత్రమున దీర్ఘతముని వలన అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్రాంధ్రులను పేళ్ళు గలవా రార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబునకు రాజులై, దేశంబులకుఁ దమతమ నామధేయంబు లిడి యేలిరి. సువీరునకు సత్యరథుఁడు, సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుండు, ధర్మరథునకుఁ జిత్రరథుండుఁ బుట్టిరి. ఆ చిత్రరథుండు రోమపాదుండు నా బరఁగె, | 684 |
| క. |
సంతతి లేని కతంబునఁ, జింతింపుచు నుండ నతని చెలికాఁ డగు ధీ మంతుఁడు దశరథుఁ డతనికిఁ, సంతతిగా నిచ్చె నాత్మజను శాంతాఖ్యన్. |
685 |
| వ. | అంత రోమపాదుండు, దన కూఁతురు శాంత యని కైకొని మెలఁగుచుండ, నా రాజు రాజ్యంబునం గొంతకాలంబు వర్షంబు లేమికిం జింతించి, విభాండక సుతుండైన ఋశ్యశృంగుండు వచ్చిన వర్షంబు గురియు నని పెద్దలవలన నెఱింగి, | 686 |
| క. |
ఆ రాజు ఋశ్యశృంగుని, ఘోరతపోనిరతుఁ దెచ్చుకొఱకై పనిచెన్ వారసతుల నేర్పరుల ను, దార స్తనభారభీరుతర మధ్యగలన్. |
687 |
| వ. | వారును జని. | 688 |
| ఆ. |
కాంతలార! మెకము గన్నది మొదలుగా, నాఁడువారి నెఱుఁగఁ డడవిలోన, గోఁచి బిగియఁ గట్టుకొనిన యా వడుగని, మత్తికాని రతికి మరపవలయు, |
689 |
| వ. | అని పలుకుచు. | 690 |
| క. |
ఆడుచుఁ జెవులకు నింపుగఁ, బాడుచు నాలోకనిశితబాణౌఘములన్ వీడుచు డగ్గఱ నోడుచుఁ, జేడియ లాతపసి కడకుఁ జేరిరి కలఁపన్. |
691 |
| వ. | అ య్యవసరంబున వారలం జూచి. | 692 |
| సీ. |
మిళితాళినీలధమ్మిల్ల భారంబులు చారుజటావిశేషంబు లనియు భర్మాంచ లోజ్జ్వల ప్రభదుకూలంబులు తతచర్మ వస్త్రభేదంబు లనియు బహు రత్నకీలిత భాసురదామంబు లధికరుద్రాక్షమాలాదు లనియు మలయజ మృగనాభి మహిత లేపంబులు బహువిధ భూతిలేపంబు లనియు |
|
| తే. |
మధుర గానంబు శ్రుతియుక్త మంత్రజాతు లనియు, వీణెలు దండంబు లనియు, సతుల మూర్తు లెన్నఁడు నెఱుఁగని ముగుదతపసి, వారిఁ దాపసులని డాయ వచ్చి మ్రొక్కె. |
693 |
| వ. | ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋశ్యశృంగుం జూచుచు, నగుచు డగ్గఱి. | 694 |
| సీ. |
సేమమే యని సతుల్ చేతుల గ్రుచ్చి కర్కశకుచంబులు మోవఁ గౌఁగిలించి చిరతపోనియతి డస్సితి గదా యని మోముఁ గంఠంబు నాభియుఁ గలయఁ బుణికి క్రొత్తదీవన లివి కొనుమని వీనుల పొంత నాలుకలఁ జప్పుళ్ళు చేసి మా వనంబుల పండ్లు మంచివి తిను మని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసఁగి |
|
| ఆ. |
నూతనాజినంబు నును పిది మేలని, గోఁచి విడిచి మృదుదుకూల మిచ్చి మౌని మరగఁజేసి మా పర్ణశాలకుఁ, బోద మనుచుఁ గొంచుఁ బోయి రతని. |
695 |
| వ. | ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్ష పాశబద్ధుండై, వారల వెంటం జని రోమపాదుకడకుం బోయిన నతండు, దన ప్రియనందనయైన శాంత నిచ్చి పురంబున నునిచికొనియె. అ మ్మునీశ్వరుండు వచ్చిన వర్ష ప్రతిబంధదోషంబు చెడి వర్షంబు గురిసె నంత. | 696 |
| ఆ. |
ఆ నృపాలచంద్రుఁ డనపత్యుఁడై యుండ, నెఱిఁగి మునికులేంద్రుఁ డింద్రుఁ గూర్చి యిష్టిచేసి సుతుల నిచ్చె నాతని కృపఁ, బంక్తిరథుఁడు పిదపఁ బడసె సుతుల. |
697 |
| వ. | ఆ రోమపాదునకుఁ జతురంగుండును, జతురంగునకుఁ బృథులాక్షుండును, బృథులాక్షునికి బృహద్రథుండును, బృహత్కర్ముండు, బృహద్భానుండు ననువారు మువ్వురును బుట్టిరి. అందు బృహద్రథునకు బృహన్మనస్సును, బృహన్మనస్సునకు జయద్రథుండును, జయద్రథునకు విజయుండును, విజయునకు సంభూతి యను భార్యయందు ధృతియు, నా ధృతికి ధృతవ్రతుండును, ధృతవ్రతునకు సత్యకర్ముండును, సత్యకర్మునకు నతిరథుండును జనించిరి. | 698 |
| గీ. |
కుంతి పిన్ననాఁడు గోరి సూర్యునిఁ బొంద, బిడ్డఁ డుదితుఁడైనఁ బెట్టెఁ బెట్టి గంగ నీట విడువఁ గని యతిరథుఁ డంతఁ, గర్ణుఁ డనుచుఁ గొడుకు గారవించె. |
699 |
| వ. | ఇ ట్లతిరథునకుఁ గానీనుండైన కర్ణుండు కొడుకయ్యె. కర్ణునకు వృషసేనుండు పుట్టె. అ య్యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు నారబ్ధుండు, నారబ్ధునకు గాంధారుం, డాగాంధారునకు ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్మదుండు, దుర్మదునకుఁ బ్రచేతస్సు జనించిరి. ప్రచేతస్సుకు నూర్గురు పుట్టి, మ్లేచ్ఛాధిపతులై, యుదీచీదిశ నాశ్రయించిరి. తుర్వసునకు వహ్ని, వహ్నికి భర్గుండు, భర్గునకు భానుమంతుఁడు, భానుమంతునకుఁ ద్రిసానువు, త్రిసానువునకుఁ గరంధముండు, కరంధమునకు నుదార చిత్తుండైన మరుత్తుండును బుట్టరి. అతనికి యయాతిశాపంబున సంతతి లేదయ్యె, వినుము. | 700 |