| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| చ. |
అనఘ! యయాతి పెద్దకొడుకైన యదుక్షితిపాలు వంశమున్ వినినఁ బఠించినన్ నరుఁడు వెండియుఁ బుట్టఁడు, ముక్తిఁ బొందు న య్యనుపమమూర్తి విష్ణుఁడు నరాకృతిఁ బొంది జనించెఁ గావునన్ వినుము నరేంద్ర! నీకు నిది వీనుల పండువు గాఁగఁ జెప్పెదన్. |
701 |
| వ. | యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుండు, రిపుండు ననువారు నలువురు సంభవించిరి. అందుఁ బెద్దకొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు గలిగె. ఆ శతజిత్తునకు మహాహయ, వేణుహయ, హేహయులను వారు మువ్వురు పుట్టిరి. అందు హేహయునకు ధర్ముండు, ధర్మునకు నేత్రుండు, నేత్రునకుఁ గుంతి, కుంతికి మహిష్మంతుఁడు, మహిష్మంతునకు భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్మదునికి ధనికుండు, ధనికునికిఁ గృతవీర్యుండు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుఁడను నలువురు సంభవించిరి. అందుఁ గృతవీర్యునికి నర్జునుండు జనియించె. అతండు మహాబుద్ధిబలంబున. | 702 |
| సీ. |
హరికళాసంజాతుఁడైన దత్తాత్రేయు సేవించి సద్యోగసిద్ధిఁ బొంది బహుయజ్ఞ దాన తపంబులు గావించి సకల దిక్కులు గెల్చి జయముతోడ సతతంబు హరినామ సంకీర్తనము సేసి ధనముల నొంది యుదారవృత్తి యెనుబదియైదువే లేండ్లు భూచక్రంబు ఘనకీర్తిఁ దనపేరు గాఁగ నేలె; |
|
| ఆ. |
ముదిమి లేక తరుణమూర్తియై యురుకీర్తి, నమరెఁ గార్తవీర్యుఁ డనఁగ విభుఁడు; నిజము వానిభంగి నేల యేలిన యట్టి, రాజు నెఱుఁగ మెందు రాజముఖ్య! |
703 |
| వ. | ఆ యర్జునునకుం గల పుత్త్రసహస్రంబునం బరశురాముని బారికిం దప్పి జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువు, నూర్జితుం డనువా రేవురుం బ్రతికిరి. జయధ్వజునకుఁ దాళజంఘుండు, తాళజంఘునకు నౌర్వముని తేజంబున నూర్వురు కొడుకులుఁ గలిగిరి. అందుఁ బ్రథముండు వీతిహోత్రుండు. మధువునకు వృక్ణుండు, వృక్ణునకుఁ బుత్త్ర శతంబు వుట్టె, నందుఁ బ్రథముండు వృష్ణి; మఱియు మధు వృష్ణి యదువుల యా వంశంబుల వారు మాధవులు, వృష్ణులు, యాదవులు ననం బరఁగిరి. యదుపుత్రుండయిన క్రోష్టువునకు వృజినవంతుండు, వృజినవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు భేరుశేకుండు, భేరుశేకునకుఁ జిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండుఁ బుట్టిరి. | 704 |
| మ. |
కృశమధ్యల్ పదివేవు రంగనలతోఁ గ్రీడం బ్రమోదింప స త్కుశలుండై పదివేలలక్షలు సుపుత్త్రుల్ భక్తి సేయం జతు ర్దశ రత్నుండును యోగినాఁ బరఁగి సప్తద్వీప రాజేంద్రుఁడై శశిబిందుం డురునీతిమంతుఁ డమరెన్ సత్కాంతి పూర్ణేందుఁడై. |
705 |
| వ. | అతని కొడుకుల మొత్తంబులకు ముఖరులైన యార్వురలోఁ బృథుశ్రవుండను వానికి ధర్ముండు వుట్టె. ధర్మునకు నుశనుండు వుట్టి నూఱశ్వమేధంబులు సేసె. అ య్యుశనునకు రుచకుండు వుట్టె. ఆ రుచకునకుఁ బురుజిత్తు, రుక్ముండు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుండు నను వా రేవురు పుట్టిరి. అందు జ్యామఖుండు. | 706 |
| సీ. |
తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున ననపత్యుఁ డయ్యును నన్యభార్యఁ గైకొన కొకకొంత కాలంబునకుఁ బోయి పగవారియింటను బలిమిఁ బట్టి యొకకన్యఁ దేరిపై నునిచి తోడ్తేరంగ జననాథుఁ గన్యను శైబ్య చూచి కోపించి మానవకుహక! యీ పడుచును దెచ్చియు నేనుండఁ దేరిమీఁదఁ |
|
| ఆ. |
బెట్టినాఁడ వనుచు బిఱుసులు వలుకంగ, నతఁడు పలికె నంత నతివతోడ నాకుఁ గోడ లింత నమ్ము మీ లలితాంగి, సవతి గాదు వినుము సత్య మనుచు. |
707 |
| వ. | అ య్యవసరంబున శైబ్య కొడుకుం గాంచు నని యెఱింగి, విశ్వేదేవతలును, బితృదేవతలును సంతసించిరి. వారల ప్రసాదంబున | 708 |
| క. |
తన సవతి మొఱఁగి పెనిమిటి, తనుఁ బొందిన శైబ్య మఱి విదర్భునిఁ గనియెన్ దనయుఁ గని జ్యామఖుండును, దనతెచ్చిన కన్యఁ దెచ్చి తనయున కిచ్చెన్. |
709 |
| వ. | ఆ కన్యకయందు విదర్భునకుఁ గుశుండును, గ్రుథుండును, రోమపాదుండునుం బుట్టిరి. రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు విభువు, విభువునకుఁ గృతి, కృతికి నుశికుండు, ఉశికునకు చేది, చేదికి చైద్యాదులు పుట్టిరి. క్రుథునకుఁ గుంతి, కుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు. నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికిఁ గుంతి, కుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధువు, మధువునకుఁ గురువశుండు, కురువశునకు ననువు, అనువునకుఁ బురుహోత్రుండు, నతనికి నంశువు, నతనికి సాత్త్వతుండు, సాత్త్వతునకు భజమానుండును, భజియు, దివ్యుండును, వృష్టియు, దేవాపృథుండును, నందకుండును, మహాభోజుండు నను నేడ్గురును బుట్టిరి. అందు భజమానునకుఁ బ్రథమభార్య యందు నిమ్రోచి కంకణ వృష్ణులు మువ్వురును, రెండవభార్యయందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు నను మువ్వురును బుట్టిరి. అందు దేవాపృథునికి బభ్రువు పుట్టె. వీర లిరువుర ప్రభావంబులఁ బెద్దలు శ్లోకరూపంబునఁ బఠియించుదురు. అట్టి శ్లోకార్థం బెట్టిదనిన. | 710 |
| తే. |
వినుము దూరంబునం దేమి వినుచు నుందు, మదియు చూతుము డగ్గఱ నరుగుదేర నరులలో బభ్రుకంటె నున్నతుఁడు లేఁడు, యోజ దేవాపృథున కెన యొరుఁడు గలఁడె? |
711 |
| క. |
పదునాలుగు వేవురు నఱు, వదియేవురు నరులు ముక్తి పడసిరి బభ్రుం డుదితుఁడు దేవాపృథుఁడును, బదపడి యోగంబుఁ దెలియఁ బలికిన కతనన్. |
712 |
| వ. | మహాభోజుం డతిధార్మికుండు. వాని వంశంబువారు భోజులని పలుకం బడిరి. వృష్టికి సుమిత్రుండును, యుధాజిత్తును జన్మించిరి. అందు యుధాజిత్తునకు శినియు, అనమిత్రుండును జనించిరి. అనమిత్రునికి నిమ్నుండు, నిమ్నునికి సత్రాజితుండు, ప్రసేనుండు నన నిరువురు పుట్టిరి, మఱియు ననమిత్రునికి శినియను వాఁడు వేఱొకండుఁ గలఁడు, అతని పుత్త్రుండు సత్యకుండు, అతనికి యుయుధానుం డనం బరఁగిన సాత్యకియు, నా సాత్యకికి జయుండును, జయునకుం గుణియు, నాగుణికి యుగంధరుండును బుట్టిరి. మఱియు ననమిత్రునకుఁ బృశ్నియను వేఱొక కొడుకుం గలఁడు. వానికి శ్వఫల్కచిత్రకులు గలిగిరి. అందు శ్వఫల్కునకు గాందిని యం దక్రూరుండును, నసంగుండును, సారమేయుండును, మృదుకుండును, మృదుపచ్ఛివుండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రోపేక్షుండును, అరిమర్దనుండును, శత్రుఘ్నుండును, గంధమాదనుండును, ప్రతిబాహువు ననువారు పన్నిద్దఱు కొడుకులును, సుచారువను కన్యకయుం జనించిరి. వారియం దక్రూరునికి దేవలుండును, అనుపదేవుండును బుట్టిరి. మఱియుఁ జిత్రునకుఁ బృథుండును, విదూరథుండును మొదలుగాఁ గలవారు పెక్కండ్రు వృష్ణి వంశ జాతు లయిరి. భజమానుండు, కుకురుఁడు, శుచి, కంబళబర్హిషుండు నన నలువు రంధకునికిఁ బుట్టిరి. కుకురునకు వృష్ణి, వృష్ణికి విలోమతనయుండు, విలోమతనయునికి కపోతలోముండు, కపోతలోమునికిం దుంబురు సఖుండైన యనువు, అనువునకు దుందుభి, దుందుభికి దవిద్యోతుండు, దవిద్యోతునకుఁ బునర్వసువు, ఆతనికి ఆహుకుం డను కుమారుండును, ఆహుకి యను కన్యకయుం గలిగిరి. ఆ యాహుకునికి దేవకుండు, ఉగ్రసేనుండు నన నిరువురు జన్మించిరి. అందు దేవకునికి దేవలుండు, అనుపదేవుండు, సుదేవుండు, దేవవర్ధనుండన నలుగురు గలిగిరి. వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ననఁ దోఁబుట్టువు లేడ్వురు గలిగిరి. | 713 |
| క. |
అసదృశ లలితాకారలఁ, గిసలయ కరతలల దేవకీముఖ్యల నా బిసరుహనయనల నందఱ, వసుదేవుఁడు పెండ్లి యాడె వసుధాధీశా! |
714 |
| వ. | ఉగ్రసేనునకుఁ గంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుండును, శంకుండును, సుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, తుష్టిమంతుండు నను కొడుకులును; కంసయు, కంసవతియు, సురాభువు, రాష్ట్రపాలికయు నను కూఁతులుం బుట్టిరి. వారు వసుదేవానుజ భార్యలైరి. భజమానునికి విదూరథుండును, విదూరథునికి శినియు, నతనికి భోజుండు, భోజునికి హృదికుండు, హృదికునకు దేవమీఢుండు, శతధనువు, కృతవర్మయు నను కొడుకులు గలిగిరి. ఆ దేవమీఢుండు శూరుండు ననంబడు. శూరునికి మారిష యను భార్య యందు వసుదేవుండును, దేవభాగుండును, దేవశ్రవుండును, ఆనకుండును, సృంజయుండును, శ్యామకుండును, కంకుండును, అనీకుండును, వత్సకుండును, వృకుండు ననువారు పదుగురు కొడుకులును; పృథయు, శ్రుతదేవయు, శ్రుతకీర్తియు శ్రుతశ్రవసయు, రాజాధి దేవియు నను కూఁతు లేవురును బుట్టిరి. అందు | 715 |