| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| ఉ. |
ధీనయశాలియైన వసుదేవుఁడు పుట్టిన వెంట మింటిపై నానకదుందుభుల్ మొరసె, నచ్యుతుఁ డీతనికిం దనూజుఁడై మానుగఁ బుట్టునంచు గరిమంబున దేవత లుబ్బ రాజపం చానన! తన్నిమిత్తమున నానకదుందుభి యయ్యె వాఁడిలన్. |
716 |
| క. |
తన చెలికాఁడగు కుంతికిఁ, దనయులు లేకున్నఁ జూచి తన తనయఁ బృథన్ దనయఁగ నిమ్మన శూరుఁడు, దనయందుల మైత్రి నిచ్చె ధరణీనాథా! |
717 |
| వ. | అయ్యింతి కుంతిభోజుని యింటం బెరుగుచుండ, నొకనాఁడు దుర్వాసుం డరుగుదెంచిన న మ్మహాత్మునకుఁ గొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులం జేరంజీరు విద్య వడసి, యా విద్య లావెఱుంగ నొక్క నాఁ డేకాంతంబున వెలుంగుఱేని నాకర్షించిన, నా దేవుండు వచ్చినం జూచి, వెఱఁగుపడి యిట్లనియె. | 718 |
| క. |
మంత్ర పరీక్షార్థం బభి, మంత్రించితిఁ గాని దేవ! మదనక్రీడా తంత్రంబుఁ గోరి చీరన్, మంత్రించిన తప్పు సైచి మరలు దినేశా! |
719 |
| వ. | అనిన న య్యువిదకుం బద్మినీవల్లభుం డిట్లనియె. | 720 |
| మ. |
తెఱవా! నీ పలుకట్ల యౌ; వినుములే దేవోత్తమాహ్వానముల్ మొఱగంబోలునె? వేల్పులం బడయుటల్ మోఘంబులే! నీకు నీ తఱి గర్భం బగుఁ బుత్త్రుఁడుం గలుగు; నీ తారుణ్యముం బూజ్యమౌ వెఱవం గార్యము లేదు; సిగ్గు దగునే? వ్రీడావినమ్రాననా! |
721 |
| చ. |
అని తగ నీయకొల్పి లలితాంగికి గర్భము సేసి మింటికిన్ జనియె దినేశ్వరుం డపుడు చక్కని రెండవ సూర్యుఁడో యనన్ దనరెడు పుత్రుఁ గాంచి కృప దప్పి జగజ్జనవాదభీతయై తనయుని నీటఁ బోవిడిచి తా నరిగెం బృథ దండ్రియింటికిన్. |
722 |
| వ. | అయ్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహం బయ్యె. అయ్యంగనకుఁ బాండురాజు వలన ధర్మజ, భీమార్జునులు పుట్టిరి. అమ్మగువచెల్లెలగు శ్రుతదేవను, గారూషకుండైన వృద్ధశర్మ పెండ్లియాడె. అయ్యిద్దఱకును ముని శాపంబున దంతవక్త్రుండను దానవుండు జన్మించె. దాని తోడంబుట్టువగు శ్రుతకీర్తినిఁ గేకయుండు పెండ్లియాడె. ఆ దంపతులకుఁ బ్రతర్దనాదు లేవురు పుట్టిరి. దాని భగిని యైన రాజాధిదేవిని జయత్సేనుండు పరిణయం బయ్యె. ఆ మిథునమునకు విందానువిందులు సంభవించిరి. చేది దేశాధిపతియైన దమఘోషుండు శ్రుతశ్రవసను పరిగ్రహించె; వారలకు శిశుపాలుం డుదయించె. వసుదేవుని తమ్ముండైన దేవభాగునికిఁ గంసయందుఁ జిత్రకేతు బృహద్బలు లిరువురు జనించిరి. వాని భ్రాతయగు దేవశ్రవస్సను వానికి గంసవతి యందు వీరుండును, నిషుమంతుండును నుప్పతిల్లిరి. వాని సోదరుండైన కంకునికిఁ గంక యను దానికి బకుండును, సత్యజిత్తు పురుజిత్తను వారు జనించిరి. వాని సహజుండైన సృంజయునికి రాష్ట్రపాలియందు వృష, దుర్మర్షణాదులు జనించిరి. వాని యనుజాతుండైన శ్యామకునకు సురభూమియందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి. వాని తమ్ముండైన వత్సుండు మిశ్రకేశి యను నప్సరసయందు వృకాదిసుతులం గనియె. వృకుండు దూర్వాక్షి యందుఁ దక్ష పుష్కర సాళ్వాదుల నుత్పాదించె. వాని జఘన్యజుండయిన యనీకుండు సుదామని యను దాని యందు సుమిత్రానీక బాణాదు లయిన కొడుకులం బడసె, వాని యనుజుండైన యానకుండు కర్ణిక యందు ఋతధామ జయులం గాంచె. వసుదేవుని వలన రోహిణియందు బలుండును, గదుండును, సారణుండును, దుర్మదుండును, విపులుండును, ధ్రువుండును, కృతాదులును; పౌరవియందు సుభద్రుండును, భద్రబాహుండును, దుర్మదుండును, భద్రుండును భూతాదులుం గూడఁ బన్నిద్దఱును; మదిరయందు నందోపనంద కృతక శ్రుత శూరాదులును; నిళయందు యదుముఖ్యులయిన యురువల్కలాదులును; ధృతదేవయందుఁ ద్రిపృష్ఠుండును; శాంతిదేవాత్మజయందుఁ బ్రశ్రమ ప్రశ్రితాదులును; నుపదేవయందుఁ గల్పవృష్ట్యాదులు పదుండ్రును; శ్రీదేవయందు వసుహంస, సుధన్వాదు లార్గురును, దేవరక్షితయందు గదాదులు తొమ్మండ్రును; సహదేవయందుఁ గీర్తిమంతుండును, సుషేణుండును, భద్రసేనుండును, ఋజువును సమదనుండును, భద్రుండును, సంకర్షణుండును, ననువా రేడ్వురు పుట్టిరి. మఱియును. | 723 |
| క. |
దుష్జజననిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబు సేయుట కొఱకై యష్టమగర్భమున గుణో, త్కృష్టుఁడు దేవకికి విష్ణుదేవుఁడు పుట్టెన్. |
724 |
| ఆ. |
విష్ణుఁ డుదితుఁడైన వెనుక నా దేవకి, భద్రమూర్తియగు సుభద్రఁ గనియె; నా గుణాఢ్య ముత్తవగు నీకు, నర్జున, దయిత యగుటఁ జేసి ధరణినాథ! |
725 |
| క. |
ఎప్పుడు ధర్మక్షయ మగు, నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో నప్పుడు విశ్వేశుఁడు హరి, దప్పక విభుఁడయ్యుఁ దన్నుఁ దా సృజియించున్. |
726 |
| క. |
తనమాయ లేక పరునకు, ఘనునకు నీశ్వరున కాత్మకర్తకు హరికిన్ జననములకుఁ గర్మములకు, మనుజేశ్వర! కారణంబు మఱియును గలదే? |
727 |
| క. |
తలపఁగ నెవ్వని మాయా, విలసనములు జనన వృద్ధి విలయంబులకుం గలిమి కనుగ్రహ మోక్షం, బులు కను జీవులకు మూలములు నా నెగడున్. |
728 |
| సీ. |
అట్టి సర్వేశుని కరయంగ జన్మాది పరతంత్రభావ మెప్పాటఁ గలదు రాజలాంఛనముల రాక్షసవల్లభు లక్షౌహిణీశులై యవనిఁ బుట్టి జనులను బాధింప శాసించు కొఱకునై సంకర్షణునితోడ జనన మంది యమరుల మనముల కైన లెక్కింపఁగ రాకుండు నట్టి కర్మములఁ జేసి |
|
| తే. |
కలియుగంబున జన్మింపఁ గలుగు నరుల దుఃఖ శోకతమంబులఁ దొలఁగఁ జేసి నేల వ్రేఁగెల్ల వారించి నిఖిలదిశల, విమలకీర్తులు వెదచల్లి వెలసె శౌరి. |
729 |
| సీ. |
జనకుని గృహమున జన్మించి మందలోఁ బెరిఁగి శత్రులనెల్లఁ బీఁచ మణఁచి పెక్కండ్రు భార్యలఁ బెండ్లియై సుతశతంబులఁ గాంచి తను నాదిపురుషుఁ గూర్చి శరణన్న వారిని గరుణించి పాండవ కౌరవులకు నంతఁ గలహమైన నందఱ సమయించి యర్జును గెలిపించి యుద్ధవునకుఁ దత్త్వ మొప్పఁ జెప్పి |
|
| తే. |
మగధ పాండవ సంజయ మధు దశార్హ, భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుఁ డగుచు నుర్విభరము నివారించి, యుండ నొల్ల, కా మహామూర్తి నిజమూర్తి యందుఁ బొందె. |
730 |
| క. |
మంగళహరికీర్తి మహా, గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్ సంగతము సేసి ద్రావఁ దొ, లంగును గర్మంబు లావిలం బగుచు నృపా! |
731 |
| క. |
వనజాక్షుని మందస్మిత, ఘనకుండల దీప్తి గండ కలితాననమున్ వనితలుఁ బురుషులుఁ జూచుచు, ననిమిషభావంబు లేమి కలయుదు రధిపా! |
732 |
| చ. |
నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహము లచ్చి కాట ప ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండల కర్ణముల్ మదే భ గతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి మ్ముగఁ బొడసూపుఁ గాతఁ గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్. |
733 |
| వ. | అని చెప్పి. | 734 |
| క. |
జనకసుతాహృచ్చోరా!, జనకవచోలబ్ధ విపినశైల విహారా! జనకామిత మందారా!, జనకాది మహేశ్వరాతిశయసంచారా! |
735 |
| మాలిని. |
జగదవనవిహారీ! శత్రులోక ప్రహారీ!, సుగుణఘనవిహారీ; సుందరీమానహారీ! విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!, స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ! |
736 |
| గద్య. | ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు సూర్యవంశారంభంబును, వైవస్వతమను జన్మంబును, హైమచంద్రకథనంబును, సుద్యుమ్నాది మనుసూనుల చరిత్రంబును; మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగర, నాభాగ ప్రముఖుల చరిత్రంబులును, నంబరీషుని యందుఁ బ్రయోగింపఁ బడిన దుర్వాసుల కృత్య నిరర్థక యగుటయు; నిక్ష్వాకు, వికుక్షి, మాంధాతృ, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, భగీరథ ప్రముఖుల చరిత్రంబులును; భాగీరథీ ప్రవాహవర్ణనంబును; గల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును, శ్రీరామచంద్రకథనంబును, దదీయవంశ పరంపరా గణనంబును; నిమికథయును, జంద్రవంశారంభంబును, బుధపురూరవుల కథయును, జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును; విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతను, భీష్మ, పాండవ, కౌరవ, ప్రముఖుల వృత్తాంతంబులును, ఋశ్యశృంగ వ్రతభంగంబును, ద్రుహ్వ్యనుతుర్వసుల వంశంబును, యదు కార్తవీర్య శశిబిందు జామదగ్న్యాదుల వృత్తాంతంబులును, శ్రీకృష్ణావతార కథాసూచనంబును నను కథలుం గల నవమస్కంధము సంపూర్ణము. | 737 |