| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
హలధరుఁ డమర్త్యచరితుం, డలఘుభుజాబలుఁ డొనర్చు నద్భుతకర్మం బులు పెక్కు నాల్గుమోములు, గల మేటియు లెక్కపెట్టఁ గలఁడె నరేంద్రా! |
960 |
| చ. |
అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను పద్మపత్త్ర లో చనుని యనంతవీర్యగుణసంపద వేమఱు విన్న నైననుం దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్ వినిన మనోజపుష్పశరవిద్ధుఁడు నైన విరామ మొందునే? |
961 |
| వ. | అదియునుంగాక. | 962 |
| చ. |
హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతుఁ గోరి మ్రొక్కు త చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా వరుఁ గను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్. |
963 |
| క. |
హరిపాదతీర్థసేవా, పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి స్ఫురితాంగము లంగము; లా, పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! |
964 |
| సీ. |
అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి జనవర! గోవిందసఖుఁడు కుచేలుండు, నా నొప్పు విప్రుండు మానధనుఁడు విజ్ఞాని రాగాదివిరహితస్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి |
|
| తే. |
నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి, కాసు పదివేలనిష్కముల్‌గాఁ దలంచి యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష, యొకవిధంబున నడుపుచు నుండు నంత |
965 |
| సీ. |
లలితపతివ్రతాతిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహదరిద్ర పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి మల మల మాఁడుచు మానసం బెరియంగఁ ‘బట్టెఁ డోరెము మాకుఁబెట్టు’ మనుచుఁ బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి వేఁడిన వీనులు సూఁడినట్ల |
|
| ఆ. |
యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ, జేరి యిట్లని పలికె ‘నో జీవితేశ! తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు, నొంప దీని కుపాయ మూహింప వైతి. |
966 |
| వ. | అని మఱియు నిట్లనియె. | 967 |
| తే. |
బాలసఖుఁడైన యప్పద్మపత్త్ర నేత్రుఁ, గాన నేఁగి దారిద్ర్యాంధకార మగ్ను లైన మము నుద్ధరింపుము; హరికృపా క, టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ ! నీవు. |
968 |
| వ. | మఱియును. | 969 |
| చ. |
వరదుఁడు సాధుభక్తజనవత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁ గుశస్థలీ పురమున యాదవప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁడు; నీ వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూనసంపదల్. |
970 |
| మ. |
కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ దలఁప న్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని శ్చలభక్తిన్ భజియించువారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్? |
971 |
| క. |
అని చెప్పిన న మ్మానిని, సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం గన నేఁగుట యిహపర సా, ధన మగు నని మదిఁ దలంచి తన సతితోడన్. |
972 |
| తే. |
నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు, పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట పరమశోభన మా చక్రపాణి కిపుడు, గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? |
973 |
| తే. |
అనిన న య్యింతి యౌఁగాక యనుచు విభుని, శిథిలవస్త్రంబుకొంగునఁ బృథుకతండు లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ, జనియె గోవిందదర్శనోత్సాహి యగుచు. |
974 |
| వ. | అట్లు సనుచుం దన మనంబున. | 975 |
| సీ. |
ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును? భాసురాంతఃపురవాసి యైన య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ దర్శింపఁ గలనొ? తద్ద్వారపాలు రెక్కడి విప్రుఁడ? విం దేల వచ్చెద?వని యడ్డ పెట్టిరే నపుడు వారి కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్థశూన్యుండ నేను; |
|
| తే. |
నయిన నా భాగ్య; మతనిదయార్ద్రదృష్టి, గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?, లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి. |
976 |
| వ. | ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జని చని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. | 977 |
| సీ. |
విశదమై యొప్పు షోడశసహస్రాంగనాకలితవిలాససంగతిఁ దనర్చి మహనీయతపనీయమణిమయగోపురప్రాసాదసౌధహర్మ్యములు సూచి, మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి సంతోషబాష్పముల్ జడిగొనంగఁ బ్రకటమై విలసిల్లు నొకవధూమణి మందిరమున నింతులు చామరములు వీవఁ |
|
| తే. |
దనరు మృదుహంసతూలికాతల్పమందుఁ, దానుఁ బ్రియయును బహువినోదములఁ దనరి మహితలావణ్యమన్మథమన్మథుండు, ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు. |
978 |
| సీ. |
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ గరుణాలవాలు, భాసురకపోలుఁ గౌస్తుభాలంకారుఁ, గామితమందారు సురుచిరలావణ్యు, సురశరణ్యు హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు, ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ బన్నగశయను, నబ్జాతనయను, |
|
| తే. |
మకరకుండలసద్భూషు, మంజుభాషు, నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు, భూరిగుణసాంద్రు, యదుకులాంభోధిచంద్రు, విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు. |
979 |
| మ. |
కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డ ప్పేద వి ప్రుని నశ్రాంతదరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్ ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే లుని నల్లంతనె చూచి సంభ్రమవిలోలుండై దిగెం దల్పమున్. |
980 |
| క. |
కరమర్థి నెదురుగాఁ జని, పరిరంభణ మాచరించి, బంధుస్నేహ స్ఫురణం దోడ్తెచ్చి, సమా, దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్. |
981 |
| తే. |
అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక, కలశసలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి, లలితమృగమదఘనసారమిళిత మైన. |
982 |
| తే. |
మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత, శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి బంధురామోదకలితధూపంబు లొసఁగి, మించు మణిదీపముల నివాళించి మఱియు. |
983 |
| వ. | సురభికుసుమమాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళితతాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందుసందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణరవంబు లొలయం జామరలు వీవం దజ్జాతవాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంతకాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి. | 984 |
| ఉ. |
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్ బామున, యోగివిస్ఫురదుపాస్యకుఁడై తనరారు నీ జగ త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ; డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్? |
985 |
| వ. | అదియునుం గాక. | 986 |
| చ. |
తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున్ వినయమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుఁడో ? |
987 |
| వ. | అను న య్యవసరంబున | 988 |
| క. |
మురసంహరుఁడు కుచేలుని, కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ మన మా గురుగృహమున వర్తించిన, చరితము లని కొన్ని నుడివి చతురత మఱియున్. |
989 |
| సీ. |
బ్రాహ్మణోత్తమ ! వేదపాఠనలబ్ధదక్షత గల చారువంశంబువలనఁ బరిణయం బైనట్టి భార్య సుశీలవర్తనములఁ దగ భవత్సదృశ యగునె? తలఁప గృహక్షేత్రధనదారపుత్త్రాదు లందు నీ చిత్తంబు సెందకుంట తోఁచుచున్నది; యేను దుది లోకసంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు |
|
| తే. |
గతి, మనంబులఁ గామమోహితులు గాక, యర్థిమై యుక్తకర్మంబు లాచరించి ప్రకృతిసంబంధములు వాసి భవ్యనిష్ఠ, దవిలి యుందురు కొంద ఱుత్తములు భువిని. |
990 |
| వ. | అని మఱియు నిట్లనియె. | 991 |
| క. |
ఎఱుఁగుదువె ? మనము గురు మం, దిరమున వసియించి యతఁడు దెలుపఁగ వరుసన్ ఎఱుఁగఁగ వలసిన యర్థము, లెఱిఁగి పరిజ్ఞానమహిమ నెఱుఁగుట లెల్లన్. |
992 |
| వ. | అని మఱియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె. | 993 |
| తే. |
తివిరి యజ్ఞానతిమిరప్రదీప మగుచు, నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించు భరితసత్త్వుండు సత్కర్మనిరతుఁ డతుల, భూసురశ్రేష్ఠుఁ డలఘుండు బుధనుతుండు. |
994 |
| వ. | అ మ్మహాత్మునివలన సకలవర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నది గావున. | 995 |
| క. |
భూసురులకెల్ల ముఖ్యుఁడ, నై సకలకులాశ్రమంబులందును నెపుడున్ ధీసుజ్ఞానప్రదుఁ డన, దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్. |
996 |
| తే. |
అట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ, కుశలు లగువారు నిఖిలైకగురుఁడ నైన నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ, దాఁటుదురు మత్పదాంబుజధ్యానపరులు. |
997 |
| వ. | అదియునుం గాక సకలభూతాత్మకుండనైన యేను దపోవ్రతయజ్ఞదానశమదమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు నని చెప్పి మఱియు మనము గురుమందిరమున నున్నయెడ నొక్కనాఁడు గురుపత్నీనియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన న య్యవసరంబున. | 998 |
| సీ. |
ఘుమఘుమారావసంకులఘోరజీమూతపటలసంఛన్నాభ్రభాగ మగుచుఁ జటులఝంఝానిలోత్కటసముద్ధూతనానావిధజంతుసంతాన మగుచుఁ జండదిగ్వేదండతుండనిభాఖండవారిధారాపూర్ణవసుధ యగుచు విద్యోతమానోగ్రఖద్యోతకిరణజిద్విద్యుద్ద్యుతిచ్ఛటావిభవ మగుచు |
|
| తే. |
నడరి జడి గురియఁగ నినుఁ డస్తమింప, భూరినీరంధ్రనిబిడాంధకార మేచి సూచికాభేద్యమై వస్తుగోచరంబు గాని, యట్లుండ మనము న వ్వానఁ దడిసి. |
999 |
| తే. |
బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును, రహితసహితస్థలంబు లేర్పఱుప రాక యున్న యత్తఱి మనము నొండొరుల చేతు, లూతఁగాఁ గొని నడచుచు నుండునంత. |
1000 |
| క. |
బిసబిస నెప్పుడు నుడుగక, విసరెడి వలిచేత వడఁకు విడువక మనముం బస చెడి మార్గముఁ గానక, మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్. |
1001 |
| క. |
తెలతెలవాఱెడివేళం, గలకల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్ మిలమిలని ప్రొద్దుపొడువున, ధళ ధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్. |
1002 |
| క. |
అప్పుడు సాందీపని మన, చొ ప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం దెప్పిఱిలుటఁ గని ఖేదం, బుప్పతిలం బలికె నకట ! యో వటులారా ! |
1003 |
| చ. |
కటకట! యిట్లు మా కొఱకుఁగాఁ జనుదెంచి మహాటవిన్ సము త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు ! మీ ఋణంబు నీఁ గుట కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి స్ఫుటధనబంధుదారబహుపుత్త్రవిభూతిజయాయురున్నతుల్. |
1004 |
| క. |
కని గారవించి యాయన, మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం జనుదెంచుట లెల్లను నీ, మనమునఁ దలఁతే’ యటంచు మఱియుం బలికెన్. |
1005 |
| వ. | ‘అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్యస్నేహవాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!’ యని యవి యెల్లం దలంచి యాడు మాధవుమధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె: | 1006 |
| క. |
వనజోదర ! గురుమందిర, మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం పని పను లెవ్వియుఁ గలవే?, విను మవి యట్లుండ నిమ్ము విమలచరిత్రా! |
1007 |
| క. |
గురుమతిఁ దలఁపఁగఁ ద్రిజగ, ద్గురుఁడ వనం దగిన నీకు గురుఁ డనఁగా నొం డొరుఁ డెవ్వ? డింతయును నీ, కరయంగ విడంబనంబ యగుఁ గాదె హరీ!’ |
1008 |
| వ. | అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుం డగుచు నతనిం జూచి ‘నీ విచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రం బైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లు గాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. | 1009 |
| క. |
దళమైనఁ బుష్పమైనను, ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిం గొలిచిన జను లర్పించిన, నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. |
1010 |
| క. |
అని పద్మోదరుఁ డాడిన, వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె చ్చిన యడుకులు దగ నర్పిం, పను నేరక మోము వాంచి పలుకక యున్నన్. |
1011 |
| వ. | అ వ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి ‘యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపం డైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచినవా; డితనికి నింద్రాదులకుం బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీ క్షణంబ యొడఁ గూర్పవలయు’ నని తలంచి యతండు జీర్ణవస్త్రంబుకొంగున ముడిచి తెచ్చిన యడుకులముడియఁ గని ‘యిది యేమి’ యని యొయ్యన నమ్ముడియఁ దన కరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని ‘యివియ సకలలోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు’ నని యప్పుడు. | 1012 |
| క. |
మురహరుఁడు పిడికెఁ డడుకులు, గర మొప్పఁగ నారగించి కౌతూహలియై మఱియును బిడికెఁడు గొనఁ ద, త్కర మప్పుడు పట్టెఁ గమల కరకమలములన్. |
1013 |
| క. |
‘సొం పారఁగ నతనికి బహు, సంపద లందింప నివియ చాలును నిఁక భ క్షింపఁగ వలవదు త్రిజగ, త్సంపత్కర ! దేవ దేవ ! సర్వాత్మ ! హరీ ! ’ |
1014 |
| వ. | అని యిట్లు వారించె; న క్కుచేలుండును నా రాత్రి గోవిందు మందిరంబునఁ దనకు హృదయానందకరంబులగు వివిధపదార్థంబు లనుభవించి, మృదుల శయ్యాతలంబున నిద్రించి తనమనంబునం దన్ను సమధిక స్వర్గభోగానుభవుంగాఁ దలంచుచు మఱునాఁ డరుణోదయంబున మేల్కని కాలోచితకృత్యంబులు దీర్చి, యిందిరారమణుండు దన్నుఁ గొంత దవ్వనిపి యామంత్రితుం జేయఁ జనుచు నందనందన సందర్శనానంద లోలాత్ముండై తన మనంబున నిట్లనియె. | 1015 |
| క. |
‘నా పుణ్య మరయ నెట్టిదొ, యా పుణ్యనిధిం బ్రశాంతు నచ్యుతు నఖిల వ్యాపకు బ్రహ్మణ్యునిఁ జి, ద్రూపకుఁ బురుషోత్తమునిఁ బరుం గనుఁగొంటిన్. |
1016 |
| సీ. |
పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి యే నేడ? నిఖిలావనీశ్వరి యగు నిందిరాదేవికి నెనయంగ నిత్యనివాసుఁడై యొప్పు నవ్వాసుదేవుఁ డేడ? న న్నర్థిమైఁ దోడఁబుట్టినవానికైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి |
|
| తే. |
చారునిజవధూకరసరోజాతకలిత, చామరానిలమున గతశ్రమునిఁ జేసి శ్రీకుచాలిప్తచందనాంచితకరాబ్జ, తలములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి. |
1017 |
| వ. | కావున. | 1018 |
| ఉ. |
శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు న్నీనితెఱంగు గానఁబడె; నెన్న ‘దరిద్రుఁడు సంపదంధుఁడై కానక తన్నుఁ జేరఁ’ డని కాక శ్రితార్తిహరుండు సత్కృపాం భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే ? |
1019 |
| వ. | అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకుఁ జని చని ముందట. | 1020 |
| సీ. |
భానుచంద్రప్రభాభాసమానస్వర్ణచంద్రకాంతోపలసౌధములును గలకంఠశుకనీలకంఠసముత్కంఠమానితకూజితోద్యానములును ఫుల్లసితాంభోజహల్లకకల్హారకైరవోల్లసితకాసారములును మణిమయకనకకంకణముఖాభరణవిభ్రాజితదాసదాసీజనములుఁ |
|
| తే. |
గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ, యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముఁ డుండు నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత, వైభవోన్నతలక్ష్మీనివాస మగుచు. |
1021 |
| వ. | అని తలపోయుచున్న యవసరంబున. | 1022 |
| తే. |
దివిజవనితలఁబోలెడు తెఱవ లపుడు, డాయ నేతెంచి ‘యిందు విచ్చేయుఁ’ డనుచు విమలసంగీతనృత్యవాద్యములు సెలఁగ, గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును. |
1023 |
| వ. | ఇట్లు సనుదేర నతనిభార్యయైన సతీలలామంబు దనమనంబున నానందరసమగ్న యగుచు. | 1024 |
| సీ. |
తన విభురాక ముందటఁ గని మనమున హర్షించి వైభవం బలర మనుజ కామినీరూపంబు గైకొన్న యిందిరావనితచందంబునఁ దనరుచున్న కలకంఠి తనవాలుఁగన్నులక్రేవల నానందబాష్పంబు లంకురింప నతనిపాదంబుల కాత్మలో మ్రొక్కి భావంబున నాలింగనంబు సేసె |
|
| తే. |
నా ధరాదేవుఁ డతులదివ్యాంబరాభ, రణవిభూషితలై రతిరాజుసాయ కములగతి నొప్పు పరిచారికలు భజింప, లలితసౌభాగ్య యగు నిజలలనఁ జూచి. |
1025 |
| క. |
ఆ నారీరత్నంబును, దానును ననురాగరసము దళుకొత్తఁగ ని త్యానందము నొందుచుఁ బెం, పూనిన హరిలబ్ధవైభవోన్నతి మెఱయన్. |
1026 |
| సీ. |
కమనీయపద్మరాగస్తంభకంబులుఁ గొమరారుపటికంపుఁగుడ్యములును మరకతనవరత్నమయకవాటంబులుఁ గీలితహరినీలజాలకములు దీపితచంద్రకాంతోపలవేదులు నంచితవివిధపదార్థములును దగు హంసతూలికాతల్పంబులును హేమలాలితశయనస్థలములుఁ దనరు |
|
| తే. |
సమధికోత్తుంగభద్రపీఠముల సిరులు, మానితోన్నతచతురంతయానములును వలయు సద్వస్తుపరిపూర్ణవాటికలును, గలిగి చెలువొందుమందిరం బెలమిఁ జొచ్చి. |
1027 |
| వ. | సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; నింతకాలం బత్యంతదురంతంబగు దారిద్ర్యదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగినవిభవంబున నిప్పుడు. | 1028 |
| ఆ. |
ఎన్నఁ గ్రొత్తలైన యిట్టి సంపదలు నా, కబ్బుటెల్ల హరిదయావలోక నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి, కర్థి నగుచు నేను నరుగుటయును. |
1029 |
| క. |
నను నా వృత్తాంతంబును, దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ మ్మని యీ సంపద లెల్లను, నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయనిఁ జేసెన్. |
1030 |
| వ. | అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రం బగుపదార్థంబైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నాచే నున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుకదయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబులయందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుం గాక! యని యప్పుండరీకాక్షుని యందుల భక్తితాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిలభోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండునునై యఖిలక్రియలందు ననంతుని యనంతధ్యానసుధారసంబునం జొక్కుచు విగతబంధనుండై యపవర్గప్రాప్తి నొందె; మఱియును. | 1031 |
| ఆ. |
దేవదేవుఁ డఖిలభావజ్ఞుఁ డాశ్రిత, వరదుఁ డైన హరికి ధరణిసురులు దైవతములు గాన ధారుణీదివిజుల, కంటె దైవ మొకఁడు గలడె భువిని? |
1032 |