| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| వ. | అట్లు సని మొదలం బ్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధనులగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీ తీర్థంబును గనుంగొనుచు నచట నచట నవగాహనదేవర్షిపితృతర్పణబ్రాహ్మణసంతర్పణంబులను భూసురయుక్తుండై నడపుచుం జని సకలలోక స్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి, యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న మునిజనంబులం గనుంగొనిన వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజావిధానంబులు గావించిన నతండును బ్రముదితమానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ. | 927 |
| క. |
ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు, త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం పూనిన పీఠముపై నా, సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్. |
928 |
| వ. | కనుంగొని యతనిసమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి ‘వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణసభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండపోలె దురభిమానంబున శక్తిమనుమనివలనం గొన్నికథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్యలెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు, ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబుల తోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. | 929 |
| క. |
అనఘా! యితనికి బ్రహ్మా, సన మే మిచ్చుటను నీవు సనుదే నితఁ డా సనము దిగఁ డయ్యె నింతయు, మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ! |
930 |
| క. |
ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా, దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో త్తరణప్రాయశ్చిత్తము, దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా! |
931 |
| వ. | అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబు దప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లు గావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు’ మనిన నతండు వారలం గనుంగొని ‘తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె. దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీ కిష్టం బగునే? నట్లు నాయోగమాయచేఁ గావింతు’ నన నమ్మునులు నీ యస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు మనిన నతం డందఱం జూచి యప్పుడు. | 932 |
| క. |
ధాత్రీవర! సమధిక చా, రిత్రుఁడు హలపాణి పలికె ధృతి ‘నాత్మా వై పుత్త్రక నామాసి’ యను ప, విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్. |
933 |
| క. |
ఈ సూతసూనుఁ డిపుడు మ, హాసత్త్వము నాయువును ననామయమును వి ద్యా సామర్థ్యము గలిగి సు, ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్. |
934 |
| వ. | అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. | 935 |
| తే. |
‘ఏ నెఱుంగక చేసిన యీ యవజ్ఞ, శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు దానిఁ గావింతు ననిన మోదంబు నొంది, పలికి ర త్తాపసులు హలపాణిఁ జూచి. |
936 |
| చ. |
‘హలధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ గలఁ డొక దానవుండు బలగర్వమునం బ్రతిపర్వమందు న చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్రసురాస్రపూయ వి ట్పలలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్. |
937 |
| వ. | కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసంబగు; నంత మీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు నని పలుకునంతఁ బర్వసమాగమంబైన. | 938 |
| సీ. |
మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటఁ గనుఁగొని పఱతెంచి యసుర తద్భవనములను రక్తవిణ్మూత్రసురామాంసజాలంబు నించి హేయంబు గావించి పెలుచఁ బెంధూళి ఱాలును బెల్లలు నురలెడు చక్రానిలము వీఁచి చదల నపుడు గాటుకకొండసంగతిఁ బొల్చు మేను తామ్రశ్మశ్రుకేశసమాజములును |
|
| తే. |
నవ్యచర్మాంబరము భూరినాసికయును, గఱకు మిడిగ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జిహ్వి, కయును ముడివడ్డబొమలును గలుగువాని. |
939 |
| మహాస్రగ్ధర. |
కనియెం దాలాంకుఁ డుద్యత్కరచటులనటత్కాలదండాభశూలున్ జనరక్తాసిక్తతాలున్ సమధిక సమరోత్సాహలోలుం గఠో రా శని తుల్యోదగ్రదంష్ట్రాజనితశిఖకణాచ్ఛాదితాశాంతరాళున్ హననవ్యాపారశీలున్నతిదృఢఘనమస్తాస్థిమాలుం గరాళున్. |
940 |
| ఉ. |
వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా దండముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో ద్దండ విఘాతులౌ ముసలదారుణలాంగలముల్ దలంప మా ర్తాండనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్. |
941 |
| వ. | అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబు లగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు. | 942 |
| చ. |
గగనమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం దగిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్ బుగబుగ నెత్తు రొల్క నిల బోరగిలం బడె వజ్రధారచేఁ దెగి ధరఁ గూలు భూరిజగతీధరముం బురుడింప బెట్టుగాన్. |
943 |
| వ. | అట్లు పల్వలుండు మడిసిన. | 944 |
| క. |
మునివరులు గామపాలుని, వినుతించిరి వేయువేల విధముల వృత్రుం దునిమిన యింద్రుని నమరులు, వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా! |
945 |
| తే. |
అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి, మంజులామ్లాన కంజాత మాలికయును నంచితాభరణములు దివ్యాంబరములు, నర్థి నిచ్చినఁ దాల్చి యా హలధరుండు. |
946 |
| క. |
దేవేంద్రుఁ బోలి యొప్పెను, ధీవిలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్ సేవించుచుఁ గతిపయ వి, ప్రావలి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్. |
947 |
| వ. | చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువునందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి, దేవర్షిపితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశ యగు విపాశయందుఁ దోఁగి శోణనదంబున నాప్లావితుండై గయ నాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్ర నగంబున కరిగి. | 948 |
| క. |
రాముఁడు గనుఁగొనె భార్గవ, రామున్ రజనీశకుల ధరావరనగ సు త్రామున్ సన్నుతసుగుణ, స్తోముం గారుణ్యసీము సుజనలలామున్. |
949 |
| ఆ. |
కని నమస్కరించి కౌతుకం బలరార, నతని వీడుకొని హలాయుధుండు గొమరు మిగిలి సప్తగోదావరికి నేఁగి, యందుఁ దీర్థమాడి యచటు గదలి. |
950 |
| వ. | వేణీపంపాసరస్సులం జూచి భీమనది కేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటిశక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి. | 951 |
| స్రగ్ధర. |
సేవించెన్ రంగధామున్ శ్రితనివహ పయస్సింధుసంపూర్ణసోముం గావేరీమధ్యసీమున్ ఘనకలుషమహాకాలకూటోగ్ర భీమున్ దేవారిశ్రీవిరామున్ దివిజవినుతసందీపితానంతనామున్ ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువనవిలసద్దేవతాసార్వభౌమున్. |
952 |
| వ. | అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలం బెక్కి, యగస్త్యునిం గని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి , కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపిం బయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీ పురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబులవలనఁ బాండవధార్తరాష్ట్రుల భండనంబునందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందనసుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని. | 953 |
| తే. |
ధర్మనందనుఁ దనకు వందనము సేయు, కృష్ణు నరు మాద్రిసుతుల వీక్షించి యేమి పలుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ, గ్రోధమునఁ బోరు భీమదుర్యోధనులను. |
954 |
| వ. | చూచి వారల డాయం జని యిట్లనియె. | 955 |
| సీ. |
వీరపుంగవులార! వినుఁడు;మీలోపల భూరిభుజాసత్త్వమున నొకండు ప్రకటితాభ్యాససంపద్విశేషంబున నొక్కండు యధికుఁడై యుంటఁజేసి సమబలు; లటు గాన చర్చింపఁగా నిందు, జయ మొక్కనికి లేదు సమరమందుఁ; గాన యూరక పోరఁగా నేల మీ కని వారింప నన్యోన్య వైరములను |
|
| తే. |
నడరి తొల్లింటిదుర్భాష లాత్మలందుఁ, దలఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు,రారి వీక్షించి వీరి శుభాశుభములు, |
956 |
| వ. | ఎట్లు గావలయు నట్ల యయ్యెడుం గాక యని యచ్చోట నిలువక యుగ్రసేనాదిబంధుప్రకరంబులు పరితోషంబున నెదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి, యందుండి మగిడి నైమిశారణ్యంబునకుం జని, యందుల మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి, బహుదక్షిణ లొసంగి యంచితజ్ఞాన పరిపూర్ణు లగునట్లుగా వరం బిచ్చి, రేవతియునుం దానును బంధుజ్ఞాతియుతంబుగా నవభృథస్నానం బాచరించి యనంతరంబ. | 957 |
| చ. |
విలసితమాల్యచందననవీనవిభూషణరత్నవస్త్రముల్ పొలుపుగఁ దాల్చి యంచితవిభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా కలితసుధాంశురేఖ యెసకం బెసఁగన్ నిజబంధులోచనో త్పలచయ ముల్లసిల్లఁ బరిపాండురచారుయశోవిలాసుఁడై. |
958 |
| వ. | ఇ వ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియునైన బలదేవుం డతివైభవంబున నిజపురంబు ప్రవేశించి సుఖం బుండె’ నని చెప్పి యిట్లనియె . | 959 |