పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీ కృష్ణుండు దంతవక్త్రుని వధించుట
వ. ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వపౌండ్రకశిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతిభీషణాకారంబుతో నప్పుడు. 914
చ. పెట పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్ను గ్రేవలం
జిటచిట విస్ఫులింగములు చింద మహోద్ధతపాదఘట్టనన్‌
నటనిటనై ధరిత్రి వడఁకాడ వడిన్‌ గద కేలఁ ద్రిప్పుచున్‌
మిటమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్‌.
915
చ. వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ డుల్లము పల్లవింప న
ప్పుడు గదఁ గేలఁబూని రథమున్‌ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
గడఁగి విరోధికి న్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
యడరుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్‌ హరిన్‌.
916
వ. కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె. ‘నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండ వైతివి. మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబునందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁ జేయు చికిత్సకునిచందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళిసంరంభగంభీరంబైన మదీయగదాదండహతిం బరేతనివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదుసఖుల ఋణంబుఁ దీర్తు’ నని దుర్భాష లాడుచు డగ్గఱి. 917
చ. పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిన్‌
గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పున పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంత వ
క్త్రుని యురముం బగిల్చినఁ గుదుల్కొనుచున్‌ రుధిరంబు గ్రక్కుచున్‌.
918
వ. తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలం గూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిలభూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మ తేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె, నయ్యవసరంబున నగ్రజుమరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పు లుప్పతిల్ల విదూరథుండు గాలానలజ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలం దాల్చి దామోదరుదెసకుఁ గవయుటయుం గనుంగొని. 919
చ. జలరుహలోచనుండు నిజసాధనమై తనరారుచక్రమున్‌
వలనుగఁ బూన్చి వైవ నది వారక వానిశిరంబు ద్రుంచె న
బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోద రా
వలుల వధించి తత్కులమువారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్‌.
920
వ. అ య్యవసరంబున. 921
క. నరమునియోగిసురాసుర, గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ
శ్చర కిన్నరకింపురుషులు, హరిమహిమ నుతించి రద్భుతానందములన్‌.
922
వ. మఱియు నప్సరోజనంబులు నృత్యంబులు సలుప, వేల్పులు కుసుమవర్షంబులు గురియ, దేవతూర్యంబు లవార్యంబులై మొరయ, యదువృష్ణిప్రవరులు సేవింపఁ, బరమానందంబును బొంది నిజవిజయాంకితంబులైన గీతంబుల వందిజనంబులు సంకీర్తనంబులు సేయ, నతిమనోహరవిభవాభిరామంబును, నూతనాలంకారంబును నైన ద్వారకానగరంబు శుభముహూర్తంబునం బ్రవేశింపం జనునెడ. 923
క. పురసతులు విరులు లాజలు, గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం
బురుహాక్షుం డంతఃపుర, వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్‌.
924
వ. అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె నంత. 925
క. కౌరవపాండవపృథుసమ, రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా
సీరాంకుఁ డుభయకులులకు, నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా!
926
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )