| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
వసుధేశ! విను; మును వైదర్భిపరిణయవేళ దుర్మదశిశుపాలభూమి వరునకుఁ దోడ్పడ నరుదెంచి సైనికావలితోడఁ దొడరి దోర్బలము దూలి హరిచేత నిర్జితులైన రాజులలోనఁ జైద్యుని చెలికాఁడు సాల్వభూమి పతి జరాసంధాదిపార్థివప్రకరంబు విన మత్సరానలవిపులశిఖల |
|
| తే. |
ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ, గడఁగి సేయుదు నని దురాగ్రహముతోడఁ బంతములు పల్కి యటఁ జని భరితనిష్ఠఁ, దపము కావింపఁ బూని సుస్థలమునందు. |
831 |
| క. |
ధృతి వదలక యుగ్రస్థితిఁ, బ్రతిదినమును బిడికెఁ డవనిరజ మశనముగా నతినియమముతో నా పశు, పతి శంకరు ఫాలనయను భర్గు నుమేశున్. |
832 |
| క. |
చెదరని నిజభక్తిని ద, త్పదపద్మము లాత్మ నిలిపి పాయక యొక యేఁ డుదితక్రియ భజియించిన, మదనారియు వానిభక్తి మహిమకు వశుఁడై. |
833 |
| క. |
బోరనఁ బ్రత్యక్షంబై, కోరినవర మేమి యైనఁ గొసరక యిత్తున్ వారక వేఁడు మ టన్నను, నా రాజతపోధనుండు హరునకుఁ బ్రీతిన్. |
834 |
| తే. |
వందనం బాచరించి యానందవికచ, వదనుఁడై నొస లంజలిఁ గదియఁ జేర్చి శ్రితదయాసార! నన్ను రక్షించెదేని, నెఱుఁగ వినిపింతు వినుము మదీప్సితంబు. |
835 |
| తే. |
గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర, వరులచే సాధ్యపడక నా వలయు నెడల నభ్రపథమునఁ దిరిగెడు నట్టి మహిత, వాహనము నాకు దయసేయు వరద! యీశ! |
836 |
| వ. | అని అభ్యర్థించినం బ్రసన్నుండై హరుండు వానికోర్కి కనురూపంబైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును ‘నట్ల చేసెద’ నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకం బను నామం బిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁ జని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి. | 837 |
| సీ. |
సరిదుపవనసరోవరములు మాయించి బావులు గలఁచి కూపములు సెఱిచి కోటలు వెస వీటతాటముల్ గావించి పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి యట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్ దునుమాడి కాంచనధ్వజపతాకములు నఱకి భాసురగోపురప్రాసాదహర్మ్యేందు శాలాంగణములు భస్మములు చేసి |
|
| తే. |
విమలకాంచనరత్నాదివివిధవస్తు, కోటినెల్లను నందంద కొల్లపుచ్చి ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి, తఱిమి యి బ్భంగిఁ బెక్కుబాధల నలంచి. |
838 |
| చ. |
మదమున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్ గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తిశిలామహీరుహ ప్రదరము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగశర్కరల్ వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్. |
839 |
| వ. | అట్టియెడ. | 840 |
| క. |
చటులపురత్రయదనుజో, త్కటదుష్కరబాధ్యమానధారుణిగతి న ప్పుటభేదన మెంతయు వి, స్ఫుటపీడం జెంది వగల సుడివడుచుండన్. |
841 |
| చ. |
కని భగవంతుఁడున్ రథిశిఖామణియు న్నగు రౌక్మిణేయుఁ డ జ్జనముల ‘నోడ కుండుఁ’ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా ధనములుఁ బూని సైనికకదంబము గొల్వ ననూనమీన కే తన రుచి గ్రాల నున్నతరథస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్. |
842 |
| వ. | అ య్యవసరంబున. | 843 |
| చ. |
సమధికబాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత క్షమగదభానువిందశుకసాత్యకిసారణచారుదేష్ణ సాం బ మకరకేతనాత్మజశ్వఫల్కతనూభవతత్సహోదర ప్రముఖయదూత్తముల్ విమతభంజనులై కృతవర్మ మున్నుగన్. |
844 |
| క. |
వారణవాజిస్యందన, వీరభటావలులు సనిరి విశ్వము వడఁకన్ ఘోరాకృతి వివిధాయుధ, భూరిద్యుతు లర్కబింబముం గబళింపన్. |
845 |
| వ. | చని యా గోవిందనందనస్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదుసైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవసంకులసమరవిధంబునం దుములం బయ్యె; న య్యెడ. | 846 |
| మ. |
వితతజ్యాచయటంకృతుల్ మదజలావిర్భూతశుండాల ఘీం కృతు లుద్యద్భటహుంకృతుల్ మహితభేరీభాంకృతుల్ భీషణో ద్ధతనిస్సాణధణంకృతుల్ ప్రకటయోధవ్రాతసాహంకృతుల్ కుతలంబున్ దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా! |
847 |
| మ. |
హరిరింఖారథనేమిసద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు స్తరధూళీపటలప్రభూతనిబిడధ్వాంతప్రవిధ్వంస కృ త్కరశాతాసిగదాదిహేతిరుచు లాకాశంబు నిండన్ వియ చ్చరదృక్కుల్ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్. |
848 |
| చ. |
తలకొని సైనికుల్ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం కిలి గొన కెమ్ము లమ్ములఁ బగిల్చి నొగి ల్చితరేతరుల్ తలల్ నలియఁగ మొత్తి యొత్తి నయనంబుల నిప్పులు రాల లీల నౌఁ దలలు లలాటముల్ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్. |
849 |
| వ. | అ య్యవసరంబునం బ్రద్యుమ్నుండు గనుంగొని. | 850 |
| మ. |
అనయంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా సన నిర్ముక్తనిశాతదివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం బున లీలాగతి నభ్రగుల్ మనములన్ భూషించ మాయించె న వ్వనజాతాప్తుఁడు భూరిసంతమసమున్ వారించుచందంబునన్. |
851 |
| వ. | మఱియును. | 852 |
| చ. |
అతిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖపంచ విం శతి విశిఖంబుల న్నతనిసైనికపాలుని నొంచి యుగ్రుఁడై శత శతకోటికోటినిభసాయకముల్ పరఁగించి సాల్వభూ పతి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్. |
853 |
| చ. |
పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం గదురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం జదియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్ మదము లడంచి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్. |
854 |
| క. |
దుర్మానవహరు నద్భుత, కర్మమునకు నుభయసైనికప్రకరంబుల్ నిర్మలమతి నుతియించిరి, భర్మాచలధైర్యు విగతభయుఁ బ్రద్యుమ్నున్. |
855 |
| వ. | అ య్యవసరంబున. | 856 |
| ఉ. |
సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్ జాంబవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాఁడ నేసి శా తాంబకవింశతి న్నతనిసౌభక మల్లలనాడ నేసినన్. |
857 |
| చ. |
గదుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం తుద వదనాభబాణవితతుల్ పరఁగించి విరోధిమస్తముల్ గుదులుగ గ్రుచ్చి యెత్తుచు నకుంఠితవిక్రమకేళి లోలుఁడై చదల సురల్ నుతింప రథిసత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా! |
858 |
| ఉ. |
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భూసు రా దిత్య మయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా! |
859 |
| ఉత్సాహము. |
భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్యదు ర్మాన కాననానలోపమానచండకాండసం తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. |
860 |
| ఉత్సాహము. |
చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే దారుణ ప్రతాపసాల్వదండనాథమండలిన్ మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్. |
861 |
| క. |
శుకుఁ డాయోధన విజయో, త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ ప్రకరంబులఁ దను శౌర్యా, ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్. |
862 |
| ఉ. |
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో స్సార మెలర్పఁ గుంతశరశక్తిగదాక్షురికాది హేతులన్ వారక వాజిదంతిరథవర్గములం దునుమాడి కాల్వురన్ వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. |
863 |
| క. |
అక్రూరుఁడు దదనుజులు న, వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా విక్రమమున వధియించిరి, చక్రప్రాసాదివివిధసాధనములచేన్. |
864 |
| మ. |
కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి శ్రిత వర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న ద్భుతకర్మం బని సైనికుల్ వొగడ శత్రుల్ దూలుచో సంగర క్షితి ధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా! |
865 |
| వ. | అ య్యవసరంబున సాల్వుండు గోపోద్దీపిత మానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. | 866 |
| సీ. |
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు, నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు నొకమాటు శైలమస్తకమున వర్తించు నొకపరిఁ జరియించు నుదధినడుమ నొక్క తోయంబున నొక్కటియై యుండు నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును నొకమాటు సాలసంయుక్తమై పొడసూపు నొకతోయ మన్నియు నుడిగి తోఁచు |
|
| ఆ. |
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన, గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు మఱియుఁ బెక్కు గతుల నరివరుల్ గలఁగంగఁ, దిరిగె సౌభకంబు ధీవరేణ్య! |
867 |
| వ. | ఇ వ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. | 868 |
| క. |
స్ఫురదనలాభశరంబులు, పొరిఁ బొరిఁ బుంఖానుపుంఖములుగా నేయం దెరలియు మరలియు మురిసియు, విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్. |
869 |
| క. |
అయ్యెడ మానము వదలక, డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్ దయ్య మెఱుంగును నెక్కటి, కయ్యం బపు డయ్యెఁ బేరుగల యోధులకున్. |
870 |
| క. |
మును ప్రద్యుమ్న కుమారుని, ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా ల్వుని మంతిరి ద్యుమనాముఁడు, సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. |
871 |
| చ. |
వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్ విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో త్కరములు దేరిపై వదలి కన్నులు మూయుచు మూర్ఛనొందినన్. |
872 |
| ఆ. |
సమరధర్మవేది సమధికనయవాది, దారుకునిసుతుండు ధైర్యయుతుఁడు రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే, చనియె మూర్ఛదేఱి శంబరారి. |
873 |
| ఉ. |
సారథిఁ జూచి యిట్లనియె శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్ బీరము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. |
874 |
| వ. | అనిన నతం డతని కిట్లనియె. | 875 |
| క. |
‘రథి రిపుచే నొచ్చిన సా, రథియును సారథియు నొవ్వ రథియును గావం బృథుసమరధర్మ; మిఁక న, వ్యథచిత్తుఁడ వగుచుఁ గడఁగు వైరుల గెలువన్’. |
876 |
| వ. | అనిన విని. | 877 |
| ఉ. |
సంచితభూరిబాహుబలశౌర్యుఁడు సారథిమాట కాత్మ మో దించి యుదాత్తకాండరుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్. |
878 |
| వ. | అట్లు డగ్గఱి. | 879 |
| చ. |
అరితను వష్టబాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం దురగములన్ వధించి యొకతూపున సారథిఁ ద్రుంచి రెంట ని ష్ఠురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం కరముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్. |
880 |
| మ. |
కని సాంబ ప్రముఖాదియోధవరు లుత్కంఠాత్ములై మీన కే తను నగ్గించి సువర్ణపుంఖనిశితాస్త్రశ్రేణి సంధించి సా ల్వుని సైన్యావలిమస్తముల్ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె త్తున వే త్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్. |
881 |
| వ. | అట్టి యెడ. | 882 |
| స్రగ్ధర. |
కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గెడయున్ గుప్పలై; నుగ్గునూచై వ్రాలున్ దేరుల్; హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్; శోణితంబుల్ గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెముకలన్ గుంపులై సోలుచున్ బే తాలక్రవ్యాదభూతోత్కరములు; జతలై తాళముల్ దట్టి యాడున్. |
883 |
| వ. | మఱియు నొక్కయెడ. | 884 |
| సీ. |
ఖండితశుండాలగండముల్ నక్రముల్; భూరితుండంబులు భుజగసమితి; పదతలంబులు గచ్ఛపంబులు; దంతముల్ శక్తులు; గుంభనిర్ముక్తమౌక్తి కములు రత్నములు; వాలములు జలూకముల్; మెడలు భేకంబులు; మెదడు రొంపి; ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి |
|
| ఆ. |
సైకతములు; రక్తచయము తోయంబులు;, నొరగు నెడల నొరలు మొఱలు ఘన త రంగరవముగా మతంగజాయోధన, స్థలము జలధిఁ బోల్పఁ దగె నరేంద్ర! |
885 |
| వ. | ఇ వ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పరజయకాంక్షలం దలపడి పోరు పూర్వ పశ్చిమసముద్రంబులవడువున నిరువదియేడుదినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థ పురంబునుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంగొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె. | 886 |
| శా. |
కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్ మహాభీలముల్ మింటన్ మేదినిఁ దోఁచుచున్న యవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురి న్గెంటింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్. |
887 |
| వ. | అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబలపరాక్రమంబులం బ్రతిపక్ష బలంబులతోడం దలపడి పోరు యదుబలంబులును నభోవీథి నభేద్యమాయావిడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవిగాని సౌభకవిమానంబునం దున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియం జను మురాంతకుని వీక్షించి యదుసైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుగొని సౌభకపతివిక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. | 888 |
| చ. |
మిడుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా ఘణఘణ భూరినిస్వననికాయమునన్ హరిదంతరాళముల్ వణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా రుణగతి నింగి నుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్. |
889 |
| క. |
వడిఁ జనుదేరఁగఁ గని య, ప్పుడు నగధరుఁ డలతి లీలవోలెన్ దానిం బొడిపొడియై ధరఁ దొరఁగఁగఁ, నడుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్. |
890 |
| చ. |
గురుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్ దెరలఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండ భా స్కర కిరణాభషోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్. |
891 |
| చ. |
కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబు కై వడి మొరయించుచున్ వెడఁదవాతి శరంబులఁ బద్మలోచను న్నెడమభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతిశార్‌ఙ్గమున్ విడిచె రథంబుపై గగనవీథి సురల్ భయమంది చూడఁగన్. |
892 |
| క. |
హాహా యని భూతావళి, హాహాకారములు సేయ నంతట దేఱ న్నాహరిఁ గనుఁగొని యతఁ డు, త్సాహంబునఁ బలికె బాహు శౌర్యస్ఫూర్తిన్. |
893 |
| చ. |
‘నళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో మలి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో ర్బలమున ధర్మనందను సభాస్థలి నేమఱి యున్న వాని న చ్చలమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్. |
894 |
| క. |
తల చెడి పాఱక బాహా, బల మొప్పఁగ నాదు దృష్టిపథమున ధృతితో నిలిచిన నిష్ఠుర విశిఖా, ర్చుల ముంచి మదీయసఖుని సూ డిటు దీర్తున్. |
895 |
| చ. |
అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా ల్వునిఁ గని ‘యోరి! లావు లగువుం గల పోటరివోలెఁ బ్రేలె దే మనినను బాటు సన్నిహిత మౌట యెఱుంగవు మూఢచిత్త! వొ’ మ్మని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్. |
896 |
| వ. | అట్లు వ్రేసిన. | 897 |
| క. |
పెనుమూర్ఛ నొంది వెస ము, క్కున వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ య్యన తెలిసి నిలువరింపక, చనె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్. |
898 |
| వ. | అ య్యవసరంబున. | 899 |
| తే. |
గగనమందుండి యొకఁ డార్తుఁ డగుచు వచ్చి, నందనందనుపాదారవిందములకు వందనము సేసి యానకదుందుభిని మ, హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి. |
900 |
| తే. |
దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు, దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె’ ననఁగ విని సరోరుహనాభుఁడు ఘనవిషాద, మగ్నుఁ డయ్యెను గురుమీఁది మమతఁ జేసి. |
901 |
| క. |
‘నరగంధర్వసురాసుర, వరులకు నిర్జింపరానివాఁడు బలుం డే మఱ కరయ హీనబలుచేఁ, బరికింపఁగ నెట్లు పట్టువడు నొకొ, యనుచున్ |
902 |
| వ. | మఱియును. | 903 |
| క. |
భావంబు గలఁగ ‘నాహా!, దైవకృతం బెవ్వరికిని దప్పింపఁగ రా దే విధినైనను నని శో, కావిలమతిఁ బలుకుచున్న న త్తఱి వాఁడున్. |
904 |
| వ. | తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతకవసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి ‘పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీనితలఁ ద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావం గల శక్తి గల దేనిం గావు’ మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలం బూని జళిపించుచు న మ్మాయావసుదేవునిశిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తియై చరియించు సౌభకవిమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వునిమాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు న మ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. | 905 |
| క. |
మును లపుడు గొంద ఱచటికిఁ, జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం గనుఁగొని సమధికభక్తిన్, వినయంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్. |
906 |
| సీ. |
కమలాక్ష! సర్వలోకములందు సర్వమానవులు సంసారనానావిధైక దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేర నేరక వికలత్వమునఁ బొందువేళ నిన్నుఁ దలఁచి దుఃఖంబులఁ దరియింతు రట్టి సద్గుణ నిధివై దేవకోటికెల్లఁ బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది పరమయోగీశ్వరప్రకరగూఢ |
|
| తే. |
పరచిదానందదివ్యరూపమున వెలుఁగు, దనఘ! నీ వేడ? నీచజన్మాత్మజనిత ఘనభయస్నేహమోహశోకంబు లేడ?, ననుచు సంస్తుతి సేసి వా రరిగి రంత. |
907 |
| చ. |
హరి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ వరు వధియింపఁ గోరి బహువారిదనిర్గతభూరివృష్టి వి స్ఫురణ ననూనతీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర చ్చఱ రిపుమౌళిరత్నమును జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్. |
908 |
| మ. |
వితతక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో ద్ధతశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్ దట్టంబుగాఁ బర్వ ను గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా యత భూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమువ్ సౌభమున్. |
909 |
| వ. | అట్లు కృష్ణుం డమ్మయనిర్మితమాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబుభంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యును బొలివోవని బీరంబున వసుధాతలంబునకు డిగ్గి యాగ్రహంబున. | 910 |
| క. |
కరమునఁ బవినిభ మగు భీ, కరగద ధరియించి కదియఁగాఁ జనుదేరన్ మురహరుఁ డుద్ధతి సాల్వుని, కరము గదాయుక్తముగను ఖండించె నృపా! |
911 |
| క. |
అంతం బోవక కినుక న, నంతుఁడు విలయార్కమండలాయతరుచి దు ర్దాంతంబగు చక్రంబు ని, తాంతంబుగఁ బూన్చి సాల్వధరణిపు మీఁదన్. |
912 |
| క. |
గురుశక్తి వైచి వెస భా, సురకుండలమకుటరత్నశోభితమగు త చ్ఛిరము వడిఁ ద్రుంచె నింద్రుఁడు, వరకులిశముచేత వృత్రు వధియించుక్రియన్. |
913 |