పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట
వ. అని గోవిందునిం బొగడి యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్త్వవిజ్ఞానులైన ధరణీసురులను ఋత్విజులంగా వరియించి. 765
సీ. సాత్యవతేయ కశ్యప భరద్వాజోపహూతి విశ్వామిత్ర వీతిహోత్ర
మైత్రేయ పైల సుమంతు మధుచ్ఛంద గౌతమ సుమతి భార్గవ వసిష్ఠ
వాసుదేవాకృతవ్రణ కణ్వ జైమిని ధౌమ్య పరాశరాథర్వ కవషు
లసిత వైశంపాయ నాసురి భార్గవ క్రతు వీరసేన గర్గ త్రికవ్య
 
ఆ. ముఖ్యులైన పరమమునులను గృపుని గాం, గేయ కుంభ జాంబికేయ విదుర
కురుకుమార బంధుకులవృద్ధధారుణీ, సుర నరేంద్ర వైశ్యశూద్రవరుల.
766
క. రప్పింప వారు హర్షము, లుప్పతిలఁగ నేఁగుదెంచి యుచితక్రియలం
దప్పక కనుఁగొనుచుండఁగ, నప్పుడు విధ్యుక్తనియతులై భూమిసురుల్‌.
767
ఆ. కడఁగి సవనభూమిఁ గనకలాంగలముల, నర్థి దున్ని పాండవాగ్రజునకు
నచట దీక్షచేసి యంచితస్వర్ణ మ, యోపకరణముల నలోపముగను,
768
వ. ఇట్లు నియమంబున సముచితక్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు. 769
క. సకలావనీశు లిచ్చిన, యకలంక సువర్ణరత్న హయధనవస్త్ర
ప్రకరంబులు మొదలగు కా, నుక లందుకొనన్‌ సుయోధనుని నియమించెన్‌.
770
సీ. అర్థిజాతము గోరినట్టి వస్తువు లెల్లఁ దగఁ బంచి యిడఁగ రాధాతనూజు
సరసాన్నపానాదిసకలపదార్థముల్‌ పాకముల్‌ సేయింపఁ బవనతనయుఁ
బంకజోదరు నొద్దఁ బాయక పరిచర్య దవిలి కావింప వాసవతనూజు
సవననిమిత్తంబు సంచితద్రవ్యంబు పెంపుతో వేగఁ దెప్పింప నకులు
 
తే. దేవగురువృద్ధధాత్రీసురావళులను, నరసి పూజింప సహదేవు నఖిలజనులఁ
బొలుచు మృష్టాన్నతతులఁ దృప్తులను జేయ, ద్రౌపదిని నియమించెను ధర్మసుతుఁడు.
771
వ. అ య్యవసరంబున. 772
చ. హరి శిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్య కే
శ్వర శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్య కి
న్నర గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుఁ జూచి య
చ్చెరువడి తొల్లి యెవ్వరును జేయుమఖంబులు నింత యొప్పునే?
773
క. అదిగాక యిందిరావిభు, పదములు సేవించునట్టి భాగ్యము గలుగం
దుదిఁ బడయరాని బహు సం, పద లెవ్వియుఁ గలవె? యనుచుఁ బ్రస్తుతి సేయన్‌.
774
వ. అప్పుడు. 775
చ. అమరసమానులై తనరు యాజకవర్గము లోలి రాజ సూ
య మఖవిధానమంత్రముల నగ్నిముఖంబుగఁ జేసి ధర్మజుం
గ్రమమున వేలిపింపఁ గ్రతురాజసమాప్తి దినంబునన్‌ నృపో
త్తముఁడు గడంగి యాజకసదస్యగురుద్విజకోటిఁ బెంపునన్‌.
776
వ. పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారిభాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి ‘యి మ్మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు’ నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె. 777
ఉ. కాలము దేశమున్‌ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్‌ జగ
జ్జాలము దైవమున్‌ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‌
వేళలు విప్రులున్‌ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‌
లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‌.
778
చ. ఇతఁడె యితండు గన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‌
వితతములై జనించుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‌?
779
ఉ. ఈ పురుషోత్తమున్‌ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి
ద్రూపకు నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్తలోకముల్‌
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‌
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‌?
780
క. అని సహదేవుఁడు పలికిన, విని యచ్చటిజనులు మనుజవిభులు ఋషులున్‌
మునుకొని మనములు మోదము, దనుకఁగ ‘నిది లెస్స’ యనిరి ధర్మజుఁ డంతన్‌.
781
క. మునిజనమానసమధుకర, వనజాతములైన యట్టి వారిజదళ లో
చను పదయుగళప్రక్షా, ళన మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్‌.
782
క. తానును గుంతియు ననుజులు, మానుగ ద్రుపదాత్మజయును మస్తకములఁ బెం
పూనిన నియతి ధరించి మ, హానందము బొంది రతిశయప్రీతిమెయిన్‌.
783
క. చంచత్కాంచనరుచిరో, దంచితవస్త్రముల నూతనార్క ప్రభలన్‌
మించిన రత్నములం బూ, జించెన్‌ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్‌.
784
వ. ఇట్లు పూజించి యానందబాష్పజలబిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతులు సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధతూర్య ఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించిరి; అయ్యవసరంబున. 785
క. దమఘోషసుతుఁడు దద్విభ, వము సూచి సహింప కలుక వట్రిలఁగాఁ బీ
ఠము డిగ్గి నిలిచి నిజ హ, స్తము లెత్తి మనోభయంబు దక్కినవాఁడై.
786
వ. అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె. 787
క. ‘చాలుఁ బురే యహహా! యీ, కాలము గడవంగ దురవగాహం బగు నీ
తేలా తప్పెను నేఁ డీ, బాలకు వచనములచేతఁ బ్రాజ్ఞులబుద్ధుల్‌?
788
వ. ఇట్లు దప్పిన తెఱం గెట్లనినఁ బాత్రాపాత్రవివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధతపోవ్రతనియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజ సేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హం బగునే? యదియునుంగాక. 789
సీ. గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన
మప్పులఁ బొరలెడు నాదిమధ్యావసానంబులం దరయ మానంబు లేదు
బహురూపియై పెక్కుభంగుల వర్తించు వావివర్తనములు వరుసలేవు
పరికింప విగతసంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మానిసయ్యెఁ
 
తే. బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి, వాసి కెక్కదు యాదవవంశమెల్ల
బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు, బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?
790
క. జారుఁడు జన్మావధియును, చోరుఁడు ముప్పోకలాఁడు సుమహితపూజా
చారక్రియలకు నర్హుఁడె, వారక యితఁ డనుచు నశుభవాక్యస్ఫూర్తిన్‌.
791
చ. అని తను దూఱనాడిన మురాంతకుఁ డా శిశుపాలువాక్యముల్‌
విని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవరావ మాత్మఁ గై
కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా
డిన యవినీతిభాషలకు డెందమునం గడు వంత నొందుచున్‌.
792
ఉ. వీనులు మూసికొంచు విన విస్మయ మంచు ‘ముకుంద! మాధవా!
శ్రీనిధి! వీని నేగతికిఁ జేర్చెదొ’ యంచు దురాత్ముఁ దిట్టుచు
న్నా నరనాథులున్‌ మునులు నచ్చట నిల్వక పోవఁ బాండు సం
తానము లప్రమేయబలదర్పమహోద్ధతరోషచిత్తులై.
793
వ. అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధపాణులై యదల్చి నిల్చిన వాఁడును బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ, న మ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; ర య్యవసరంబున. 794
క. మునివరులును జనపతులును, గనుఁగొని వెఱఁ గందఁ జైద్యు గాత్రమునందుం
డనుపమ తేజము వెలువడి, వనజోదరు దేహమందు వడిఁ జొచ్చె నృపా!
795
వ. అనిన మునివరునకు భూవరుం డిట్లనియె. 796
క. ‘కమలాక్షుని నిందించిన, దమఘోషతనూభవుండు దారుణమల కూ
పమునుం బొందక యే క్రియ, సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా!
797
వ. అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. 798
మ. మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్‌ మత్తిల్లి జన్మత్రయా
వధి యే ప్రొద్దుఁ దదీయరూపగుణదివ్యధ్యానపారీణ ధీ
నిధి యౌటన్‌ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూతసర్వాఘుఁడై
విధిరుద్రాదుల కందరాని పదవిన్‌ వే పొందె నుర్వీశ్వరా!
799
వ. అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం బూజించి యవభృథస్నానక్రియాపరితోషంబున. 800
సీ. మురజమృదంగగోముఖశంఖడిండిమపణవాదిరవము లంబరము నిండఁ
గవిసూతమాగధగాయకవందివైతాళికవినుతు లందంద బెరయ
వితతమర్దళవేణువీణారవంబుల గతులకు నర్తకీగతులు సెలఁగఁ
దరళవిచిత్రకధ్వజపతాకాంకితస్యందనగజవాజిచయము లెక్కి
 
తే. సుతసహోదరహితపురోహితజనంబు, గటకకేయూరహారకంకణకిరీట
వస్త్రమాల్యానులేపనవ్రాతములను, విభవ మొప్పారఁ గైసేసి వెడల నంత.
801
వ. మఱియు యదు సృంజయ కాంభోజ కురు కేకయ కోసల భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నంటి నడతేర ఋత్విఙ్నికాయంబును సదస్యులును బ్రహ్మఘోషంబు లొలయ మున్నిడికొని శోభమానానూన ప్రభా భాసమాన సువర్ణమయ మాలికాదివ్య మణిహారంబులు గంఠంబునం దేజరిల్ల నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబు గళత్రసమేతుండై యెక్కి యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనాజనంబులు తమవారలం గూడికొని. 802
సీ. కనకాద్రిసానుసంగతకేకినులభాతిఁ గ్రొమ్ముళ్ళు వీఁపుల గునిపి యాడఁ
దరళతాటంకముక్తాఫలాంశుద్యుతుల్‌ చెక్కుటద్దములతోఁ జెలిమిసేయఁ
బొలసి యదృశ్యమైపోని క్రొమ్మెఱుంగులగతులఁ గటాక్షదీధితులు దనర
మంచుపై నెగయ నుంకించు జక్కవ లనఁ జన్నులు జిలుఁగు కంచెలల నఱుమ
 
తే. మహితకుచభారకంపితమధ్య లగుచు, నర్థి మొలనూళ్ళు మెఱయఁ బయ్యదలు జారఁ
గరసరోజాతకంకణక్వణనములును, జరణనూపురఘోషముల్‌ సందడింప.
803
వ. మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజలబిందు సందోహకందళిత మందహాసచంద్రికాసుందరవదనారవిందంబుల నిందిందిరరుచిరచికురబృందంబులు చిందఱ వందఱలై సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశృంగసంగతంబులైన సంకుమదమలయజముఖ సురభితోయంబులు సముదాయంబులై తమతోయంబుల వారిపయిం జల్లుచుఁ జెందొవలఁ గెందమ్మి విరుల రచియించిన చిమ్మనగ్రోవులఁ దావులు గల పూఁదేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీఱఁ గ్రేవలనుండి యిమ్ములం గని చిమ్ముచుఁ, మృగమదకుంకుమపంకంబునుం గొంకక బింకముల జంకెన లొలయం బంకజసన్నిభంబులగు మొగంబుల నేమఱించి చరుముచు నుల్లంబులు పల్లవింపఁ బెల్లడరి యందియలు గల్లుగల్లని మొరయఁ గ్రేళ్లు దాఁటుచుం జారు చంద్రికాసారఘనసారధూళి మిళితరజనీపరాగంబు రాగంబు రంజిల్లం గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుఁ జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు కుచంబుల కెత్తు వత్తు మని బిత్తరించుపువ్వు గుత్తులం దత్తఱంబున వ్రేయుచుఁ బరిహసించుచు నన్యోన్యకర కిసలయకనకకరండభరితంబగు పన్నీటం జెంగావిజిలుఁగుఁ బుట్టంబులు దట్టంబుగాఁ దోఁగి మర్మంబులు బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమకనుఱెప్ప లడ్డంబు సేయుచుఁ బురుషులుం దాము నారామ లభిరామలీలారసోక్తు లెనయ నంతరంగంబుల సంతసంబునం బంతంబు లిచ్చుచు వసంతంబు లాడిరి. అవ్వేళ నతులవిమానారూఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకశిబిక లెక్కి, నిజచేటికాజనంబులు సేవింపఁ జనుదెంచు భూకాంతకాంతాజనంబులుం దమ సరసంబులకు నర్హంబులైన ధరణీపాలవధూలలామంబు లాదరించు చెలులపైఁ దమ సఖీజనంబులం బురికొల్పి చల్లించుచు భావగర్భితంబు లగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమలలీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం జని; రవ్విధంబున నిజసామ్రాజ్యవిభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున. 804
క. అనిమిషదుందుభి ఘన ని, స్వనములు వీతెంచెఁ బుష్పవర్షము గురిసెన్‌
మునిదేవపితృమహీసుర, వినుతుల రవ మెసఁగె నపుడు విమలచరిత్రా!
805
క. నరు లెట్టి పాపులైనను, గర మర్థిని నెద్ది సేసి గతకల్మషులై
చరియింతు రట్టి యవభృథ, మరుదుగఁ గావించి రెలమి నఖిలజనంబుల్‌.
806
ఆ. అంత ధర్మతనయుఁ డభినవమృదుల దు, కూల సురభికుసుమమాలికాను
లేపనములు రత్నదీపితభూషణా, వళులు దాల్చి వైభవమున నొప్పె.
807
వ. అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి, 808
ఉ. పాండుతనూభవాగ్రజుఁడు పాండుయశోనిధి భాసమాన మా
ర్తాండనిభుండు యాజకసదస్యమహీసురమిత్రబంధు రా
ణ్మండలిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చె నొం
డొండ దుకూలరత్నకనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌.
809
వ. అట్లు నారాయణపరాయణులై దేవసమానప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయ భూషణమాల్యానులేపనంబులు ధరించి పరమానందభరితాత్ములై యొప్పియుండి; రంత. 810
చ. సునిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ వచ్చిన యట్టి దేవతా
ముని ధరణీసుర ప్రకరభూవరవిడ్జనశూద్రకోటి య
జ్జనవరచంద్రుచే నుచితసత్కృతులం బరితోషచిత్తులై
వినయముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుఁ బెక్కుభంగులన్‌.
811
చ. హరిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండు భూ
వరసుతరాజసూయమఖవైభవమున్‌ నుతియించుచున్‌ సమా
దరమున నాత్మభూముల కుదారత నేఁగిరి ధర్మసూనుఁడున్‌
సరసిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్‌.
812
వ. ఇట్లు పాండవాగ్రజు ప్రార్థనం గైకొని దామోదరుండు సమస్తయాదవులను గుశస్థలికిఁ బోవం బనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁ దన్నగరంబునఁ బ్రమోదంబున నుండెనని చెప్పి మఱియు నిట్లనియె. 813
చ. ‘జనవర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా
బ్ధిని సరసీరుహాక్షుఁడను తెప్పకతంబున దాఁటి భూరి శో
భనయుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె న
వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్‌?
814
వ. అట్టియెడ. 815
ఆ. రాజసూయమఖవరప్రభావమునకు, నఖిలజనులు మోదమంది రపుడు
కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో, ధనుఁ డొకండు దక్క ధరణినాథ!’
816
వ. అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 817
ఆ. ‘అఖిలజనుల కెల్ల నానందజనకమై, యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
గర మసహ్యమైనకారణ మెయ్యది, యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత!’
818
చ. అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ గురురాజు పాండు నం
దనులదెస న్ననేకదురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై
నను నొకనాఁడు పంకరుహనాభదయాపరిలబ్ధభూరి శో
భన జితదేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై.
819
చ. వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తుల మిన్ను ముట్టఁ బెం
పలరిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
జ్జ్వలమణి భూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
త్కలిక భజించుచున్‌ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్‌.
820
వ. ఉండం గనుంగొని యదియునుంగాక యొక్కనాఁడు లలితాష్టమీశశాంకబింబంబుల విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటల ఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామరుచి స్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసితదంతమరీచికానిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచిజాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వం బొలుచు కపోలపాలికలును, విలసితగ్రైవేయకముక్తాఫలహారనిచయంబుల కిమ్ము చూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొనమీటినం బగులు ననం బొగడం దగి మొగంబులకుం బుటంబు లెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగ లేక తూఁగాడుచుం గరతల పరిమేయంబు లగు మధ్యభాగంబులును, ఘనజఘనమండలావతీర్ణ కాంచనకాంచీకలాపకింకిణీకలకలనినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలితహల్లకపల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలు గొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయకంకణాంగుళీయకాదివివిధభూషణద్యుతి నిచయంబు లుష్ణమరీచికరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగమదఘనసార హరిచందనాగరుకుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మలవిధంబున గగనమండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగార రసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతల చందంబున, విలసించు మాధవవధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయమహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలం బగు సభాభవనంబునకుం జని. 821
సీ. సుతసహోదరపురోహితబాంధవామాత్యపరిచారభటకోటి బలసి కొలువఁ
గలితమాగధమంజుగానంబుఁ బాఠకపఠనరవంబును బ్రమద మొసఁగఁ
గంకణఝణఝణత్కారంబు శోభిల్ల సరసిజాననలు చామరము లిడఁగ
మయవినిర్మితసభామధ్యంబునను భాసమానసింహాసనాసీనుఁ డగుచు
 
తే. నమరగణములు గొలువఁ బెంపారు ననిమి, షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
వరుసఁ గొలువున్న య త్తఱి దురభిమాని, క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.
822
ఉ. కాంచనరత్నభూషణనికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందు వాయ వా
రించి సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్‌ భజింప నే
తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్‌.
823
వ. అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబునందు. 824
క. సలిలములు లేనిఠావున, వలువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం
బులు గల చోటను జేలం, బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్‌.
825
క. ఆ విధ మంతయుఁ గనుఁగొని, పావని నవ్వుటయు నచటి పార్థివులును గాం
తావలియును యమతనయుఁడు, వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్‌.
826
వ. దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనత వదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబున కరిగె; నయ్యవసరంబున ధీవిశాలురైన సభాసదులగు నచ్చటిజనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్న నై యుండె; న ప్పుండరీకాక్షుండు భూభారనివారకారణుం డగుటం జేసి దుర్యోధను నపహాసంబునకుం గా దనం డయ్యె; నంత. 827
క. హరి ధర్మసుతుని వీడ్కొని, తరుణీహితబంధుజనకదంబము గొలువం
బరితోషమునఁ గుశస్థల, పురమునకుం జనియె మోదమున నరనాథా!
828
చ. జనవరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
దన మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
తనయుచరిత్రభాసురకథాపఠనాత్ములు గాంతు రిష్ట శో
భన బహుపుత్త్రకీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్‌.
829
క. అని శుకయోగీంద్రుం డ, మ్మనుజేంద్రునిఁ జూచి పలికె మఱియును శ్రీకృ
ష్ణుని యద్భుతకర్మంబులు, వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా!
830
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )