| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
అనిలజుని దేవపతినం, దనుఁడును బద్మాక్షుఁడును నుదారత నాలిం గనములు సేసి పరాక్రమ, మున కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్. |
743 |
| క. |
వనజాక్షుఁ డంత గరుణా, వననిధియును భక్తలోకవత్సలుఁడును గా వున మాగధసుతు సహదే, వునిఁ బట్టము గట్టెఁ దన్నవోన్నతపదవిన్. |
744 |
| క. |
మగధాధినాథునకు ము, న్నగపడి చెఱసాలలను మహాదుఃఖములన్ నొగులుచుఁ దన పాదాంబుజ, యుగళము చింతించుచున్న యుర్వీశ్వరులన్. |
745 |
| వ. | అ య్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన వారలు పెద్దకాలంబు కారాగృహంబులం బెక్కుబాధలంబడి కృశీభూతశరీరు లగుటం జేసి రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి కేశపాశంబులు మాసి జటాబంధంబులైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి యప్పుడు. | 746 |
| సీ. |
నవపద్మలోచను భవబంధమోచను భరితశుభాకారు దురితదూరుఁ గంగణకేయూరుఁ గాంచనమంజీరు వివిధశోభితభూషు విగతదోషుఁ బన్నగాంతకవాహు భక్తమహోత్సాహు నతచంద్రజూటు నున్నతకిరీటు హరినీలనిభకాయు వరపీతకౌశేయుఁ గటిసూత్రధారు జగద్విహారు |
|
| తే. |
హారవనమాలికామహితోరువక్షు, శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు లలిత శ్రీవత్సశోభితలక్షణాంగు, సుభగచారిత్రు దేవకీసుతునిఁ గాంచి. |
747 |
| చ. |
భరితముదాత్ములై విగతబంధనులై నిజమస్తముల్ మురా సురరిపుపాదపద్మములు సోఁకఁగ జాఁగిలి మ్రొక్కి నమ్రులై కరములు మోడ్చి యో పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం హరణవివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా! |
748 |
| ఆ. |
వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద, దాసదుఃఖనాశ! వాసుదేవ! యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు, మిందిరేశ! నీకు వందనములు |
749 |
| ఉ. |
ధీరవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతో దారనిబంధనోగ్రపరితాపము నీ కరుణావలోకనా సారముచేత నార్చితివి; సజ్జనరక్షయు దుష్టశిక్షయు న్నారయ నీకుఁగార్యములు యాదవవంశ పయోధిచంద్రమా! |
750 |
| సీ. |
అవధరింపుము మాగధాధీశ్వరుఁడు మాకు బరమబంధుఁడు గాని పగయ కాఁడు ప్రకటితరాజ్యవైభవమదాంధీభూతచేతస్కులము మమ్ముఁ జెప్ప నేల? కమనీయజలతరంగములకైవడిదీపశిఖవోలెఁ జూడ నస్థిరములైన గురుసంపదలు నమ్మి పరసాధనక్రియాగమ మేది తద్బాధకంబు లగుచుఁ |
|
| తే. |
బరఁగ నన్యోన్య వైరానుబంధములను, బ్రజలఁ గారించుచును దుష్టభావచిత్తు లగుచు నాసన్నమృత్యుభయంబు దక్కి, మత్తులై తిరుగుదురు దుర్మనుజు లంత. |
751 |
| చ. |
కడపటిచేఁత నైహికసుఖంబులుఁ గోల్పడి రిత్త కోర్కి వెం బడిఁబడి యెండమావులఁ బిపాసువులై సలిలాశ డాయుచుం జెడు మనుజుల్ భవాబ్ధిదరిఁ జేరఁగలేక నశింతు; రట్టి యా యిడుమలఁ బొందఁ జాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా! |
752 |
| ఉ. |
వేదవధూశిరోమహితవీథులఁ జాల నలంకరించు మీ పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁ బల్కు దా మోదర! భక్తదుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! |
753 |
| క. |
అని తను శరణము వేఁడిన, జననాథులవలను సూచి సదమలభక్తా వన చరితుఁడు పంకజ లో, చనుఁ డిట్లను వారితోడ సదయామతియై. |
754 |
| చ. |
‘జనపతులార! మీ పలుకు సత్యము; రాజ్యమదాంధచిత్తులై ఘనముగ విప్రులం బ్రజలఁ గాఱియఁబెట్టుటఁజేసి కాదె వే న నహుషరావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా లనమునఁ గాక నిల్చునె? కులంబు బలంబుఁ జిరాయురున్నతుల్. |
755 |
| వ. | అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాఁ దెలిసి. | 756 |
| ఉ. |
మీరలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక భూజనాళిఁ బెం పారుచు సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు భూరియజ్ఞముల్ గౌరవవృత్తి మత్పరముగా నొనరింపుచు మామకాంఘ్రి పం కేరుహముల్ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్. |
757 |
| వ. | అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్యప్రాప్తు లయ్యెదరు; మదీయపాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగునని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి వివిధమణిభూషణ మృదులాంబరమాల్యానులేపనంబు లొసంగి, భోజనతాంబూలాదులం బరితృప్తులం జేసి యున్నత రథాశ్వసామజాధిరూఢులం గావించి నిజరాజ్యంబులకుఁ బూజ్యులం చేసి యనిచిన. | 758 |
| క. |
నరవరు లీ చందంబున, మురసంహరుచేత బంధమోక్షణులై సు స్థిరహర్షంబులతో నిజ, పురములకుం జనిరి శుభవిభూతి తలిర్పన్. |
759 |
| క. |
హరిమంగళగుణకీర్తన, నిరతముఁ గావించుచును వినిర్మలమతులై గురుబంధుపుత్త్రజాయా, పరిజన మలరంగఁ గృష్ణుఁ బద్మదళాక్షున్. |
760 |
| వ. | బహుప్రకారంబులం బొగడుచుఁ దమ తమ దేశంబులకుం జని. | 761 |
| క. |
నళినదళలోచనుఁడు దముఁ, దెలిపిన సద్ధర్మపద్ధతినిఁ దగవరులై యిలఁ బరిపాలించుచు సుఖ, ముల నుండిరి మహితనిజవిభుత్వము లలరన్. |
762 |
| వ. | ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, వాయునందనవాసవనందనులుం దానును జరాసంధతనయుండగు సహదేవుండు సేయు వివిధంబులగు పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థ పురంబునకుం జనుదెంచి, తద్ద్వారప్రదేశంబున విజయశంఖంబులు పూరించినఁ బ్రతిపక్షభయదంబును, బాంధవప్రమోదంబును నగు న మ్మహాఘోషంబు విని, పౌరజనంబులు జరాతనయుమరణంబు నిశ్చయించి సంతసిల్లిరి. వారిజాక్షుండును భీమసేన పార్థులతోఁ బురంబు ప్రవేశించి ధర్మనందనునకు వందనం బాచరించి, తమ పోయిన తెఱంగును, నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును సవిస్తరంబుగా నెఱింగించిన నతండు విస్మయవికచలోచనంబుల నానందబాష్పంబులు గురియ, న మ్మాధవుమాహాత్మ్యంబునకుఁ దమయందలి భక్తిస్నేహదయాదిగుణంబులకుం బరితోషంబు నొందుచుఁ గృష్ణునిం జూచి యిట్లనియె. | 763 |
| సీ. |
‘కమలాక్ష! సర్వలోకములకు గురుఁడవై తేజరిల్లెడు భవదీయమూర్తి యంశాంశసంభవు లగు లోకపాలురు నీ యాజ్ఞఁ దల మోచి నిఖిలభువన పరిపాలనిపుణులై భాసిల్లుచున్న వా రట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు టరయ నీమాయ గాకది నిక్కమే? యేక మై యద్వితీయమై యవ్యయంబు |
|
| తే. |
నైన నీ తేజమున కొక హాని గలదె?, చిన్మయాకార! నీ పాదసేవకులకు నాత్మపరభేదబుద్ధి యెందైనఁ గలదె? పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! |
764 |