| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు మృగపతిద్వితయంబు వృషభయుగము పావకద్వయము దంతావళయుగళంబు దలపడు వీఁక నుద్దండలీలఁ గదిసి యన్యోన్య భీకరగదాహతుల నుగ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమణములను సింహచంక్రమణములను |
|
| తే. |
గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి, కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర, ఘనగదాఘట్టనధ్వని గగన మగల. |
733 |
| వ. | పోరునంత. | 734 |
| మ. |
గద సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం జద లల్లాడఁగఁ బాదఘట్టనములన్ సర్వంసహాభాగముం గదలన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁదట్టుచున్. |
735 |
| చ. |
మడవక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్ విడివడులీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్ నడితల లూరుజానుజఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ బిడుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్. |
736 |
| లయవిభాతి. |
బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ బెనుపిడుగు లవనిం దొరఁగ నుడుగణము రాలన్ మిడుఁగుఱులు పోరి చెదలడర హరిదంతములు వడఁక జడధుల్ గలఁగ బుడమి చలియింపన్ వెడచఱువ మొత్తియును దడఁబడఁగ నత్తియును నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్ వడవడ వడంకుచును సుడివడక డాసి చల ముడుగ కపు డొండొరుల వడి చెడక పోరన్. |
737 |
| వ. | ఇ వ్విధంబునం బోరుచుండ నొండొరుల గదాదండంబులు దుమురులైనన్ బెండు వడక సమద దిగ్వేదండశుండాదండమండితప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గఱి. | 738 |
| లయగ్రాహి. |
కాల వెస డాచియును గీ లెడలఁ ద్రోచియును దాలుములు దూలఁ బెడకేల వడి వ్రేయన్ ఫాలములు గక్షములుఁ దాలువులు వక్షములు వ్రీలు నెముకల్ మెదడు నేలఁ దుమురై వే రాల విపులక్షతవిలోలమగు నెత్తురులు జాలుగొని యోలిఁ బెనుఁగాలువలుగం బే తాలమదభూతములు ఖేలనలఁ జేతులను దాళములు తట్టుచు సలీలగతి నాడన్. |
739 |
| ఉ. |
ప్రక్కలుఁ జెక్కులున్ మెడలుఁ బాణితలంబులచేఁ బగుల్చుచున్ ముక్కులు నక్కులుం జెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్ డొక్కలుఁ బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్ నెఱుల్ దక్కక స్రుక్క కొండొరులఁ దార్కొని పేర్కొని పోరి రుగ్రతన్. |
740 |
| ఉ. |
హుమ్మని మ్రోఁగుచుం బెలుచ హుంకృతు లిచ్చుచుఁ బాసి డాసి కో కొమ్మనుచు న్నొడ ళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం గ్రుమ్ముచు ముష్టిఘట్టనల స్రుక్కుచు నూర్పులు సందండింపఁగా సొమ్మలు వోవుచుం దెలియుచున్ మదిఁ జేవయుఁ లావుఁ జూపుచున్. |
741 |
| వ. | ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతరముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబుల తోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁగొండలచందంబునను జూపట్టి పోరుచుండఁ గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగు నట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్కశాఖాగ్రంబు రెండుగాఁ జీల్చివైచి వాని నట్ల చీరి చంపుమని సంజ్ఞగాఁ జూపిచెప్పిన నతండు నాకీలు దెలిసి యవక్రపరాక్రముండై మాగధుఁ బడఁద్రోచి వానిపదంబు పదంబునం ద్రొక్కి బాహుయుగళంబున రెండవపదంబుఁ గదలకుండం బట్టి మస్తకపర్యంతంబుఁ బెళ బెళమని చప్పు ళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరుచందంబునఁ బాద జాను జంఘోరుకటి మధ్యోదరాంస కర్ణనయనంబులు వేఱువేఱుభాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసి రంత. | 742 |