| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| తే. |
తవిలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ, బిలుకుమార్పింప వచ్చును భీముచేత! ననిన ధర్మజుఁ ‘డదిలెస్స’ యనిన విప్ర, వేషములు దాల్చి యరిగిరి విశదయశులు. |
717 |
| వ. | ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణవేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు నతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠచిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి. | 718 |
| క. |
‘ధరణీశ! యతిథిపూజా, పరుఁడవు నీ వనుచు దిశలఁ బలుకఁగ విని మే మరుదెంచితిమి మదీప్సిత, మఱసేయక యిమ్ము సువ్రతాచారనిధీ! |
719 |
| క. |
అతిథిజనంబుల భక్తిన్, సతతముఁ బూజించి యుచితసత్కారము లు న్నతి నడపు సజ్జనులు శా, శ్వతకీర్తులు ధరణిఁ బడయఁ జాలుదు రనఘా! |
720 |
| క. |
పరికింపఁగ దేహం బ, స్థిర మని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి స్ఫురణం బ్రస్తుతి కెక్కని, పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా! |
721 |
| క. |
ధారుణిలోన వదాన్యుల, కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే కోరినఁ దన మేయెముకలు, ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే? |
722 |
| క. |
అడిగిన వృథసేయక తన, యొడ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే ర్పడ నిచ్చి కీర్తిఁ గనె నని, పుడమిన్ మును వినమె యల కపోతము ననఘా! |
723 |
| క. |
ఆ యింద్రాగ్నులు శ్యేనక, వాయస రూపములఁ దన్ను వలఁతిగ వేఁడన్ ధీయుతుఁడై మును శిబి తన, కాయము గోసిచ్చె నన జగంబుల వినమే! |
724 |
| ఆ. |
ధీరమతులు రంతిదేవహరిశ్చంద్ర, బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు, సన్న నైన నేఁడు నున్నవారు. |
725 |
| వ. | అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీరభాషణంబులును, గుణకిణాంకం బులును మహాప్రభావంబులును జూచి తన మనంబున ‘వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు; ర, ని తలంచి ‘యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబు లేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుం డయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స’ యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. | 726 |
| క. |
భూరిగుణులార! మీ మది, కోరిక యెఱిఁగింపుఁ డేమి కోరిన నైనన్ ధీరత నొసఁగుటయే కా, దారయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్. |
727 |
| ఉ. |
నావుడుఁ గృష్ణుఁ డమ్మగధనాథున కిట్లను భూవరేణ్య! నీ భావము సూనృతవ్రతశుభస్థితిఁ జెందు టెఱుంగవచ్చె మా కీవలె నాజిభిక్ష యితఁ డింద్ర తనూభవుఁ డే నుపేంద్రుఁడం బావని యీతఁ డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్ |
728 |
| చ. |
అన విని వాఁడు నవ్వి యహహా! విన వింతలు పుట్టె మున్ను న న్ననిమొన నోర్వఁ జాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం చన మధురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే? వనరుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే? |
729 |
| క. |
ఇన్నేల సెప్ప? మాయలఁ, బన్నినఁ బో విడువ గోపబాలక! బల సం పన్నుని మాగధభూవరు, న న్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్? |
730 |
| ఉ. |
కాన రణోర్వి న న్నెదురఁ గష్టము గాన తలంగు; గోత్ర భి త్సూనుఁడు భూరిబాహుబలదుర్దముఁ డయ్యును బిన్న; యీ మరు త్సూనుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ; వీని నెదుర్తు నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై. |
731 |
| క. |
కరువలిసుతునకు నొక భీ, కరగద నిప్పించి యొక్కగదఁ దనకేలన్ ధరియించి నలువురును గ్ర, చ్చఱఁ బురివెలి కేగి యచట సమతలభూమిన్. |
732 |