పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకుఁబంపుట
సీ. ధరణీశ! యొకనాఁడు ధర్మతనూజుండు ప్రవిమలనిజసభాభవనమందు
హితులు మంత్రులు పురోహితులును సుతులును మిత్రులు బంధువుల్‌ క్షత్రవరులుఁ
బరిచారకులు సూత పాఠక కవి బుధవరులును మునులును వరుసఁ గొలువఁ
జిరలీల నవరత్నసింహాసస్థుఁడై గొలువుండి వినతుఁడై నలిననాభు
 
తే. భువనరక్షణదక్షు నద్భుతచరిత్రు, యదుకులేశ్వరు మురదైత్యమదవిభేది
నాప్తు నయవేదిఁ జతురుపాయప్రవీణుఁ, జూచి, యిట్లని పలికె నస్తోకచరిత!
697
తే. అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబు, నెమ్మిఁ గావించువేడుక నెమ్మనమున
నెనయుచున్నది యది నిర్వహింప నీవ, కాక నా కాత్మబంధువుల్‌ గలరె యొరులు?
698
ఉ. ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తినిష్ఠులై
యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై
యవ్విమలాత్ము లందుదు రుదంచితశోభననిత్యసౌఖ్యముల్‌
నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే?
699
వ. అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె 700
చ. నయగుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీ క్రతు
క్రియ మునిదేవతాపితృసుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ
క్షయమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్‌
జయము నొసంగు దీనిఁ గురుసత్తమ! వేగ యుపక్రమింపవే!
701
క. మనుచరిత! నీ సహోదరు, లనుపమదివ్యాస్త్రవేదు లాహవభూమిం
జెనకిన వైరినృపాలురఁ, దునుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమభంగిన్‌.
702
క. గెలువుము విమతనృపాలుర, వెలయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్‌
నిలుపుము నిఖిలధరా మం, డలిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్‌.
703
క. నీ పంచుకార్య మొరులం, జూపక యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం
జూపఁగ వచ్చునె! సకల ధ, రాపతులకు నీకుఁ జేయరానిది గలదే!.
704
వ. కావున. 705
క. విమలమతి నిట్టి మఖ రా, జమునకుఁదెప్పింపవలయు సంభారంబుల్‌
సమకూర్పుము; నీ యనుజుల, సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్‌.
706
క. అను మాటలు విని కుంతీ, తనయుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్‌
వినుతించి శౌర్యకలితుల, యనుజుల దెసఁ జూచి పలికె హర్షముతోడన్‌.
707
క. సృంజయభూపాలకులును, గుంజరరథవాజిసుభటకోటులు నినుఁ గొ
ల్వం జను మని సహదేవుని, నంజక పొ మ్మనియె దక్షిణాశ జయింపన్‌.
708
క. ప్రకటచతుర్విధసేనా, ప్రకరంబులు గొలువఁ బంచెఁ బడమటిదిశకున్‌
నకులున్‌ విదళితరిపుభూ, పకులున్‌ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా!
709
క. దుర్జనభంజను శౌర్యో, పార్జితవిజయప్రకాండు నాహవనిపుణు
న్నర్జునమహితయశోనిధి, నర్జును నుత్తరపుదిశకు ననిచె నరేంద్రా!
710
ఆ. మహితశౌర్యనిధులు మత్స్యకేకయ మద్ర, భూతలేంద్రబలసమేతముగను
దర్పమొప్పఁ బంచెఁ దూర్పుదిక్కునకు ను, ద్దామనిహతవైరిధాము భీము.
711
చ. పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమవిక్రమంబుల
న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌
కనకవినూత్నరత్నతురగప్రముఖాఖిలవస్తుజాతముల్‌
గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్తచిత్తులై.,
712
చ. తమతమ పోయి వచ్చినవిధంబుల భూపతులన్‌ జయించుటల్‌
క్రమముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం
చమరవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్‌
యమసుతుఁ డూరకుండె వికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్‌.
713
తే. ధర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ, బలికె మాగధుఁ బోరఁ జంపఁగ నుపాయ
మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు, నాకుఁ జెప్పినచందంబు నయచరిత్ర!
714
చ. విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్‌
వినయముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁ గా
వున విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం
జని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్‌.
715
వ. అట్టియెడ. 716
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )