పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొనిపోవుట
క. హరిరాక యెఱిఁగి ధర్మజు, డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజనసచివపురోహిత, పరిచారకకరిరథాశ్వభటయుతుఁ డగుచున్‌.
685
క. చిందములు మొరయ గాయక, బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్‌
డెందము దగులఁగఁ బరమా, నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్‌.
686
వ. ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబు చేసి, రోమాంచకంచుకితశరీరుండై యానందబాష్పధారాసిక్త కపోలుండై నిర్భరానందకందళితహృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందనవాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుండు విప్రవృద్ధజనంబులకు నమస్కారంబు చేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుండై కేకయసృంజయాదిభూవిభుల మన్నించి సూతమాగధాదుల కనేకపదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధమణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టి యెడ. 687
సీ. కొఱనెలపైఁ దోచు నిరులునాఁ జెలువొంది నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ
హాటకమణిమయతాటంకరోచులు గండభాగంబుల గంతు లిడఁగ
స్ఫురితవిద్రుమనిభాధరబింబరుచితోడ దరహాసచంద్రిక సరసమాడ
నొండొంటితో రాయు నుత్తంగకుచకుంభములు మొగంబులకును బుటము లెగయ
 
తే. బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ, రవళిమెట్టెలు మణినూపురములు మొరయఁ
బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ, బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ.
688
వ. ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురుపతి సుతబంధుజనంబులు వారింప నతిక్రమించి సమున్నతభర్మహర్మ్యశిఖరాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 689
సీ. విశ్వగర్భుండునా వెలయు వే ల్పిల యశోదానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె;
బ్రహ్మాదిసురలకు భావింపఁగా రాని బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె;
వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె;
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్తసులభుండు నవనీతచోరుఁ డయ్యె
 
తే. నెనయఁ గమలాసతికిఁ జిత్తమీని వేల్పు, గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ
జేసె నని కామినులు సౌధశిఖరములను, గూడి తమలోన ముచ్చటలాడి రధిప!
690
వ. మఱియును. 691
సీ. గోపాలబాలురఁ గూడి యాడెడివాఁడు వ్రేపల్లెలోపల నేపు రేఁగి,
చల్ల లమ్మగఁ బోవుసతులకొంగులు పట్టి మెఱుఁగుఁజెక్కిళ్ళను మీటి మీటి,
కలికియై ముద్దాడిఁ గౌఁగిటఁ జేర్చిన పూఁబోఁడికుచములు పుణికి పుణికి
పాయనియనురక్తి డాయఁ జీరిన యింతి యధరసుధారసం బాని యాని
 
తే. యురుసమాధిపరాష్టాంగయోగయుక్తు, లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి
వల్లవీజనవనకల్పవల్లి యయ్యె, ననుచుఁ బొగడిరి కృష్ణు న య్యబ్జముఖులు.
692
మ. అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య
వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావంబందుఁ గీలించి సం
జనితానందరసాబ్ధిమగ్న లగుచున్‌ సంప్రీతిఁ దద్భవ్య కీ
ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌.
693
వ. తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామరధరావరవణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి. పుణ్యాంగనాజనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందుభామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షతకుసుమతాంబూలంబు లిడి లలితదుకూలమణిభూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమల నయనుని వధూజనుల ననుగత బంధుమిత్రపుత్త్రసచివపురోహితపరిచారకసముదయంబుల నుచితంబులగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబులగు వివిధోపచారంబులు గావించుచుండె. 694
క. హరియు యుధిష్ఠిరుసముచిత, పరిచర్యల కాత్మ నలరి పార్థుఁడు దానున్‌
సరసవిహారక్రియలను, సురుచిరగతిఁ గొన్నినెలలు సుఖ ముండె నృపా!
695
వ. అంత 696
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )