| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
‘ఉద్ధవ! మహితవివేక స, మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్ వృద్ధవరానుమతంబుగ, బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా! |
666 |
| తే. |
అనఘచారిత్ర ! నీవు మా యక్షియుగము, వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు, ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత!’ |
667 |
| వ. | అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండపోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తమునిభాషణంబులకు మనంబున సంతసిల్లి, యతనిపాదంబులు దన మనంబున నిడికొని, ‘వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయభక్తుండైన యుధిష్ఠిరుయాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుం గాక నిఖిలదిగ్విజయమూలంబగు రాజసూయకృత్యంబునందు జరాసంధమర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహవిముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీబలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థులుగా; రట్లగుట నతండు భూసురులేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గపటవిప్రవేషంబునం జని యాజరాసంధుని నాహవభిక్ష వేఁడి, భవత్సన్నిధానంబున న ప్పవమానతనయుం డతని వధియించు నట్టి కార్యంబు సేఁత బహుళార్థసాధనం బగు’ నని పలికిన నారదుండును యాదవజనంబులును సభ్యులునుం బొగడి; రంత. | 668 |
| సీ. |
తరలవిచిత్రకస్థగితప్రభావలిఁ దనరారు గరుడకేతనము వెలుఁగఁ గాంచనచక్రసంఘటితఘంటాఘణ ఘణనినాదముల దిక్కరులు బెదర సలలితమేఘపుష్పకవలాహకశైబ్యసుగ్రీవతురగవిస్ఫురణ దనర బాలసూర్యప్రభాభాసమానద్యుతిదిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ |
|
| తే. |
బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర, నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె శంఖకాహళపటహనిస్సాణడిండి, మాదిరవములు భరితదిగంతములుగ. |
669 |
| క. |
మనుజేశ్వరునకుఁ దాలాం, కునకును గురువృద్ధజనులకును జెప్పి ప్రియం బున ననుపఁ గాంచన స్యం, దనసామజవాజిభటకదంబము గొలువన్. |
670 |
| తే. |
వందిమాగధసూతకైవారరవము, వసుమతీసురకోటిదీవనల మ్రోఁత లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర, సీమలందుండి ముత్యాలసేస లొలుక. |
671 |
| క. |
లీలం జని కృష్ణుఁడు వా, హ్యాలిన్ నవకుసుమఫలభరానతశాఖా లోల ఘనసారసాల ర, సాల వనస్థలములందుఁ జతురత విడిసెన్. |
672 |
| వ. | అట్టి యెడ సరోజనాభుశుద్ధాంతంబున. | 673 |
| సీ. |
వికచమరందనవీనసౌరభలసన్మందారకుసుమదామములు దుఱిమి చారుసుగంధకస్తూరికాఘనసారమిళితచందనపంకమెలమి నలఁది కనకకుండలరణత్కంకణనూపురముద్రికాభూషణంబులు ధరించి యంచితముక్తాఫలాంచలమృదులదివ్యాంబరమ్ములు సెలువారఁగట్టి |
|
| తే. |
యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి, యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి పెంపు దీపింప నుడురాజబింబముఖులు, నవచతుర్విధశృంగార మవధరించి. |
674 |
| తే. |
జలజలోచనుకడకు నుత్కలికతోడఁ, దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర, కలితులై పౌరులను నెడగలుగ జడియ. |
675 |
| క. |
అసమాస్త్రుఁడు పులు గడిగిన, కుసుమాస్త్రములను హసించుకోమలతనువుల్ మిసమిస మెఱవఁగ వేశ్యా, విసరము దాసీజనంబు విభవ మెలర్పన్. |
676 |
| ఆ. |
హరుల వేసడములఁ గరులను నెక్కి తో, నరుగుదేర బహువిధాయుధములు దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు, రాంగనలు సితాంబుజాక్షుకడకు. |
677 |
| వ. | వచ్చి రంత. | 678 |
| క. |
నారదుని, మాధవుఁడు స, త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం భోరుహమునఁ గృష్ణునకును, వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్. |
679 |
| క. |
నరవరుల దూతయును ముర, హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ వరుల కడ కేగి పద్మో, దరువచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్. |
680 |
| వ. | అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయబంధుసుహృజ్జనసమేతుండై కదలి చనునెడ. | 681 |
| చ. |
కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను త్కటపటుచామరధ్వజపతాకకిరీటసితాతపత్త్ర వి స్ఫుటఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్ చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్. |
682 |
| క. |
కరిహరిరథసుభటసము, త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్ సరిదుపవనదుర్గసరో, వరజనపదపురపుళిందవనగోష్ఠములన్. |
683 |
| వ. | ఇట్లు గడచి చనుచు నానర్తకసౌవీరమరుదేశంబులు దాటి ఇందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీ నది దాఁటి మత్స్యవిషయంబులు లోనుగాఁగడచి యింద్రప్రస్థ నగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన. | 684 |