పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
నారదుండు శ్రీకృష్ణునితో ధర్మజు రాజసూయము నెరవేర్పు మని చెప్పుట
సీ. శారదచంద్రికాసారంగరుచితోడ జడముడికెంపు చేఁజఱచి నవ్వ
శరదంబుదావృతసౌదామనీలతాశోభఁ గాంచనకటిసూత్ర మలర
లలితపూర్ణేందుమండలకలంకముగతి మృదుమృగాజినరుచి మించుఁజూపఁ
గల్పశాఖాగ్రసంగతపుష్పగుచ్ఛంబు లీలఁ గేలను నక్షమాల యమర
 
తే. భూరిపుణ్యనదీతోయపూరణమునఁ, దగు కమండలు వొక్క హస్తమునఁ దనర
వెల్ల జన్నిద మఱుత శోభిల్ల వచ్చె, నారదుండు వివేకవిశారదుండు.
655
క. చనుదెంచె నట్లు ముని నిజ, తనుకాంతుల నఖిలదిగ్వితానము వెలుఁగన్‌
వనజాప్తుఁబోలి యయ్యదు, జనములు గృష్ణుండు లేచి సంప్రీతిమెయిన్‌.
656
క. వినయమున మ్రొక్కి కనకా, సనమునఁ గూర్చుండఁబెట్టి సముచితవివిధా
ర్చనములఁ దనిపి మురాంతకుఁ, డనియెన్‌ వినయంబు దోఁప న మ్మునితోడన్‌.
657
తే. ఇప్పు డెందుండి వచ్చితి విందులకును?, నఖిలలోకైకసంచారి వగుటఁజేసి
నీ యెఱుంగని యర్థంబు నిఖిలమందు, నరయ లేదండ్రు; మి మ్మొకఁ డడుగవలయు.
658
తే. పాండునందను లిప్పు డేపగిది నెచట, నున్నవారలొ యెఱిఁగింపు మన్న మౌని
కరసరోజాతములు మోడ్చి కడఁకతోడఁ, బలికెఁ గమలాక్షుఁ జూచి సద్భక్తి మెఱసి.
659
వ. దేవా! విశ్వనిర్మాణకర్తవై, మాయివై, సకలకార్యోత్పాదనాదిశక్తి యుక్తుండవై, పావకుండు దారువులందు నంతర్హితప్రకాశుండై యున్నచందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులఁ బెక్కు మాఱులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుం గాక నీ సంకల్పంబున జగంబుద్భవంబై భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాఁ దెలియ నెవ్వండు సమర్థుం? డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోఁచు నదియును లోకవిచక్షణుండవైన నీదు రూపంబు; మఱియును ముక్తిమార్గంబు నెఱుంగక సంసారపరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపఁజేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తి యను ప్రదీపంబు ప్రజ్వలింపఁజేసి కృపసేయు దట్టి నీకు నమస్కరించెద; నది గావున నీ ప్రపంచంబున నీ యెఱుంగని యర్థంబు గలదె? యని కృష్ణునకు నారదుం డిట్లనియె. 660
సీ. ‘అయినను వినిపింతు నవధరింపుము దేవ! పాండుతనూజుండు పారమేష్ఠ్య
కామానుమోదియై కావింప నున్నాఁడు రాజసూయమహాధ్వరంబు నిష్ఠ
ఠవణింప లోకవిడంబనార్థము గాక, పరికింపఁ దన కాత్మబంధువుఁడవు
భక్తవత్సలుఁడవు పరమపూరుషుఁడవు యజ్ఞరక్షకుఁడవు యజ్ఞభోక్త
 
తే. వగు భగవత్సేవ చాలదే సుగతి వడయ?, నైన నీ మేనబావ ధర్మాత్మజుండు
అతనియజ్ఞంబు రక్షింప నంబుజాక్ష! వలయు విచ్చేయు మచటికి వలను మెఱసి.
661
క. నీ పేరు వినిన నొడివినఁ, బాపంబులు దూలిపోవు పద్మాక్ష; జగ
ద్దీపక! నీ దర్శనమున, నేపారవె భక్తజనుల కిహపరసుఖముల్‌.
662
మ. భవదీయోజ్జ్వలకీర్తిదిగ్వితతులన్‌ భాసిల్లు యుష్మత్పదో
ద్భవనైర్మల్యజలంబు లుత్కలికఁ బాతాళంబునం బాఱు భో
గవతీనామమునం దనర్చి ధరణిం గంగానదీపూరమై
దివి మందాకినియై జగత్త్రయమునం దీపించుఁ గాదే? హరీ!
663
క. ఆ మఖవేళ సమస్త ధ, రామండలిఁ గల్గు మేటిరాజులు మౌని
స్తోమంబును భవదీయ మ, హామహిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్‌.
664
క. కలరని చెప్పిన న మ్ముని, పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం
డెలనవ్వు మొగమునకుఁ జెలు, వొలయఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్‌.
665
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )