| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| చ. |
నరవర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా నరకునిఁ ద్రుంచి వానిభవనంబున నున్న పదాఱువేల సుం దరులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై పరిణయ మయ్యె నా విని శుభస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్. |
598 |
| వ. | ఇట్లు దలంచి కృష్ణపాలితం బయిన ద్వారకానగరంబు డాయం జని ముందట. | 599 |
| సీ. |
శుకశారికాశిఖిపికకూజితప్రసవాంచితోద్యానవనౌఘములను గలహంససారసకైరవకమలకహ్లారశోభితకమలాకరములఁ గలమాదిసస్యసంకులవరేక్షుక్షేత్రభూరిలసన్నదీతీరములను గిరిసానుపతితనిర్ఝరకణసందోహసంతతహేమంతసమయములను |
|
| తే. |
గమలసంభవకాంచనకార రచిత, చిరతరైశ్వర్యనగరలక్ష్మీకరాబ్జ ఘటితనవరత్నమయహేమకటక మనఁగ, సొబగు మీఱిన కోటయుఁ జూచె మౌని. |
600 |
| వ. | మఱియును సముత్తుంగమణిసౌధగవాక్షరంధ్రనిర్గతనీరంధ్రఘనసారచందనాగరుధూపధూమపటల విలోకనసంజనితపయోధరాభిశంకాంగీకృతతాండవకేళీవిలోలపురకామినీజనోపలాలితనీలకంఠ సముదయంబును, జంద్రకాంతమణిస్ఫటికస్తంభసంభృతమరకతపద్మరాగఘటితనవరత్నకాంచన ప్రాసాద శిఖరాగ్రవిన్యస్తబహుసూర్యవిభ్రమకృదంచితశాతకుంభకుంభనిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత వైశ్యాగారవీథీవేదికాకలితంబును, మహితాతపనివారణతరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితా శాంతరిక్షంబును, సరోజనాభపూతనాచేతనాపహారాదినూతన విజయసందేశలిఖితస్వర్ణవర్ణావళీ విభాసిత గోపురమణి విటంకప్రదేశంబును, యాదవేంద్రదర్శనోత్సవాహూయమానసమాగతనానాదేశాధీశ భూరివారణ దానజలప్రభూతపంకనిరసనైకగతాగతజనసమ్మర్ద కరకంకణకషణవికీర్యమాణరజఃపుంజంబును; వినూత్న రత్నమయమంగళరత్నవల్లీవిరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమసలిలసిక్త విపణి మార్గంబును, వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీమృదంగకాహళశంఖతూర్య రవాధరీకృత సాగరఘోషంబునునై, యమరావతీ పురంబునుం బోలె వసుదేవనందననివాసంబై, యనలపుట భేదనంబునుం బోలెఁ గృష్ణమార్గసంచారభూతంబై, సంయమనీనామనగరంబునుంబోలె హరితనూభ వాభిరామంబై, నైరృతి నిలయంబునుంబోలెఁ బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుంబోలె గోత్రరక్షణభువన ప్రశస్తంబై, ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృద్ధంబై, యలకాపురంబునుంబోలె ముకుందవరశంఖ మకరాంకకలితంబై, రజతాచలంబునుంబోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుంబోలె వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, గ్రహమండలంబునుంబోలె గురుబుధ విరాజమిత్రవిరాజితంబయి, సంతతకల్యాణ వేదియుంబోలె వైవాహికోపేతంబయి, బలిదానవకరతలంబునుంబోలె సంతతదానవారి యుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసహస్ర హర్మ్యంబులందు. | 601 |
| సీ. |
పటికంపుఁగంబముల్ పవడంపుఁబట్టెలు మరకతరచితముల్ మదురు లమర వైడూర్యమణిగణవలభులఁ బద్మరాగంబులమొగడలకాంతు లొలయ సజ్ఞాతివజ్రలసజ్జాలరుచులతో భాసిల్లునీలసోపానములును గరుడపచ్చలవిటంకములును ఘనరుచి వెలసిన శశికాంతవేదికలును |
|
| తే. |
వఱలు మౌక్తికఘటితకవాటములును, బ్రవిమలస్వర్ణమయసాలభంజికలును మించు కలరవ మెసఁగఁ గ్రీడించుమిథున, లీల నొప్పు కపోతపాలికలుఁ గలిగి. |
602 |
| తే. |
చేటికానీక పదతులాకోటిమధుర, నినదభరితమై రుచిరమాణిక్య దీప మాలికయుఁ గల్గి చూపట్టఁగ్రాలు నొక్క, జలజలోచన నిజసౌధతలమునందు. |
603 |
| తే. |
కనకకంకణఝణఝణత్కారకలిత, చంద్రబింబాననాహస్తజలజఘటిత చామరోద్ధూతమారుతచలితచికుర, పల్లవునిఁ గృష్ణు వల్లవీపల్లవునిని. |
604 |
| వ. | మఱియు హాటకనిష్కంబు లఱ్ఱులందు వెలుగొందఁ, గంచుకంబులు శిరోవేష్టనంబులుఁ గనక కుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమానవయోరూపగుణవిలాసవిభ్రమకలితలయిన విలాసినీసహస్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచనసింహాసనాసీనుం గాంచె; న ప్పుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్థానంబు సేసి యప్పుడు. | 605 |
| క. |
మునివరుపాదాంబుజములు, దన చారుకిరీటమణివితానము సోఁకన్ వినమితుఁడై నిజసింహా, సనమునఁ గూర్చుండఁ బెట్టి సద్వినయమునన్. |
606 |
| క. |
తన పాదకమలతీర్థం, బున లోకములం బవిత్రముగఁ జేయు పురా తనమౌని లోకగురుఁ డ, మ్మునిపదతీర్థంబు మస్తమున ధరియించెన్. |
607 |
| వ. | ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండు నైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె. | 608 |
| క. |
ఏ పని పంచినఁ జేయుదుఁ, దాపసవర! యనుడు నతఁడు దామోదర! చి ద్రూపక! భవదవతార, వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే! |
609 |
| తే. |
అఖిలలోకైకపతివి దయార్ద్రమతివి, విశ్వసంరక్షకుండవు శాశ్వతుఁడవు వెలయ నే పనియైనఁ గావింతు ననుట, యార్తబంధుండ విది నీకు నద్భుతంబె? |
610 |
| తే. |
అబ్జసంభవహరదేవతార్చనీయ!, భూరిసంసారసాగరోత్తారణంబు నవ్యయానందమోక్షదాయకము నైన, నీ పదధ్యాన మాత్మలో నిలువ నీవె. |
611 |
| వ. | అని యభ్యర్థించి య ద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డ మ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియం గోరి, వేఱొకచంద్రబింబాననాగేహంబునకుం జని, యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవయుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోటు వాసి చని. | 612 |
| క. |
మునివరుఁడు కాంచె నొండొక, వనజాయతనేత్ర నిజనివాసంబున నం దనయుతు జిష్ణు సహిష్ణున్, వినుతగుణాలంకరిష్ణు విష్ణున్ గృష్ణున్. |
613 |
| క. |
నారదుఁ డట చని కనె నొక, వారిజముఖియింట నున్నవాని మురారిన్ హారిన్ దానవకుల సం, హారిన్ గమలామనోవిహారిన్ శౌరిన్. |
614 |
| వ. | ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి మునీంద్రా! సంపూర్ణకాములయిన మిమ్ము నపూర్ణకాములమైన మే మేమిటఁ బరితృప్తి నొందఁ జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద మని ప్రియపూర్వకంబుగాఁ బలికిన నా నందనందనుమాటలకు నానందకందళితహృదయారవిందుండును, మందస్మితసుందరవదనారవిం దుండును నగుచు నారదుండు వెండియుఁ జని చని. | 615 |
| క. |
అనఘాత్ముఁడు గనుఁగొనె నొక, వనితామణిమందిరమున వనకేళీ సం జనితానందుని ననిమిష, వినమితచరణారుణారవిందు ముకుందున్. |
616 |
| క. |
పరమేష్ఠిసుతుఁడు గనె నొక, తరుణీభవనంబునందుఁ దను దాన మనోఽం బురుహమునఁ దలఁచుచుండెడి, నరకాసురదమనశూరు నందకుమారున్. |
617 |
| వ. | మఱియుం జని చని. | 618 |
| సీ. |
ఒకచోట నుచితసంధ్యోపాసనాసక్తు నొకచోటఁ బౌరాణికోక్తికలితు నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని నొకచోట నమృతోపయోగలోలు నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు నొకచోట ధేనుదానోత్కలితాత్ముని నొకచోట నిజసుతప్రకరయుక్తు |
|
| తే. |
నొక్క చోటను సంగీతయుక్తచిత్తు, నొక్కచోటను జలకేళియుతవిహారు నొక్కచోటను సన్మంచకోపయుక్తు నొక్కచోటను బలభద్రయుక్తచరితు. |
619 |
| వ. | మఱియును. | 620 |
| సీ. |
సకలార్థసంవేది యొకయింటిలోపలఁ జెలితోడ ముచ్చటల్ సెప్పుచుండు విపులయశోనిధి వేఱొకయింటిలో సరసిజాననఁ గూడి సరసమాడుఁ బుండరీకదళాక్షుఁ డొండొకయింటిలోఁ దరుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ గరుణాపయోనిధి మఱియొక యింటిలోఁ జెలిఁ గూడి విడియము సేయుచుండు |
|
| ఆ. |
వికచకమలనయనుఁ డొకయింటిలో నవ్వు, బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి సలుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు. |
621 |
| వ. | ఇట్లు సూచుచుం జని చని. | 622 |
| క. |
చతురానననందనుఁ డం, చితమతిఁ జని కాంచె నొక్క చెలిగేహమునన్ గ్రతుకర్మాచరణుని నా, శ్రితభయహరణున్ సురేంద్రసేవితచరణున్. |
623 |
| క. |
వృత్రారినుతునిఁ బరమ, పవిత్రుని నారదుఁడు గాంచె వేఱొక యింటం బుత్త్రక పౌత్త్రక దుహితృ క, ళత్రసమేతుని ననంతు లక్షణవంతున్. |
624 |
| క. |
సుందరమగు నొకసుందరి, మందిరమునఁ బద్మభవకుమారుఁడు గాంచెన్ నందితనందున్ సుజనా, నందున్ గోవిందు నతసనందు ముకుందున్. |
625 |
| క. |
జలజభవసుతుఁడు గనె నొక, నలినాక్షినివాసమందు నతభద్రేభున్ జలదాభున్ గతలోభు, న్నలకాళిజితద్విరేఫు నంబుజనాభున్. |
626 |
| మ. |
ఒకయింటం గజవాజిరోహకుఁడునై యొక్కింట భుంజానుఁడై సకలాత్ముండు పరుండు షోడశసహస్రస్త్రీనివాసంబులం దొకబోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుఁడై యుండ న య్యకలంకున్ వరదున్ మహాపురుషు బ్రహ్మణ్యున్ నతాబ్జాసనున్. |
627 |
| క. |
అస్తోకచరితు నమిత స, మస్తసుధాహారు వేదమస్తకతల వి న్యస్తపదాంబుజయుగళు న, పాస్తాశ్రితనిఖిలపాపుఁ బరము ననంతున్. |
628 |
| ఆ. |
పరమభాగవతుఁడు పరమేష్ఠితనయుండు, మనుజలీలఁ జెంది మహితసౌఖ్య చిత్తుఁడైన యా హృషీకేశు యోగ మా, యాప్రభావమునకు నాత్మ నలరి. |
629 |
| క. |
మాయురె? హరి! హరి! వరద! య, మేయగుణా! యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం డాయదునాయకు సుజన వి, ధేయుని కిట్లనియె ‘దేవ! త్రిజగములందున్. |
630 |
| క. |
నీ మాయఁ దెలియువారలె, తామరసాసన సురేంద్రతాపసు లైనన్ ధీమంతులు నీభక్తిసు, ధా మాధుర్యమునఁ బొదలు ధన్యులు దక్కన్. |
631 |
| క. |
అని హర్షించుచు ‘నిఁక నేఁ, బనివినియెద నిఖిలలోకపావనమును స జ్జనహితమునైన నీకీ, ర్తన మఖిలజగంబులందుఁ దగ నెఱిఁగింతున్. |
632 |
| క. |
అని తద్వచనసుధాసే, చనమున ముదితాత్ముఁ డగుచు సంయమి చిత్తం బునఁ దన్మూర్తిం దగ నిడు, కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్. |
633 |
| క. |
ఈ పగిది లోకహితమతి, నా పరమేశ్వరుఁడు మానవాకృతిఁ ద్రిజగ ద్దీపితచారిత్రుఁడు బహు, రూపములం బొందె సుందరుల నరనాథా! |
634 |
| చ. |
అని హరి యిట్లు షోడశసహస్రవధూమణులం బ్రియంబునన్ మనసిజకేళిఁ దేల్చిన యమానుషలీల సమగ్రభక్తితో వినినఁ బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్ మహా ధనపశుపుత్త్రమిత్రవనితాముఖసౌఖ్యములున్ నరేశ్వరా!’ |
635 |
| వ. | అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందనున కిట్లనియె. ‘నా నిశావసానంబునఁ బద్మబాంధవాగమనంబును గమలినీలోకంబునకు మునుకలుగ నెఱింగించు చందంబునం గలహంస సారసరథాంగముఖజలవిహంగంబులరవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగీత మృదుమధురగాననినదంబును లలితమృదంగవీణావేణునినాదంబును ఏతేర మేలుకని తనచిత్తంబునఁ జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంతవిహీనుఁ బరమబ్రహ్మంబు నైన తన్నుం దా నొక్కింత చింతించి, యనంతరంబ విరోధిరాజన్య నయనకల్హారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్తనిఖిలదోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచనసరోజంబులు వికసింపఁజేయుచుఁ దల్పంబు డిగ్గి చనుదెంచి యంత. | 636 |
| సీ. |
మలయజకర్పూరమహితవాసితహేమకలశోదకంబుల జలకమాడి నవ్యలసన్మృదుదివ్యవస్త్రంబులు వలనొప్ప రింగులువాఱఁ గట్టి మకరకుండలహారమంజీరకేయూరవలయాదిభూషణావలులు దాల్చి ఘనసారకస్తూరికాహరిచందనమిళితపంకము మేన నలర నలఁది |
|
| తే. |
మహితసౌరభ నవకుసుమములు దుఱిమి, పొసఁగ రూపైన శృంగారరస మనంగ మూర్తిఁ గైకొన్న కరుణాసముద్ర మనఁగ, రమణ నొప్పుచు లలితదర్పణము చూచి. |
637 |
| తే. |
కడఁగి సారథి తెచ్చిన కనకరథము, సాత్యకి హితప్రియోద్ధవసహితుఁ డగుచు నెక్కి నిజకాంతి దిక్కులఁ బిక్కటిల్లఁ, బూర్వగిరిఁ దోఁచు భానునిఁబోలి వెలిఁగె. |
638 |
| సీ. |
అభినవనిజమూర్తి యంతఃపురాంగనానయనాబ్జములకు నానంద మొసఁగ సలలితముఖచంద్రచంద్రికాతతి పౌరజనచకోరముల కుత్సవము సేయ మహనీయకాంచనమణిమయభూషణదీప్తులు దిక్కులఁ దేజరిల్ల నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి హలకులిశాంకుశజలజకలశ |
|
| తే. |
లలితరేఖలు ధరణి నలంకరింప, నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి మహితగతి దేవతాసభామధ్యమునను, రుచిరసింహాసనమునఁ గూర్చుండె నెలమి. |
639 |
| చ. |
అతివిభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లఁగా హితులు పురోహితుల్ వసుమతీశులు మిత్రులు బాంధవుల్ బుధుల్ సుతులును మాగధుల్ కవులు సూతులు మంత్రులు భృత్యులున్ శుభ స్థితిఁ గొలువంగఁ నొప్పె నుడుసేవితుఁడైన సుధాంశుఁడో యనన్. |
640 |
| క. |
కరుణార్ద్రదృష్టిఁ బ్రజలం, బరిరక్షించుచు వివేకభావకళా చా తురి మెఱసి యిష్టగోష్ఠిం, బరమానందమున రాజ్యభారకుఁ డగుచున్. |
641 |
| వ. | ఇ వ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్క నాఁ డపూర్వదర్శనుండైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభామధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరంబులు మొగిచి యిట్లనియె. | 642 |
| క. |
కంజవిలోచన! దానవ, భంజన! యోగీంద్రవిమలభావలసద్బో ధాంజన! దీప్తినిదర్శన!, రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా! |
643 |
| తే. |
అవధరింపు జరాసంధుఁ డతులబలుఁడు, దనకు మ్రొక్కని ధారుణీధవుల నెల్ల వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ, బెట్టినాఁడు గిరివ్రజపట్టణమున. |
644 |
| తే. |
వారు పుత్తేర వచ్చినవాఁడ నేను, నరవరోత్తమ! నృపులవిన్నపము గాఁగ విన్నవించెద నామాట వినినమీఁద, ననఘ! నీ దయ!, వీరిభాగ్యంబుకొలఁది. |
645 |
| వ. | అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె. | 646 |
| ఉ. |
వారిజనాభ! భక్తజనవత్సల! దుష్టమదాసురేంద్ర సం హార! సరోరుహాసనపురారిముఖామరవంద్యపాద పం కేరుహ! సర్వలోకపరికీర్తితదివ్యమహాప్రభావ! సం సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా! |
647 |
| ఆ. |
ఆర్తజనుల మమ్ము నరసి రక్షింపు మ, హాత్మ! భక్తజనభయాపహరణ! నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ, చరణయుగము మాకు శరణ మనఘ! |
648 |
| క. |
బలియుర దండింపఁగ దు, ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా కలితుఁడవై యుగయుగమున, నలవడ నుదయింతు కాదె? యభవ! యనంతా! |
649 |
| క. |
నీమదిఁ దోఁపని యర్థం, బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త స్తోమసురభూజ! త్రిజగత్, క్షేమంకర ! దీనరక్షసేయు మురారీ! |
650 |
| క. |
నీ పంపు సేయకుండఁగ, నా పద్మభవాదిసురలకైనను వశమే? శ్రీపతి! శరణాగతులం, జేపట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా! |
651 |
| క. |
అభవుఁడ వయ్యును జగతిం, బ్రభవించుట లీల గాక భవ మందుటయే ప్రభువులకుం బ్రభుఁడవు మము, సభయాత్ముల నరసి కావఁ జను నార్తిహరా! |
652 |
| క. |
కదనమున నీ భుజావలి, కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం పద సెడఁగ జరాసంధుఁడు, పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్. |
653 |
| వ. | ఇట్లు తనపడినబన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న య ప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుతదారమిత్రవర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు’ మని విన్నవించి రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున. | 654 |