| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
కోరి సుయోధనుకూఁతురు సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ మహి నొప్పు కన్యకామణి వివాహంబునఁ జక్రహస్తునితనూజాతుఁడైన సాంబుఁడు బలసాహసమున నెత్తుక పోవఁ గౌరవు లీక్షించి కడఁగి క్రొవ్వి ‘పడుచువాఁ డొకఁ డదె బాలికఁ గొనిపోవుచున్నాఁడు గై కొన కుక్కు మిగిలి |
|
| తే. |
యిట్టి దుర్మదుఁ గయిముట్టి పట్టి తెచ్చి, జనులు వెఱఁగందఁ జెఱపెట్టి యునుతుమేని యదువులు మనల నేమి సేయంగఁగలరొ, యనుచుఁ గురువృద్ధజనముల యనుమతమున. |
560 |
| వ. | ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణ శల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నతరథారూఢులై కూడ నరిగిన వారలఁ గనుంగొని జాంబవతీనందనుండు మందస్మితవదనారవిందుం డగుచు సింగంబుభంగి గర్జించుచు మణిదీప్తం బైన చాపంబుఁ బూని నిల్చిన వారును సాంబు నదల్చి నిలునిలు మని పలికి. | 561 |
| తే. |
చండకోదండముక్తనిశాతవిశిఖ, జాల మందంద వఱప యాభీలముగను నందనందననందనస్యందనంబు, ముంచి రచలేంద్రమును ముంచు మంచుపగిది. |
562 |
| వ. | మఱియును. | 563 |
| శా. |
శౌర్యాటోపవిజృంభణంబుల సరోజాతాక్షసూనున్ సురా హార్యస్థైర్యుని మీఁద నేయ నతఁ డుద్యద్భూరిబాహాబలా వార్యుండై శితసాయకాలి నవి మాయం జేసినన్ దేవతా తూర్యంబుల్ దివి మ్రోసెఁ; నంత నతఁ డస్తోకప్రతాపోన్నతిన్. |
564 |
| వ. | ఇట్లు గడంగి బాణజాలంబులు పరఁగించి యందఱ కన్నిరూపులై రథసూతధ్వజపతాకాతపత్రంబులు చూర్ణంబులు గావించి, విరథులం జేసి వారల మెయిమఱవు లఱువుళ్ళు గావించి, యొక్కొక్కనిఁ బెక్కుబాణంబుల నుచ్చిపో నేసిన వారలు శోణితదిగ్ధాంగులైకుసుమితకింశుకంబులం బోలియుండి రంత. | 565 |
| ఉ. |
వార లనేకులయ్యు బలవంతులు నయ్యు మహోగ్రసంగ రో దార పరాక్రమప్రకటదక్షులు నయ్యుఁ గుమారకున్ జగ ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపఁగలేక సిగ్గునం గూరిన చింత నొండొరులఁ గూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్. |
566 |
| వ. | మగిడి సమరసన్నద్ధులై సంరంభించి. | 567 |
| ఉ. |
అందఱు నొక్కపెట్ట దనుజాంతకనందనుఁ జుట్టు ముట్టి యం దంద నిశాతసాయకచయంబుల ముంచి రథంబు నుగ్ర లీ లం దునుమాడి చాపము చలంబునఁ ద్రుంచి హయాలిఁ జంపి సూ తుం దెగటార్చి యంత విరథుం డగుడున్ వెసఁ జొచ్చి పట్టినన్. |
568 |
| తే. |
బాలకుఁడు చేయునది లేక పట్టువడియెఁ, గౌరవులు దమ మనములఁ గౌతుకంబు లొలయఁ సాంబునిఁ గన్యకాయుక్తముగను, బురమునకుఁ దెచ్చి రతులవిభూతి మెఱసి. |
569 |
| వ. | అంత ద్వారకానగరంబున. | 570 |
| ఉ. |
జాంబవతేయువార్త యదుజాతులు నారదయోగిచే సమ స్తంబును విన్నవా రగుచు సంగరకౌతుక ముప్పతిల్లఁ జి త్తంబులఁ గౌరవాన్వయకదంబము నొక్కట నుక్కడంచు కో పంబున నుగ్రసేనజనపాలుననుజ్ఞ ననూనసైన్యముల్. |
571 |
| తే. |
కూడి నడవంగఁ గని వారితోడ బలుఁడు, ధార్తరాష్ట్రులు మనకు నెంతయును డాసి నట్టి బంధులు; వారిపై నిట్టి యలుక, నెత్తి చనుచుంట యిది నీతియే తలంప? |
572 |
| వ. | అని వారల వారించి తత్‌క్షణంబ బంధు ప్రియుండైన బలరాముం డనలార్క సంకాశంబగు కాంచనరథం బెక్కి యనురక్తులైన భూసురులును, నుద్ధవాదులగు కులవృద్ధులును సేవింపం గరిపురంబునకుం జని తత్పురోపకంఠవనంబున సురభికుసుమఫలభరితతరుచ్ఛాయావిరచితచంద్రకాంతశిలాతలంబునందు వసియించి, మహితగ్రహమధ్యగతుండైన పూర్ణచంద్రు ననుకరించి యుండె; నంతఁ గార్యబోధనంబు సేయుటకై కౌరవులకడకుఁ బ్రబుద్ధుండైన యుద్ధవునిం బనిచినం జని యతం డాంబికేయునకు ధనురాచార్యా పగాతనూభవసుయోధనులకుం బ్రణమిల్లి వారిచేత నభినందితుండై యిట్లనియె. | 573 |
| సీ. |
భూరియశోధనులార! తాలాంకుండు చనుదెంచి నగరోపవనమునందు నున్నవాఁ’డనిన వా రుత్సాహమున బలుఁబొడగను వేడుక బుద్ధిఁ దోఁపఁ దనరారు కానికల్ గొని చని యర్ఘ్యపాద్యాదిసత్కృతులు నెయ్యమునఁ జేసి ధేనువు నిచ్చి సమ్మానించి యందఱు నందందవందనం బాచరించి |
|
| తే. |
యుచితభంగిని నచటఁ గూర్చున్నయెడను, గుశలమే మీకు? మాకును గుశల మనుచుఁ బలికి రాముఁడు కురునరపాలుఁ జూచి, యచటిజనములు వినఁగ నిట్లనియెఁ దెలియ. |
574 |
| ఉ. |
‘మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్ ధరియించి కౌరవుల్ మానుగఁ జేయు టొప్పగుఁ; గుమారకు నొక్కనిఁ బెక్కుయూథపుల్ పూనిన లావుమై నెదిరి పోర జయించుట మీఁది తప్పు; త ప్పైనను గాచె బాంధవహితాత్మకుఁడై మనుజాధినాథుఁడున్. |
575 |
| క. |
అను మాటలు విని కౌరవ, జననాయకుఁ డాత్మ నలిగి చాలుఁ బురే? యే మనఁ గలదు కాలగతి? చ, క్కనఁ గాలం దొడుగుపాదుకలు దల కెక్కెన్. |
576 |
| ఆ. |
మనము బంధువరుస మన్నించు మన్ననఁ, గాదె రాజ్యభోగగరిమఁ బొదలి వసుధఁ బేరు గలిగి వాసికి నెక్కుటఁ, దమకు ననుభవింపఁ దగని యట్టి. |
577 |
| వ. | సితచ్ఛత్రచామరశంఖకిరీటచిత్రశయ్యాసౌధసింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? యిట్టిచో సరివారునుంబోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధసఖ్యంబులు సాలుఁ; బాములకుఁ బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమపంపుసేయు మనుట సిగ్గులేకుంటఁ గాదె! యదియునుంగాక దివ్యాస్త్రకోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరులకున్ లోఁబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపవచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిపని?’ యని దుర్భాషలాడుచు దిగన లేచి నిజమందిరంబునకుం జనియె; నప్పుడు హలాయుధుం డమ్మాటల కదిరిపడి. | 578 |
| ఉ. |
కౌరవుఁ డాడి పోయిన యగౌరవభాషల కాత్మఁ గిన్క దై వాఱఁగ నుల్ల సత్ప్రళయభానునికైవడి మండి చండ రో షారుణితాంబకుం డగుచు యాదవవృద్ధులఁ జూచి పల్కెఁ ‘బెం పారినరాజ్యవైభవమదాంధులమాటలు మీరు వింటిరే? |
579 |
| తే. |
శ్రీమదాంధులు సామంబుచేతఁ జక్కఁ, బడుదురే యెందు? బోయఁడు పసులఁ దోలు పగిది నుగ్రభుజావిజృంభణసమగ్ర, సుమహితాటోప మనిలోనఁ జూపకున్న. |
580 |
| క. |
కౌరవుల సమయఁ జేయ ను, దారత యదువీరవరులు దామోదరుఁడున్ రా రావల దని యచ్చట, వారించితిఁ గాదె బంధువత్సలయుక్తిన్. |
581 |
| వ. | అదియునుం గాక. | 582 |
| సీ. |
ఏ దేవు భృత్యులై యింద్రాదిదిక్పాలవరులు భజింతురు వరుసతోడ నే దేవు మందిరం బేపారు దేవతాతరుసభావిభవసుందరతఁ జెంది యే దేవుపదయుగం బేప్రొద్దు సేవించు నఖిలజగన్మాతయైన లక్ష్మి యే దేవుచారుసమిద్ధకళాంశసంభవులము పద్మజభవులు నేను |
|
| తే. |
నట్టి దేవుండు దుష్టసంహారకుండు, హరి ముకుందుండు పంపుసేయంగ నొప్పు నుగ్రసేనునిరాజ్యసమగ్రగరిమ, యంతయును దార యిచ్చిన దంట! తలఁప. |
583 |
| చ. |
అదియును గాక యెవ్వని పదాంబుజచారురజోవితాన మా త్రిదివవరాదిదిక్పతికిరీటములందు నలంకరించు; భూ విదితపుఁదీర్థముం గడు బవిత్రము సేయును; నట్టి కృష్ణుచేఁ బొదలిన రాజ్యచిహ్నములఁ బొందఁగ రా దఁట యేమి చోద్యమో! |
584 |
| క. |
తా మఁట తలఁపం దల లఁట, యే మఁట పాదుకల మఁటగణింపఁగ రాజ్య శ్రీమదమున ని ట్లాడిన, యీ మనుజాధమునిమాట కేమన వచ్చున్? |
585 |
| వ. | అని సక్రోధమానసుండై యప్పుడు. | 586 |
| క. |
ధారుణి నిటమీఁదట ని, ష్కౌరవముగఁ జేయకున్నఁ గా దని యుగ్రా కారుండై బలభద్రుఁడు, సీరము వెసఁ బూన్చి లావుఁ జేవయు నెసఁగన్. |
587 |
| వ. | ఇట్లు పూని కౌరవరాజధానియైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి, య ప్పుటభేదన విస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి, తిగిచి, గంగాప్రవాహంబునం బడఁద్రోయ గమకించిన నప్పుడు మహాజలమధ్యవిలోలంబగునావచందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపురవప్ర ప్రాకారసౌధాట్టాలకతోరణధ్వజద్వారకవాటకుడ్యవీథీయుతంబుగా నొడ్డగెడవైనఁ బౌరజనంబులు పుడమి నడుగు లిడంగ రాక తడంబడుచు, నార్తులై కుయ్యిడుచుండి; రట్టియెడ న మ్మహోత్పాతంబులు గనుంగొని తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెఱింగి దానికిఁ బ్రతీకారంబు లేమిని గళవళంబున భయాకులమానసులై పుత్రమిత్రకళత్రబంధుభృత్యపౌరజనసమేతంబుగా భీష్మదుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగాఁ దలంచి, సాంబునిఁ గన్యకాయుక్తంబుగా ననేక మణిమయభూష ణాంబరజాలంబుతోఁ గొనివచ్చి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి. | 588 |
| క. |
‘రామ! సమంచితముక్తా, దామ! యశఃకామ! ఘనసుధాధామరుచి స్తోమ! జయసీమ! జగదభి, రామ! గుణోద్దామ! నిఖిలరాజలలామా! |
589 |
| క. |
నీ మహిమ యెఱిఁగి పొగడఁగఁ, నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్ క్షేమంకరుఁడవు; సుమతివి, తామసులము మమ్ముఁ గావఁ దగు హలపాణీ! |
590 |
| క. |
భూచక్ర మెల్లఁదాల్చిన, యా చక్రీశ్వరుఁడు దావకాంశుఁడు బలదే వా! చక్రికి నగ్రజుఁడవు, నీచ క్రియ లుడుపఁజెల్లు నీకు జితారీ! |
591 |
| క. |
రక్షింపుము రక్షింపు ము, పేక్షింపక నమితనిఖిలబృందారక! ఘో ర క్షణదాచరవిషనిట, లాక్ష! భయాతురుల మమ్ము నరయు మనంతా! |
592 |
| వ. | మఱియును దేవా! యీ సచరాచరంబు జగంబుల నీ లీలావినోదంబులం జేసి, దుష్టజనమర్దనంబును, శిష్టజనరక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తిస్థితిలయహేతువైన నీకు సమస్కరింతు’ మని వెండియు నిట్లనిరి. | 593 |
| తే. |
‘అవ్యయుండవు; సర్వభూతాత్మకుఁడవు; సర్వశక్తిధరుండవు; శాశ్వతుఁడవు విశ్వకరుఁడవు గురుఁడవు విమలమూర్తి, వైన నిన్ను నుతింప బ్రహ్మకును దరమె?’ |
594 |
| చ. |
అని వినుతించినం బ్రముదితాత్మకుఁడై హలపాణి వారలం గనుఁగొని ‘యోడ కోడకుఁడు కార్యగతిం దగి లిట్లు మీరు సే సిన యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబు దక్కి పొం’ డనిన సుయోధనుండు వినయంబున నల్లునిఁ గూఁతునుం దగన్. |
595 |
| క. |
అనుపుచు నరణము దాసీ, జనముల వేయింటి లక్షసైంధవములఁ దా నినుమడి యేనుంగులఁ గాం, చన రథముల నాఱువేల సమ్మతి నిచ్చెన్. |
596 |
| వ. | ఇట్లిచ్చి యనిచిన భద్రుండు గొడుకునుం గోడలిం దోడ్కొనుచుఁ బరమానందంబు నొందుచు, నక్కడక్కడి జనంబులు పదివేలవిధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవులతోడఁ దాఁ గరిపురంబునకుం బోయినవిధంబును, వారలాడినదురాలాపంబులును, దా నందులకై యొనర్చిన ప్రతీకారంబును నెఱింగించి సుఖంబుండె; వారణపురంబు నేఁడును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక గంగకై క్రుంగి బలభద్రునిమాహాత్మ్యంబుఁ దెలుపుచున్న’ దని యమ్మహాత్మునిభుజవీర్యం బవార్యం బని చెప్పి, శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. | 597 |