పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
బలరాముండు ద్వివిదుఁడను వానరుని సంహరించుట
క. బలభద్రుఁ డప్రమేయుం, డలఘుఁ డనంతుండు నతనియద్భుతకర్మం
బులు వినియు, దనియ దింకను, దెలియఁగ నా కాన తిమ్ము దివ్యమునీంద్రా!
538
వ. అనిన రాజునకు శుకుం డిట్లనియె. 539
క. జననాయక! విను సుగ్రీ, వుని సచివుఁడు మైందునకు సహోదరుఁ డనఁగా
వినుతికి నెక్కిన ద్వివిదుం, డను ప్లవగుఁడు నరకసఖ్యుఁ డతిదర్పితుఁడై.
540
సీ. చెలికానిపగఁ దీర్పఁ దలఁచి కృష్ణుం డేలు పురములు జనపదంబులు దహించి
సరిదుపవనసరోవరములు గోరాడి మందలఁ గొందల మందఁజేసి
ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగబలముల సమయఁజేసి
పురుషుల సతులను భూధరగుహలలోఁ బెట్టి వాకిలి గట్టి బిట్టు నొంచి
 
తే. ఫలితతరువులఁ ద్రుంచి సాధుల నలంచి, కోట లగలించి పడుచుల నీట ముంచి
ధరణి నిబ్భంగిఁ బెక్కుబాధలఁ జలంబు, పరఁగఁ జేయుచు నొకనాఁడు ప్లవగవరుఁడు.
541
క. చతురమృదు గీతరవము, న్నతి వీతెంచినఁ జెలంగి నగచరుఁ డా రై
వతగిరికందరమున కా, యతిగతిఁ జని యందు నెత్త మాడెడువానిన్‌.
542
చ. లలితవినీలవస్త్రుని విలాసవతీయుతుఁ జంద్రచంద్రికా
కలితమహోన్నతాంగు మణికాంచనదివ్యవిభూషణోన్నతున్‌
విలసితవారుణీసమదవిహ్వలలోచనుఁ గాంచె సీర ని
ర్దళితరిపుక్షితీశనిజధాముని రాముని కామపాలునిన్‌.
543
సీ. కనుఁగొని తత్పురోగమభూమిరుహశాఖ, లెక్కి యూఁచుచుఁ జాల వెక్కిరించుఁ;
గికురించుచును బండ్లిగిల్చి చూపుచు వెసఁ గొమ్మకొమ్మకు నుఱుకుచు నదల్చుఁ;
దోఁక నూరక మేను సోఁకఁగ నులివెట్టు; వెడవెడ నాలుక వెడలఁ బెట్టు;
బరుల నఖంబుల గిరగిర గోఁకుచుఁ బొరిఁబొరి ఫలములు గఱచివైచు;
 
తే. గోళ్ళు తెగ గొర్కి యుమియును; గుదము సూపు;, బలసి మర్కటజాతి యి ప్పగిదిఁ జేయఁ
గోపమున హలధరుఁ డొక గుండు వైవ, దానిఁ దప్పించుకొని ప్రల్లదమున నతని.
544
క. నగి యాసవకలశముఁ గొని, జగతీరుహశాఖ యెక్కి చాపలమున న
జ్జగతిపయి వైచెఁ దద్ఘట, మగలగ; నది చూచి కోప మగ్గల మొదవన్‌.
545
వ. మఱియును. 546
క. సీరినిఁ దన మనమున నొక, చీరికిఁ గైకొనక కదిసి చీరలు చింపన్‌
వారక దా భువిజనములఁ, గారించుట మాన్పఁ దలఁచి ఘనకుపితుండై.
547
వ. ఇట్లు కోపోద్దీపితమానసుండై కనుంగొని హలాయుధుం డప్పుడు. 548
చ. ముసలముఁ దీవ్రశాతహలమున్‌ ధరియించి సమస్తచేతన
గ్రసనమునాఁడు పొంగు లయకాలునిభంగి నదల్చి నిల్వ; వా
డసదృశవిక్రమక్రమవిహార మెలర్ప సమీపభూజమున్‌
వెసఁ బెకలించి మస్తకము వ్రేసెఁ జలంబు బలంబు చొప్పడన్‌.
549
వ. ఇట్లు వ్రేయ బలుం డప్పుడు. 550
చ. ఉరవడి దండతాడితమహోరగుభంగిఁ గడంగి వీర సా
గరమన నేఁచి హేమకటకంబుల నొప్పు సునందనామ భీ
కర ముసలంబునన్‌ ద్వివిదుకంఠము వ్రేసినఁబొల్చె వాఁడు జే
గురు గల కొండచందమునఁ గోయని యార్చి సురల్‌ నుతింపఁగన్‌.
551
మత్త. అంత వాఁడొకయింత మూర్ఛిలి యంతలోఁ దెలివొంది దు
ర్దాంతభూరిభుజావిజృంభణుఁడై మహీజము పూన్చి దై
త్యాంతకాగ్రజు వ్రేసె; వ్రేసిన నాగ్రహంబున దాని నిం
తింతలై ధర రాలఁ జేసె నహీనవిక్రమశాలియై.
552
క. మఱియును జల ముడుగక వెసఁ, దరుచరుఁ డొకతరువు వ్రేయఁ దాలాంకుఁ డనా
దరమునఁ దునిమిన వెండియుఁ, దొరఁగించెఁ గుజంబు లతఁడు దోడ్తోఁ దునుమన్‌.
553
క. ఆ చందంబున వనచరుఁ, డేచి మహీరుహచయంబు లెల్లను హలిపై
వైచి యవి శూన్య మగుటయుఁ, జూచి శిలావృష్టిఁ గురిసె సుర లగ్గింపన్‌.
554
క. బలుఁ డపుడు ఱాలు తుమురై, యిల రాలఁగఁ జేసి యార్వ నే పుడుగక యా
వలిముఖుఁడు తాలసన్నిభ, ము లయిన నిజబాహుదండముల నుగ్రుండై.
555
క. వడిఁ బిడుగుఁబోనిపిడికిటఁ, బొడిచిన వడి సెడక బలుఁడు ముసలము హలమున్‌
విడిచి ప్లవంగుని మెడఁ గడు, వెడవెడ బిగియించె గ్రుడ్లు వెలి కుఱుకంగన్‌.
556
క. వదనమునఁ జెవుల రుధిరము, మెదడును దొరఁగంగ వాఁడు మేదినిమీఁదం
జదికిలఁ బడి యొక యింతయు, మెదలక మిడుకంగ లేక మృతిఁ బొందె నృపా!
557
తే. వానిపాటున కప్పుడు వనసమేత, మగుచు నా శైలరాజ మల్లల్ల నాడె;
సురగణంబులు రాముపై సురభి కుసుమ, వృష్టి గురియించి రతుల సంతుష్టి మెఱసి.
558
వ. ఇ వ్విధంబున భువనకంటకుండైన దుష్టశాఖామృగేంద్రుని వసుంధరకుం బలిచేసి సకల జనంబులుఁ బరమానందకందళితహృదయారవిందులై తన్ను నందింప న య్యదునందనుండు నిజనగరంబున కరుదెంచె; నని శుకుండు వెండియు న మ్మనుజపతి కిట్లనియె. 559
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )