| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
మనుజేశ! బలగర్వమున మదోన్మత్తుఁడై, యవనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ, మలవడునే? యని యదటు మిగిలి తెగి హరి దా వాసుదేవుఁడ ననుకొను, నఁట! పోయి వలదను మనుచు దూతఁ బద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన, నరిగి వాఁ డంబుజోదరుఁడు పెద్ద |
|
| తే. |
కొలువుఁ గైకొని యుండ సంకోచపడక, వినుము మా రాజుమాటగా వనజనాభ! యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది, నట్టి యే నుండ సిగ్గు వోఁదట్టి నీవు. |
508 |
| క. |
నా పేరును నా చిహ్నము, లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం తే పో! మదిఁ బరికించిన, నే పంత మెఱుంగు గొల్లఁ డే మిట నైనన్? |
509 |
| ఆ. |
ఇంతనుండి యైన నెదిరిఁ ద న్నెఱిఁగి నా, చిన్నె లెల్ల విడిచి చేరి కొలిచి బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా, యెదురు మనుము ఘోరకదనమునను. |
510 |
| క. |
అను దుర్భాషలు సభ్యులు, విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్ ‘జనులార! యెట్టి క్రొత్తలు, వినఁబడియెడు నిచట? లెస్స వింటిరె?’ యనఁగన్. |
511 |
| వ. | అట్టియెడఁ గృష్ణుండు వాని కిట్లనియె. | 512 |
| మ. |
వినరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో దనమీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్ మూఁగఁగా, ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి న్ననయంబున్ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్. |
513 |
| క. |
అని యుద్రేకముగా నా, డిన మాటల కులికి వాఁడు డెందము గలఁగం జని తన యేలిక కంతయు, వినిపించెను నతనిమదికి విరసము గదురన్. |
514 |
| వ. | అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధకలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబునగు సుందరస్యందనంబుఁ బటుజవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీ ద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతనిమిత్రుండైన కాశీపతియును మూఁడక్షౌ హిణులతోడం దోడుపడువాఁడై వెడలె, ని ట్లాప్తయుతుండై వచ్చువాని. | 515 |
| సీ. |
చక్రగదాశంఖశారాఙ్గదిసాధనుఁ, గృత్రిమగౌస్తుభశ్రీవిలాసు మకరకుండలహారమంజీరకంకణ, మణిముద్రికావనమాలికాంకుఁ దరళవిచిత్రపతంగవుంగవకేతుఁ, జెలువొందు పీతకౌశేయవాసు జవనాశ్వకలితకాంచనరథారూఢుని, రణకుతూహలు లసన్మణికిరీటు |
|
| తే. |
నాత్మసమవేషు రంగవిహారకలిత, నటసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి హర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ, డంత వాఁడును నుద్వృత్తుఁ డగుచు నడరి. |
516 |
| క. |
పరిఘశరాసనపట్టిస, శరముద్గరముసలకుంతచక్రగదా తో మరభిందిపాలశక్తి, క్షురికాసిప్రాసపరశుశూలముల వెసన్. |
517 |
| చ. |
పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంతకాల భీ కర మహితోగ్రపావకుని కైవడి నేచి విరోధిసాధనో త్కరముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్. |
518 |
| ఉ. |
వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారిసైన్యముల్ మారి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం దేరులు వ్రాలె, నశ్వములు ద్రెళ్ళె, గజంబులు మ్రొగ్గె, సద్భటుల్ ధారుణిఁ గూలి, రిట్లు నెఱి దప్పి చనెన్ హతశేషసైన్యముల్. |
519 |
| వ. | అట్టియెడ రుధిరప్రవాహంబులును, మేదోమాంసపంకంబును నై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె, న య్యవసరంబునం గయ్యంబునకుం గాలు ద్రవ్వు న ప్పౌండ్రకునిం గనుంగొని హరి సంబోధించి యి ట్లనియె. | 520 |
| మ. |
‘మనుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ డనిలో మాపుదు, నెద్దు క్రొవ్వి పెలుచ న్నాఁబోతుపై ఱంకె వై చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే రును జిహ్నంబులు నీ పయిన్ విడుతు నర్చుల్ పర్వ నేఁ డాజిలోన్. |
521 |
| క. |
అది గాక నీదు శరణము, పదపడి యేఁ జొత్తు నీవు బలవిక్రమ సం పద గల పోటరి వేనిం, గదలక నిలు ‘మనుచు నిశితకాండము లంతన్. |
522 |
| మ. |
చల మొప్పన్ నిగుడించి వానిరథముం జక్కాడి తత్సారథిం దల వే ద్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం బ్రలయార్కప్రతిమానచక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ డిలఁ గూలెం గులిశాహతి న్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా! |
523 |
| చ. |
మడవక కాశికావిభునిమస్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై వడి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులన్ గడఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త న త్తఱిన్. |
524 |
| క. |
సుర గంధర్వ నభశ్చర, గరుడోరగసిద్ధసాధ్యగణము నుతింపన్ మరలి చనుదెంచి హరి నిజ, పురమున సుఖ ముండె నతివిభూతి దలిర్పన్. |
525 |
| క. |
వనజోదరు చిహ్నంబులు, గొనకొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై యనవరతము హరి దన తలఁ, పునఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా! |
526 |
| సీ. |
అక్కడఁ గాశిలో నా రాజు మందిరాం, గణమునఁ గుండలకలిత మగుచుఁ బడి యున్న తలఁ జూచి పౌరజనంబులు, దమరాజు తలయకాఁ దగ నెఱింగి చెప్పిన నా నృపుజీవితేశ్వరులును సుతులు, బంధువులును హితులు గూడి మొనసి హాహాకారమున నేడ్చి, రత్తఱిఁ, దత్తనూభవుఁడు సుదక్షిణుండు |
|
| తే. |
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి, జనకు ననిలో వధించిన చక్రపాణి నడరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి, చతురుఁ డగునట్టి తన పురోహితునిఁ బిలిచి. |
527 |
| క. |
అతడుం దానును జని పశు, పతిపదసరసిజములకును బ్రమదముతో నా నతుఁడై య ద్దేవుని బహు, గతులం బూజింప నతఁడు కరుణాన్వితుఁడై. |
528 |
| క. |
మెచ్చితి నే వర మైనను నిచ్చెద నను వేఁడు మనిన నీశ్వర ! నన్నున్ మచ్చిక రక్షింతువు పొర, పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా! |
529 |
| క. |
దేవా! మ జ్జనకుని వసు, దేవాత్మజుఁ డాజిలో వధించెను, నే నా గోవిందుని ననిలోపల, నే విధమున గెలుతు నాన తీవె పురారీ!’ |
530 |
| తే. |
అనిన శంకరుఁ డతనికి ననియె ననఘ!, నీవు ఋత్విజులును భూసురావళియును బ్రీతి నభిచార మొనరింప భూతయుక్తుఁ, డగుచు ననలుండు దీర్చు నీ యభిమతంబు’. |
531 |
| తే. |
అనిన నా చంద్రమౌళివాక్యములభంగి, భూరినియమముతో నభిచారహోమ మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ, జెలఁగ దక్షిణవలమాన శిఖల వెలిఁగె. |
532 |
| వ. | అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబు లైన నిడుదకోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడినబొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతిరౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిననిహన్యమానప్రాణిరక్తారుణమృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాలతాలప్రమాణపాదద్వయహతులం దూలు పెంధూళి నింగి మ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచనసంజాతసముద్ధూతనిఖిలభయంకరజ్వాలికాజాలంబున దిశాజాలంబు లోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరునగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచువనమృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదం బాడు దామోదరునిం గని రక్షరక్షేతిరవంబుల నార్తులయి ‘కృష్ణ! కృష్ణ! పెనుమంటలఁ బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె’ నన వారిం జూచి ‘యోడ కోడకుఁ’ డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దనదివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్రప్రేరితయైన య మ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తియై యున్న య ద్దివ్య సాధనంబు గనుంగొని యప్పుడు. | 533 |
| సీ. |
భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్దామ మగుచుఁ జండమై విజితమార్తాండమై పాలితాజాండమై విజయప్రకాండ మగుచు దివ్యమై నిఖిలగంతవ్యమై సుజనసంభావ్యమై సద్భక్తసేవ్య మగుచు నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జితదైత్య మగుచు |
|
| తే. |
విలయసమయసముద్భూతవిపులభాస్వ, దళికలోచనలోచనానలసహస్ర ఘటితపటుసటాజ్వాలికాచటులసత్త్వ, భయదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి. |
534 |
| వ. | అదియును బ్రళయవేళాసంభూతజీమూతసంఘాతప్రభూతఘుమఘుమాటోపనినదాధరీకృత మహాదుస్సహకహకహ నిబిడనిస్వన నిర్ఘోషపరిపూరితబ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహకీలాసముత్కట పటుచిటపటస్ఫుటద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ, జయ జయ, శబ్దకలితంబును, ననంతతేజోవిరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంట నంటిన నది తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతం బొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె, నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధప్రాకారగోపురాట్టాలకాదివివిధవస్తువాహననికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచనపార్శ్వవర్తియై నిజప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె నని చెప్పి మఱియు నిట్లనియె. | 535 |
| క. |
మురరిపువిజయాంకితమగు, చరితము సద్భక్తిఁ దగిలి చదివిన వినినన్ దురితములఁ బాసి, జను లిహపరసౌఖ్యము లతనిచేతఁ బడయుదు రధిపా! |
536 |
| వ. | అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె. | 537 |