పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
బలరాముండు సుహృద్బంధుజన దర్శనార్థమై వ్రేపల్లెకుఁ బోవుట
సీ. నరనాథ! విను మొకనాఁడు తాలాంకుండు చుట్టాల బంధులఁ జూచువేడ్క
సుందరకాంచనస్యందనారూఢుఁడై, భాసిల్లుచున్న వ్రేపల్లె కరిగి
చిరకాలసంగతస్నేహులై గోపగో, పాంగనానికర మాలింగనములు
సముచితసత్కృతుల్‌ సలుపఁ గైకొని మహో, త్సుకలీల నందయశోదలకును
 
తే. వందనం బాచరించిన వారు మోద, మంది బిగియారఁ గౌఁగిళ్ల నొందఁ జేర్చి
సమత దీవించి యంకపీఠమునఁ జేర్చి, శిరము మూర్కొని చుబుకంబుఁ గరము పుణికి.
483
వ. మఱియు నానందబాష్పధారాసిక్తకపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్పుడు నరసి రక్షింపవలయు, మాకు నేడుగడయ మీరు కాక యొరులు గలరే? యని సముచితసంభాషణంబులం బ్రొద్దుపుచ్చు చుండి రంత. 484
క. గోపాలవరులు ప్రమదం, బాపోవని మది నివర్తితాఖిలగేహ
వ్యాపారు లగుచు హలధరు, శ్రీపాదంబులకు నతులు సేసిరి వరుసన్‌.
485
క. సీరియు వారికిఁ గరుణో, దారుండై నడపె సముచితక్రియ లంతం
గోరి తనయీడు గోప కు, మారులఁ జే చఱచి బలుఁడు మందస్మితుఁడై.
486
క. నిజసుందర దేహద్యుతి, రజతాచలరుచులఁ దెగడ రాముఁడు వారల్‌
భజియింప నేగి యొకచో, విజనస్థలమున వసించి విలసిల్లు నెడన్‌.
487
కవిరాజ విరాజితము. చరణములం గనకస్ఫుటనూపురజాలము గల్లనుచుం జెలఁగం
గరములఁ గంకణముల్‌ మొరయన్‌ నలి కౌ నసియాడఁ గుచాగ్రములన్‌
సరులు నటింపఁ గురుల్‌ గునియన్‌ విలసన్మణి కుండలకాంతులు వి
స్ఫురితకపోలములన్‌ బెరయన్‌ వ్రజసుందరు లంద ఱమందగతిన్‌.
488
కవిరాజవిరాజితము. చని బలభద్రుని శౌర్యసముద్రుని సంచితపుణ్యు నగణ్యునిఁ జం
దనఘనసారపటీరతుషారసుధారుచికాయు విధేయు సుధా
శనరిపుఖండను సన్మణిమండను సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక యదుప్రభు నిట్లని రుత్కలికన్‌.
489
చ. ‘హలధర! నీ సహోదరుఁ డుదంచితకంజవిలోచనుండు స
ల్లలితపురాంగనాజనవిలాసవిహారసమగ్రసౌఖ్యముల్‌
గలిగి సుఖించునే? మము నొకానొక వేళనయేని బుద్ధిలోఁ
దలఁచునొ? నూతనప్రియలఁ దార్కొని యేమియుఁ బల్కకుండునో?
490
క. జననీజనకుల ననుజులఁ, దనుజుల బంధువుల మిత్రతతుల విడిచె నె
మ్మనమున నొండు దలంపక, తను నమ్మినవారి విడువఁ దగునే హరికిన్‌?
491
సీ. సలలితయామునసైకతస్థలమున, నుండ మ మ్మేమని యూఱడించె
విమలబృందావనవీథి మా చుబుకముల్‌, పుణుకుచు నే మని బుజ్జగించెఁ
బుష్పవాటికలలోఁ బొలుచు మా కుచయుగ్మ, మంటుచు నే మని యాదరించెఁ
గాసారముల పొంతఁ గౌఁగిట మముఁ జేర్చి, నయమొప్ప నే మని నమ్మఁ బలికె
 
తే. నన్నియు మఱచెఁ గాఁబోలు వెన్నుఁ డాత్మఁ, గోరి తా జాయలున్నైన వారి విడుచు
నట్టి కృష్ణుఁడు దము ఱట్టు వెట్టు ననక, యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు.
492
మ. అని యిబ్భంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు
న్ననుబంధుల్‌ పరిరంభణంబులు రతివ్యాసంగముల్‌ భావముల్‌
వినయంబుల్‌ సరసోక్తులుం దలఁచి యువ్విళ్ళూరుచిత్తంబులన్‌
జనితానంగశరాగ్నిచేత దురవస్థం బొంది శోకించినన్‌.
493
వ. అంత బలభద్రుండు వారలమనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతుర వచనంబులఁ గృష్ణునిసందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడపుచుఁ గాళిందీతీరంబున. 494
సీ. మాకందజంబీరమందారఖర్జూర, ఘనసారశోభితవనములందు
నేలాలతాలోలమాలతీమల్లికా, వల్లీమతల్లికావాటికలను
దరళతరంగశీకరసాధుశీతల, సైకతవేదికాస్థలములందు
మకరందరసపానమదవదిందిందిర, పుంజరంజితమంజుకుంజములను
 
తే. విమలరుచి గల్గు సానుదేశములయందు, లలితశశికాంతఘనశిలాతలములందు
లీల నిచ్ఛావిహారవిలోలుఁ డగుచు, సుందరీజనములు గొల్వఁ జూడ నొప్పె.
495
తే. అట్లు విహరింప వరుణునియాజ్ఞఁ జేసి, వారుణీదేవి మద్యభావంబు నొంది
నిఖిలతరుకోటరములందు నిర్గమించి, మించు వాసనచేత వాసించె వనము.
496
వ. అట్టియెడ. 497
మ. కర మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాలసుం
దరులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేవించి యా
తరళాక్షుల్‌ మణిహేమకంకణఝణత్కారానుకారంబులై
కరతాళంబులు మ్రోయఁ బాడుచును వేడ్క న్నాడుచున్‌ సోలుచున్‌.
498
సీ. తనమీఁది బిరుదాంకితములైన గీతముల్‌, వాడుచు రా బలభద్రుఁ డంత
మహితకాదంబరీమధుపానమదవిహ్వ, లాక్షుండు లలితనీలాలకుండు
నాలోలనవపుష్పమాలికోరస్స్థలుఁ, డనుపమమణికుండలాంచితుండు
ప్రాలేయసంయుక్తపద్మంబుగతి నొప్పు, సలలితాననఘర్మజలకణుండు
 
తే. నగుచు వనమధ్యమున సలిలావగాహ, శీలుఁడై జలకేళికిఁ జేరి యమున
నిందు రమ్మని పిలువఁ గాళింది యతని, మత్తుఁ డని సడ్డసేయక మసలుటయును.
499
చ. ఘనకుపితాత్ముఁడై యమునఁ గన్గొని రాముఁడు వల్కెఁ డాయఁ జీ
రినఁ జనుదేక తక్కితి పురే! విను నిందఱుఁ జూడ మద్భుజా
సునిశితలాంగలాగ్రమున సొంపఱ నిప్పుడు నూఱుత్రోవలై
చన వెసఁ జించివైతు నని చండపరాక్రమ మొప్ప నుగ్రుఁడై.
500
వ. అట్లు కట్టలుక రాము డుద్దామంబగు బాహుబలంబున హలంబు సాఁచి య మ్మహావాహినిం దగిల్చి పెకలిరాఁ దిగిచిన న న్నది భయభ్రాంతయై సుందరీరూపంబు గైకొని యతిరయంబునం జనుదెంచి, య య్యదువంశతిలకుండగు హలధరునిపాదారవిందంబులకు వందనం బాచరించి యిట్లనియె. 501
మ. ‘బలరామా! ఘనబాహ! నీ యతులశుంభద్విక్రమం బంగనల్‌
దెలియం జాలెడివారె? యీ యఖిలధాత్రీభారధౌరేయ ని
శ్చలసత్త్వుండగు కుండలీశ్వరుఁడునుం జర్చింప నీ సత్కళా
కలితాంశప్రభవుండు! నీ గురుభుజాగర్వంబు సామాన్యమే?
502
చ. అని వినుతించి యేను భవదంఘ్రిసరోజము లాశ్రయించెదన్‌
ననుఁ గరుణింపు మన్న యదునందనుఁ డన్నదిఁ బూర్వమార్గవై
చను మని కామినీనికరసంగతుఁడై జలకేళి సల్పె నిం
పెనయఁ గరేణుకాయుతమదేభము చాడ్పున నమ్మహానదిన్‌.
503
తే. అంత జలకేళి సాలించి సంతసంబు, నందుచుండ వినీలవస్త్రాదిరత్న
మండనంబులుఁ గాంచనమాలికయును, దెచ్చి హరి కిచ్చి చనె నా నదీలలామ.
504
క. అవి యెల్లఁ దాల్చి హలధరుఁ, డవిరళగతి నొప్పి వల్లవాంగనలును దా
దివిజేంద్రుఁ బోలి మహితో, త్సవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుఁడై.
505
క. అవనీశ! యిట్లు హలమునఁ, దివిచినఁ గాళింది వ్రయ్య దెలియఁగ నేఁడున్‌
భువి నుతి కెక్కెను రాముని, ప్రవిమలతరమైన బాహుబలసూచకమై.
506
వ. అంత బలభద్రుండు వ్రజసుందరీసమేతుండై నందఘోషంబునం బరితోషంబు నొందుచుండె, నంత నక్కడఁ గరూశాధిపతియైన పౌండ్రకుండు తనదూతం బిలిచి యిట్లనియె. 507
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )