పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
నృగమహారాజు చరిత్రము
సీ. ధరణీశ! యొకనాఁడు హరితనూజులు, రతీశ్వరసాంబసారణచారుభాను
లాదిగా యదుకుమారావలి యుద్యాన, వనమున కతివైభవమున నేగి
వల నొప్ప నిచ్ఛానువర్తులై సుఖలీలఁ, జరియించి ఘనపిపాసలను జెంది
నెఱి దప్పి సలిల మన్వేషించుచును, వేగ వచ్చుచో నొకచోట వారిరహిత
 
తే. కూపమును నందులో నొక కొండవోలె, విపుల మగుమేని యూసరవెల్లిఁ గాంచి
చిత్తముల విస్మయం బంది తత్తఱమున, దాని వెడలించు వేడుక దగులుటయును.
454
చ. పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁ గట్టి య
గ్గురుభుజు లందఱుం గదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
దరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్‌.
455
ఉ. విని నరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై జలశూన్యకూప మ
ల్లన కదియంగ నేఁగి కృకలాసము నొక్కతృణంబుఁ బోలె గొ
బ్బున వెడలించె వామకరపద్మమున న్నది యంతలోనఁ గాం
చనరుచి మేనఁ గల్గు పురుషత్వముతోఁ బొడసూపి నిల్చినన్‌.
456
వ. చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడిజనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతని చేతఁ దద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె. 457
చ. కనదురురత్నభూషణనికాయుఁడవై మహనీయమూర్తివై
యనుపమకీర్తిశోభితుఁడవై విలసిల్లుచు ధాత్రిమీఁదఁ బెం
పొనరిన నీకు నేమి గతి నూసరవెల్లితనంబు చొప్పడెన్‌
విన నిది చోద్యమయ్యె సువివేకచరిత్ర! యెఱుంగఁ జెప్పుమా!’
458
క. అని యడిగిన మురరిపు పద, వనజంబులఁ దన కిరీటవరమణు లొరయన్‌
వినయమున మ్రొక్కి యిట్లను, ఘనమోదముతోడ నిటలఘటితాంజలియై.
459
తే. విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుఁ, బ్రకటముగ నీ వెఱుంగని దొకటి గలదె
యైన నాచేత విన నిష్ట మయ్యెనేని, నవధరింపుము వినిపింతు నంబుజాక్ష!
460
శా. ఏ నిక్ష్వాకుతనూజుఁడన్‌ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్‌
దీనవ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స
మ్మానింపం జతురంతభూభరణసామర్థ్యుండనై సంతత
శ్రీ నిండారినవాఁడ నుల్లసితకీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్‌.
461
చ. పలుకులఁ దన్నుఁ దాఁ బొగడఁ బాతకమందు ర టుండెఁ దారకా
వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టఁగా
నలవడుఁ గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో
వుల గణుతింప ధాతయును నోపఁడు మాధవ! యేమి సెప్పుదున్‌?
462
వ. అదియునుం గాక 463
చ. పొలుచు సువర్ణశృంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ
త్సలు గల పాఁడియావుల నుదాత్తతపోవ్రతవేదపాఠముల్‌
గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు పేద వి
ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పఁగ నిత్తు నచ్యుతా!
464
వ. మఱియును న్యాయసముపార్జితవిత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధదానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిఁ, బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, ని వ్విధంబునం జేయుచో నొక్కనాఁడు. 465
క. అనఘా! మునుపడఁ గశ్యపుఁ, డను విప్రున కే నకల్మషాత్ముఁడనై యి
చ్చిన గోవు దప్పి నా మం, దను గలసినఁ దెలియలేక తగ నా గోవున్‌.
466
క. ఒండొక భూమీసురకుల, మండనునకు దాన మీయ మసలక యా వి
ప్రుం డా గోవుం గొని చను, చుండన్‌ మును ధారగొన్న యుర్వీసురుఁడున్‌.
467
క. మది రోష మొదవ దోవతి, వదలిన బిగియించుకొనుచు వడిఁ గది సిది నా
మొదవు, నడివీథి దొంగిలి, వదలక కొనిపోయె, దిట్టివారుం గలరే?
468
చ. అనవుడు నాతఁ డిట్లనియె నాతనితో నిపు డేను దీని నీ
జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యె?
ట్లనిన నతండు ‘నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా’
వని వినిపింప నిద్దఱకు నయ్యె నపారవివాద మచ్చటన్‌.
469
వ. ఇట్లు విప్రు లిద్దఱుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరిఁగి కలహించి నా యున్న యెడకుం జనుదెంచిరి, మున్ను నాచేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె. 470
సీ. ‘మనుజేంద్ర! ప్రజ లధర్మ ప్రవర్తనముల, నడవకుండఁగ నాజ్ఞ నడపు నీవు
మనమున నే ధర్మ మని యాచరించితి?, మును నాకు నిచ్చిన మొదవు దప్పి
వచ్చి నీ మందలోఁ జొచ్చిన నిప్పు డీ, భూసురునకు ధార వోసి యిచ్చి
తగవు మాలితివి దాతవు నపహర్తవు, నైన ని న్నేమందు? నవనినాథ!
 
తే. యనిన మాటలు సెవులు సోఁకినఁ గలంగి, భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ
నిట్టి పాపంబు దొరసె నే నెఱిఁగి సేయఁ, గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు.’
471
క. అని మఱియును న వ్విప్రుని, సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్‌
ననుఁ గావు, నరకకూపం, బునఁ బడఁగా జాలఁ విప్రపుంగవ!’ యనుచున్‌.
472
తే. ఎంత వేఁడిన మచ్చరం బంత పెరిఁగి, మొదల నా కిచ్చినట్టి యీ మొదవె కాని
యెనయ నీ రాజ్య మంతయు నిచ్చితేని, నొల్ల నని విప్రుఁ డచ్చట నుండ కరిగె.
473
వ. అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింపక పదివే లేఱి కోరిన పాఁడి మొదవుల నిచ్చిన నైనను దీనిన కాని యొల్ల నని నిలువక చనియె, నంతఁ గాలపరిపక్వంబైన నన్ను దండధరకింకరులు గొనిపోయి వైవస్వతుముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె. 474
మ. మనుజేంద్రోత్తమ! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ
ఘనదానక్రతుధర్మముల్‌ త్రిభువనఖ్యాతంబులై చెల్లెడిన్‌,
మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై
చను సౌఖ్యంబులఁ బొందు, పద్మజునియాజ్ఞం ద్రోవఁగా వచ్చునే?
475
వ. అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపుడ యీ నికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి నింతకాలంబు దద్దోషనిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ, బ్రాణులకుఁ బుణ్యపాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు. నేఁడు సమస్త దురితనిస్తారకం బయిన భవదీయపాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలం బాసి నిర్మలాత్మకుండ నైతి నని పునఃపునః ప్రణామంబు లాచరించి మఱియు నిట్లనియె. 476
ఆ. ‘కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!, యప్రమేయ! వరద! హరి! ముకుంద!
నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపఁ గనుగొంటి, నఖిలసౌఖ్యపదవు లందఁ గంటి’.
477
వ. అని యనేకభంగులం గొనియాడి గోవిందునిపదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి ‘దేవా! భవదీయపాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?’ యని తదనుజ్ఞాతుండై యచ్చటిజనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతులతేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె, నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె. 478
సీ. నరనాథ! కులకాననము దహించుటకును, నవనీసురుల విత్త మగ్నికీల,
జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప, బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు,
పార్థివోత్తముల సంపచ్ఛైలములఁ గూల్ప, భూసురధనము దంభోళిధార,
జగతీవరుల కీర్తిచంద్రిక మాప వి, ప్రోత్తముధనము సూర్యోదయంబు,
 
తే. విప్రతతిసొమ్ముకంటెను విషము మేలు, గరళమునకును బ్రతికృతి గలదు గాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు, గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.
479
క. ఎఱుఁగమి నైనను భూసుర, వరుల ధనం బపహరింప వలవదు పతికిన్‌.
మఱపున ననలము ముట్టిన, దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్‌?
480
వ. మఱియును దనధనంబు పరులచేతఁ గోల్పడినవిప్రుండు దుఃఖమున రోదనంబుసేయ రాలిన యశ్రుకణంబుల నవని రేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైనపతి దారుణవేదనలు గల కుంభీపాకనరకంబు నొందు. మఱియు నతనితోడఁ గ్రిందటఁ బదితరంబులవారును, ముందటఁ బదితరంబులవారును మహానరకవేదనలం బొందుదురు. స్వదత్తంబైన నర్థలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్రసంభూతధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేలసంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు. నట్లగుట యెఱింగి విప్రు డెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదుపాలింటివా, రదియునుం గాక యేనును బ్రతిదినంబును భూసురుల నతివినయంబునఁ బూజింతు. నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు. నది గావున మీరలును బ్రాహ్మణజనంబులవలనం బరమభక్తి గలిగి మెలంగుం డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజనివాసంబునకుం జనియె’ నని చెప్పి శుకుం డిట్లనియె. 481
క. ఈ కథఁ జదివిన వారలుఁ, గైకొని వినువారు విగతకలుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు, రా కైవల్యంబుఁ గరతలామలక మగున్‌.
482
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )