పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురి కరుగుట
క. పురమున కేగి యుషాసుం, దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం
బరదాసదాసికాజన, వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్‌.
446
క. కనకరథంబున నిడుకొని, ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా
ననిరుద్ధుని గోవిందుం, డనుమోదింపంగఁ దెచ్చి యర్పించె నృపా!
447
ఉ. అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య
త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా
కాంతుఁడు మున్నుగాఁ బటహకాహళతూర్యనినాదపూరితా
శాంతరుఁడై వెసం జనియె నాత్మపురీముఖుఁడై ముదంబునన్‌.
448
మ. కనియెన్‌ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో
క నదోత్తుంగతరంగసంగతలసత్కాసారకన్‌ భూరి శో
భన నిత్యోన్నతసౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్‌
జనసంతాపనివారకన్‌ సుజనభాస్వత్తారకన్‌ ద్వారకన్‌.
449
వ. కని డాయం జనఁ బురలక్ష్మి కృష్ణసందర్శనకుతూహలయై చేసన్నలం జీరుచందంబున నందంబు నొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకత తోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాదవీథికావిలసితంబును, మౌక్తికవితానవిరచితమంగళరంగవల్లీవిరాజితంబును, శోభనాకలితవిన్యస్తకదళికాస్తంభసురభికుసుమమాలికాక్షతాలంకృతంబును, గుంకుమసలిలసిక్త విపణిమార్గంబును, శంఖదుందుభిభేరీమృదంగపటహకాహళమృదంగాదిమంగళారావకలితంబును, వందిమాగధసంగీత ప్రసంగంబునునై యతిమనోహరవిభవాభిరామంబైన య ప్పురవరంబు సచివపురోహితసుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనాకరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె, నంత. 450
క. శ్రీకృష్ణునివిజయం బగు, నీ కథఁ బఠియించువార లెప్పుడు జయముం
గైకొని యిహపరసౌఖ్యము, లాకల్పోన్నతి వహింతు రవనీనాథా!
451
క. అని చెప్పిన శుకయోగికి, జననాయకుఁ డనియెఁ గృష్ణచరితము విన నా
మన మెపుడుఁ దనియ దింకను, వినవలతుం గరుణఁ జెప్పవే మునినాథా!
452
వ. అనినఁ బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 453
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )