పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శివుండు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట
తే. కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు, గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ గదియ వచ్చి
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ, డగుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.
440
వ. ‘దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు, నిఖిలవేదవేదాంతనిగూఢుండవు, నిర్మలుండవు, సమానాధికరహితుండవు, సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైనవార లాకాశంబుపగిది నవలోకింతు, రదియునుం గాక పంచోపనిషన్మయం బయిన భవదీయదివ్యమంగళమహావిగ్రహ పరిగ్రహంబు సేయు నెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుండును, బాదంబుల వసుంధరయు, నాత్మయం దహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీవ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబు సేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయదివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు, అద్వితీయుండవు, పురాణపురుషుండవు, సకలసృష్టిహేతుభూతుండవు, ఈశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచువిధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండ వయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేకరూపుండవై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబురూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితు లయిన జీవులు పుత్త్రదారగృహక్షేత్రాదిసంసారరూపకంబైన పాపపారావారమహావర్త గర్తంబుల మునుంగుచుం దేలుచుందురు; దేవా! భవదీయదివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియపరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేర నెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుం డనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండవైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబు మాని హాలాహలంబు సేవించుట గాదె? జగదుదయపాలనలయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండవై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణులైన మునిగణంబులును భజియించుచుందుము, మఱియును. 441
తే. అవ్యయుండ, వనంతుండ, వచ్యుతుండ, వాదిమధ్యాంతశూన్యుండ, వఖిలధృతివి
నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి, నిఖిలమెల్లను నీయంద నెగడుఁ గృష్ణ!
442
సీ. అని సన్నుతించిన హరి యాత్మ మోదించి, మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త
లలితబాలేందుకళామౌళి కిట్లను, శంకర! నీమాట సత్య మరయ
నేది నీకిష్టమై యెసఁగెడు దానిన, వేఁడుము నీ కిత్తు వీఁ డవధ్యుఁ
డిది యెట్టి దనినఁ బ్రహ్లాదుండు మద్భక్తుఁ, డతనికి వరము నీ యన్వయమున
 
తే. జనన మందినవారలఁ జంప ననుచుఁ, గడఁక మన్నించితిని యది కారణమున
విశ్వవిశ్వంభరాభారవిపులభూరి, బలభుజాగర్వ మడఁపంగ వలయుఁ గాన.
443
క. కరములు నాలుగు సిక్కం, బరిమార్చితి, వీఁడు నీదు భక్తుల కగ్రే
సరుఁడై పొగడొంది జరా, మరణాదిభయంబు దక్కి మను నిట మీఁదన్‌.
444
వ. అని యాన తిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె, నబ్బలినందనుం డట్లు రణరంగ వేదిం గృష్ణదేవతాసన్నిధిం బ్రజ్వలితచక్రకృశానుశిఖాజాలంబులందు నిజబాహాసహస్ర శాఖాసమి త్ప్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాలమహితాజ్యధారాశతంబును, బరభయంకరవీరహుంకార మంత్రంబుల తోడ వేల్చి, పరిశుద్ధిం బొంది, విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాఁడై యనవరతపూజితస్థాణుండగు నబ్బాణుండు భుజవనవిచ్ఛేదజనితవిరూపితస్థాణుం డయ్యును దదీయవర దానకలితానందహృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకుఁ బ్రణామంబు లాచరించి యనంతరంబ. 445
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )