| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
కమనీయకింకిణీఘంటికాసాహస్ర, ఘణఘణధ్వనిచేత గగన మగల నన్యజనాలోక నాభీలతరళోగ్ర, కాంచనధ్వజపతాకలు వెలుంగఁ బృథునేమిఘట్టనఁ బృథివి కంపింపంగ, వలనొప్పు పటుజవాశ్వములఁ బూన్చి నట్టి యున్నతరథం బత్యుగ్రగతి నెక్కి, కరసహస్రమున భీకరతరాసి |
|
| తే. |
శరశరాసనముఖదివ్యసాధనములు, దనరఁ జలమును బలము నుత్కటము గాఁగ హర్ష మిగురొత్తఁ గయ్యంపుటాయితమునఁ, బురము వెలువడె బలిపుత్త్రుఁ డురుజవమున. |
434 |
| క. |
చని రణభూమిని మధ్యం, దినమార్తాండప్రచండదీప్తాకృతితోఁ దనరుచుఁ బరిపంథిబలేం, ధనదవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్. |
435 |
| ఉ. |
తాఁకి భుజావిజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొ క్కూఁకున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోఁ దాఁకఁగ నేసినన్ మురవిదారుఁడు తోడన తచ్ఛరావళి న్నాఁక గొనంగఁ ద్రుంచె నిశితార్ధశశాంకశిలీముఖంబులన్. |
436 |
| వ. | అంత. | 437 |
| చ. |
నుతనవపుండరీకనయనుం డన నొప్పు మురారి రోషఘూ ర్ణితమహితారుణాబ్జదళనేత్రుఁడు దా నటు పంచె దైత్యుపై దితిసుతకాననప్రవరదీపితశుక్రము రక్షితాంచితా శ్రితజనచక్రమున్ సతతసేవితశక్రము దివ్యచక్రమున్. |
438 |
| వ. | అదియునుం బ్రచండమార్తాండమండలప్రభావిడంబితంబును, భీషణశతసహస్రకోటిదంభోళి నిష్ఠురనిబిడనిశితధారాసహస్రప్రభూతజ్వలనజ్వాలికాపాస్తసమస్తకుటిలపరిపంథిదుర్వారబాహాఖర్వ గర్వాంధకారంబును, సకలదిక్పాలదేవతాగణజేగీయమానంబును, సమదదానవజనశోకకారణభయంకర దర్శనంబును, సమంచితసజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతకప్రేరితంబై చని, యారామకారుండు కదళికాకాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమదవేదండశుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయకేయూరకంకణాలంకృతంబు నగు తదీయబాహాసహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున. | 439 |