| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| చ. |
వరదుఁ డుదారభక్తజనవత్సలుఁడైన హరుండు బాణునిం గర మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా దుర మొనరించువేడ్కఁ బ్రమథుల్ గుహుఁడున్ నిజభూతకోటియున్ సరస భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁడై. |
402 |
| సీ. |
ఖురపుటాహతి రేఁగు ధరణీపరాగంబు, పంకేరుహాప్తబింబంబుఁ బొదువ విపులవాలాటోపవిక్షేపజాతవా, తాహతి వారివాహములు విరియఁ గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన, బ్రహ్మాండభాండకర్పరము వగుల నలవోక ఖణిఖణిల్లని ఱంకె వైచిన, రోదసీకుహరంబు భేదిలంగ |
|
| తే. |
గళచలద్భర్మఘంటికాఘణఘణ ప్ర, ఘోషమున దిక్తటంబు లాకులత నొంద లీల నడతెంచు కలధౌతశైల మనఁగ, నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె. |
403 |
| వ. | ఇట్లు వెడలి సమరసన్నాహసముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబుల తోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె, నప్పు డప్పురాతనయోధుల యాయోధనంబుఁజూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవశక్రసురయక్షసిద్ధసాధ్యచారణగంధర్వకిన్నరకింపురుష గరుడోరగాదులు నిజవిమానారూఢులై వియత్తలంబున నిలిచి రట్టియెడం గృష్ణుండును - హరుండును, మారుండును - గుమారుండును, గూపకర్ణ - కుంభాండులును - గామపాలుండును; బాణుపుత్త్రుండగు బలుండును - సాంబుండును; సాత్యకియును - బాణుండును, రథికులు - రథికులును, నాశ్వికులు - నాశ్వికులును, గజారోహకులు - గజారోహకులును, బదాతులు - పదాతులునుం దలపడి యితరేతరహేతిసంఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వానబిరుదాంకితసింహనాదహుంకార శింజినీటంకారవారణఘీంకార వాజిహేషారవంబులను, బటహకాహళభేరీమృదంగశంఖతూర్యఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె, న య్యవసరంబున. | 404 |
| చ. |
జలరుహనాభుఁ డార్చి నిజశార్‌ఙ్గశరాసనముక్తసాయకా వలి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా కలితుల గుహ్యకప్రమథకర్బురభూతపిశాచడాకినీ బలవదరాతియోధులను బమ్మెరపోయి కలంగి పాఱఁగన్. |
405 |
| వ. | ఇట్లేసి యార్చిన కుంభినీధరుభుజావిజృంభణసంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియునిశితాంబకంబులం బీతాంబరు నేసిన, వాని నన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి, చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును. | 406 |
| మ. |
అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా వనజాతేక్షణుమీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁడై యేసె, నే సినఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్ జనితాశ్చర్యరసాబ్ధిమగ్ను లగుచున్ శక్రాదు లగ్గింపఁగన్. |
407 |
| శా. |
వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతి న్నేయ దై తేయధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం, గ్రతుధ్వంసి యా గ్నేయాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై, దాని వే మాయం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్. |
408 |
| వ. | మఱియును. | 409 |
| ఉ. |
పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్ దోయరుహాయతాక్షుఁడును దోడన లోకభయంకరోగ్ర నా రాయణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ క్రాయుధుఁ డిత్తెఱంగునఁ బురారిశరావలి రూపుమాపినన్. |
410 |
| క. |
ఊహ కలంగియు విగతో, త్సాహుండగు హరునిమీఁద జలజాక్షుఁడు స మ్మోహనశిలీముఖం బ, వ్యాహతజయశాలి యగుచు నడరించె నృపా! |
411 |
| వ. | అట్లేసిన. | 412 |
| క. |
జృంభణశరపాతముచే, శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్ జృంభితుఁడై ఘననిద్రా, రంభతవృషభేంద్రుమూఁపురముపై వ్రాలెన్. |
413 |
| వ. | ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణపరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు ని వ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె, నంత. | 414 |
| చ. |
తఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ గఱకరిఁ దాఁకి తీవ్రశితకాండపరంపర లేసి నొంపఁగా నెఱఁకులు గాఁడి పైఁదొరఁగు నెత్తుట జొత్తిలి వైరు లార్వఁ గాఁ బఱచె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజి భీతుఁడై. |
415 |
| ఉ. |
పంబి రణక్షితిన్ శరవిపాటితశాత్రవవీరుఁడైన యా సాంబుఁడు హేమపుంఖశితసాయకజాలము లేర్చి భూరికో పంబున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ ర్యంబును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్. |
416 |
| మ. |
వరబాహాబలశాలి యా హలి రణావష్టంభసంరంభ వి స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూన్చి వ్రేసెన్ బొరిం బొరిఁ గుంభాండక కూపకర్ణుల శిరంబుల్ వ్రస్సి మేదంబు నె త్తురు గర్ణంబుల వాతనుం దొరఁగ సంధుల్ వ్రీలి వే చావఁగన్. |
417 |
| వ. | అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుంబోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురికొల్పి తానును ముంగలియై నడచె, నప్పు డుభయసైన్యంబు లన్యోన్యజయకాంక్షం దలపడు దక్షిణోత్తరసముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరంబయ్యె, నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు; ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు; శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు; సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును; నులిసిన మేనులును, నలిసిన జానువులును; నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబులయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును; విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలురుధిరంబులును; బడలుపడుబలంబులును, గొండలవడువునం బడు మాంసఖండంబులును; వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును; గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును; దెరలిన కాలుబలంబులును గలిగి, పలలఖాదనకుతూహలజనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోలకోలాహలభయంకరారావబధిరీకృతసకలదిశావకా శంబయి సంగరాంగణంబు భీషణం బయ్యె, న య్యవసరంబున. | 418 |
| చ. |
శరకుముదంబు లుల్లసితచామరఫేనము లాతపత్ర భా సురనవపుండరీకములు శోణితతోయము లస్థిసైకతో త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాపశైవల స్ఫురణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్. |
419 |
| వ. | అట్టి యెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోపప్రదీప్తుండై కదిసి. | 420 |
| మ. |
ఒక యే నూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త క్కక యొక్కొక్కట సాయకద్వయము వీఁకం బూన్చు నాలోన నం దకహస్తుండు తదుగ్రచాపచయవిధ్వంసంబు గావించి కొం చక తత్సారథిఁ గూల నేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్. |
421 |
| తే. |
ప్రళయజీమూతసంఘాతభయదభూరి, భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య మఖిలజనులు భయభ్రాంతులయి చలింపఁ, గడఁగి నిర్భిన్నరాక్షసీగర్భముగను. |
422 |
| వ. | అట్టి యవక్రవిక్రమపరాక్రమంబునకు వెగడుపడి బాణుండు లేటమొగంబువడి చేయునది లేక విన్ననయి యున్నయెడ. | 423 |
| సీ. |
అత్తఱిఁ గోటర యను బాణజనయిత్రి, సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి వీడి శిరోజముల్ వ్రేలంగ నిర్ముక్తపరిధానయై మురాసురవిభేది యెదుర నిల్చినఁ జూడ మదిఁ జాల రోసి ప, రాఙ్ముఖుఁడై యున్న ననువు వేచి తల్లడించుచు బాణుఁ డుల్లంబు గలగంగఁ, దలచీర వీడ యాదవులు నవ్వ |
|
| తే. |
నవ్యకాంచనమణి భూషణములు రాలఁ, బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ పురము వడిఁ జొచ్చె నప్పుడు భూతగణము, లాకులతతోడ నెక్కడే నరుగుటయును. |
424 |
| క. |
శిరములు మూఁడును ఘనభీ, కరపదములు మూఁడుఁ గలిగి కనలి మహేశ జ్వర మురుఘోరాకృతితో, నరుదేరఁగఁ జూచి కృష్ణుఁ డల్లన నగుచున్. |
425 |
| చ. |
పరువడి వైష్ణవజ్వరముఁ బంచిన న య్యుభయజ్వరంబులున్ వెరవును లావుఁ జేవయును వీరము బీరము గల్గి ఘోర సం గర మొనరింప నందుఁ గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణవ జ్వరమున కోడి పాఱె ననివారణ వైష్ణవి వెంట నంటఁగన్. |
426 |
| తే. |
పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి, నెనసి యేడ్చుచు నా హృషీకేశుపాద కంజములఁ బడి ‘ననుఁ గావు కావు’ మనుచు, నిటలతటఘటితాంజలిపుటయు నగుచు. |
427 |
| వ. | ఇట్లు వినుతించె. | 428 |
| సీ. |
అవ్యయు ననఘు ననంతశక్తిని బరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్ర వరుల కీశ్వరుఁ డైనవాని సర్వాత్మకు జ్ఞానస్వరూపు సమానరహితు వరదుని జగదుద్భవస్థితిసంహారహేతుభూతుని హృషీకేశు నభవు బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞానశక్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు |
|
| ఆ. |
నజు షడూర్మిరహితు నిజయోగమాయా వి, మోహితాఖిలాత్ము ముఖ్యచరితు మహితతేజు నాదిమధ్యాంతహీనునిఁ, జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ! |
429 |
| వ. | అదియునుం గాక లోకంబున దైవం బనేకప్రకారంబులై యుండు, నది యెట్టి దనినం గలాకాష్ఠా ముహూర్తంబులనం గల కాలంబును, సుకృతదుష్కృతానుభవరూపంబులైన జీవకర్మంబులును; స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థపరిజ్ఞానకారణంబైన యంతఃకరణంబును, మహదహంకారశబ్ద స్పర్శరూపరస గంధతన్మాత్రతత్కార్యభూతగగనపవనానలసలిలధరాదిపంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటిసంఘాతంబును, బీజాంకురన్యాయంబునం గార్యకారణరూపప్రవాహంబునునై, జగత్కారణశంకితంబై యుండు, నది యంతయు భవదీయమాయావిడంబనంబుగాని యున్నయది కాదు, తదీయమాయానివర్తకుండ వైన నీవు నానావిధదివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గగతులం గ్రూరాత్ముల హింసించుచుందువు, విశ్వవిశ్వంభరాభారనివారణంబు సేయుటకుఁ గదా భవదీయదివ్యావతారప్రయోజనంబు, గావున నిన్ను శరణంబు వేఁడెద. | 430 |
| సీ. |
శాంతమై మహితతీక్ష ణసుదుస్సహంబై యు, దారమై వెలుఁగొందు తావకీన భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ, గడుఁ గృశించితి నన్ను గరుణఁ జూడుఁ మితరదేవోపాస్తిరతి మాని మీ పాద, కమలముల్ సేవించు విమలబుద్ధి యెందాక మది దోఁప దందాఁకనే కదా, ప్రాణులు నిఖిలతాపములఁ బడుట? |
|
| తే. |
యవిరళానన్యగతికుల నరసి ప్రోచు, బిరుదు గల నీకు ననుఁ గాచు టరుదె? దేవ! ప్రవిమలాకార! సంసారభయవిదూర! భక్తజనపోష పరితోష! పరమపురుష! |
431 |
| చ. |
అనినఁ బ్రసన్నుఁడై హరి యనంతుఁడు దైత్యవిభేది దాని కి ట్లనియె మదీయసాధన మనన్యనివారణ మౌట నీ మదిం గని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వరతీవ్రదాహవే దన నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్. |
432 |
| వ. | అని మఱియు న ప్పుండరీకాక్షుం డిట్లను, ‘నెవ్వరేనియు నీ యుభయజ్వరవివాదంబును, నీవు మత్ప్రపత్తిం జొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టిపుణ్యాత్ములు శీతోష్ణజ్వరాదితాపంబులఁ బొరయ’ రని యానతిచ్చిన న మ్మహేశ్వరజ్వరంబు పరమానందభరితహృదయంబై యా రథాంగపాణికి సాష్టాంగ దండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె, నంత బాణాసురుండు నక్కడ. | 433 |