| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| వ. | అ య్యవసరంబున. | 391 |
| క. |
శారదనిర్మలనీరద, పారదరుచిదేహుఁ డతులభాగ్యోదయుఁ డా నారదముని యేతెంచె న, పారదయామతి మురారిభజనప్రీతిన్. |
392 |
| వ. | ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మలమణివినిర్మితసుధర్మాభ్యంతరంబున యదువృష్ణి భోజాంధకవీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, సముచితకనకాసనాసీనుం జేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధువృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షునిచేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ, దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి, తానును గట్టాయితం బయ్యె, నంత. | 393 |
| సీ. |
హారకిరీటకేయూరకంకణకట, కాంగులీయకనూపురాదివివిధ భూషణప్రతతిచేఁ బొలుపారి కరముల, ఘనగదాశంఖచక్రములు దనర సురభిచందనలిప్తసురుచిరోరస్స్థలిఁ, బ్రవిమలకౌస్తుభప్రభలు నిగుడఁ జెలువారు పీతకౌశేయచేలము కాసె, వలనుగా రింగులు వాఱఁ గట్టి, |
|
| తే. |
శైబ్యసుగ్రీవమేఘపుష్పకవలాహ, కములఁ బూన్చిన తే రాయితముగఁ జేసి, దారుకుఁడు దేర నెక్కె మోదం బెలర్ప, భానుఁ డుదయాచలం బెక్కుపగిది మెఱసి. |
394 |
| వ. | ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచనపూతుండును, మహితదూర్వాంకురాలంకృతుండును, లలితపుణ్యాంగనాకరకిసలయకలితశుభాక్షతవిన్యాసభాసురమస్తకుండును, మాగధమంజుల గానానుమోది తుండును, వందిజనసంకీర్తనానందితుండును, బాఠకపఠనరవవికాసితహృదయుండును నయి వెడలు నవసరంబున. | 395 |
| సీ. |
బలభద్రసాత్యకిప్రద్యుమ్నముఖయదు, వృష్ణిభోజాంధకవీరవరులు దుర్వారపరిపంథిగర్వభేదనకళా, చతురబాహాబలోత్సాహలీల వారణస్యందనవాజిసందోహంబు, సవరణ సేయించి సంభ్రమమున సముచితప్రస్థానచటులభేరీభూరి, ఘోష మంభోనిధిఘోష మడఁప |
|
| తే. |
ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి, నడచెఁ గృష్ణునిరథము వెన్నంటి చెలఁగి పృథులగతి మున్ భగీరథురథమువెనుక, ననుగమించు వియన్నది ననుకరించి. |
396 |
| వ. | ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరం జని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత. | 397 |
| మ. |
సరిదారామసరోవరోపవనయజ్ఞస్థానముల్ మాపి, వే పరిఖల్ పూడిచి, యంత్రముల్ దునిమి, వప్రవ్రాతముల్ ద్రొబ్బి, గో పురముల్ గూలఁగఁద్రోచి, సౌధభవనంబుల్ నూకి, ప్రాకారముల్ ధరణిం గూల్చి, కవాటముల్ విఱిచి, రుద్దండక్రియాలోలురై. |
398 |
| వ. | ఇట్లనేకప్రకారంబుల గాసి చేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినం జూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై బాణుండు సమరసన్నాహసంరంభవిజృంభమాణుండై సంగరభేరి వ్రేయించిన. | 399 |
| సీ. |
ఆచక్రవాళాచలాచక్ర మంతయు, బలసి కుమ్మరిసారెపగిదిఁ దిరిగె ఘనఘోణిఖురకోటిఘట్టితనదముల, కరణి నంభోనిధుల్ గలఁగి పొరలెఁ గాలరుద్రాభీలకరశూలహతి రాలు, పిడుగులగతి రాలె నుడుగణంబు చటులానిలోద్ధూతశాల్మలీతూలంబు, చాడ్పున మేఘముల్ చదలఁ దూలె |
|
| తే. |
గిరులు వడఁకాడె, దివి పెల్లగిల్లె, సురల, గుండె లవిసె, రసాతలక్షోభ మొదవె దిక్కు లదరె విమానముల్ తెరలి, చెదరెఁ, గలఁగి గ్రహరాజచంద్రులగతులు దప్పె. |
400 |
| వ. | అట్టి సమరసన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మవర్మనిర్మలాంశుజాలంబులును, శిరస్త్రాణకిరీటకోటిఘటితవినూత్నరత్నప్రభాపటలంబులును, గనకకుండలగ్రైవేయహారకంకణ తులాకోటి వివిధభూషణవ్రాతరుచినిచయంబులును, బ్రచండబాహుదండసహస్రంబున వెలుంగుచు శరశరాసనశక్తి ప్రాసతోమరగదాకుంతముసలముద్గరభిందిపాలకరవాలపట్టిసశూలక్షురికాపరశు పరిఘాదినిశాతహేతి వ్రాతదీధితులును, వియచ్చరకోటినేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచల శృంగసముత్తుంగం బగు రథం బెక్కి యరాతివాహినీసందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికి వెడలె, న య్యవసరం బున. | 401 |