పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
బాణాసురుం డనిరుద్ధుని నాగపాశబద్ధునిఁ జేయుట
సీ. కనియె శుభోపేతుఁ గందర్పసంజాతు, మానితదేహు నాజానుబాహు
మకరకుండలకర్ణు మహితప్రభాపూర్ణుఁ, జిరయశోల్లాసుఁ గౌశేయవాసుఁ
గస్తూరికాలిప్తు ఘనకాంతికుముదాప్తు, హారశోభితవక్షు నంబుజాక్షు
యదువంశతిలకు మత్తాలినీలాలకు, నవపుష్పచాపుఁ బూర్ణప్రతాపు
 
తే. నభినవాకారు నక్షవిద్యావిహారు, మహితగుణవృద్ధు మన్మథమంత్రసిద్ధుఁ
గలితపరిశుద్ధు నఖిలలోకప్రసిద్ధుఁ, జతురు ననిరుద్ధు నంగనాజననిరుద్ధు.
380
చ. కని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం
గనుఁగొని యీ నరాధమునిఁ గట్టుఁడు, పట్టుఁడు, కొట్టుఁడన్న వా
రనుపమహేతిదీధితు లహర్పతితేజము మాయఁ జేయ డా
సిన నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్‌.
381
చ. కలిగి, మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో
ర్బల ఘనవిక్రమప్రళయభైరవుభంగి విజృంభణక్రియా
కలన నెదిర్చె దానవనికాయముతోఁ దలపాటుఁ బోటునుం
జలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటుఁ జూపుచున్‌.
382
చ. పదములు బాహులుం దలలు ప్రక్కలు చెక్కులు జానుయుగ్మముల్‌
రదములు గర్ణముల్‌ మెడ లురంబులు మూఁపులు వీఁపు లూరువుల్‌
చిదురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌
కదనపరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై.
383
వ. ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబు నొంది వెఱచియుం, బఱచియు; విచ్చియుం, జచ్చియుఁ; గలంగియు, నలంగియు; విఱిగియు, సురిఁగియుఁ; జెదరియు, బెదరియుఁ; జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియు; బొడిచియు, నడిచియుఁ బెనంగి. 384
క. క్రుద్ధుండై యహిపాశ ని, బద్ధుం గావించె నసురపాలుఁడు రణ స
న్నద్ధున్‌ శరవిద్ధు న్నని, రుద్ధున్‌ మహితప్రబుద్ధు రూపసమృద్ధున్‌.
385
వ. ఇట్లు కట్టి త్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత. 386
క. నీలపటాంచితమై సువి, శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా
భీలమగు నతని కేతన, మాలోన నకారణంబ యవనిం గూలెన్‌.
387
క. అది చూచి దనుజపాలుఁడు, మదనాంతకుఁ డాడినట్టిమాట నిజముగాఁ
గదనంబు గలుగు ననుచును, నెదురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్‌.
388
వ. అంత నక్కడ. 389
క. ద్వారకలో ననిరుద్ధ కు, మారుని పోకకును యదుసమాజము వగలం
గూరుచు నొకవార్తయు విన, నేరక చింతింప నాల్గునెల లరిగె నృపా!
390
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )