| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| తే. |
అనఘ! బలినందనులు నూర్వు రందులోన, నగ్రజాతుండు బాణుఁ డత్యుగ్రమూర్తి చిరయశోహారి విహితపూజితపురారి, యహితతిమిరోష్ణకరుఁడు సహస్రకరుఁడు. |
311 |
| క. |
బాణుఁడు విక్రమజిత గీ, ర్వాణుఁడు సని కాంచె భక్తివశుఁడైన గణ స్థాణున్ నిర్దళితాసమ, బాణుం దాండవధురీణు భక్తత్రాణున్. |
312 |
| క. |
కని యనురాగవికాసము, దన మనమునఁ గడలుకొనఁగ ధరఁ జాఁగిలి వం దన మాచరించి మోదము, దనరఁగఁ దాండవము సలుపు తఱి నయ్యభవున్. |
313 |
| ఉ. |
సంచితభూరిబాహుబలసంపద పెంపున నారజంబు వా యించి యనేకభంగుల సుమేశుఁ ద్రిలోకశరణ్యు నాత్మ మె చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుఁ గా వించి తదాననాంబురుహ వీక్షణుఁడై తగ మ్రొక్కి యిట్లనున్. |
314 |
| ఉ. |
శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా శంకర! పాండునీలరుచిశంకరవర్ణనిజాంగ! భోగి రా ట్కంకణ! పార్వతీహృదయకైరవకైరవమిత్ర! యోగి హృ త్పంకజపంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! |
315 |
| వ. | అని వినుతించి. | 316 |
| ఉ. |
దేవ! మదీయవాంఛితము తేటపడ న్నిటు విన్నవించెదన్ నీవును నద్రినందనయు నెమ్మిని నా పురికోటవాకిటం గావలియుండి నన్నుఁ గృపఁ గావుము భక్తఫలప్రదాత! యో భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్. |
317 |
| వ. | అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాదిభూతగణంబులతో బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ, బదంపడి యొక్కనాఁ డబ్బలినందనుండు. | 318 |
| తే. |
దర్పమునఁ బొంగి రుచిరమార్తాండదీప, మండలముతోడ మార్పడు మహితశోణ మణికిరీటము త్రిపురసంహరుని పాద, వనజములు సోఁక మ్రొక్కి యిట్లని నుతించె. |
319 |
| సీ. |
‘దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత! వితతచారిత్ర! సంతతపవిత్ర! హాలాహలాహార! యహిరాజకేయూర! బాలేందుభూష! సద్భక్తపోష! సర్వలోకాతీత! సద్గుణసంఘాత! పార్వతీహృదయేశ! భవవినాశ! రజతాచలస్థాన! గజచర్మపరిధాన! సురవైరివిధ్వస్త! శూలహస్త! |
|
| తే. |
లోకనాయక! సద్భక్తలోకవరద!, సురుచిరాకార! మునిజనస్తుతవిహార! భక్తజనమందిరాంగణపారిజాత!, నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ! |
320 |
| వ. | అని స్తుతియించి. | 321 |
| మ. |
అనిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా లిన వీరుం డొకఁడైన బందెమునకున్ లేఁడయ్యె, భూమండలి న్ననయంబున్ భవదగ్య్రదత్తకరసాహస్రంబుకండూతి వా యు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తు న్నుమానాయకా! |
322 |
| సీ. |
హుంకారకంకణక్రేంకారశింజినీటంకారనిర్ఘోషసంకులంబు చండదోర్దండభాస్వన్మండలాగ్రప్రకాండఖండితరాజమండలంబు శూలాహతక్షతోద్వేలకీలాలకల్లోలకేళీసమాలోకనంబు శుంభదున్మదకుంభికుంభస్థలధ్వంససంభూతశౌర్యవిజృంభణంబు |
|
| తే. |
గలుగు నుద్దామభీమసంగ్రామకేళి, ఘనపరాక్రమవిక్రమక్రమము గాఁగ జరపలేనట్టి కరములు కరము దుఃఖ, కరము లగుఁ గాక సంతోషకరము లగునె? |
323 |
| ఉ. |
కాన మదీయచండభుజగర్వపరాక్రమకేళికిన్ సముం డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కనా; నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో నూనిన రోషవార్ధి గడ లొత్తఁగ నిట్లని పల్కె భూవరా! |
324 |
| క. |
‘విను మూఢహృదయ! నీ కే, తన మెప్పు డకారణంబ ధారుణిపైఁ గూ లును నపుడు నీ భుజావలి, దునియఁగ నా యంతవానితో నని గల్గున్. |
325 |
| వ. | అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్యధురీణుండగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబునకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ. | 326 |
| సీ. |
ఆ దానవేశ్వరుననుఁగుఁగుమారి యుషాకన్య విమలసౌజన్యధన్య రూపవిభ్రమకళారుచిరకోమలదేహ యతనునాఱవబాణ మనఁగఁ బరఁగు సుందరీరత్నంబు నిందునిభానన యలినీలవేణి పద్మాయతాక్షి యొకనాఁడు రుచిరసౌధోపరివేదికాస్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి |
|
| తే. |
మున్ను దన దౌల నెన్నఁడు విన్న యతఁడుఁ, గన్నులారంగఁ దాఁ బొడగన్న యతఁడుఁ గాని యసమానరూపరేఖావిలాస, కలితు ననిరుద్ధు నర్మిలిఁ గవిసినటులు. |
327 |
| చ. |
కల గని యంత మేలుకని కన్నుల బాష్పకణంబు లొల్కఁగాఁ గలవలెఁ గాక నిశ్చయముగాఁ గమనీయవిలాసవిభ్రమా కలిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోఁచినం గళవళ మందుచున్ బిగియఁ గౌఁగిటిచే బయ లప్పళించుచున్ |
328 |
| వ. | మఱియును. | 329 |
| చ. |
సరసమృదూక్తులుం గుసుమసాయక కేళియు శాటికా కచా కరషణముల్ నఖక్రియలుఁ గమ్రకపోలలలాటమేఖలా కరకుచబాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో దరి మది గాఢమై తగిలె దర్పకుఁ డచ్చున నొత్తినట్లయై. |
330 |
| సీ. |
కలికిచేష్టలు భావగర్భంబు లైనను బ్రియుమీఁది కూరిమి బయలుపఱుపఁ బిదపిదనై లజ్జ మదిఁ బద నిచ్చినఁ జెలి మేనఁ బులకలు చెక్కు లొత్త మదనాగ్నిసంతప్తమానస యగుటకు గురుకుచహారవల్లరులు గందఁ జిత్తంబు నాయకాయత్తమై యుంటకు మఱుమాట లాడంగ మఱపు గదుర |
|
| తే. |
నతివ మనమున సిగ్గు మోహంబు భయముఁ, బొడమ నునుమంచు నెత్తమ్మిఁ బొదువుమాడ్కిఁ బ్రథమచింతాభరంబునఁ బద్మనయన, కోరి తలచీర వాటింప నేర దయ్యె. |
331 |
| వ. | ఇట్లు విరహవేదనాదూయమానమానసయై యుండె, నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మఱు వెట్టుచు నప్పుడు. | 332 |
| చ. |
పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి, కుచాగ్రసీమపై బెరసిన సన్న లేఁజెమట బిందువు లొయ్యన నార్చుఁ, గన్నులం దొరఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం దరుణులు రండు చూత మని తా మొగ మెత్తును గూఢరాగయై. |
333 |
| వ. | ఇ వ్విధంబునం జరియించుచుండె నట్టియెడ. | 334 |
| తే. |
అంతకంతకు సంతాప మతిశయించి, వలుఁదచన్నులు గన్నీటివఱదఁ దడియఁ జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము, వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి. |
335 |
| వ. | అంత. | 336 |
| తే. |
బలితనూభవుమంత్రి కుంభాండుతనయ, తన బహిఃప్రాణ మిది యనఁ దనరునట్టి కామినీమణి ముఖపద్మకాంతివిజిత, శిశిరకరచారురుచిరేఖ చిత్రరేఖ. |
337 |
| వ. | కదియ వచ్చి య బ్బాల నుపలక్షించి. | 338 |
| తే. |
భామినీమణి సొబగుని బయల వెదకు, విధమునను నాత్మవిభుఁ బాసి విహ్వలించు వగను జేతికి లోనైనవానిఁ బాసి, భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకట మయ్యె. |
339 |
| తే. |
వనిత! నాకన్న నెనరైనవారు నీకుఁ గలుగ నేర్తురె! నీ కోర్కిఁ దెలియఁ జెప్ప కున్న మీ యన్నతో డన్నఁ గన్నుఁగవను, నలరు నునుసిగ్గుతో నగ వామతింప. |
340 |
| వ. | ఇ వ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె. | 341 |
| చ. |
‘చెలి కలలోన నొక్క సరసీరుహనేత్రుఁడు హారరత్నకుం డల కటకాంగుళీయకరణన్మణినూపురభూషణుండు ని ర్మలకనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుఁ డు జ్జ్వలరుచి నూతనప్రసవసాయకుఁ డున్నతవక్షుఁ డెంతయున్. |
342 |
| చ. |
నను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ జేర్చి మోదముం దనుకఁగ నంచితాధరసుధారస మిచ్చి మనోజకేళికిం బనుపడఁ జేసి మంజుమృదుభాషలఁ దేలిచి యంతలోననే చనియెను దుఃఖవార్ధిఁ బెలుచన్ ననుఁ ద్రోచి సరోరుహాననా! |
343 |
| వ. | అనుచు నమ్మత్తకాశిని త్తంబు చిత్తజాయత్తం బయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరు మున్నీరుగా వగచుచు విన్ననయిన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున నయ్యింతిసంతాపంబు చింతించి యిట్లనియె. | 344 |
| చ. |
‘సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్ నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యకి న్నరవరముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో హరుఁ గని ‘వీడె పొ’ మ్మనిన నప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్.’ |
345 |
| వ. | అని యొడంబఱిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళ ధళ మను మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబుసేసి, వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేఱు వేఱ కనకరజతపాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయోరూపసంపన్ను లయిన పురుషముఖ్యుల నన్వయగోత్రనామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన య ప్పటంబు దన ముందటఁ దెచ్చి పెట్టి యప్పటంబునం దగులనివారు లేరు, వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు’ మని యిట్లనియె. | 346 |
| సీ. |
కమనీయసంగీతకలితకోవిదులు కింపురుషగంధర్వకిన్నరులు వీరె! సతతయౌవనయదృచ్ఛావిహారులు సిద్ధసాధ్యచారణనభశ్చరులు వీరె! ప్రవిమలసౌఖ్యసంపద్వైభవులు సుధాశనమరుద్యక్షరాక్షసులు వీరె! నిరుపమరుచికళాన్వితకామరూపులై పొగడొందునట్టి పన్నగులు వీరె! |
|
| తే. |
చూడు’మని నేర్పు దీపింపఁ జూపుటయును, జిత్తము నిజమనోరథసిద్ధి వడయఁ జాలకుండిన మధ్యమక్ష్మాతలాధి, పతులఁ జూపుచు వచ్చె నప్పద్మనయన. |
347 |
| ఉ. |
మాళవకొంకణద్రవిడమత్స్యపుళిందకళింగభోజనే పాళవిదేహపాండ్యకురుబర్బరసింధుయుగంధరాంధ్రబం గాళకరూశటేంకణత్రిగర్తసుధేష్ణమరాటలాటపాం చాలనిషాదఘూర్జరకసాళ్వమహీశులు వీరె కోమలీ! |
348 |
| ఉ. |
సింధురవైరివిక్రముఁడు శీతమయూఖమరాళికాపయ స్సింధుపటీరనిర్మలవిశేషయశోవిభవుండు శౌర్యద ర్పాంధరిపుక్షితీశనికరాంధతమఃపటలార్కుఁ డీ జరా సంధునిఁ జూడు మాగధుని సద్బృహదశ్వసుతుం గృశోదరీ! |
349 |
| మ. |
సకలోర్వీతలనాథసన్నుతుఁడు శశ్వద్భూరిబాహాబలా ధికు డుగ్రాహవకోవిదుండు త్రిజగద్విఖ్యాతచారిత్రకుం డకలంకోజ్జ్వలదివ్యభూషుఁడు విదర్భాధీశ్వరుండైన భీ ష్మకభూపాలకుమారుఁ జూడు మితనిన్ మత్తద్విరేఫాలకా! |
350 |
| ఉ. |
సంగరరంగనిర్దళితచండవిరోధివరూధినీశ మా తంగతురంగసద్భటరథప్రకరైకభుజావిజృంభణా భంగపరాక్రమప్రకటభవ్యయశోమహనీయమూర్తి కా ళింగుఁడు వీఁడె చూడు తరళీకృతచారుకురంగలోచనా! |
351 |
| మ. |
సుగుణాంభోనిధి ఫాలలోచను నుమేశు న్నాత్మ మెప్పించి శ క్తి గరిష్ఠంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్ జగతిన్ మిక్కిలి మేటివీరుఁడు రణోత్సాహుండు భూపౌత్రుఁ డీ భగదత్తుం గనుఁగొంటె! పంకజముఖీ! ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్. |
352 |
| మ. |
వికచాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు దాఁ బూను నం దకచక్రాబ్జగదాదిచిహ్నములచేతన్ వాసుదేవాఖ్య ను త్సుకుఁడై యెప్పుడు మచ్చరించు మదిఁ గృష్ణుం డన్న నేమేటి పౌం డ్రకుఁ గాశీశసఖుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా! |
353 |
| మ. |
ద్విజశుశ్రూషయు సూనృతవ్రతము సద్వృత్తిన్ భుజాగర్వమున్ విజయాటోపముఁ జాపనైపుణియు ధీవిస్ఫూర్తియుం గల్గు నీ రజనీనాథకులప్రదీపకులఁ బాఱం జూడు పద్మాక్షి! ధ ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్. |
354 |
| మ. |
బలిమిన్ సర్వనృపాలుర న్నదిమి కప్పంబుల్ దగం గొంచు ను జ్జ్వల తేజోవిభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లఁగాఁ బొలుపొందం దను రాజరా జన మహాభూరిప్రతాపంబులుం గల దుర్యోధనుఁ జూడు సోదరయుతుం గంజాతపత్త్రేక్షణా! |
355 |
| వ. | అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును. | 356 |
| ఉ. |
శారదనీరదాబ్జఘనసారసుధాకరకాశచంద్రికా సార పటీరవర్ణు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ త్తారినృపాలకాననహుతాశనమూర్తిఁ, బ్రలంబదైత్య సం హారునిఁ, గామపాలుని హలాయుధుఁ, జూడుము దైత్యనందనా! |
357 |
| సీ. |
కమనీయశుభగాత్రుఁ గంజాతదళనేత్రు, వసుధాకళత్రుఁ బావనచరిత్రు సత్యసంకల్పు నిశాచరోగ్రవికల్పు, నతపన్నగాకల్పు నాగతల్పుఁ గౌస్తుభమణిభూషు గంభీరమృదుభాషు, శ్రితజనపోషు నంచితవిశేషు నీలనీరదకాయు నిర్జితదైతేయు, ధృతపీతకౌశేయు నతవిధేయు |
|
| తే. |
నఘమహాగదవైద్యు వేదాంతవేద్యు, దివ్యమునిసన్నుతామోదుఁ దీర్థపాదు జిష్ణు వరసద్గుణాలంకరిష్ణుఁ గృష్ణుఁ, జూడు దైతేయకులబాల! సుభగలీల! |
358 |
| చ. |
స్ఫురదళిశింజినీరవవిభూషితపుష్పధనుర్విముక్త భా స్వరనవచూతకోరకనిశాతశిలీముఖపాతభీత పం కరుహభవాదిచేతననికాయు మనోజనిజాంశు రుక్మిణీ వరసుతు రాజకీరపరివారుని మారునిఁ జూడు కోమలీ! |
359 |
| వ. | ఇ వ్విధంబునం జూపిన. | 360 |
| మ. |
వనితారత్నము కృష్ణనందనునిభావప్రౌఢిఁ దాఁ జూచి గ్ర ద్దనఁ ద న్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో ననుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ తనచేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచు న్నిట్లనున్. |
361 |
| ఉ. |
ఇంతి మదీయమానధన మెల్ల హరించిన మ్రుచ్చు నిమ్మెయిం బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుఁ జేసినట్టి నీ యంతటిపుణ్యమూర్తిఁ గొనియాడఁగ నేర్తునె? నీ చరిత్రముల్ వింతలె నాకు? నీ మహితవీరుకులంబు బలంబుఁ జెప్పుమా! |
362 |
| చ. |
అనవుడుఁ జిత్రరేఖ జలజాక్షికి నిట్లను ‘నీ కుమారకుం డనఘుఁడు యాదవాన్వయసుధాంబుధిపూర్ణసుధాకరుండు నాఁ దనరిన కృష్ణపౌత్త్రకుఁ డుదారచరిత్రుఁడు భూరిసింహ సం హననుఁ డరాతిసైన్యతిమిరార్కుఁడు, పే రనిరుద్ధుఁ డంగనా! |
363 |
| వ. | అని చెప్పి యే నతిత్వరితగతిం జని య క్కుమారరత్నంబుఁ దోడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట. | 364 |
| క. |
సరసిజముఖి గనుఁగొనె శుభ, భరిత విలోకనవిధూతభవవేదనమున్ బరసాధనమును సుకృత, స్ఫురణాపాదనముఁ గృష్ణుపుటభేదనమున్. |
365 |
| వ. | కని డాయం జని తదీయసుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం గామినీచరణ రణితమణి నూపురఝణంఝణధ్వనితమణిగోపురంబును, నతివిభవవిజితగోపురంబును నగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ జంద్రకాంతశిలాభవనంబున సుధాధామరుచిరరుచిచయంబు నపహసించు హంసతూలికా తల్పంబున నిజాంగనారతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి తనయోగవిద్యామహత్త్త్వంబున నతని నెత్తుకొని మనోవేగంబున శోణపురంబునకుం జని బాణాసురనందన యగు నుషాసుందరీతల్పంబునం దునిచి యిట్లనియె. | 366 |
| క. |
వనజాక్షి! చూడు నీ విభు, ననిమిషనగధీరు శూరు నభినవమారున్ వనధిగభీరు నుదారుని, ననిరుద్ధకుమారు విదళితాహితవీరున్. |
367 |
| క. |
అనిన నుషాసతి దన మన, మున ననురాగిల్లి మేనఁ బులకాంకురముల్ మొనయఁగ నానందాశ్రులు, గనుఁగవ జడి గురియ ముఖవికాస మెలర్పన్. |
368 |
| వ. | ఇట్లు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె. | 369 |
| సీ. |
అతివ! వీ సాంగత్య మను భానురుచి నాకుఁ, గలుగుటఁ గామాంధకార మడఁగెఁ దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ, గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే, నంగజసంతాప మార్పఁ గంటి వనిత! నీ చెలితనం బను రసాంజనముచే, నా మనోహరనిధానంబుఁ గంటిఁ |
|
| తే. |
గలలఁ దోఁచిన రూప గ్రక్కన లిఖించు, వారు నౌనన్నఁ దోడ్తెచ్చువారు గలరె? నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక, కాక గల్గునె మూఁడులోకములయందు? |
370 |
| వ. | అని వినుతించి చిత్రరేఖను నిజమందిరంబునకుం బోవం బనిచినం జనియె, ననంతరంబ వింతజనుల కెవ్వరికిం బ్రవేశింప రాని యంతఃపురసౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని య య్యింతిం గనుంగొని యప్పుడు. | 371 |
| క. |
సురుచిరమృదుతల్పంబునఁ, బరిరంభణసరసవచనభావకళా చా తురి మెఱయ రాకుమారుఁడు, తరుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై. |
372 |
| వ. | ఇవ్విధంబున నతిమనోహరవిభవాభిరామంబులగు దివ్యాంబరాభరణమాల్యానులేపనంబులను, గర్పూరతాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిరమణిదీపనీరాజనంబులను, సుగంధ బంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానందసాగరాంతర్నిమగ్నమానసులై యుదయాస్తమయనిరూపణంబు సేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి, రంత. | 373 |
| క. |
ఆలోనన యతిచర మగు, కాలము సుఖలీల జరుగఁగా వరుస నుషా బాలాలలామ కొయ్యనఁ, జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్. |
374 |
| క. |
ఆ చిన్నె లంగజాలలు, సూచి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో నో చెల్ల! యెట్టులో? యీ, రా చూలికిఁ జూలు నిలిచెరా! యి బ్భంగిన్’ |
375 |
| క. |
అని గుజగుజ వోవుచు ని, ప్పని దప్పక దనుజలోకపాలునితోడన్ వినిపింపవలయు నని వే, చని బాణునిఁ జేరి మ్రొక్కి సద్వినయమునన్. |
376 |
| క. |
మంతనమున దేవర! క, న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్ వింతజనములకుఁ జొరఁగ దు, రంతము విను పోతుటీఁగకైన సురారీ! |
377 |
| తే. |
ఇట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును, నేమి కనుమాయయో కాని యెఱుఁగ మధిప! నీ కుమారిక గర్భంబు నివ్వటిల్లి, యున్న దన్నను విని రోషయుక్తుఁ డగుచు. |
378 |
| వ. | అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలు ముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయుసింగంబు విధంబున లంఘించుచు, భీకరకరవాలంబు గేలం దాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని. | 379 |