| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
బవరమునఁ గృష్ణుచే ము, న్నవమానము నొంది రుక్మి యచ్యుతు గెలువం దివురుచుఁ దన సుత నరిసం, భవునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ బలుకు మునీంద్రా! |
280 |
| సీ. |
నావుడు శుకయోగి ‘నరనాయకోత్తమ! నీవు చెప్పిన యట్ల నెమ్మనమునఁ బద్మాయతాక్షుచేఁ బడిన బన్నమునకుఁ గనలుచు నుండియు ననుజతోడి నెయ్యంబునను భాగినేయున కిచ్చెను గూఁతు నంచితపుష్పకోమలాంగిఁ దనపూన్కి దప్పినఁ దగ విదర్భేశుండు విను మెఱింగింతు న వ్విధము దెలియఁ |
|
| తే. |
బరఁగ ‘రుక్మవతీ స్వయంవరమున కొగి, నరుగుదెం డని భీష్మభూవరసుతుండు వరుస రప్పించె రాజన్యవరకుమార, వరుల ననువార్త కలరి యా హరిసుతుండు. |
281 |
| చ. |
వరమణిభూషణప్రభలవర్గ మనర్గళభంగిఁ బర్వఁ బ్ర స్ఫురితరథాధిరోహణవిభూతి దలిర్ప మనోహరైక సు స్థిరశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా పరిణయవైభవాగతనృపాలకకోటికి రుక్మివీటికిన్. |
282 |
| చ. |
చని పురిఁ జొచ్చి వృష్ణికులసత్తముఁ డచ్చట మూఁగియున్న య మ్మనుజవరేణ్యనందనులు మానము దూలి భయాకులాత్ములై చనఁగ ననేకచండతరసాయకసంపదఁ జూపి రుక్మి నం దనఁ గొనివచ్చి వేడ్క నిజధామము సొచ్చె నవార్యశౌర్యుఁడై. |
283 |
| వ. | ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరిణనయనం బరిణయం బంది నిఖిలసుఖంబు లనుభవింపుచుండె. ననంతరంబ. | 284 |
| క. |
ధీరుఁడు కృతవర్ముని సుకు, మారుఁడు వరియించె రుచిరమండనయుత నం భోరుహముఖి రుక్మిసుతం, జారుమతీకన్యఁ బ్రకట సజ్జనమాన్యన్. |
285 |
| తే. |
ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుఁడు, మనము మోదింపఁ దన కూర్మిమనుమరాలి రుక్మలోచన నసమాన రుక్మకాంతిఁ, జెలిమి ననిరుద్ధునకు బెండ్లి సేయు నపుడు. |
286 |
| క. |
పొలుపుగ రత్నవిభూషో, జ్జ్వలుఁ డయి శుభవేళ న వ్వివాహార్థము ని ర్మల బహువైభవశోభన, కలితవిదర్భావనీశకటకంబునకున్. |
287 |
| చ. |
హరియును రుక్మిణీసతియు నా బలభద్రుఁడు శంబరారియున్ నరిమదభేది సాంబుఁడును నాదిగ రాజకుమారకోటి సిం ధుర రథవాజిసద్భటులతోఁ జని యందు సమగ్రవైభవా చరితవివాహయుక్తదివసంబులు వేడుకఁ బుచ్చి యంతటన్. |
288 |
| క. |
ఒకనాఁడు యదుకుమారకు, లకలంకసమగ్ర వైభవాటోపమహో త్సుకులై యుండఁగఁ జూపో, పక యెకసక్కెమున నవనిపాలురు వరుసన్. |
289 |
| ఉ. |
ఎచ్చరికం గళింగధరణీశుఁడు రుక్మిమొగంబు సూచి నీ యొచ్చెముఁ దీర్చికో నిదియ యొప్పగువేళ బలుండు జూదమం దిచ్చ గలండు, గాని పొలు పెక్కిన నేర్పరి గాఁడు, గాన నీ కిచ్చు నవశ్యమున్ జయము నీఁగుము తొల్లిటఁ బడ్డ బన్నముల్. |
290 |
| క. |
అని పురికొల్పిన రుక్మియుఁ, దనచేటు దలంపలేక తాలాంకుని తో డన జూదమాడఁ దివిరెను, వనజాసనుకృతము గడచు వా రెవ్వ రిలన్? |
291 |
| వ. | అంత. | 292 |
| క. |
కోరి విదర్భుఁడు కుటిల వి, హారుండై పిలిచె జూదమాడ జితారిన్ హారిన్ సన్నుతసూరిన్, సీరిన్ రైవతసుతార్ద్రచిత్తవిహారిన్. |
293 |
| ఆ. |
‘పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ!, నెత్త మాడ నీవు నేర్తు వనఁగ విందు, మిపుడు గొంతవెల యొడ్డి యాడుద’ మనిన బలుఁడు లెస్స యని చెలంగె. |
294 |
| క. |
మదిలోని చలము డింపక, పది యిరువది నూఱు వేయి పదివే లిదె ప న్నిద మని యొడ్డుచు నాడిరి, మదమున నిద్దఱును దురభిమానము పేర్మిన్. |
295 |
| ఉ. |
ఆడిన యాటలెల్లను హలాయుధుఁ డోడిన రుక్మి గెల్చుడున్ దోడి నృపాలకోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం ‘డోడె బలుం’డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్. |
296 |
| తే. |
బలుఁడు కోపించి యొకలక్ష పణము సేసి, యాడి ప్రకటంబుగా జూద మపుడు గెల్చె, గెల్చినను రుక్మి ‘యిది యేను గెల్చియుండ, గెలుపు నీ దని కికురింప నలవి యగునె? |
297 |
| తే. |
అనవుడు హలధరుఁ డచ్చటి, జనపాలకసుతులఁ జూచి సత్యము పలుకుం డని యడిగిన వారలు రు, క్మునిహితులై పలుకరైరి మొగమోటమునన్. |
298 |
| ఉ. |
అప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం జొప్పఁడ గెల్చి యీ గెలుపు సూడఁగ నాదియొ వానిదో జనుల్ దప్పక చెప్పుఁ డన్న విదితధ్వనితో నశరీరవాణి తా నిప్పటియాట రాముఁడె జయించె; విదర్భుఁడె యోడె నావుడున్. |
299 |
| వ. | అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్నమానసులైరి. కుటిలస్వభావు లయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిం దన్ను నెఱుంగక బలాబలవివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని “యిప్పటియాటయు నేన గెల్చియుండ వృథా జల్పకల్పనుండవయి ‘గెల్చితి” నని పల్కెద, వక్షవిద్యానైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే” యని క్రొవ్వున నవ్వుచుం బలికిన న ప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపిత మానసుండై పెట పెటం బండ్లు గొఱుకుచుం గన్నుల నిప్పు లుప్పతిల్లం గినుకం దోఁక త్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితం బయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండబాహుదండంబులు సాఁచి, పరిఘం బందుకొని పరిపంథియైనరుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె, న య్యవసరంబున. | 300 |
| క. |
మును దంతపంక్తి వెలిగాఁ, దను నవ్విన య క్కళింగుఁ దల వట్టి రయం బునఁ బడఁ దిగిచి వదన మే, పునఁ బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్. |
301 |
| క. |
అంతం బోవక రుక్మిని, దంతంబులు మున్ను డులిచి తను వగలింపన్ అంతకుపురి కేగెను వాఁ, డెంతయు భయ మంది రాజు లెల్లం గలఁగన్. |
302 |
| వ. | అట్లుచేసి య య్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత. | 303 |
| క. |
భూవర! పద్మాక్షుఁడు దన, బావ హతుం డగుట గనియుఁ బలుకక యుండెన్ భావమును రుక్మిణీ బల, దేవుల కే మనఁగ నెగ్గు దేరునొ? యనుచున్. |
304 |
| వ. | అంత నా విదర్భానగరంబు నిర్గమించి. | 305 |
| క. |
పరమానురాగరస సం, భరితాంతఃకరణు లగుచుఁ బాటించి వధూ వరులను రథమం దిడి హల, ధరహరిరుక్మిణులఁ గొల్చి తగ యదువీరుల్. |
306 |
| ఉ. |
మంగళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా తంగ తురంగసద్భటకదంబముతోఁ జని కాంచి రంత నా రంగ లవంగలుంగవిచరన్మదభృంగసురంగనాద స త్సంగతరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్. |
307 |
| వ. | ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని. | 308 |
| క. |
అందు వసించిరి నందిత, చందనమందారకుందచంద్రలస న్మా కందముల నీడ హృదయా, నందము సంధిల్ల నందనందనముఖ్యుల్. |
309 |
| వ. | తదనంతరంబ పురప్రవేశంబు సేసి రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షి న్నరేంద్రున కిట్లనియె. | 310 |