పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
కృష్ణుండు రుక్మిణీదేవి నూరడించుట
చ. ‘అలికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం
గలఁగఁగ నేల? వేఁటలను గయ్యములన్‌ రతులందు నొవ్వఁగాఁ
బలికిన మాట లెగ్గు లని పట్టుదురే? భవదీయచిత్తముం
దెలియఁగఁ గోరి యేఁ బలికితిన్‌ మదిలో నిటు గుంద నేఁటికిన్‌?
263
వ. అదియునుం గాక. 264
ఉ. కింకలు ముద్దుబల్కులును గెంపుఁగనుంగవ తియ్యమోవియున్‌
జంకెలు తేఱిచూపు లెకసక్కెములున్‌ నెలవంకబొమ్మలుం
గొంకక వీడ నాడుటలుఁ గూరిమియుం గల కాంతఁ గూడుటల్‌
అంకిలిలేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా!’
265
వ. అని మఱియు నిట్లనియె. 266
ఉ. ‘నీవు పతివ్రతామణివి నిర్మలధర్మవివేకశీల స
ద్భావవు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం
సేవయ కాని యన్యము భజింపవు, పుట్టిననాఁటనుండి నీ
భావ మెఱింగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ!’
267
వ. అని వెండియు నిట్లనియె, ‘నీ వాక్యంబులు శ్రవణసుఖంబు గావించె, నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నా యంద యుండుటం జేసి యేకాంతసేవాచతురవైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు. నీ పాతివ్రత్యంబును, నా యందలిస్నేహంబు నతివిశదంబు లయ్యె, నా వాక్యములచేత భవదీయచిత్తంబు చంచలంబు గాక నాయందలి బుద్ధి దృఢం బగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబులందు నీదు భాగ్యంబునం జేసి సంసారి కైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ, దక్కిన ప్రాణేంద్రియపరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం;, బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు, రదియంతయు నా మాయావిజృంభితంబు, దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లు గావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబున ననేకరాజన్యవర్యులఁ గైకొనక భవదీయమధురాలాపశ్రవణాత్మకుండ నయిన నా సన్నిధికి “నా శరీరం బితర యోగ్యంబు గాదు, నీకు శేషంబునయి యున్నదాన’నని యేకాంతంబునం బ్రాహ్మణునిం బుత్తెంచిన నేనును జనుదెంచి నీ పరిణయసమయంబున భవత్సహోదరుం బట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగభయంబున నూరకుండితి; వది గావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు”నని యి వ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించు చుండె నని శుకుండు మఱియు నిట్లనియె. 268
క. అని యిట్లు కృష్ణుఁ డాడి న, వినయవివేకానులాపవితతామృత సే
చన, ముదితహృదయయై య, వ్వనితామణి వికచవదనవనరుహ యగుచున్‌.
269
క. నగ వామతించు చూపులు, నగధరుమోమునను నిలిపి నయమునఁ గరముల్‌
మొగిచి వినుతించెఁ గృష్ణున్‌, ఖగవాహున్‌ రుచిరదేహుఁ గలితోత్సాహున్‌.
270
చ. అతులవిరాజమానముఖుఁడై వివిధాంబరచారుభూషణ
ప్రతతులతోడఁ గోరినవరంబులు దద్దయు నిచ్చెఁ గృష్ణుఁ డు
న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై
యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్‌.
271
వ. ఇట్లు సమ్మానించి కృష్ణుండు రుక్మిణియుం దానును దదనంతరంబ. 272
చ. ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా
వలిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌
వొలయు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలన్‌
గొలఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై.
273
క. ఆరామభూములందు వి, హారామలసౌఖ్యలీల నతిమోదముతో
నా రామానుజుఁ డుండెను, నా రామామణియుఁ దాను నభిరామముగన్‌.
274
వ. మఱియు ననేకవిధమణివితానాభిశోభితప్రాసాదోపరిభాగంబులను, లాలితనీలకంఠకలకంఠ కలవింక శుకకలాపకలితతీరంబులను, మకరందపానమదవదిందిందిరఝంకారసంకులకమల కహ్లార సుధాసారనీహారపూరితకాసారంబులను, ధాతునిర్ఝరరంజిత సానుదేశగిరికుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీ లోలాత్ముం డయ్యె, ననంతరం బా సుందరీలలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె, నట్లు సత్యభామాజాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱు వేఱ పదుగురేసి భద్రమూర్తులైన కుమారు లుదయించి రవ్విధంబున మఱియును. 275
చ. అనఘ! పదాఱువేలసతులందు జనించిరి వేఱు వేఱ నం
దన దశకంబు తత్సుతవితానము గాంచి రనేకసూనుల
న్నెనయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్రపౌత్ర వ
ర్ధనమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్‌.
276
తే. అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ, నామధేయాంతరముల నెన్నంగ నూట
యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు, నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.
277
తే. గురుజనంబులు విను మూఁడు కోట్లమీఁద, నెనుబ దెనిమిదివేలపై నెసఁగ నూర్వు
రన్నఁ దద్బాలకావలి నెన్నఁ దరమె, శూలికైనను దామరచూలికైన?
278
వ. అందు గోవిందనందనుండైన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతువలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె. 279
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )