| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
మురహర! దివసాగమ దళ, దరవిందదళాక్ష! తలఁప నది యట్టి దగున్ నిరవధికవిమలతేజో, వరమూర్తివి, భక్తలోకవత్సల! యెందున్. |
246 |
| తే. |
సంచితజ్ఞానసుఖబలైశ్వర్యశక్తు, లాదిగాఁ గల సుగుణంబు లమరు నీకు, నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ!, లీలమై సచ్చిదానందశాలి వనఘ! |
247 |
| సీ. |
రూఢిమైఁ బ్రకృతి పూరుషకాలములకు నీశ్వరుఁడవై భవదీయచారుదివ్య లలితకళాకౌశలమున నభిరతుఁడై కడఁగు నీ రూప మెక్కడ మహాత్మ! సత్త్వాదిగుణసముచ్చయయుక్తమూఢాత్మ నయిన నే నెక్కడ? ననఘచరిత! కోరి నీ మంగళగుణభూతిదానంబు సేయంగఁబడు నని చెందు భీతి |
|
| తే. |
నంబునిధిమధ్యభాగమం దమృతఫేనపటలపాండురనిభమూర్తి! పన్నగేంద్ర భోగశయ్యను బవ్వళింపుచును దనరు, నట్టి యున్నతలీల దివ్యంబు దలఁప. |
248 |
| వ. | శబ్దస్పర్శరూపరసగంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళసుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకారనివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి, భవత్పాదారవిందమకరందరసాస్వాదలోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబుగా, ద ట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యం బగుట యేమి సెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు, దేవా! నీ వకించనుఁడ వైతేని బలిభోక్త లయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్తసమస్తదోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్నులైనవారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు రదియునుం గాక. | 249 |
| ఆ. |
వరమునీంద్రయోగివరసురకోటిచే, వర్ణితప్రభావవైభవంబు గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్ర, దుండ వగుదు వభవ! దురితదూర! |
250 |
| వ. | దేవా! భవదీయకుటిలభ్రూవిక్షేపోదీరితకాలవేగంబుచేత విధ్వస్తమంగళులగు కమలభవభవ పాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయచిత్తంబున. | 251 |
| చ. |
నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గసాయకా సన నినదంబులన్ సకలశత్రుధరాపతులన్ జయించి బో రన పశుకోటిఁ దోలు మృగరాజునిజాంశము భూరిశక్తిఁ గై కొనిన విధంబునన్ నను నకుంఠితశూరతఁ దెచ్చి తీశ్వరా! |
252 |
| ఉ. |
అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పఁగ లేనివాని య ట్లొట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుఁడ వైతి వింతయున్ నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయభక్తులై నట్టి నరేంద్రమౌళిమణు లంచితరాజఋషుల్ ముదంబునన్. |
253 |
| ఆ. |
వితతరాజ్యగరిమ విడిచి కాననముల, నాత్మలందు మీ పదాబ్జయుగము వలఁతి గాఁగ నిలిపి వాతాంబుపర్ణాశ, నోగ్రనియతు లగుచు నుందు రభవ! |
254 |
| మ. |
విమలజ్ఞాననిరూఢులైన జనముల్ వీక్షింప మీ పాదకం జ మరందస్ఫుటదివ్యసౌరభము నాస్వాదించి నిర్వాణరూ పము సత్పూరుషవాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే? |
255 |
| వ. | మఱియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకలప్రదేశంబులందును జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబు లయిన కామరూపంబులు గైకొని వరియింతు, భవదీయ చరణారవిందమకరందాస్వాదనచాతుర్యధుర్యభృంగియైన కామిని యతిహేయంబైన త్వక్ శ్మశ్రు రోమ నఖ కేశంబులచేతఁ గప్పంబడి యంతర్గతం బయిన మాంసాస్థి రక్త క్రిమి విట్కఫపిత్తవాతంబులం గల జీవచ్ఛవం బయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుం గాక. | 256 |
| సీ. |
నీరదాగమమేఘనిర్యత్పయఃపానచాతకం బేగునే చౌటి పడెకుఁ? బరిపక్వమాకందఫలరసంబులు గ్రోలు కీరంబు సనునె దుత్తూరములకు? ఘనరవాకర్ణనోత్కలికమయూరము గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ? గరికుంభపిశితసద్గ్రాసమోదితసింహ మరుగునే శునక మాంసాభిలాషఁ |
|
| తే. |
బ్రవిమలాకార! భవదీయపాదపద్మ, యుగసమాశ్రయనైపుణోద్యోగచిత్త మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ? భక్తమందార! దుర్భర భవవిదూర! |
257 |
| క. |
వాసవవందిత! భవ కమ, లాసన దివ్యప్రభాసభావలి కెపుడున్ నీ సమధికచారిత్ర క, థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్. |
258 |
| క. |
ధరణీనాథులు దమతమ, వరవనితామందిరముల వసియించుచు గో ఖర మార్జాలంబుల గతి, స్థిరబద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్. |
259 |
| ఆ. |
జలజనాభ! సకలజగదంతరాత్మవై, నట్టి దేవ! నీ పదారవింద యుగళి సానురాగయుక్తమై నా మదిఁ, గలుగునట్లు గాఁగఁ దలఁపు మనఘ! |
260 |
| ఆ. |
పృథురజోగుణప్రవృద్ధ మైనట్టి నీ, దృష్టిచేత నన్నుఁ దేరుకొనఁగఁ జూచు టెల్ల పద్మలోచన! నా మీఁద, ఘనదయార్ద్రదృష్టిగాఁ దలంతు. |
261 |
| వ. | అదియునుం గాక, మధుసూదనా! నీ వాక్యంబులు మిథ్యలు గావు, తల్లివచనంబు కూఁతున కభిమతంబు గాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి పరిజ్ఞాని యైనవాఁడు విడుచు, నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిం దగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు, నట్లు గావున నీ యెఱుంగని యర్థంబు గలదే? యని విన్నవించిన రుక్ష్మిణీదేవివచనంబులకుఁ గృష్ణుండు సంతసిల్లి యిట్లనియె. | 262 |