పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుండు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట
వ. అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీలమరకతాదిమణిస్తంభవలభివిటంకపటల దేహళీకవాటవిరాజమానంబును, శాతకుంభకుడ్యగవాక్షవేదికాసోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్రకౌశేయవితానంబును, వివిధమణిదీపికావిసరవిభ్రాజమానంబును, మధుకరకుల కలితమల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్రవినిర్గతకర్పూరాగరుధూపధూమంబును, వాతాయనవిప్రకీర్ణశిశిరకరకిరణ స్తోమంబును, బారిజాతప్రసవామోదపరిమళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్ర చంద్రికాధవళపర్యంకమధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి. 227
సీ. కుచకుంభములమీఁది కుంకుమతో రాయు హారంబు లరుణంబు లగుచు మెఱయఁ
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీయకకంకణప్రభ లావరింపఁ
గదలిన బహురత్నకలితనూపురముల గంభీరనినదంబు గడలు కొనఁగఁ
గాంచనమణికర్ణికామయూఖంబులు గండపాలికలపై గంతు లిడఁగఁ
 
తే. గురులు నర్తింపఁ బయ్యెదకొంగు దూఁగ, బోటి చేనున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి, వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.
228
వ. అప్పుడు. 229
మ. పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
సుతనున్‌ రుక్ష్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్‌.
230
మ. బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగసంపద్గుణం
బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌, వారికిన్‌
నెలఁతా! తల్లియుఁ దండ్రియున్‌ సహజుఁడున్‌ ని న్నిచ్చినం బోక యీ
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్‌?
231
సీ. లోకుల నడవడిలోనివారము గాము, పరులకు మా జాడ బయలు పడదు,
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ, రాజపీఠములకు రాము తఱచు,
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు నిష్కించనుల మేము, నిధులు లేవు,
కలవారు చుట్టాలు గారు, నిష్కించనజనబంధులము ముక్తసంగ్రహులము,
 
ఆ. గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షు, లైన వారిఁగాని నాశ్రయింప,
మిందుముఖులు దగుల రిటువంటి మముబోఁటి, వారి నేల తగుల వారిజాక్షి!
232
క. సిరియును వంశము రూపును, సరియైన వివాహసఖ్యసంబంధంబుల్‌
జరుగును, సరి గాకున్నను, జరగవు, లోలాక్షి! యెట్టి సంసారులకున్‌.
233
క. తగ దని యెఱుఁగవు మమ్ముం, దగిలితివి మృగాక్షి! దీనఁ ద ప్పగు; నీకుం
దగిన మనుజేంద్రు నొక్కనిఁ, దగులుము, గుణహీనజనులఁ దగునే తగులన్‌?
234
సీ. సాల్వ జరాసంధ చైద్యాదిరాజులు చెలఁగి నన్‌ వీక్షించి మలయుచుండ
నది గాక రుక్మి నీ యన్నయు గర్వించి వీర్యమదాంధుఁడై వెలయుచున్న
వారిగర్వంబులు వారింపఁగాఁ గోరి చెలువ ని న్నొడిచి తెచ్చితిమి, గాని
కాంతాతనూజార్థకాముకులము గాము, కామమోహాదులఁ గ్రందుకొనము.
 
తే. విను, ముదాసీనులము, క్రియావిరహితులము, పూర్ణులము మేము, నిత్యాత్మబుద్ధితోడ
వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి, నవలతాతన్వి! మాతోడ నవయ వలదు.
235
వ. అని యిట్లు భగవంతుండైన హరి తన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణిదర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులునైన మనోవల్లభుమాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు. 236
సీ. కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై కుంచకుంభయుగళకుంకుమము తడియ
విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల, లాలితాధరకిసలయము గందఁ
జెలువంబు నెఱిదప్పి చిన్నవోవుచు నున్న వదనారవిందంబు వాడు దోఁప
మారుతాహతిఁ దూలు మహితకల్పకవల్లివడువున మేన్‌ వడవడ వడంకఁ
 
తే. జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జెయ్యి సేర్చి, కౌతుకం బేది పదతలాగ్రమున నేల
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ, బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె.
237
చ. అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్‌
సొలవక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాఁగ బె
బ్బులి రొద విన్న లేడిక్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలినపుత్తడిబొమ్మకైవడిన్‌.
238
వ. ఇట్లు వ్రాలిన. 239
మ. ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్‌ బాష్పావరుద్ధారుణే
క్షణ, విస్రస్తవినూత్నభూషణ దురుక్తక్రూరనారాచ శో
షణ, నాలింగితధారుణిన్‌ నిజకులాచారైకసద్ధర్మచా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్‌ రుక్మిణిన్‌.
240
సీ. కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా ననువునఁ జందనం బల్ల నలఁది
కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁబలుకులు సెవులలోఁ బాఱ నూఁది
కరమొప్ప ముత్యాలసరుల చిక్కెడలించి యురమునఁ బొందుగా నిరవు కొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి వదలినభూషణావళులఁ దొడిగి
 
తే. కమలదళచారుతాలవృంతమున విసరి, పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందు పఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁ దీర్చి బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొగము నిమిరి.
241
తే. నెరులు గల మరునీలంపుటురుల సిరుల, నరులుగొనఁజాలి నరులను మరులు కొలుపు
నిరుల గెలిచిన తుమ్మెద గఱులఁ దెగడు, కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి.
242
క. మురసంహరుఁ డిందిందిర, గరుదనిలచలత్ప్రసూనకలికాంచిత సుం
దరశయ్యఁ జేర్చె భీష్మక, వరపుత్రిన్‌ నుతచరిత్ర వారిజనేత్రన్‌.
243
వ. ఇట్లు పానుపునం జేర్చి మృదుమధురభాషణంబుల ననునయించిన. 244
క. పురుషోత్తముముఖకోమల, సరసిజ మ య్యిందువదన సవ్రీడా హా
స రుచిస్నిగ్ధాపాంగ, స్ఫురదవలోకనము లొలయఁ జూ చిట్లనియెన్‌.
245
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )