| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| ఉ. |
రాజకులావతంసుఁడు పరాజితకంసుఁడు సొచ్చి కాంచె ఘో రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు త్తేజితశక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా త్రీజనమాన్యలన్ గుణవతీవ్రతధన్యల రాజకన్యలన్. |
206 |
| మ. |
కని రా రాజకుమారికల్ పరిమళత్కౌతూహలాక్రాంతలై దనుజాధీశచమూవిదారు నతమందారున్ శుభాకారు నూ తన శృంగారు వికారదూరు సుగుణాధారున్ మృగీలోచనా జనచేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్. |
207 |
| వ. | కని యతని సౌందర్యగాంభీర్యచాతుర్యాదిగుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలితహృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుం డుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుం డని వరియించి. | 208 |
| ఉ. |
పాపపురక్కసుండు సెఱపట్టె నటంచుఁ దలంతు మెప్పుడుం బాపుఁడె? వీనిధర్మమునఁ బద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో? యా పరమేష్ఠి పుణ్యుఁడు గదమ్మ! హరిన్ మముఁ గూర్చె నిచ్చటన్. |
209 |
| క. |
ఉన్నతి నీతఁడు గౌఁగిట, మన్నింపఁగ నింక బ్రదుకుమానిని మనలో ము న్నేమి నోము నోఁచెనొ, సన్నుతమార్గముల విపినజలదుర్గములన్. |
210 |
| క. |
విన్నారమె యీ చెలువముఁ?, గన్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్? మన్నార మింతకాలముఁ, గొన్నారమె యెన్నఁ డయినఁ గూరిమి చిక్కన్. |
211 |
| సీ. |
వనజాక్షి! నేఁగన్క వైజయంతిక నైన గదిసి వ్రేలుదు గదా కంఠమందు బింబోష్ఠి! నేఁగన్క పీతాంబరము నైన మెఱసి యుండుదు గదా మేనునిండఁ గన్నియ! నేఁగన్క కౌస్తుభమణి నైన నొప్పు సూపుదుఁగదా యురమునందు బాలిక! నేఁగన్క పాంచజన్యము నైన మొనసి చొక్కుదుఁగదా మోవిఁ గ్రోలి |
|
| ఆ. |
పద్మగంధి! నేను బర్హదామము నైనఁ, జిత్రరుచుల నుందు శిరమునందు ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు, గములు గట్టి గరుడగమనుఁ జూచి. |
212 |
| శా. |
భూనాథోత్తమ! కన్యకల్ వరుస నంభోజాతనేత్రుండు న న్నే నవ్వెం దగఁ జూచె డగ్గఱియె వర్ణించెన్ వివేకించె స మ్మానించెం గరుణించెఁ బే రడిగె సన్మార్గంబుతోఁ బెండ్లి యౌ నేనే చక్రికి దేవి నంచుఁ దమలో నిర్ణీతలై రందఱున్. |
213 |
| వ. | ఇట్లు బహువిధంబులం దమ తమ మన్ననలకు నువ్విళ్ళూరుకన్నియలం బదాఱువేల ధవళాంబ రాభరణమాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను; ధవళంబులై, వేగవంతంబులై, యైరావతకులసంభవంబులైన చతుర్దంతదంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి, దేవేంద్రునిపురంబునకుం జని యదితిదేవిమందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణపటలపరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి. | 214 |
| మ. |
హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ బెట్టె సుం దరగంధానుగతభ్రమద్భ్రమరనాదవ్రాతముం బల్లవాం కుర శాఖాఫలపర్ణపుష్పకలికాగుచ్ఛాదికోపేతమున్ గిరిభిత్త్రాతముఁ బారిజాతముఁ ద్రిలోకీయాచకాఖ్యాతమున్. |
215 |
| వ. | ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం, దానును విహగవల్లభారూఢుండయి చనుచున్న సమయంబున. | 216 |
| సీ. |
నరకాసురునిబాధ నలఁగి గోవిందునికడ కేగి తత్పాదకమలములకుఁ దన కిరీటము సోఁక దండప్రణామముల్ గావింప నా చక్రి కరుణ సేసి చనుదెంచి భూసుతు సమయించి తనవారిఁ దన్ను రక్షించుటఁ దలఁప మఱచి యింద్రుండు బృందారకేంద్రత్వమదమునఁ ‘బద్మలోచన! పోకు పారిజాత |
|
| ఆ. |
తరువు విడువు’ మనుచుఁ దాఁకె నడ్డము వచ్చి, తఱిమి సురలు నట్లు దాఁకి రకట! యెఱుక వలదె నిర్జరేంద్రత కాల్పనే?, సురల తామసమును జూడ నరిది. |
217 |
| వ. | ఇట్లు తనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన నిర్జరేంద్రాదుల నిర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభికుసుమమకరందమాధురీవిశేషంబులకుఁ జొక్కి చిక్కక నాకలోకంబున నుండి వెంట నరుగుదెంచు తుమ్మెదలకు నెమ్మి దలంచుచున్న పారిజాతమ్ము నాశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ యగు సత్యభామతోఁ గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురునియింటం దెచ్చిన రాజకన్యక లెందఱందఱకు నన్ని నివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి. | 218 |
| చ. |
అమితవిహారుఁ డీశ్వరుఁ డనంతుఁడు దా నొకనాఁడు మంచి ల గ్నమునఁ బదాఱువేలభవనంబులలోనఁ బదాఱువేల రూ పములఁ బదాఱువేల నృపబాలలఁ బ్రీతిఁ బదాఱువేల చం దముల విభూతి నొందుచు యథావిధితో వరియించె భూవరా! |
219 |
| ఉ. |
దానములందు సమ్మదవిధానములం దవలోకభాషణా హ్వానములందు నొక్కక్రియ నా లలితాంగుల కన్నిమూర్తులై తా ననిశంబు గానఁబడి తక్కువ యెక్కువ లేక యుత్తమ జ్ఞానగృహస్థధర్మమునఁ జక్రి రమించెఁ బ్రపూర్ణకాముఁడై. |
220 |
| క. |
తరుణులు పెక్కం డ్రయినను, బురుషుఁడు మనలేఁడు సవతిపోరాటమునన్ హరి యా పదాఱువేవురు, తరుణులతో సమత మనియె దక్షత్వమునన్. |
221 |
| శా. |
ఎన్నేభంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్ ము న్నేదేవునిఁ జూడఁ గానక తుదిన్ మోహింతు, రా మేటి కే విన్నాణంబుననో సతుల్ గృహిణులై విఖ్యాతి సేవించి ర చ్ఛిన్నాలోకనహాసభాషణరతిశ్లేషానురాగంబులన్. |
222 |
| సీ. |
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు నానీతవస్తువు లందుకొనుచు సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుఁ బదములు గడుగుచు భక్తితోడ సంవాసితస్నానజలము లందించుచు సద్గంధవస్త్రభూషణము లొసఁగి యిష్టపదార్థంబు లిడుచుఁ దాంబూలాదు లొసఁగుచు విసరుచు నోజ మెఱసి |
|
| తే. |
శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల, నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త లయ్యుఁ గొలిచిరి దాసలై హరి నుదారుఁ, దారకాధిపవదనలు దారు దగిలి. |
223 |
| శా. |
‘నన్నే పాయఁడు, రాత్రులన్ దివములన్ నన్నే కృపం జెందెడిన్, నన్నే దొడ్డగఁ జూచు వల్లభలలో, నాథుండు నా యింటనే యున్నా’ డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా యన్నుల్ గాఢపతివ్రతాత్వపరిచర్యాభక్తియోగంబులన్. |
224 |
| క. |
ఆ రామలతో నెప్పుడుఁ, బోరాములు సాల నెఱపి పురుషోత్తముఁడున్ గారామునఁ దిరిగెను సౌ, ధారామలతాసరోవిహారముల నృపా! |
225 |
| క. |
ఏ దేవుఁడు జగముల ను, త్పాదించును మనుచుఁ జెఱుచుఁ బ్రాభవమున మ ర్యాదారక్షణమునకై, యా దేవుం డట్లు మెఱసె యాదవులందున్. |
226 |