పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
సీ. ‘అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ బొందువానికి నాదిపురుషునకును
నఖిలనిదానమై యాపూర్ణవిజ్ఞానుఁడైనవానికిఁ బరమాత్మునకును
 
ఆ. ధాతఁ గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మమహిత! యమితచరిత!
202
వ. దేవా! నీవు లోకంబులు సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి. ప్రధానపూరుషుండవు పరుండవు, నీవ! నేనును, వారియు, వహ్నియు, ననిలుండు, నాకాశంబు, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీయందు సంభవింతుము. 203
చ. దయ నిటు సూడుమా! నరకదైత్యునిబిడ్డఁడు వీఁడు, నీ దెసన్‌
భయమున నున్నవాఁడు, గడు బాలుఁ, డనన్యశరణ్యుఁ, డార్తుఁ, డా
శ్రయరహితుండు, దండ్రిక్రియ శౌర్యము నేరఁడు, నీ పదాంబుజ
ద్వయిఁ బొడఁగాంచె భక్తపరతంత్రసువీక్షణ! దీనరక్షణా!
204
వ. అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్త్రుం డయిన భగదత్తున కభయం బిచ్చి, సర్వసంపద లొసంగి నరకాసురగృహంబు ప్రవేశించి యందు. 205
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )