| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
జన్యంబున దనుజుల దౌ, ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ జన్యవతిఁ జూచి యదురా, జన్యశ్రేష్ఠుండు సరససల్లాపములన్. |
171 |
| క. |
లేమా! దనుజుల గెలువఁగ, లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా! లే! మాను మాన వేనిన్, లే మా విల్లందికొనుము లీలం గేలన్. |
172 |
| వ. | అని పలికి. | 173 |
| క. |
హరిణాక్షికి హరి యిచ్చెను, సురనికరోల్లాసనమును శూరకఠోరా సురసైన్యత్రాసనమును, పరగర్వనిరాసనమును బాణాసనమున్. |
174 |
| శా. |
ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంతతేజోవిశే షావిర్భూతమహాప్రతాపమున వీరాలోకదుర్లోకయై తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడామహోత్కంఠతోన్. |
175 |
| క. |
నారి మొరయించె రిపు సే, నా రింఖణహేతువైన నాదము నిగుడన్ నారీమణిబలసంప, న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా! |
176 |
| సీ. |
సౌవర్ణకంకణఝణఝణనినదంబు శింజినీరవముతోఁ జెలిమిసేయఁ దాటంకమణిగణధగధగదీప్తులు గండమండలరుచిఁ గప్పికొనఁగ ధవళతరాపాంగధళధళరోచులు బాణజాలప్రభాపటలి నడఁప శరఘాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి సైనిక కలకలస్వనము నుడుప |
|
| తే. |
వీరశృంగారభయరౌద్రవిస్మయములు, గలసి భామిని యయ్యెనో కాక యనఁగ నిషువుఁ దొడుగుట దివుచుట యేయు టెల్ల, నెఱుఁగ రాకుండ నని సేసె నిందువదన. |
177 |
| మ. |
పరుఁజూచున్ వరుఁజూచు నొంప నలరింపన్, రోషరాగోదయా విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్, గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్ సరసాలోకసమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్. |
178 |
| మ. |
అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢపాదంబుతో నలికస్వేదవికీర్ణకాలకలతో నాకర్ణికానీత స ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకారధనుర్విముక్తవిశిఖవ్రాతాహతారాతియై. |
179 |
| సీ. |
‘బొమ్మ పెండ్లిండ్లకుఁ బోనొల్ల’ నను బాల రణరంగమున కెట్లు రాఁ దలంచె? మగవారిఁ గనినఁ దా మఱుఁగు చేరెడు నింతి పగవారి గెల్వ నే పగిదిఁ జూచెఁ? బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు ఖగపతిస్కంధ మే కడిఁది నెక్కె? సఖుల కోలాహలస్వనము లోర్వనికన్య పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె? |
|
| ఆ. |
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ, నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి యే విధమున నుండె నెలమి నాలీఢాది, మానములను రిపులమాన మడఁప? |
180 |
| సీ. |
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్ట నేర్చె? మ్రాఁకునఁ దీఁగెఁ గూర్పంగ నేరని లేమ గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె? సరవి ముత్యము గ్రువ్వఁజాలని యబల యే నిపుణత సంధించె నిశితశరముఁ? జిలుకకుఁ బద్యంబు సెప్పనేరని తన్వి యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ? |
|
| ఆ. |
బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే, గతి నొనర్చె సింహగర్జనములు? ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ, గుణధామ, చారుసత్యభామ, సత్యభామ. |
181 |
| శా. |
జ్యావల్లీధ్వని గర్జనంబుగ, సురల్ సారంగ యూథంబుగా, నా వి ల్లింద్రశరాసనంబుగ, సరోజాక్షుండు మేఘంబుగాఁ, దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్నిమగ్నంబుగాఁ బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్. |
182 |
| సీ. |
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు, కందర్పకేతువై ఘనధూమకేతువై యలరుఁ బూఁబోఁడిచేలాంచలంబు, భావజుపరిధియై ప్రళయార్కుపరిధియై మెఱయు నాకృష్టమై మెలఁత చాప, మమృతప్రవాహమై యనలసందోహమై తనరారు నింతిసందర్శనంబు, |
|
| తే. |
హర్షదాయియై మహారోషదాయియై, పరఁగు ముద్దరాలిబాణవృష్ణి, హరికి నరికిఁ జూడ నందంద శృంగార, వీరరసము లోలి విస్తరిల్ల. |
183 |
| వ. | ఇ వ్విధంబున. | 184 |
| క. |
శంపాలతాభ బెడిదపు, టంపఱచే ఘోరదానవానీకంబుల్ పెంపఱి సన్నాహంబుల, సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్. |
185 |
| వ. | అ య్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధురవచనసుధారసవిసారియుం, దదీయసమరసన్నాహనివారియునై యిట్లనియె. | 186 |
| క. |
‘కొమ్మా! దానవనాథుని, కొ మ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ, గొ మ్మాభరణములు నీవు గోరిన వెల్లన్.’ |
187 |
| వ. | అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృతచిత్తవిక్షేపంబులు నైన సల్లాపంబులం గళావతిం దద్దయుఁ బెద్దఱికంబు సేసి, తత్కరకిసలయోల్లసితబాణాసనంబు మరల నందు కొనియె, నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె. | 188 |
| క. |
మగువ మగవారి ముందఱ, మగతనములు సూప రణము మానుట నీకున్ మగతనము గాదు; దనుజులు, మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ! |
189 |
| వ. | అనిన హరి యిట్లనియె. | 190 |
| క. |
‘నరకా! ఖండించెద మ, త్కరకాండాసనవిముక్తఘనశరముల భీ కరకాయు నిన్ను సుర కి, న్నరకాంతలు సూచి నేఁడు నందం బొందన్.’ |
191 |
| వ. | అని పలికి హరి నరకాసురయోధులమీఁద శతఘ్ని యను దివ్యాస్త్రంబు ప్రయోగించిన నొక్క వరుసను వార లందఱు మహావ్యథం జెందిరి, మఱియును. | 192 |
| మ. |
శరవిచ్ఛిన్నతురంగమై పటుగదాసంభిన్నమాతంగమై, యురుచక్రాహతవీరమధ్యపదబాహుస్కంధముఖ్యాంగమై, సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్. |
193 |
| వ. | అప్పుడు. | 194 |
| ఆ. |
మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు, శస్త్రసముదయముల జనవరేణ్య! మురహరుండు వరుస మూఁడేసి కోలల, ఖండితంబు సేసె గగనమందు. |
195 |
| క. |
వెన్నుని సత్యను మోచుచుఁ, బన్నుగఁ బదనఖరచంచుపక్షాహతులన్ భిన్నములు సేసె గరుడుఁడు, పన్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా! |
196 |
| వ. | మఱియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటం జూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతిశక్తిం గొని గరుడుని వైచె, నతండును విరులదండవ్రేటునఁ జలింపని మదోద్దండవేదండంబునుంబోలె విలసిల్లె, న య్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున. | 197 |
| మ. |
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా చక్రాయుధున్ వైవ శూ లము చేఁ బట్టిన నంతలోన రుచిమాలాభిన్నఘోరాసురో త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర త్నమయోదగ్రవినూత్నకుండలసమేతంబైన తన్మూర్ధమున్. |
198 |
| శా. |
‘ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే! చెల్లంబో! తలఁ ద్రుంచె’ నంచు నిల నాక్షేపించుచందంబునన్ ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై. |
199 |
| క. |
‘కంటిమి నరకుఁడు వడఁగా, మంటిమి నేఁ’డనుచు వెస నమర్త్యులు మునులున్ మింటం బువ్వులు గురియుచుఁ, బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్. |
200 |
| వ. | అంత భూదేవి వాసుదేవుని డగ్గఱ నేతెంచి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, వైజయంతియను వనమాలయును, వరుణదత్తంబైన సితచ్ఛత్త్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి మ్రొక్కి భక్తితాత్పర్యంబులతోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును, విశ్వేశ్వరుండును నైన దేవదేవుని నిట్లని వినుతించె. | 201 |