పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుఁడు సత్యభామతోఁ గూడ నరిగి నరకాసురుని వధించుట
శా. ‘దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్‌, నేఁ జూచి యేతెంచి నీ
దేవీసంహతి కెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌,’
151
వ. అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె. 152
సీ. ‘సమదపుష్పంధయఝంకారములు గావు, భీషణకుంభీంద్రబృంహితములు
వాయునిర్గతపద్మవనరేణువులు గావు, తురగరింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరంగాసారములు గావు, శత్రుధనుర్ముక్తసాయకములు
గలహంససారసకాసారములు గావు, దనుజేంద్రసైన్యకదంబకములు
 
తే. కమలకహ్లారకుసుమసంఘములు గావు, చటులరిపుశూలఖడ్గాదిసాధనములు
కన్య! నీ వేడ? రణరంగగమన మేడ?, వత్తు, వేగమ నిలువుము, వలదు వలదు.’
153
వ. అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి. 154
ఉ. ‘దానవులైన నేమి? మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
మానితబాహుదుర్గముల మాటున నుండఁగ నేమి శంక? నీ
తో నరుదెంతు’ నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్‌.
155
వ. ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁ గ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగనమార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి. 156
మ. గదచేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్‌ భంజించి చక్రాహతిం
జెదరన్‌ వాయుజలాగ్నిదుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్‌.
157
వ. మఱియును. 158
శా. ప్రాకారంబు గదాప్రహారముల నుత్పాటించి యంత్రంబులన్‌
నాకారాతుల మానసంబులును ఖిన్నత్వంబు సెందంగ న
స్తోకాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్రనిర్ఘాత రే
ఖా కాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణిచైతన్యమున్‌.
159
వ. అంత లయకాల కాలాభ్రగర్జనంబుపగిది నొప్పు న మ్మహాధ్వని విని పంచశిరుండైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలి వచ్చి హరిం గని ప్రళయకాలకీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం బంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీలకీలాజటాలం బగు శూలంబున గరుడుని వైచి భూనభోఽంతరం బులు నిండ నార్చుచు. 160
క. దురదురఁ బరువిడి బిరుసున, ‘హరి హరి! నిలునిలువు’ మనుచు నసురయుఁ గదిసెన్‌
మురముర దివిజులహృదయము, మెరమెర యిదె యడఁగు ననుచు మెఱసెన్‌ హరియున్‌.
161
వ. అప్పుడు. 162
క. గరుడునిపైఁ బడ వచ్చిన, మురశూలము నడుమ నొడిసి ముత్తునియలుగాఁ
గరముల విఱిచి ముకుందుఁడు, మురముఖముల నిశితవిశిఖములు వడిఁ జొనిపెన్‌.
163
మ. గద వ్రేసెన్‌ మురదానవుండు హరిపైఁ, గంసారియుం దద్గదన్‌
గదచేఁ ద్రుంచి సహస్రభాగములుగాఁ గల్పించె, నాలోన వాఁ
డెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ
గ్ర దశన్‌ వానిశిరంబు లైదును వడిన్‌ ఖండించెఁ జక్రాహతిన్‌.
164
వ. ఇట్లు శిరంబులు చక్రి చక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారాదళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వానిసూనులు జనకవధజనితశోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునఁ దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నన నేడ్వురుయోధులు సక్రోధులై కాలాంతకచోదితంబైన ప్రళయపవనసప్తకంబు భంగి నరకాసురప్రేరితులై రయంబునఁ బీఠుం డనియెడు దండనాథుం బురస్కరించు కొని, పఱతెంచి హరిం దాఁకి శరశక్తిగదాఖడ్గకరవాలశూలాదిసాధనంబులు ప్రయోగించిన. 165
ఉ. ఆ దనుజేంద్రయోధవివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్‌
మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళమార్గణాళిఁ గ్ర
వ్యాదకులాంతకుం డసురహస్తభుజాననకంఠజాను జం
ఘాదులఁ ద్రుంచి వైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్‌.
166
వ. మఱియు హరిశరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱఁగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకుసేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుం డయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండతండంబులై నడువ వెడలి భండనంబునకుం జని. 167
మ. బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజబింబోపరి
స్థలశంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలానారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్‌ రణాభంగునిన్‌.
168
వ. కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున. 169
శా. వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీర సంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్రభాగంబునన్‌.
170
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )