పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుండు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారలఁ బరిణయమాడుట
వ. అంతం గృష్ణుండు ధర్మరాజ ప్రముఖుల వీడుకొని సాత్యకిప్రముఖసహచరులు గొలువ, మరలి తన పురంబునకుం జని బంధుజనంబులకుఁ బరమానందంబు సేయుచు నొక్కపుణ్యదివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె, మఱియు నవంతిదేశాధీశ్వరు లయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూఁతురైన తమ చెలియలిని వివాహంబు సేయ నుద్యోగించి స్వయంవరంబుఁ జాటించిన. 124
క. భూ రమణులు సూడఁగ హరి, వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూరితసుజనానందం, జారుచికురకాంతివిజితషట్పదబృందన్‌.
125
సీ. జననాథ! వినుము కోసలదేశ మేలెడి నగ్నజిత్తను నరనాథుఁ డొకఁడు
సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యను కన్యక గుణవతి గలదు; దానిఁ
బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచి వాఁడికొమ్ములు గల వాని, వీర
గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని, నతిమదమత్తంబులైన వాని
 
తే. గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచి, బాహుబలమున నెవ్వఁడు పట్టి కట్టు
నతఁడు కన్యకుఁ దగు వరుం డనిన వానిఁ, బట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి.
126
వ. ఇట్లు గోవృషంబుల జయించినవాఁ డక్కన్యకు వరుం డనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్నయెడ. 127
క. ఆ రాజకన్య ప్రియమున, నా రాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో
కారాధితు మాధవుఁ దన, కారాధ్యుండైన నాథుఁ డని కోరె నృపా!
128
వ. మఱియు న క్కన్యకారత్నంబు తన మనంబున. 129
ఆ. విష్ణుఁ డవ్యయుండు విభుఁడు గావలె నని, నోఁచినట్టి తొంటి నోముఫలము
సిద్ధ మయ్యెనేనిఁ జేకొనుఁబో నన్నుఁ, జక్రధరుఁడు వైరిచక్రహరుఁడు.
130
మ. సిరియుం బద్మభవేశదిక్పతులు మున్‌ సేవించి యెవ్వాని శ్రీ
చరణాంభోజపరాగముల్‌ శిరములన్‌ సమ్యగ్గతిం దాల్తుఁ రీ
ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా
పరుఁడై యెవ్వఁడు దాల్చు నట్టి హరి యెబ్భంగిం బ్రవర్తించునో!
131
వ. అని యిట్లు నాగ్నజితి విచారించు నెడఁ గృష్ణుం డా రాజుం జూచి మేఘగంభీరనినదంబున నిట్లనియె. 132
క. అన్యుల యాచింపరు రా, జన్యులు సౌజన్యకాంక్షఁ జనుదెంచితి నీ
కన్యన్‌ వేఁడెద నిమ్మా!, కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!
133
వ. అనిన రాజిట్లనియె. 134
శా. కన్యం జేకొన నిన్నిలోకముల నీకన్నన్‌ ఘనుండైన రా
జన్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా
నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్‌ నిత్యయై
ధన్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై.
135
శా. చంచద్గోవృషసప్తకంబుఁ గడిమిన్‌ సైరించి యెవ్వాఁడు భం
జించున్‌ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్‌ వైభవో
దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్పాదశృంగాహతిం
గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై.
136
శా. ఉష్ణాంశుండు తమంబుఁ దోలుక్రియ నీ వుగ్రాహవక్షోణిలోఁ
గృష్ణా! వైరులఁ దోలినాఁడవు, రణక్రీడావిశేషంబులన్‌
నిష్ణాతుండవు, సప్తగోవృషములన్‌ నేఁ డాజి భంజించి రో
చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్‌.
137
వ. అని నగ్నజిత్తు తన కూఁతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని. 138
చ. కనియె నఘారి వత్సబకకంసవిదారి ఖలప్రహారి దా
ఘనతరకిల్బిషంబుల నగణ్యభయంకరపౌరుషంబులన్‌
సునిశితశృంగనిర్దళితశూరసమూహముఖామిషంబులన్‌
హననగుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్‌.
139
ఉ. చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్‌ వడి నేడుమూర్తులై
బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాలకు లెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వతసన్నిభంబులన్‌.
140
వ. ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె, నా రాజసుందరు లానందంబును బొంది, రా సమయంబున బ్రాహ్మ ణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె, నంత నా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణభూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భటసమూహంబును నిచ్చి పుత్తెంచిన వచ్చునప్పుడు. 141
ఉ. భూతి యెలర్పఁ గోసలునిపుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ
బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధవుం
డా తరుణిన్‌ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం
ఘాతముతోడఁ దాఁకి రరిగర్వవిమోచనుఁ బద్మలోచనున్‌.
142
ఉ. దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో
భండనభూమియందుఁ దన బాంధవు లెల్లను సన్నుతింపఁగా
గాండివచాపముక్తవిశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా
ఖండలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్‌.
143
వ. ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామ తోడం గ్రీడించుచుండె; మఱియును. 144
మ. జనవంద్యన్‌ శ్రుతకీర్తి నంద్యఁ దరుణిన్‌ సందర్శనక్షోణిపా
ద్యనుజన్‌ మేనమఱందలిన్‌ విమలలోలాపాంగఁ గై కేయి ని
ద్ధ నయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్‌ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్‌.
145
వ. మఱియును. 146
చ. అమరులఁ బాఱఁ దోలి భుజగాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
కమలదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్‌
సమదమృగేక్షణన్‌ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్‌.
147
వ. ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్రరాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి, మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్రకన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె నని విని. 148
క. ధరకుం బ్రియనందనుఁ డగు, నరకుని హరి యేల చంపె? నరకాసురుఁ డా
వరకుంతల లగు చామీ, కరకుంభస్తనుల నేల కారం బెట్టెన్‌?
149
వ. అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె, నరకాసురునిచేత నదితికర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రిస్థానంబును గోలుపడుటయు నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసురవధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె. 150
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )