పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుం డింద్రప్రస్థపురంబున కరుగుదెంచుట
వ. అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకిప్రముఖయాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రప్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులం గనిన యింద్రియంబులభంగి వా రఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని కృష్ణునిదివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగ హాసవిభాసితంబైన ముకుందముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి, గోవిందుండును యుధిష్ఠిరభీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకులసహదేవులు మ్రొక్కిన గ్రుచ్చి యెత్తి, యుత్తమపీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు. 103
క. చంచద్ఘనకుచభారా, కుంచితయై క్రొత్తపెండ్లికూఁతు రగుట నిం
చించుక సిగ్గు జనింపఁగఁ, బాంచాలతనూజ మ్రొక్కెఁ బద్మాక్షునకున్‌.
104
వ. అంత సాత్యకి పాండవులచేతం బూజితుండైయొక్కపీఠంబున నాసీనుండై యుండెఁ, దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి, హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె. 105
క. ‘అత్తా! కొడుకులుఁ గోడలుఁ, జిత్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా
యత్తానుగవై యాజ్ఞా, సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్‌?
106
చ. అనవుడుఁ బ్రేమవిహ్వలత నందుచు గద్గదభాషణంబులం
గనుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే
సిన యపచారముం దలఁచి చెందినదుఃఖము లెల్లఁ జెప్పి యా
దనుజవిరోధి కి ట్లనియెఁ దద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్‌.
107
సీ. ‘అన్న! నీ చుట్టాల నరయుదు, మఱవవు, నీవు పుత్తెంచిన నెమ్మితోడ
మా యన్న యేతెంచి మముఁ జూచి పోయెను, నిల్చి యున్నారము నీ బలమున,
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు నేఁడాదిగా నింక నీవె కాక?
యఖిలజంతువుల కీ వాత్మవు గావునఁ బరులు నా వారని భ్రాంతి సేయ
 
తే. వయ్య! నా భాగ్యమెట్టిదో? యనవరతముఁ జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్ల
వాపుచుందువు గాదె! యో పరమపుణ్య!, యదుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య!
108
వ. అనిన యుధిష్ఠిరుం డి ట్లనియె. 109
మ. ‘పట్టఁగ లేరు నిన్నుఁ దమభావములందు సనందనాదు లే
పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా
చుట్టమ వంచు వచ్చెదవు చూచెద వల్పులమైన మమ్ము; నే
మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీరవేళలన్‌?’
110
వ. అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబువారలకు నయనానందంబు సేయుచు హరి గొన్నినెలలు వసియించి యుండె, నం దొక్కనాఁడు. 111
మ. తురగశ్రేష్ఠము నెక్కి కంకటధనుస్తూణీశరోపేతుఁడై
హరితోడన్‌ వనభూమి కేగి విజయుం డాసక్తుఁడై చంపె శం
బర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా
సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగముఖ్యంబులన్‌.
112
క. అచ్చోటఁ బవిత్రములై, చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకున్‌
దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ, జెచ్చెర నరుఁ గొల్చియున్న సేవకు లధిపా!
113
వ. అంత నర్జునుండు నీరువట్టున డస్సిన యమునకుం జని య మ్మహారథులైన నరనారాయణు లందు వార్చి జలంబులు ద్రావి యొక పులినప్రదేశంబున నుండి. 114
ఉ. ఉపగతులైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా
విపులవిలోలనీలతరవీచికలందు శిరోజభార రు
చ్యపహసితాళిమాలిక నుదంచితబాలశశిప్రభాలికం
దపనునిబాలికన్‌ మదనదర్పణతుల్యకపోలపాలికన్‌.
115
వ. కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్యకిట్లనియె. 116
మ. ‘సుదతీ! యెవ్వరిదాన? వేమికొఱ కిచ్చోటం బ్రవర్తించె? దె
య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోఁగూడి యీ
నదికిన్‌ వచ్చిన జాడ గానఁబడె? ధన్యం బయ్యె నీ రాక, నీ
యుదయాదిస్థితి నెల్లఁ జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా!
117
వ. అనిన నర్జునునకుఁ గాళింది యి ట్లనియె. 118
మ. ‘నరవీరోత్తమ! యేను సూర్యునిసుతన్‌, నాపేరు కాళింది, భా
స్కర సంకల్పితగేహమందు నదిలోఁ గంజాక్షు విష్ణుం బ్రభున్‌
వరుగాఁ గోరి తపంబు సేయుదు, నొరున్‌ వాంఛింపఁ, గృష్ణుండు వ
న్యరతిన్‌ వచ్చి వరించు నంచుఁ బలికెన్‌ నా తండ్రి నాతోడుతన్‌.’
119
వ. అనిన విని ధనంజయుఁ డా నీలవేణిపలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరి మధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజుకడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి, వారిపురం బతివిచిత్రంబు సేయించె. 120
క. దేవేంద్రునిఖాండవ మ, ప్పావకునకు నీఁ దలంచి పార్థుని రథికుం
గావించి సూతుఁ డయ్యెను, గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్‌.
121
వ. ఇట్లు నరనారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయతూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవ మనియెడి బాణాసనంబును, దివ్య రథంబును, ధవళరథ్యంబులను నిచ్చె నందు. 122
ఉ. వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖాజనితోగ్రవేదనల్‌
వాసినఁజేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై
యా సభలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు
ల్లాసముఁ బాసి యుండుట జలస్థలనిర్ణయబుద్ధిహీనుఁడై.
123
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )