| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
‘జగతీశ! వినవయ్య శతధన్వుఁ బొడగని యక్రూరకృతవర్మ లాప్తవృత్తి ‘మన కిత్తు’ ననుచు సమ్మతిఁజేసి తన కూఁతుఁ బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కేక్రియనైన మణి పుచ్చుకొనుము నీ మతము మెఱసి’ యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు పశువుఁ గటికివాఁడు పట్టి చంపు |
|
| ఆ. |
కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ, బట్టి చంపి, వానిభామలెల్ల మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ, జనియె నొక్కనాఁడు జనవరేణ్య! |
84 |
| వ. | ఇట్లు హతుండైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తుమరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరు లయ్యును మనుష్యభావంబుల విలపించి, రంత బలభద్రసత్యభామాసమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలి వచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె. | 85 |
| ఉ. |
‘అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడుతోయముల్ దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారలలావు వింతయే? |
86 |
| వ. | అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరునియింటికిం జని హరితోడ పగకుం దోడు రమ్మని చీరిన నక్రూరుండు హరిబలపరాక్రమధైర్యస్థైర్యంబు లుగ్గడించి మఱియు నిట్లనియె. | 87 |
| సీ. |
‘ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై పుట్టించు రక్షించుఁ బొలియఁ జేయు, నెవ్వనిచేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు, లెవ్వనిమాయ మోహించు భువన, మే డేండ్లపాపఁడై యే విభుఁ డొకచేత గోరక్షణమునకై కొండ నెత్తె, నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత కర్ముఁ డనంతుండు కర్మసాక్షి, |
|
| తే. |
యట్టి ఘనునకు శౌరికి ననవరతము, మ్రొక్కెదము గాక! విద్వేషమునకు నేము వెఱతు మొల్లము నీ వొండువెంటఁ బొమ్ము, చాలు పదివేలు వచ్చె నీ సఖ్యమునను. |
88 |
| వ. | అని యి ట్లక్రూరుం డుత్తరంబు పలికిన న మ్మహామణి యక్రూరునియొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజనదూరంబు సనియె, గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామకృష్ణులు వెనుచని, రంత నతండును మిథిలానగరంబుఁ జేరి తత్సమీపంబునందు. | 89 |
| చ. |
తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై పరువిడఁ ‘బోకు పోకు’మని పద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ కరగతి వానిమస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం బరిహతదైత్యచక్రముఁ బ్రభాచయమోదితదేవశక్రమున్. |
90 |
| వ. | ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండుటఁదెలిసి బలభద్రునికడకు వచ్చి శతధన్వుం డూరక హతుం డయ్యె, మణిలే’ దనిన బలభద్రుం డిట్లనియె. | 91 |
| సీ. |
‘ఆ మణి శతధన్వుఁ డపహరించుట నిక్క, మెవ్వరిచే దాఁప నిచ్చినాఁడొ? వేగమె నీ వేఁగి వెదకుము పురిలోన, వైదేహు దర్శింప వాంఛ గలదు, పోయి వచ్చెద, నీవు పొ’మ్మని వీడ్కొని మెల్లన రాముండు మిథిలఁ జొచ్చి పోయిన జనకుండు పొడగని హర్షించి యెంతయుఁ బ్రియముతో నెదురు వచ్చి |
|
| తే. |
యర్ఘ్యపాద్యాదికృత్యంబు లాచరించి, యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి ‘యుండు’ మని భక్తిచేసిన నుండె ముసలి, కువలయేశ్వర!, మిథిలలోఁగొన్ని యేండ్లు. |
92 |
| వ. | అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుండై. | 93 |
| క. |
చలమున గాంధారేయుఁడు, లలితగదాయుద్ధకౌశలము నేర్చెఁ దగన్ హలిచే నాశ్రితనిర్జర, ఫలిచేఁ ద్రైలోక్యవీరభటగణబలిచేన్. |
94 |
| వ. | అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును, మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె, నక్రూరకృతవర్మలు శతధన్వుమరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజనదూర భూమికిం జని, రక్రూరుండు లేమింజేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీరమానసతాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి. | 95 |
| సీ. |
‘కమలాక్ష! వినవయ్య! కాశీశుఁ డేలెడికుంభిని వానలు గురియకున్నఁ గోరి శ్వఫల్కునిఁ గొనిపోయి యతనికిఁ గాందిని యనియెడు కన్య నిచ్చి కాశీవిభుండు సత్కారంబు సేసిన వానలు గురిసె నా వసుధమీఁద, నాతనిపుత్త్రకుఁడైన యక్రూరుండు నంతటివాఁడు, మహాతపస్వి |
|
| ఆ. |
మరలి వచ్చెనేని మాను నుత్పాతంబు, లెల్ల, వాన గురియు నీ స్థలమున, దేవ! యతనిఁ దోడి తెప్పింపు, మన్నింపు, మానవలయుఁ బీడ మానవులకు. |
96 |
| వ. | అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి, పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి, సకలలోకజ్ఞుండు గావున మృదుమధురభాషణంబుల నతని కిట్లనియె. | 97 |
| సీ. |
‘తా నేగుతఱి శతధన్వుండు మణిఁ దెచ్చి నీ యింటఁ బెట్టుట నిజము తెలిసి నాఁడ, సత్రాజిత్తునకుఁ బుత్రకులు లేమి నతనికిఁ గార్యంబు లాచరించి విత్తంబు ఋణమును విభజించుకొనియెద రతని పుత్త్రికలెల్ల, నతఁడు పరుల చేత దుర్మరణంబుఁ జెందినాఁ, డతనికై సత్కర్మములు మీఁద జరుపవలయు, |
|
| ఆ. |
మణి గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మఁ, డెలమి బంధుజనుల కెల్లఁ జూపు మయ్య! నీ గృహమున హాటకవేదికా, సహితమఖము లమరు సంతతమును’. |
98 |
| వ. | అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన. | 99 |
| ఉ. |
సంతసమంది బంధుజనసన్నిధికిన్ హరి దెచ్చి చూపె న శ్రాంతవిభాసమానఘృణిజాలపలాయితభూనభోంతర ధ్వాంతము హేమభారచయవర్షణవిస్మితదేవమానవ స్వాంతముఁ గీర్తిపూరితదిశావలయాంతము నా స్యమంతమున్. |
100 |
| క. |
చక్రాయుధుఁ డీ క్రియఁ దన, యక్రూరత్వంబు జనుల కందఱకును ని ర్వక్రముగఁ దెలిపి క్రమ్మఱ, నక్రూరుని కిచ్చె మణిఁ గృపాకలితుండై. |
101 |
| క. |
ఘనుఁడు భగవంతుఁ డీశ్వరుఁ, డనఘుఁడు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్ వినినఁ బఠించినఁ దలఁచిన, జనులకు దుర్యశముఁ బాపసంఘముఁ దలఁగున్. |
102 |